పిలాటిస్‌... వ్యాయామాల్లో కొత్త ట్రెండ్‌!

శరీరం దృఢంగా ఉండాలి. ఎటు వంపితే అటు విల్లులా వంగాలి. ఆకృతి అదిరిపోవాలి. ఆరోగ్యం మెరుగుపడాలి.వయసు పెరిగినా చురుకుదనం తగ్గకూడదు... ఇలా మనిషికి ఎన్నో కోరికలు. అన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అదే ‘పిలాటిస్‌’ అంటున్నారు వ్యాయామ నిపుణులు..! సెలెబ్రిటీల నుంచి సాధారణ యువత వరకూ ఇప్పుడు జిమ్ముల్లోనూ ఇళ్లలోనూ చెమటోడ్చి చేస్తున్న వ్యాయామం ఇదే మరి! ఏమిటీ దీని ప్రత్యేకతలు అంటే- చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు.

Updated : 05 Feb 2024 12:18 IST

శరీరం దృఢంగా ఉండాలి. ఎటు వంపితే అటు విల్లులా వంగాలి. ఆకృతి అదిరిపోవాలి. ఆరోగ్యం మెరుగుపడాలి.వయసు పెరిగినా చురుకుదనం తగ్గకూడదు... ఇలా మనిషికి ఎన్నో కోరికలు. అన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అదే ‘పిలాటిస్‌’ అంటున్నారు వ్యాయామ నిపుణులు..! సెలెబ్రిటీల నుంచి సాధారణ యువత వరకూ ఇప్పుడు జిమ్ముల్లోనూ ఇళ్లలోనూ చెమటోడ్చి చేస్తున్న వ్యాయామం ఇదే మరి! ఏమిటీ దీని ప్రత్యేకతలు అంటే- చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు.

‘మణికట్టు దగ్గర నొప్పి. చాకు పట్టుకుని కూరగాయలు కోద్దామంటే చెయ్యి  పట్టు ఇవ్వడం లేదు’ ఫిర్యాదుచేసింది భార్య. ‘కుర్చీలో కూర్చుని గంటల తరబడి ఆ కంప్యూటర్‌ని చూస్తానా... ఇంటికొచ్చేసరికి మెడ కట్టెలా బిగుసుకుపోతోంది’ తన బాధ చెప్పాడు భర్త.

‘ఏ నొప్పి అయినా భరించొచ్చు కానీ ఈ నడుం నొప్పిని భరించడం మాత్రం నావల్ల కావట్లేదు. కూర్చోలేనూ నిలబడలేనూ’ అంటూ వచ్చింది ఆ ఇంటి ఆడపడుచు. పాతిక, ముప్పై ఏళ్లకే ఇలా మాట్లాడుతుంటే ఇక వీళ్లకు ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందీ..?

జీవనశైలి కారణంగా వచ్చే ఇటువంటి నొప్పుల నుంచి బయటపడాలంటే వ్యాయామం చేయాలి, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి- అంటారు నిపుణులు. కానీ ఏ వ్యాయామాన్ని ఎంచుకోవాలన్నదే సమస్య. నడక, యోగా, ఏరోబిక్స్‌, కార్డియో, స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్‌ వ్యాయామాలు... ఇలా ఎన్నో రకాలున్నాయి. అన్నీ మంచివే. దేని ఫలితాలు దానికి ఉంటాయి. ఒకటి కన్నా ఎక్కువ ఫలితాలు కావాలంటే... రెండు మూడు రకాల వ్యాయామాలను ఎంచుకుని చేయాలి. కానీ అది అందరికీ సాధ్యం కాదు. అందుకే ఎక్కువ ప్రయోజనాలు ఉండే ఒక్క వ్యాయామం దిశగా సాగిన అన్వేషణలో వెలుగులోకి వచ్చిందే ‘పిలాటిస్‌ (pilates). ఈ తరానికి ఎంతో నచ్చేసిన ఈ వ్యాయామం నిజానికి వందేళ్ల క్రితమే రూపొందించినది. అప్పటి నుంచీ కొద్దిమంది శిక్షకులు దీన్ని అనుసరిస్తున్నా, కొవిడ్‌ తర్వాత ఒక్కసారిగా అన్నిదేశాల్లోనూ బహుళ ఆదరణ పొందుతోంది. కొవిడ్‌ సమయంలో సెలెబ్రిటీలు ఈ వ్యాయామాలు చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అందరి దృష్టీ దీనిమీద పడింది. ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లోనూ పిలాటిస్‌ శిక్షణ ఇచ్చే నిపుణులున్నారు, ఫిట్‌నెస్‌ సెంటర్లున్నాయి.

