నవ నారసింహ క్షేత్రాలు.. ఇవిగో

దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలూ శివాలయాలూ అమ్మవారి మందిరాలూ ఎన్నో ఉన్నప్పటికీ వాటిల్లో 108 దివ్యదేశాలూ ద్వాదశజ్యోతిర్లింగాలూ అష్టాదశ శక్తిపీఠాలుగా పేర్కొనే ఆలయాలే ప్రాశస్త్యం పొందాయి. అదేవిధంగా నృసింహావతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభూగా వెలిసిన తొమ్మిది ఆలయాలు అత్యధిక ప్రాచుర్యం చెందాయి.

Updated : 23 Mar 2022 16:47 IST

నవ నారసింహ క్షేత్రాలు.. ఇవిగో

దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలూ శివాలయాలూ అమ్మవారి మందిరాలూ ఎన్నో ఉన్నప్పటికీ వాటిల్లో 108 దివ్యదేశాలూ ద్వాదశజ్యోతిర్లింగాలూ అష్టాదశ శక్తిపీఠాలుగా పేర్కొనే ఆలయాలే ప్రాశస్త్యం పొందాయి. అదేవిధంగా నృసింహావతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభూగా వెలిసిన తొమ్మిది ఆలయాలు అత్యధిక ప్రాచుర్యం చెందాయి. అవే నవ నారసింహ క్షేత్రాలు..!


అహోబిలం: నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది అహోబిలం. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్రనారసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన ప్రదేశం ఇదేనట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో ‘అహో... బలం...’ అని పొగిడారట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందట. శ్రీమహావిష్ణువు ఉగ్రనారసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్నీ అహోబిలంలో చూడవచ్చు. హిరణ్యకశిపుని సంహారం తరవాత వికటాట్టహాసం చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిదిచోట్ల జ్వాలా, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నరసింహస్వామి రూపాల్లో స్వామి వెలిశాడట. అందుకే ఇది నవనారసింహ క్షేత్రంగా పేరొందింది.


మాల్యాద్రి: ప్రకాశం జిల్లా కందుకూరు-పామూరు రోడ్డులోని వలేటివారి పాలెం సమీపంలో ఉంటుందీ ఆలయం. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రిమీద తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడనేది పురాణగాథ. అయితే స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనీ దేవతలూ రుషుల దర్శనార్థం వారంలో ఆరు రోజులూ శనివారం మానవులకీ కేటాయించాలని కోరగా, స్వామి సమ్మతించాడట. అందుకే భక్తులు శనివారంనాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. స్వామివారి ఆలయాన్ని వారంరోజులూ తెరవాలని ప్రయత్నించి నవాళ్లు పలు ఇబ్బందులకు గురయ్యారట. దాంతో మిగిలిన రోజుల్లో ఎవరూ ఆలయ సమీపంలోకి వెళ్లేందుకు సాహసించరు. ఆలయ అర్చకులూ సిబ్బందీ శుక్రవారం రాత్రికి మాలకొండకు చేరుకుని ఉదయాన్నే అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి ఆలయం తలుపులు మూసేసి వెళ్లిపోతారు.


అంతర్వేది: హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహారానంతరం వశిష్ఠుడి కోరికమేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడనేది పురాణగాథ. వశిష్ఠమహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిం దట. ఇది మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. త్రేతాయుగంలో రావణబ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి విగ్రహాలను బట్టి క్రీ.శ. 300కు ముందు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారు. మాఘమాసంలో స్వామివారి కల్యాణోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి.


ధర్మపురి: కరీంనగర్‌ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరంలో ఉందీ క్షేత్రం. రాక్షసవధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడనీ, ఆపై స్వయంభూగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడనేది పౌరాణిక గాథ. ధర్మవర్మ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందనీ, ఆయన తపస్సు చేయడంవల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది మరో కథనం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. యమధర్మరాజు స్వామిని దర్శించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడనీ చెబుతారు. అందుకు గుర్తుగా ఇక్కడ యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. ముందుగా ఆయన్ని దర్శించాకే నృసింహుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ‘ధర్మపురికి పోతే యమపురి ఉండదు’ అనీ అంటారు.


మంగళగిరి: నవ నారసింహక్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. నిజానికి ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీనరసింహస్వామి గానూ కొండమీద ఉన్న స్వామిని పానకాల స్వామిగానూ పిలుస్తారు. కొండపైన తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనమిస్తాడు. అక్కడి స్వామికి పానకం అంటే మహాప్రీతి. పానకంతో అభిషేకిస్తే సగం తాగి, మిగిలిన సగాన్ని భక్తులకు ప్రసాదంగా వదులుతాడట. ఎంత పాత్రతో పోసినా సగం తాగి సగం వదలడం ఈ క్షేత్ర విశిష్టత. ఇక్కడ పానకం ఒలికినా చీమలూ ఈగలూ చేరవు. కొండ కింద ఉన్న పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలోని గాలిగోపురం రాష్ట్రంలోకెల్లా ఎత్తైనది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురాన్ని ధరణికోట జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కట్టించారు.


