ఫుడ్‌ ట్రెండ్‌

చికెన్‌, చేపలు, రొయ్యలు వంటివాటితో చేసే స్నాక్స్‌ బయట కొన్నట్లుగా కరకరలాడేలా వచ్చేస్తే... పానీపూరీలో వాడే నీళ్లు నాలుగైదు ఫ్లేవర్లలో దొరికేస్తే... ఇంట్లోనూ కోరుకున్న మసాలాలతో పాప్‌కార్న్‌ను చేసుకోగలిగితే... భలే ఉంటుందనుకునేవారికోసం ఆ సంబారాలన్నీ దొరికేస్తున్నాయిప్పుడు. అవేంటో చూసేయండి మరి.

Updated : 05 Feb 2024 14:26 IST

చికెన్‌, చేపలు, రొయ్యలు వంటివాటితో చేసే స్నాక్స్‌ బయట కొన్నట్లుగా కరకరలాడేలా వచ్చేస్తే... పానీపూరీలో వాడే నీళ్లు నాలుగైదు ఫ్లేవర్లలో దొరికేస్తే... ఇంట్లోనూ కోరుకున్న మసాలాలతో పాప్‌కార్న్‌ను చేసుకోగలిగితే... భలే ఉంటుందనుకునేవారికోసం ఆ సంబారాలన్నీ దొరికేస్తున్నాయిప్పుడు. అవేంటో చూసేయండి మరి.


కరకరలాడేలా...

‘కేఎఫ్‌సీ చికెన్‌ బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి నోరూరిస్తుంది. అసలు దాన్నెలా చేస్తారో’, ‘రెస్టరంట్లూ, పెద్దపెద్ద హోటళ్లలో చేసినట్లుగా చికెన్‌ 65, ఫిష్‌ ఫ్రై వంటివాటినీ ఇంట్లోనూ తయారు చేయాలంటే ఎలా...’ అంటూ ఇంటర్నెట్‌ మొత్తం వెతికేస్తుంటారు కొందరు. అలాంటివారు పెద్దగా కష్టపడకుండానే ఆ రుచుల్ని ఇంట్లో ఆస్వాదించేందుకు ఓ మ్యాజిక్‌పౌడర్‌ వచ్చేసింది. అదే ‘క్రిస్పీ ఫ్రై మిక్స్‌’. చికెన్‌ 65 లేదా ఫిష్‌ ఫ్రై చేయాలంటే ఆ ముక్కల్ని మారినేట్‌ చేసుకునేందుకూ వేయించేందుకూ బోలెడు పదార్థాలు పెట్టుకోవాలి. ఈ క్రిస్పీ ఫ్రై మిక్స్‌తో అంత శ్రమ ఉండదు. ఉదాహరణకు గోబీ 65 లేదా చికెన్‌ ఫ్రై చేయాలనుకుందాం.. అలాంటప్పుడు ఈ పొడిలో ఒక వంతు తీసుకుని నీళ్లతో చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లేదా క్యాలీఫ్లవర్‌ పువ్వుల్ని మొదట ఆ పేస్టులో ముంచి తరువాత మిగిలిన వంతు పొడిని అద్దాలి. ఇలా రెండుసార్లు చేసుకుని వేడినూనెలో వేయిస్తే చాలు. మైదా, మొక్కజొన్నపిండి, ఇతర మసాలాలు కలిపి తయారుచేసిన ఈ పొడులు చికెన్‌, ఫిష్‌, పకోడీ.. ఇలా చేసుకోవాలనుకున్న ఫ్రైలను బట్టి దొరుకుతాయి గనుక ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ సమయంలోనే కోరుకున్న ఫ్రైలను చేసుకోచ్చు. ఏమంటారు?


కోరుకున్నట్లుగా పాప్‌కార్న్‌

థియేటర్లలో, షాపింగ్‌మాల్స్‌లో అమ్మే పాప్‌కార్న్‌ సాధారణంగా బటర్‌, చీజ్‌, సాల్టెడ్‌ అంటూ రకరకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉంటుంది. అదే పాప్‌కార్న్‌ను ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే.. మొక్కజొన్న గింజలతోపాటూ ఆ పదార్థాలన్నీ విడిగా తెచ్చుకోవాలి. దాంతో ఎందుకొచ్చిన శ్రమలే అనుకుంటూ చాలామంది ఆ ఆలోచననే విరమించుకుంటారు. అలాంటివారికోసమే ఇప్పుడు పాప్‌కార్న్‌ కిట్‌తోపాటూ, ఆ సీజనింగ్‌ పొడులన్నీ విడిగా వచ్చేస్తున్నాయి. పాప్‌కార్న్‌ కిట్‌లో మొక్కజొన్న గింజలతోపాటూ పెరీపెరీ, బటర్‌సాల్ట్‌, పాప్‌డీ చాట్‌, హాట్‌ అంటూ స్వీట్‌ అంటూ.. ఆరు రకాల సీజనింగ్‌ మసాలాలు వస్తాయి. వీటితో నచ్చిన ఫ్లేవర్‌లో పాప్‌కార్న్‌ను తయారుచేసుకోవచ్చు. ఆ పొడులన్నీ విడిగానూ దొరుకుతాయి గనుక ఒక్క పాప్‌కార్న్‌కే కాదు... ఫ్రెంచ్‌ఫ్రైస్‌, చిప్స్‌, పిజ్జా వంటివాటిపైనా వీటిని చల్లుకోవచ్చు. ట్రై చేసి చూడండి.


పానీపూరీ కిట్‌లో ఎన్ని రుచులో!

‘పానీపూరీలు ఎన్ని తిన్నా మనసు ఇంకొక్కటి అంటూ కోరుకుంటుంది కానీ.. ఆ నీళ్లే ఎప్పుడూ ఒకే రుచిలో ఉంటాయి. అవి కూడా ఈ మధ్య పెళ్లిళ్లలో, పెద్దపెద్ద వేడుకల్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా నాలుగైదు ఫ్లేవర్లలో అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో’ అనుకునేవారికోసం ఇప్పుడు ఆ పొడులూ వచ్చేశాయి. అంటే... కిట్‌ తరహాలో వస్తున్న ఈ ప్యాక్‌లో వేయించని పూరీలతోపాటూ నాలుగైదు రుచుల్లో మసాలా పొడులు కూడా వస్తాయి. కట్టామీఠా, పుదీనా, హింగ్‌, వెల్లుల్లి వంటి ఫ్లేవర్లలో ఉండే ఈ పొడులతోపాటూ అదనంగా గ్రీన్‌, మీఠా చట్నీలు ఉంటాయి. ఈ పొడులను నీళ్లల్లో కలిపితే.. నచ్చిన ఫ్లేవర్‌ నీటితో మార్చిమార్చి పూరీలను లాగించేయొచ్చు అన్నమాట. వరుసబెట్టి ఎన్ని పానీపూరీలు తిన్నా సరే... చివరగా ‘ఏక్‌ మీఠా పూరీ’ అంటూ చాట్‌బండి దగ్గర అడిగే పానీపూరీ ప్రియులు ఇంట్లోనే పూరీలో కాస్త మీఠాచట్నీని వేసుకుని ఆ చివరి పూరీనీ తినేయొచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..