అసలేమిటీ పిలాటిస్‌?

ఈ వ్యాయామాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. జర్మనీకి చెందిన జోసెఫ్‌ హ్యూబర్టస్‌ పిలాటిస్‌ని పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వెంటాడేది. ఆస్థమా, రికెట్స్‌, రుమాటిక్‌ ఫీవర్‌ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న కొడుకు శరీరాన్ని బలంగా తయారుచేయాలనుకున్న తండ్రి అతడిని జిమ్నాస్టిక్స్‌, బాడీ బిల్డింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ లాంటి వాటిల్లో ప్రవేశపెట్టాడు. దాంతో పద్నాలుగేళ్లకల్లా జోసెఫ్‌ అనారోగ్యాలను అధిగమించి ఎంత ఫిట్‌గా తయారయ్యాడంటే- వైద్య విద్యార్థులకోసం తయారుచేసే అనాటమీ(శరీర నిర్మాణశాస్త్రం) చార్టులకు అతడిని మోడల్‌గా తీసుకునేవారు. జిమ్నాస్ట్‌గా బాడీబిల్డర్‌గా ఎదిగిన జోసెఫ్‌ ఇంగ్లండ్‌ వెళ్లి స్థిరపడ్డాడు. అది యుద్ధ సమయం కావడంతో కొన్ని కారణాల వలన వలస వచ్చిన జర్మన్లందరినీ ఒక శిబిరంలో ఉంచారు పోలీసులు.

ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు జోసెఫ్‌. పోలీసులకూ సైనికులకూ ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇచ్చేవాడు. యోగాని అధ్యయనం చేయడమే కాక రకరకాల జంతువుల కదలికల్ని పరిశీలించిన జోసెఫ్‌ని ఆధునిక జీవనశైలి ఆలోచింపజేసింది. మనుషులు ఎక్కడా సరైన ఆకృతిలో ఉండకుండా ఓ పక్కకి వంగిపోయి నిలబడడం, జారగిలబడి కూర్చోవడం, ఈడ్చుకుంటూ నడవడం గమనించాడు. సహజంగా నడకలో ఉండాల్సిన లయ, సొగసు... పోయాయనిపించింది. ఆఖరికి చాలామంది గుండెలనిండా గాలి కూడా పీల్చుకోవడం లేదనీ అర్థమయింది. భారీ జంతువైన ఏనుగు కూడా ఎంతో అందంగా చప్పుడు కాకుండా నడుస్తుంది. కానీ ఈ మనుషులకేమైందీ... అనుకున్న అతడి ఆలోచనల్లోంచి పలు వ్యాయామాలు రూపుదిద్దుకున్నాయి. అవి చేయడానికి తోడ్పడే పరికరాలనూ తనే తయారుచేశాడు. వాటిని నేర్పించేందుకు వీలుగా ఒక శిక్షణా విధానానికీ రూపమిచ్చాడు. ఈ వ్యాయామాలు యాంత్రికంగా వన్‌ టూ త్రీ ఫోర్‌ అంటూ కాళ్లూ చేతులూ కదిలిస్తూ చేసేవి కావు. మనసుని శరీరంమీద కేంద్రీకరించాలి. వెన్నెముకను నిటారుగా ఉంచేలా ప్రధానమైన కండరాలపై దృష్టి పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదా, వెన్నెముకమీదా శ్రద్ధ పెడుతూ చేయడంవల్ల, ఉదరం, పొత్తికడుపు కండరాలని కూడా పటిష్ఠపరచగలవు. శరీర అవయవాలన్నిటి మీదా చక్కటి నియంత్రణను ఇచ్చే ఈ వ్యాయామానికి అతడు ‘కంట్రోలజీ’ అని పేరు పెట్టాడు. తొలిరోజుల్లో ఈ వ్యాయామాలను గాయపడి కోలుకుంటున్న వారిచేత చేయించేవారు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి స్థిరపడిన జోసెఫ్‌, డాన్స్‌ కదలికల్నీ అధ్యయనం చేసి తాను రూపొందించిన వ్యాయామాలకు మరింత స్పష్టత తెచ్చాడు. భార్యతో కలిసి స్టూడియో పెట్టి శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. అతడు సిక్స్‌ప్యాక్‌ తెప్పిస్తాననో కండరాలు కన్పించేలా బాడీ బిల్డింగ్‌ చేయిస్తాననో బరువు తగ్గిస్తాననో... ఆకట్టుకునే హామీలివ్వలేదు. మామూలు మనుషులే
శరీరాన్ని తమ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆనందంగా అందంగా జీవించడం ఎలాగో చెబుతానన్నాడు. కదలికలకు ఒక లయ ఉండేలా చూస్తానన్నాడు. సాధారణంగా నృత్య కళాకారులకు గాయాలయ్యే అవకాశం ఎక్కువ. ఒకసారి గాయపడితే ఇక వారు ఆ కళను సాధనచేయలేరు. అలాంటివారికి తన వ్యాయామాల శిక్షణతో తిరిగి నృత్యం చేయగలిగేలా చేసేవాడు. దాంతో అతని వ్యాయామాలకు ఎంత పేరొచ్చిందంటే- ప్రఖ్యాత నృత్యకళాకారులంతా తమ శిష్యులను వీరి దగ్గర శిక్షణకు పంపించేవారు. ‘రిటర్న్‌ టు లైఫ్‌ త్రూ కంట్రోలజీ’, ‘యువర్‌ హెల్త్‌’... లాంటి పుస్తకాలు రాశాడు జోసెఫ్‌. జోసెఫ్‌ చనిపోయాక ఆయన పేరుమీద ఈ వ్యాయామాలకు ‘పిలాటిస్‌’ అని పేరు పెట్టారు.

ఏమిటీ వీటి ప్రత్యేకత!

పిలాటిస్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇవి చేయడానికి జిమ్‌కే వెళ్లక్కర్లేదు, కొన్ని చిన్న చిన్న సాధనాలు కొనుక్కుని, ఏవీ లేకుండా ఇంట్లోనూ చేసుకోవచ్చు. అందుకే ఇవి త్వరగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పటివరకూ వ్యాయామం చేసిన అనుభవం లేకపోయినా కొత్తగా వ్యాయామం చేయడం ప్రారంభించాలనుకునేవాళ్లు కూడా దీన్ని ఎంచుకోవచ్చు. ఆడామగా ఏ వయసువాళ్లయినా పిలాటిస్‌ శిక్షణ పొందవచ్చు. అంతేకాకుండా ఒక్కో వ్యక్తి అవసరాలకు తగినట్లుగా డిజైన్‌ చేసుకునే వెసులుబాటూ ఉంది. దాదాపు 50 వ్యాయామాలను ఒక క్రమపద్ధతిలో చేయడం ద్వారా మొత్తం శరీరానికి ‘కోర్‌ స్ట్రెన్త్‌’గా పేర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఓ ఊపు ఊపుతున్న పిలాటిస్‌ వ్యాయామాల్లో జోసెఫ్‌ పిలాటిస్‌ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కొన్ని మార్పులొచ్చాయి.

వీటిల్లోనూ రకాలున్నాయా?

అవును. ప్రధానంగా ఐదు రకాలున్నాయి.