పెంచలకోన: నెల్లూరు జిల్లా రాపూర్‌ మండల కేంద్రంలోని ఈ క్షేత్రంలో స్వామి చెంచులక్మీ సమేతుడై వెలిశాడు. కృతయుగాన హిరణ్యకశి పుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్ర రూపంలో గర్జిస్తూ సంచరిస్తుండగా- చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట. స్వామి భీకరరూపం చూసి చెలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండటంతో ఆమె ధైర్యసాహసాలకీ సౌందర్యానికీ ముగ్దుడైన స్వామి శాంతించాడట. తరవాత చెంచురాజుకి కప్పం చెల్లించి వివాహమాడాడనీ, ఆమెను పెనవేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిశాడనీ అందుకే ఇక్కడి స్వామిని పెనుశిల లక్ష్మీనృసింహస్వామిగా కొలుస్తారు.


యాదాద్రి: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరి గుట్ట హైదరాబాద్‌ నగరానికి 65 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం రుష్యశృంగుని కుమారుడైన యాద రుషి ఈ కొండమీద నరసింహుణ్ణి చూడాలని తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని యాద రుషి కోరగా స్వామి కరుణించి, లక్ష్మీసమేతుడై కొండపై కొలువుదీరాడట. ఆ తరవాత స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలని మళ్లీ తపస్సు చేయడంతో నరసింహుడు జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్రనారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడనీ చెబుతారు. ఆంజనేయస్వామి గుడి ఉన్న రాతిమీద గండభేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలా, యోగానంద, లక్షీనరసింహమూర్తులు ఉంటాయి. ఉగ్ర రూపం అదృశ్యంగా ఉంటుందట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలూ నయమైపోతాయనేది భక్తుల నమ్మకం.


సింహాద్రి: విశాఖ పట్టణానికి సమీపంలోని తూర్పుకనుమల్లో సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండమీద వెలిసిన క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామి వరాహముఖం, మానవా కారం, సింహపుతోకతో దర్శనమిస్తాడు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అనీ పిలుస్తారు. మిగిలిన ఆలయాలకు భిన్నంగా పశ్చిమముఖంగా ఉండే ఈ ఆలయాన్ని లాంగూల గజపతి క్రీ.శ.పదకొండో శతాబ్దంలో నిర్మించాడట. స్వయంభూగా వెలసిన స్వామిని ముందు ప్రహ్లాదుడు అర్చించాడట. తరవాత చంద్రవంశానికి చెందిన పురూరవుడు ప్రయాణించే పుష్పకవిమానం కిందకు ఆకర్షితమవడంతో అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఏడాదిపాటు విగ్రహాన్ని చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ద తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెప్పడంతో ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.


వేదాద్రి: కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో ఉందీ నృసింహ క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహ స్వామి అవతారాల్లో దర్శనమిస్తాడు. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాచేయగా- శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు ఆ వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరగా- నరసింహావతారంలో ఆ కోరిక తీరుతుందని సెలవిస్తాడట. అందువల్లే హిరణ్యకశిపుని సంహారానంతరం స్వామి ఇక్కడ అయిదు అంశలతో ఆవిర్భవించినట్లు చెబుతారు.


పంచనారసింహుడి పచ్చని లోగిలి!

కనువిందైన కట్టడాలూ, సువిశాల ప్రాంగణాలూ, రమణీయ శిల్పసంపదా... ఇలా అణువణువూ సరికొత్త మార్పులతో రూపుదిద్దుకున్న యాదగిరి దేవస్థానం... ప్రకృతిశోభతోనూ విరాజిల్లుతోంది. ఒకప్పుడు పచ్చనిచెట్ల నడుమ వెలసిన స్వామి ఆలయం ఇప్పుడు మళ్లీ నందనవనాలతో సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికతతోపాటూ ఆహ్లాదాన్నీ పంచుతూ భక్తుల్ని రారమ్మంటూ ఆహ్వానిస్తోంది!

కప్పట్లా దట్టమైన అడవీ లేకపోవచ్చు, అన్నన్ని చెట్లూ ఉండకపోవచ్చు. కానీ ఆ గుర్తుల్ని పదిలం చేస్తూ యాదగిరీశుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తజనుల ప్రశాంతత కోసం యాదాద్రిని పచ్చని లోగిలిగా మార్చారు. దేవాలయం దగ్గర్లో పరిరక్షిస్తున్న అభయారణ్యాలు కాకుండా మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలతో హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయానికి వెళ్లే దారి నుంచి- దేవాలయం, కొండ, ఆలయనగరి, తులసీవనం, అభయారణ్యాల వరకూ వేల సంఖ్యలో మొక్కలు నాటారు. ఆలయ మార్పుల్లో భాగంగా ఈ క్రతువును నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు.

ఎక్కడెక్కడ...

స్వామి కొండ చుట్టూ, ఆలయ సన్నిధిలో... ప్రత్యేక ప్రణాళికతో పచ్చదనాన్ని పెంచుతున్నారు. దేవస్థానం లోపల భక్తుల కోసం మినీపార్కులూ, వాకింగ్‌ ట్రాక్‌ల్నీ ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. దాదాపు రెండు వేల మంది సేదతీరేందుకు ఆలయ దక్షిణ దిశలో వివిధ దశల్లో పచ్చని తోటను సిద్ధం చేశారు. ఇంకా కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న వలయ రహదారిలో నాలుగు వలయాల్లోనూ వివిధ రకాల మొక్కలను నాటుతూనే, రహదారులకిరువైపులా పచ్చని లాన్‌లనూ ఏర్పాటు చేశారు. వీటితోపాటూ గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ దారిలోనూ కొన్ని రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అలంకారంతోపాటు నీడనిచ్చేందుకు ఆలయపరిధిలో టెర్మినేలియా, టొరెనియా, దేవ గన్నేరు, గల్ఫిమియా, కాగితం పూలు, ఎర్ర తురాయి, గుల్‌మొహర్‌, కానుగ, రుద్రాక్ష, పారిజాతం, జమ్మి, మారేడు, ఆకాశమల్లె, బొడ్డుమల్లె, వేప, రావి, మేడి, జువ్వి, మర్రి, అల్లనేరేడు, తెల్లజిల్లేడు, కదంబం వంటి మొక్కలను నాటారు.

దేవాలయ దరిదాపుల్లోనే కాదు, జాతీయ రహదారి రాయగిరి నుంచి ఆలయానికి చేరుకునే 11 కిలోమీటర్లకుపైగా ఉన్న రహదారికి రెండువైపులా మొక్కలతో అలంకరించారు. మరోవైపు అటవీ శాఖ అధీనంలో రూ.4 కోట్ల ఖర్చుతో 240 ఎకరాల్లో నరసింహ అభయారణ్యం... రూ.3 కోట్ల ఖర్చుతో 140 ఎకరాల్లో ఆంజనేయ అభయారణ్యాల్ని రకరకాల మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్నారు. కొండ కింద భక్తుల బస కోసం కాటేజీలూ, విల్లాల నిర్మాణానికి 250 ఎకరాల ప్రాంగణాన్ని ఆలయ నగరిగా అభివృద్ధి చేస్తే... అందులో 35 ఎకరాలను పచ్చదనం కోసమే ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.

స్వామి కోసం...

నిత్యం లక్ష్మీసమేతస్వామిని ఆరాధించేందుకు అవసరమైన పువ్వులూ, తులసీ దళాల కోసం తులసీ వనాన్ని రూపొందించారు. గతంలో ఈ వనం కొండ కింద ఆలయ కనుమదారి సమీపంలో ఉండేది. ప్రస్తుతం క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనున్న మల్లాపురం గోశాల దగ్గర మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. ఇక్కడే స్వామి వారి అలంకరణ కోసం బంతీ, చామంతీ, గులాబీ... లాంటి ఎన్నో పూలమొక్కల్ని నాటి పూదోటను సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు కొండ కింద నుంచి ఆలయానికి చేరే దారిలో నక్షత్రవనాన్నీ ఏర్పాటు చేశారు.


ప్రతి స్తంభమూ.. ఓ అద్భుతమే..!

ఎత్తయిన రాజగోపురాలూ విశాలమైన మాడ వీధులూ అష్టభుజ ప్రాకారమండపాలతో అద్భుత వాస్తుశిల్పకళాచాతుర్యంతో పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందులోనూ స్తంభోద్భవుడైన నారసింహుని ఆలయంలో ఆ స్తంభ వైభవాన్ని కనులారా చూసి తీరాల్సిందే!