క్లాసికల్‌: ఇవి మౌలికంగా పిలాటిస్‌ రూపొందించినవే. చాపమీదా, ఓ పరికరం మీదా ఒక వరుస ప్రకారం చేసే ఈ వ్యాయామాలు శరీరంలోని ప్రతి భాగానికీ కదలిక ఉండేేలా చూస్తాయి.

మ్యాట్‌: చాపమీద చేసే ఈ వ్యాయామాలు కొత్తగా ప్రారంభించేవాళ్లకు అనువుగా ఉంటాయి. అలాగని తర్వాత చేయరని కాదు, పిలాటిస్‌ చేసేవాళ్లు ఎవరైనా చాపమీద చేసే వ్యాయామాలను తప్పకుండా చేస్తారు. శరీర కదలికల్లో మెలకువలను నేర్పించేది వీటిల్లోనే. మెషీన్లు ఏవీ ఉపయోగించరు కాబట్టి శరీరం బరువును బ్యాలన్స్‌ చేసుకుంటూ చేయడం వల్ల శరీరమూ దాని కదలికలూ కండరాల పనితీరూ లాంటి వాటి గురించి చక్కటి అవగాహన వస్తుంది.

కాంటెంపొరరీ: క్లాసికల్‌ పిలాటిస్‌కి ఫిజియోథెరపీ, బయోమెకానిక్స్‌ లాంటివన్నీ కలిపి సమకాలీన పిలాటిస్‌ని అభివృద్ధిచేశారు. వీటికి కొన్ని సాధనాలు తప్పనిసరి. గర్భిణులకు సుఖప్రసవం అవడానికీ, బాలింతలకు కాన్పు అనంతరం శరీరం తిరిగి శక్తిని పుంజుకుని ఫిట్‌గా తయారవడానికీ తోడ్పడతాయివి.

రిఫార్మర్‌: రిఫార్మర్‌ మెషీన్‌ సాయంతో చేయడంవల్ల వీటికా పేరు వచ్చింది. మ్యాట్‌ పిలాటిస్‌ కన్నా చాలా కష్టంగా, డైనమిక్‌గా ఉంటాయివి. స్ప్రింగులతో ఉండే ఈ మెషీన్‌ మన శరీరాన్ని ప్రతిఘటిస్తున్న తరహాలో ఉంటుంది కాబట్టి ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. కాళ్లూ చేతులూ మాత్రమే కాదు, మొత్తం శరీరం బలంగా తయారవుతుంది. మోకాళ్ల సర్జరీ అయినవాళ్లూ కండరాలు దెబ్బతిన్న వాళ్లూ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్లతో మొదలుపెట్టి మెల్లగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఈ మెషీన్‌లో ఉంటుంది. మొత్తం పిలాటిస్‌ వ్యాయామాలు చేయడానికి పది రకాల ప్రధాన పరికరాలు ఉంటాయి.

క్లినికల్‌: వ్యక్తి మెడికల్‌ హిస్టరీ తెలుసుకుని తదనుగుణంగా డిజైన్‌ చేసే వ్యాయామాలివి. యోగాలాగా చాపమీదా, కొన్ని పరికరాల సాయంతోనూ చేయొచ్చు.

ఏ రకమైనా... పిలాటిస్‌ వ్యాయామాలన్నీ ఐదు ప్రధానాంశాల చుట్టూ తిరుగుతాయి... శ్వాస, సర్వైకల్‌ ఎలైన్‌మెంట్‌(మెడ, భుజాలూ సరిగ్గా ఉంటే వాటికింద ఉండే వెన్నెముక సరిగ్గా ఉంటుంది), రిబ్‌ అండ్‌ స్కాప్యులర్‌ స్టెబిలైజేషన్‌ (షోల్డర్‌బ్లేడ్‌, పక్కటెముకల్లో స్థిరత్వం తేవడం), పెల్విక్‌ మొబిలిటీ(నడుం కింది భాగమైన కటివలయం కదలికలు), యుటిలైజింగ్‌ ద ట్రాన్స్‌వెర్సస్‌ అబ్డామినిస్‌(శ్వాస వ్యాయామంతో ఉదరభాగం తాలూకు కండరాల బిగిని పెంచడం)... ఈ ఐదూ చాలా ముఖ్యం. వీటిల్లోని ప్రతి వ్యాయామమూ కీలక కండరాల పటిష్ఠతకు తోడ్పడుతుంది. ఒక్కో వ్యాయామాన్నీ మూడు నుంచి ఐదుసార్లు మాత్రమే రిపీట్‌ చేస్తారు. దాంతో వ్యాయామం చేస్తున్నంత సేపూ అన్ని కండరాలకీ పని పడుతుంది. శరీరమంతా కదులుతుంది.

యోగాలాగే ఉందిగా?

శ్వాస ప్రాధాన్యతనీ, చాపమీద శరీరాన్ని సాగదీస్తూ చేసే వ్యాయామాల్నీ బట్టి చూస్తే అలా అనిపిస్తుంది కానీ ఇది యోగా కన్నా చాలా ఎక్కువ. యోగా వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అవయవాలు తేలిగ్గా కదులుతాయి. పిలాటిస్‌ వల్ల శరీరం మొత్తం రిలాక్స్‌ అవుతుంది, కండరాలు బలోపేతమవుతాయి. శరీరం మీద నియంత్రణ వస్తుంది. మొత్తమ్మీద సామర్థ్యం పెరుగుతుంది. యోగా లాగే ఇది కూడా వ్యాయామం ప్రారంభించాలనుకునేవారికి మంచి ఎంపిక. అయితే యోగా నిదానంగా చేయాలి. ఒక్కో ఆసనంలో కొంత సేపు ఉండిపోవాలి. ఇవి అలా కాదు, వేగంగా చేయాల్సి ఉంటుంది. యోగా చాలావరకూ నిలబడీ కూర్చునీ చేస్తే పిలాటిస్‌ పడుకుని చేయాలి. వీటివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. శరీరానికి స్నానం ఎలాగో లోపల కణాలకు ఈ రక్తసరఫరా అలా- అనేవాడు జోసెఫ్‌ పిలాటిస్‌. అందుకే ఈ వ్యాయామం చేయగానే శరీరమంతా ఉత్తేజితమవుతుందట.

ఇక్కడ శిక్షణ ఇచ్చేవారున్నారా?

మన దేశంలోని ప్రధాన నగరాలన్నిటిలోనూ ఇప్పుడు పిలాటిస్‌ శిక్షణ ఇచ్చే ఫిట్‌నెస్‌ సెంటర్లున్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలెబ్రిటీలంతా ఈ ట్రెండ్‌ని అందిపుచ్చుకున్నారు. జాన్వీ కపూర్‌, కరీనా తదితరులకు శిక్షణ ఇచ్చే నమ్రతా పురోహిత్‌ తాను అనుభవపూర్వకంగా పిలాటిస్‌ ప్రాధాన్యాన్ని గుర్తించానంటుంది. నమ్రత పదిహేనేళ్ల వయసులో గుర్రపు స్వారీ చేస్తూ పడిపోవడంతో మోకాలికి తీవ్రంగా గాయమైందట. చికిత్స పొందినప్పటికీ తరచూ నొప్పి తిరగబెట్టేది. దానికి తోడు తనకిష్టమైన ఆట కానీ డాన్స్‌ కానీ కొనసాగించడానికి వీల్లేదని చెప్పారట వైద్యులు. ఇది జరిగిన ఏడాది తర్వాత ఒకసారి ముంబయిలో పిలాటిస్‌ శిక్షణ గురించి తెలిసి హాజరైంది నమ్రత. నాలుగు రోజులకే తన నొప్పి తగ్గడం గమనించింది. కేవలం వ్యాయామంతో నొప్పిలేకుండా జీవించడం సాధ్యమే అని తెలిశాక ఇక ఆమె దానిమీదనే దృష్టి పెట్టడమే కాక, దాన్నే తన కెరియర్‌గా ఎంచుకుంది. సెలెబ్రిటీలకే కాదు, అందరికీ ఈ వ్యాయామాలు మేలు చేస్తాయనీ జీవనశైలిని మార్చుకోవడానికి తోడ్పడతాయనీ అంటారామె.