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా... కేళీ విహార లక్ష్మీ నారసింహా... అంటూ భక్తులు పారవశ్యంతో కీర్తించే దివ్యక్షేత్రమే యాదగిరి. ఈ క్షేత్ర పునర్నిర్మాణంకోసం స్థపతులు సుందరరాజన్‌, డాక్టర్‌ ఆనందరాజన్‌ వేలుల పర్యవేక్షణలో ఉప స్థపతులూ మరెందరో శిల్పులూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారనేది తెలిసిందే. అందులో భాగంగానే- మనిషి బుద్ధి బలానికీ సింహం దేహబలానికీ సంకేతం కాగా ఆ రెండు శక్తులతో స్తంభోద్భవుడైన నరసింహుడి దివ్యనిలయంలో స్తంభాల్నీ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

యాలీ స్తంభాలు!

సాధారణంగా ఆలయ నిర్మాణంలో- స్తంభాల్ని బ్రహ్మకాంతం, విష్ణుకాంతం, రుద్ర కాంతం అని మూడు రకాలుగా చెబుతారు. నాలుగు పలకలుగా చెక్కితే బ్రహ్మకాంతమనీ, ఎనిమిది పలకలతో ఉంటే విష్ణుకాంతమనీ, వృత్తాకారంలో నిర్మిస్తే రుద్రకాంత స్తంభం అనీ అంటారు. అయితే ఆ మూడింటినీ ఉపయోగిస్తూనే యాలీ స్తంభాలను నిర్మించడం వేదగిరి ఆలయ విశిష్టత. సింహ ఆకారంతోపాటు తొండం ఉన్న శిల్పాన్నే యాలీ అంటారు. ఈ స్తంభంలో విగ్రహస్థానం, నాగబంధం, అష్టపటం, చతురస్రం... తదితర విభాగాలు ఉంటాయి.

యాదగిరి నరసింహ క్షేత్రం రెండు ప్రాకారాలతో నిర్మితమైంది. ప్రథమ ప్రాకారంలో విష్ణుకాంత స్తంభాలు ఎక్కువగా ఉంటే, ద్వితీయ ప్రాకారంలో యాలీ స్తంభాలు అందంగా కనువిందు చేస్తుంటాయి. యాలీ స్తంభాల్లో కొన్నింటిని ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తయారుచేసి యాదాద్రికి తీసుకొచ్చారట. బయటి ప్రాకారంలో ఉన్న అష్టభుజి మండపాల్లో చిత్రకంఠ స్తంభాల్నీ బాలపాద స్తంభాల్నీ నిర్మించారు. పంచతల రాజగోపురం లోపల రుద్రకాంత స్తంభాలను అమర్చగా ఏడంతస్తుల రాజగోపురం లోపల చిత్రకంఠ స్తంభాలు కనిపిస్తాయి. ఇవేకాదు, ఇంకా అనేక స్తంభాలమీద పద్మాలనీ పత్రాల్నీ పక్షుల్నీ దశావతారాల్నీ కళ్లకు కట్టినట్లుగా చెక్కారు. ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆధునిక కాలంనాటి క్రీడల్నీ కరెన్సీనీ స్తంభాలపైన చెక్కి ప్రావీణ్యాన్ని చాటుకున్నారు శిల్పులు.

మహా ముఖమండపం!

ప్రధానాలయంలో ఉన్న మహా ముఖ మండపంలోని స్తంభ సోయగాన్ని చూసి తీరాల్సిందే. ఆళ్వారుల వైభవాన్నీ కాకతీయుల పౌరుషాన్నీ చాటుతుందీ మండపం. సాధారణంగా యాలీ స్తంభాలూ, అశ్వ స్తంభాలతోనే మహా మండపాలు నిర్మితవుతాయి. కానీ యాదాద్రి క్షేత్రంలో మహా మండపంలోని కింది అంతస్తులో ఉన్న 12 స్తంభాల ముందువైపున 12 మంది ఆళ్వార్లు కొలువుదీరి ఉంటారు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి, దక్షిణాదిన భక్తితత్త్వాన్ని విస్తరించిన విశిష్ట భక్తులే ఆళ్వారులు. పై అంతస్తులో కాకతీయుల శైలిలో నిర్మించిన బ్రహ్మకాంత స్తంభాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధాన స్తంభానికి నలువైపులా పిల్ల స్తంభాల్ని చెక్కినదాన్నే బ్రహ్మకాంత స్తంభం అంటారు. ఈ స్తంభాలమీద యుద్ధ సన్నివేశాల్నీ గజ, సింహ, పులి, అశ్వవాహనాలపై సైనికులు స్వారీ చేస్తున్నట్లుగా చెక్కిన వైనాన్ని చూసి తీరాల్సిందే మరి. ఈ ఒక్క మండపం అని కాదు... స్వామిని సేవించేందుకు శిలలే శిల్పాలై కదిలి వచ్చినట్లునట్లుగా చెక్కిన యాదగిరి లక్ష్మీనరసింహుని ఆలయంలో అణువణువూ అద్భుతమే... అడుగడుగూ మహిమాన్వితమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..