అదెలా?

క్రీడాకారులకూ నృత్యకళాకారులకూ చేతులూ కాళ్లూ నడుమూ మెడా... తరచుగా ఒకేలా కదల్చాల్సి వస్తుంది. అది ఆయా కండరాలపై ఒత్తిడిని పెంచి రకరకాల సమస్యలకు కారణమవుతుంది. కార్యాలయాల్లో కర్మాగారాల్లో పనిచేసేవారికీ అంతే. నిలబడో కూర్చునో చేతుల్ని మాత్రమే కదిలిస్తూ ఉంటారు. దానికి తోడు అలవాట్లు కూడా. నడవడం, నిలబడడం, కూర్చోవడం... లాంటివన్నీ ఒక్కొక్కరికీ ఒక్కోలా అలవాటైపోతాయి. ఆ అలవాట్ల వల్ల కండరాల్లో అసమతుల్యత వస్తుంది. దాన్ని పోగొట్టి ఆకృతిలో, శరీరంలో సమతౌల్యాన్ని తేగల శక్తి ఈ వ్యాయామాలకు ఉందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కొన్ని సమస్యలకు చికిత్సాపరంగానూ, కొన్ని సమస్యలు రాకుండా నివారించడంలోనూ కూడా ఇవి ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. దాంతో వ్యాయామప్రియులు ఏరోబిక్స్‌ నుంచి పిలాటిస్‌ వైపు మళ్లుతున్నారు. వీటి ఆన్‌లైన్‌ క్లాసులకూ గిరాకీ పెరిగింది. ఫలితంగా పిలాటిస్‌ శిక్షణావకాశాలూ పరికరాల మార్కెట్‌ విపరీతంగా పెరుగుతోందని మార్కెట్‌ వర్గాలు
చెబుతున్నాయి.  

ఒక వ్యక్తి కృషి ఫలితంగా రూపొంది ఇంతగా ప్రాచుర్యం పొందిన వ్యాయామం బహుశా ఇది ఒక్కటేనేమో!

ఇవీ గుర్తుంచుకోవాలి..!

కొందరి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని వ్యాయామాలు అవసరమవుతాయి. సమస్యలేమీ లేకపోతే భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవడానికీ ఈ వ్యాయామాలను ఎంచుకోవచ్చు. తమ అవసరాలనూ శారీరక స్థితిగతులనూ శిక్షకులకు వివరించి చెప్పి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటివారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

  • ఇది ఎనరోబిక్‌ వ్యాయామం. కాబట్టి కార్డియో కిందికి రాదు. అది అవసరం అయినవారు విడిగా చేయాల్సి ఉంటుంది.
  • ఈ వ్యాయామం శరీరాకృతిని టోన్‌ చేసి బలంగా ఉండేలా చేస్తుంది కానీ వెయిట్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ వ్యాయామాలంత ఎక్కువ కాదు. కాబట్టి శరీరంలో ఏ స్థాయి మార్పులు కోరుకుంటున్నారో వాటికి తగ్గట్టుగా వ్యాయామాల్ని ఎంచుకోవాలి.
  • ఇతర వ్యాయామాల్లాగే సరైన పోశ్చర్‌లో శరీరాన్ని ఉంచకపోయినా, కదలికల మీద ఏకాగ్రత చూపకపోయినా, నిదానంగా పద్ధతిగా చేయకపోయినా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాయామంలో పోశ్చర్‌ చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యమనస్కంగా చేయకూడదు.
  • అర్హతలున్న శిక్షకుల వద్దే శిక్షణ పొందాలి. శిక్షణ పొందాక ఇంటి వద్ద సాధన చేయవచ్చు. ఆన్‌లైన్‌లో చూసి చేయాలనుకునేవారు శిక్షకులు చెప్పే సూచనలను తప్పక పాటించాలి.
  • తక్షణ ఫలితాలు ఆశించకూడదు. అందుకు కాస్త సమయం పడుతుంది.

పిలాటిస్‌... ప్రయోజనాలివి!

ఆకృతికి ప్రాధాన్యమిచ్చే సినీనటులే కాదు, మామూలు యువత కూడా పిలాటిస్‌ను ఎంచుకోవడానికి కారణం ఉంది. ఇతర వ్యాయామాల కన్నా తేలికా, ప్రయోజనాలు ఎక్కువ. ప్రధానంగా వీటి వల్ల జీవనశైలి
సమస్యలు తగ్గుతాయి.

  • ఆకృతి లోపాన్ని సరిచేయడంలో  ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు సౌకర్యంగా కూర్చున్నామనుకుంటూ చాలామంది సోఫాలో వెనక్కి జారగిలబడుతుంటారు. దానివల్ల వెన్నెముక కింది భాగం మీద ఒత్తిడి పడుతుంది. అలాగే కుర్చీల్లో ముందుకు వంగిపోయి కూర్చోవడం కూడా. ఇవన్నీ క్రమంగా కారణం తెలియని నొప్పులుగా బయటపడతాయి.
  • ఈ వ్యాయామాల్లో స్ట్రెచింగ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాళ్లూ చేతులూ పట్టేయడం లాంటి సమస్యలు ఉండవు. కదలికలు తేలికగానూ అదుపులోనూ ఉంటాయి. వయసు పెరిగినా ఇబ్బంది ఉండదు.
  • వీటిలో ఉన్న ప్రధాన లక్షణం- కోర్‌ స్ట్రెన్త్‌ని పెంచగలగడం. మొత్తంగా శారీరక సామర్థ్యం పెరుగుతుంది.
  • నడుం నొప్పి తగ్గుతుంది. 2015, 2020లలో జరిగిన వేర్వేరు అధ్యయనాల్లో ఇది రుజువైంది. వివిధ కారణాల వల్ల వెన్నెముక, కటివలయం మధ్య అలైన్‌మెంట్‌ కుదరకపోవడమూ, శారీరక బలం లేకపోవడమూ నడుం నొప్పికి దారితీస్తాయి. ఈ వ్యాయామాలు ఆ సమస్యల్ని పరిష్కరించగలుగుతాయి కాబట్టి నడుం నొప్పి తగ్గుతుంది. గాయాలవల్ల తిరగబెట్టే నొప్పుల్ని కూడా ఈ వ్యాయామాలు నివారిస్తాయి.
  • రక్తసరఫరా మెరుగవడంతో అలసట, నీరసం తగ్గి కొత్త శక్తి వచ్చినట్లుంటుంది.
  • గాయాలను నివారిస్తాయి. శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడాన్ని సాధన చేయడం వల్ల నిలదొక్కుకోలేక తూలి పడిపోవడం, గాయపడడం లాంటి సమస్యలు తలెత్తవు.
  • పూర్తిగా మనసు పెట్టి ఏకాగ్రతతో చేసే వ్యాయామం కాబట్టి శరీరం పట్ల అవగాహన పెరుగుతుంది. అది పంపే సంకేతాలను గుర్తించడం తేలికవుతుంది.
  • శ్వాస నియంత్రణ కూడా ఈ వ్యాయామాల్లో భాగం కాబట్టి పిలాటిస్‌ చేసినప్పుడు శరీరమంతా రిలాక్స్‌ అయ్యి ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుందనీ అధ్యయనాల్లో తేలింది.
  • పొత్తి కడుపు కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. దాంతో నెలసరి కడుపునొప్పి తగ్గుతుంది.
  • మనసుకు ఉత్తేజాన్నిచ్చి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు