Good Habbits: అలవాట్లే... గెలిపిస్తాయి..!

మంచేదో చెడేదో తెలుసు... అయినా ఎందుకో మంచి అలవాట్లు ఒక పట్టాన అవవు, అయిన చెడు అలవాట్లు వదలవు. ఎందుకనీ అంటే- సరైన రీతిలో మనం ప్రయత్నించకపోవడం వల్లనే అంటారు నిపుణులు.

Updated : 22 Feb 2024 15:01 IST

మంచేదో చెడేదో తెలుసు... అయినా ఎందుకో మంచి అలవాట్లు ఒక పట్టాన అవవు, అయిన చెడు అలవాట్లు వదలవు. ఎందుకనీ అంటే- సరైన రీతిలో మనం ప్రయత్నించకపోవడం వల్లనే అంటారు నిపుణులు. అసలు అలవాట్ల ఆనుపానులేమిటో తెలిస్తే కదా ఎలా ప్రయత్నించాలో తెలుస్తుంది. ఆ సంగతులేమిటో చూద్దామా మరి!

‘ఆలస్యంగా నిద్రలేవడం, రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండడం, స్నేహితులతో చాటింగ్‌ చేయడం మానేసి మంచి
అలవాట్లు చేసుకోవాలనుకుంటున్నా. ఎలా ప్రారంభించాలో చెప్పండి...’

వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పేవారిని చాలామంది అడిగే ప్రశ్న ఇది. అందుకు వారు చెప్పే జవాబేంటో తెలుసా?

‘పొద్దున్న లేవగానే మీ పక్క సర్దుకోండి’ అని.

‘అదేమిటి... నేనేదో కష్టపడి మంచి అలవాట్లు నేర్చుకుని గొప్పవాణ్ణవుదామనుకుంటే చిన్నపిల్లలకు చెప్పినట్లు ‘పక్క సర్దండి, ఇల్లు ఊడవండి’ అంటారు. అవి గొప్ప అలవాట్లెలా అవుతాయి?’

పైకి అన్నా అనకపోయినా లోపల నూటికి తొంభై తొమ్మిది మంది అభిప్రాయం ఇదే.

కానీ పక్క సర్దడం అనే చిన్న పని వెనకాల ఉన్న పరమార్థం ఏమిటంటే...

ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వాళ్లందరూ లేవగానే కప్పుకొన్న దుప్పటిని కుప్పలా పక్కకి తోసి, కింద నలిగిపోయిన దుప్పటినీ, తొలగిపోయిన దిండు కవరునీ ఆ పళాన వదిలేసి బాత్‌రూమ్‌లోకి పరిగెత్తేవాళ్లే. అలా కాకుండా ఒక నిమిషం శాంతంగా నిలబడి, కప్పుకున్న దుప్పటిని మడతపెట్టి, దిండునీ నలిగిపోయిన పక్కదుప్పటినీ సరిచేసి చూడండి. మంచం నీట్‌గా కనపడుతూ ఎంత హాయి గొలుపుతుందో. అందుకు మీరే కారణం అన్న భావం మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. ‘ద పవర్‌ ఆఫ్‌ హ్యాబిట్‌’ అనే పుస్తకం రాసిన చార్ల్స్‌ దుహిగ్‌ అయితే- ఈ అలవాటు మనిషి పనితీరును ఎన్నోరెట్లు మెరుగుపరుస్తుందని హామీ ఇస్తున్నారు. అదెలా అంటే- ఒక పనిని బాగా చేశామన్న తృప్తి రోజంతా మనవెంటే ఉంటుందట. అలా పొద్దున్నే మొదటి పని సరిగ్గా చేస్తే రోజు మొత్తమ్మీద మరెన్నో పనులు చక్కగా చేసేందుకు వీలు కలుగుతుందన్నమాట. మంచి అలవాట్లకు అంతకన్నా గట్టి పునాది ఇంకేముంటుంది మరి! అందుకే ఇది ‘కీస్టోన్‌ హ్యాబిట్‌’ అయింది. అంతేకాదు, తమ పడకని తాము సర్దుకునేవారు ఇతరులకన్నా ఎక్కువ గాఢంగా, తృప్తిగా నిద్రపోతారని పరిశోధకులు చెబుతున్నారు.

సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచేవారిని ‘ఫైవ్‌ ఎ.ఎమ్‌. క్లబ్‌’ సభ్యులంటారు. ఐదు- ఆరు గంటల మధ్య సమయాన్ని గోల్డెన్‌ అవర్‌ అనీ అంటారు. అప్పుడు నిద్రలేచే అలవాటే విజయానికి మొదటి మెట్టని కూడా తీర్మానించారు. అలా లేచి తమ పక్క తాము సర్దుకునేవారిపై చేసిన మరో అధ్యయనం- వారంతా చక్కని క్రమశిక్షణకు కట్టుబడి నియమబద్ధమైన జీవితం గడుపుతారనీ, ఆ అలవాటు వారిలో ఒత్తిడిని తగ్గించి, ఉత్తేజాన్ని పెంచుతుంది కాబట్టి చేసే పనులన్నిట్లోనూ మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పింది. అందుకే గొప్పవారు కావాలంటే గొప్ప పనులే చేయక్కరలేదనీ, చిన్న చిన్న అలవాట్లతోనే గొప్పవాళ్లు కావచ్చనీ చెబుతున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

అసలేమిటీ అలవాట్లు

మనం ఆహారం తీసుకోగానే నోట్లోని లాలాజలంతో మొదలెట్టి అన్నవాహిక, కడుపు... ఇలా వరసగా యాసిడ్లూ
ఎంజైములూ కలిసి దాన్ని షుగర్లూ అమైనో ఆసిడ్లూ విటమిన్లూ మినరల్సూ లాంటి రకరకాల పదార్థాలుగా విడదీస్తాయి. రక్తంలో కలిపేస్తాయి. రక్తం ఆ పోషకాలను శరీరంలోని 37 ట్రిలియన్లకు పైగా కణాలకీ చేర్చి వాటిల్లో జవజీవాలను నింపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే- మనం ఏం తిన్నామో... అదే మన శరీరం.

అలాగే రోజూ అలవాటుగా మనం చేసే పనులూ తీసుకునే నిర్ణయాలూ కలిస్తే... మన జీవితం. ఆహారం ఎలాగైతే మన
ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుందో అలాగే అలవాట్లు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి.

‘రోజూ ఒకేలా పని చేయాలంటే విసుగు బాబూ. ఏ పనైనా నాకిష్టం వచ్చినప్పుడే చేస్తా...’ అనుకునేవాళ్లూ ఉంటారు. అలాగే చేశారనుకోండి. ఆలస్యంగా లేస్తారు. ఏ పనీ చేయబుద్ధికాక రోజంతా బద్ధకంగా ఉంటారు. రాత్రిస్నేహితులతో గడిపి లేట్‌గా  ఇంటికొస్తారు. అర్థరాత్రి చల్లారిన భోజనం చేసి ఏ తెల్లారగట్టో పడుకుంటారు. కొన్నాళ్లకు... ఆరోగ్యం చెడుతుంది. జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. చదువులోనైనా ఉద్యోగంలోనైనా సాధించినదేమీ కనిపించదు. దాంతో మనసు కుంగుబాటుకు లోనవుతుంది.
సరిదిద్దుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకే మంచి అలవాట్లు చేసుకోమనేది.

ఒక కొత్త అలవాటు కావాలంటే ఆలోచన, కోరిక, స్పందన, బహుమతి... నాలుగు దశలుంటాయి. పొద్దున్నే లేస్తే బాగుంటుంది అన్న ఆలోచన రాగానే అలా లేవాలన్న కోరిక కలగాలి. అప్పుడు దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవడమే స్పందన. రోజూ కన్నా ముందే లేచి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే- అదే బహుమతి. పొద్దున్నే లేచి పక్క సరిచేశారనుకోండి, ఆ ఉత్సాహంతో ఇక ఆగేదే లేదన్నట్లుగా పనులన్నీ చకచకా చేసేసి ఆఫీసుకు వెళ్లిపోతారు. అక్కడా అదే ఉత్సాహం కొనసాగుతుంది. సమయానికి పని పూర్తిచేస్తారన్న మంచి పేరు తెచ్చిపెడుతుంది.

చక్రవడ్డీలాంటిది!

ఏ పనైనా మొదలెట్టి ఊరుకోకుండా పదే పదే చేస్తే అదే అలవాటుగా మారిపోతుంది. నిజానికి మొదట్లో దాని ప్రత్యేకతేమీ కన్పించదు. అసలు అలవాటు అవుతున్నట్లు కూడా గుర్తించలేరు. గుర్తించేసరికి అది లేనిదే బతకలేమన్నట్లుగా అయిపోతుంది. అందుకే అలవాటుని చక్రవడ్డీతో పోలుస్తారు. అప్పు తీసుకునేటప్పుడు ‘కొంచెమేగా ఎంతలో తీరుస్తాం’ అనుకుంటాం. తీరా వడ్డీ మీద వడ్డీ వేసి లెక్క తేల్చేసరికి కొండంత అయ్యి గుండె గుభేలుమంటుంది. చిన్నగా ఏమాత్రం గుర్తింపునకు నోచుకోని అలవాట్లే జీవితాన్ని ఏ మలుపైనా తిప్పగలుగుతాయి. నిజానికి ఒక్క అలవాటు చాలు- జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికైనా, దిగజార్చుకోవడానికైనా. అందుకే మంచి అలవాట్లను ఎంచుకున్నవారు విజేతలుగా నిలుస్తారు. చెడు అలవాట్లకు బానిసలైనవారు అనామకులుగా మిగిలిపోతారు. మంచి అలవాట్లు చేసుకోవడమనేది బ్రహ్మవిద్యేం కాదు, ఏది మంచిదో ఏది కాదో ఎరుక ఉండాలి. నిన్నటికన్నా ఇవాళ ఒక్క శాతం మెరుగ్గా మారాలని ప్రయత్నించినా చాలు... అది అలవాటుగా మారి ఏడాది తిరిగేసరికి 44 శాతం మార్పు సాధించవచ్చట.

సంకల్పం ముఖ్యం

మంచి జీవితం గురించి కలలు కనడం సహజం. ఆ కలల సౌధాలను నిర్మించుకోవడానికి సంకల్పం అనే పునాది కావాలి. చాలావరకూ మన కలలకు మనమే సంకెళ్లు వేసుకుంటామంటున్నారు నిపుణులు. మనకంత స్తోమత లేదనీ, శక్తిసామర్థ్యాలు లేవనీ, త్యాగాలు చేయలేమనీ... అపనమ్మకాలూ అపోహలతో తమ ఎదుగుదలకు తామే బ్రేకులు వేసుకుంటారు. ఆ బ్రేకుల్ని తొలగించి ఏదైనా సాధించగలమని ముందుగా మనసుని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఎవరి బలాలు ఏమిటో జాబితా రాసుకోవాలి. మంచితనం, ఆరోగ్యం, సహకరించే తల్లిదండ్రులూ, భాగస్వామి... ఇలా. అది చూడగానే ఆత్మస్థైర్యం రెట్టింపవుతుంది. భవిష్యత్తు మీదా, కోరుకున్నది సాధించడం మీదా నమ్మకం కలుగుతుంది. కలను నిజం చేసుకున్నట్లు ఊహించుకోవడం, ‘సాధించగలను’ అని మాటల్లో పదే పదే అనుకోవడం... మూడో దశ.

ఇదంతా ఎందుకూ అంటే- జీవితంలో కావాలనుకున్నదాన్ని ముందుగా మనసులో పొందాలన్నది నిపుణుల సలహా. సంకల్పం చెప్పుకున్నంత మాత్రాన అయిపోతుందా... కానే కాదు. అవరోధాలూ సమస్యలూ ఎన్నో ఉంటాయి. అవి రాకముందే ఎలాంటి సమస్యలు రావచ్చో అంచనా వేసి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండడమే కార్యసాధకుల లక్షణం. ఒకసారి మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకున్నాక అందుకు తగినట్లుగా చేసుకునే అలవాట్లన్నీ పురోగతికి మెట్లవుతాయి.

పనిముట్లు

‘ఒక చెట్టుని నరకమని నాకు ఆరుగంటలు సమయం ఇస్తే అందులో నాలుగు గంటలు గొడ్డలిని పదును పెట్టుకోవడానికే కేటాయిస్తాను’ అన్న అబ్రహాం లింకన్‌ మాట ఏ పనికైనా సరైన పనిముట్ల అవసరం ఎంతో చెబుతుంది. గొడ్డలి మొండిగా ఉంటే ఎన్ని గంటలు కష్టపడ్డా ఫలితం ఉండదు. మంచి అలవాట్లకీ కొన్ని పనిముట్లు కావాలి. సమయాన్నీ శక్తినీ వాటిమీదే పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే- చాలామందికి ఓపిక ఉండదు. నాలుగు రోజులు చేయగానే ఫలితం కనిపించడం లేదని మానేస్తారు. అది సరైన పద్ధతి కాదు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పనేమిటో తెలుసా... ఒక పనిని పదే పదే చేయడం. లక్ష్యం చేరేదాకా చేయడం. అలా చేసిన పనులే ఇప్పటివరకూ మానవ నాగరికతను ముందుకు తీసుకెళ్లాయి. అందుకే దినచర్యతో ఒక టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని కన్పించేలా ఎదురుగా పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తున్నవాటికి స్టార్‌ గుర్తు పెట్టుకోవాలి. అవి పెరిగేకొద్దీ ఇంకా ఇంకా చేయాలన్న ఉత్సాహం వస్తుంది. నిద్ర లేవడానికి అలారం వాడినట్లే ఈరోజుల్లో పనుల్ని గుర్తుచేసే పలు రకాల ఆప్‌లూ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటి సాయమూ తీసుకోవచ్చు. అలాగే అలవాటు చేసుకునేముందు దాని లక్ష్యం ఏమిటో తెలిసి ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏడాది మొత్తానికి అంచెలంచెలుగా రూపొందించుకున్న ప్రణాళికను నెలవారీగా, వారాల వారీగా విభజించుకుంటే లక్ష్యం చిన్నదిగా, సాధించగలదిగా కన్పిస్తుంది.  

లక్ష్యమూ ప్రణాళికా సిద్ధమయ్యాక ఆచరణలోకొద్దాం. అందుకు తోడ్పడే అలవాట్లలో అన్నిటికన్నా ముఖ్యమైనవి- సరైన తిండి సమయానికి తినడం, వ్యాయామం చేయడం. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత జీవితమంతా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే
కేటాయించాల్సి వస్తుంది. తిండి సరే- శరీరానికి అవసరం. వ్యాయామం ఎందుకూ... పొద్దున్న లేచిందగ్గర్నుంచీ క్షణం తీరిక లేకుండా పనులు చేస్తుంటే, అదంతా వ్యాయామం కాదా... అంటారు చాలామంది. ఎందుకు కాదో తెలియాలంటే కార్టిసోల్‌ గురించి తెలుసుకోవాలి.

కార్టిసోల్‌ కథ

మనని పొద్దున్నే నిద్రలేపి చకచకా పనిచేసేందుకు శక్తినిస్తుంది కార్టిసోల్‌ హార్మోన్‌. నిజానికిది కీలకమైన స్ట్రెస్‌ హార్మోన్‌. ఉదయం వేళ ఎక్కువగా విడుదలవుతుంది. రోజు గడిచేకొద్దీ తగ్గుతుంది. ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్‌లాంటి వాటికి దారితీస్తుంది. ఆలోచించే శక్తిని హరిస్తుంది. ఆ తర్వాత ఇక ఏ పనీ చేయనివ్వదు. అదే కాసేపు వ్యాయామం చేస్తే కార్టిసోల్‌ స్థాయులు క్రమబద్ధమవుతాయి. దాంతో మెదడు ఉత్సాహంగా ఆలోచించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఇంటి పని శరీరానికి శ్రమే అవుతుంది కానీ వ్యాయామంలో లాగా ఎక్కువ కెలొరీలు ఖర్చవవు, దానివల్ల కార్టిసోల్‌ మీద ప్రభావం పడకపోగా ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకని పూర్తిగా శరీరం మీద దృష్టి పెట్టి ఏదో ఒక వ్యాయామం చేయాలి. అప్పుడే కార్టిసోల్‌ కండిషన్లోకి వస్తుంది. సరిగ్గా ఇరవై నిమిషాలు లేదా శరీరం చెమట పట్టేంత వ్యాయామం చేస్తే చాలు. కార్టిసోల్‌ తగ్గడమే కాదు, ఉత్తేజాన్నీ సంతోషాన్నీ
కలిగించే డోపమైన్‌, సెరొటోనిన్‌ హార్మోన్లూ విడుదలవుతాయి. ఉత్సాహంగా రోజు గడవడానికి కావాల్సినంత ఇంధనం  మకూరుతుంది! ఆహారపుటలవాట్లూ వ్యాయామమూ ఒకసారి దినచర్యలో భాగమైపోతే ఆ తర్వాత విజ్ఞానాన్ని పెంచుకునే అలవాట్లు మొదలుపెట్టాలి.

చదవండి: బిల్‌గేట్స్‌ ఏడాదికి యాభై పుస్తకాలు చదువుతాడట. ఎలన్‌ మస్క్‌ రోజులో పదిగంటలు చదువుతూనే ఉంటాడట. మరి... మీరొక పుస్తకం చదివి ఎన్నాళ్లయింది? ఎంతో చదివాకే వాళ్లు గొప్పవాళ్లయ్యారు. అందుకే రోజూ పడుకోబోయేటప్పుడు కనీసం అరగంట చదువుకి కేటాయించాలి.

ఆచరించండి: ప్రముఖుల ఉపన్యాసాలు వింటారు. టెడెక్స్‌ ప్రసంగాలు చూస్తారు. వాటన్నింటిలో ఉన్న పనికొచ్చే సమాచారాన్ని గ్రహించి ఆచరిస్తున్నారా మరి? అవసరమైనది ఎంచుకుని చూసి అందులో ఉపయోగపడేదాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.

రిలాక్స్‌ అవండి: పనిలో పడితే సమయం తెలియదు కొందరికి. మంచైనా చెడైనా... అలవాట్లకూ పరిమితులుండాలి. వాటిని మన నియంత్రణలో ఉంచుకోవాలి కానీ వాటికి బానిసలవద్దు. మంచి అలవాట్లు చేసుకోవడం ఎంత ముఖ్యమో రిలాక్స్‌ అవడమూ అంత ముఖ్యమే. అది మర్చిపోతే- కుటుంబానికీ స్నేహితులకీ దూరమవుతారు, చిన్న చిన్న ఆనందాలనీ కోల్పోతారు. చివరికి ఇంత
కష్టపడీ సాధించిన విజయాలకు అర్థం లేదనిపిస్తుంది. నిరంతరాయంగా పనిచేసేవారి కన్నా మధ్యలో విశ్రాంతి తీసుకునేవారి పనితీరు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందట. ఫైవ్‌ ఎ.ఎమ్‌. క్లబ్‌ సభ్యులైతే 60నిమిషాల పనీ పది నిమిషాల విశ్రాంతిని కచ్చితంగా అనుసరిస్తారు.

ఆటవిడుపు: మంచి అలవాట్లు చేసుకున్నాం కదా అని 365 రోజులూ వాటిని అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. నెలలో ఒకరోజు, ఏడాదికో వారం... పూర్తిగా షెడ్యూల్‌ని పక్కనపెట్టి ఆటవిడుపుగా వ్యవహరించాలి. ఏమాత్రం సంబంధం లేని పనులు చేసుకోవాలి. మనం మనుషులం... రోబోలమో కంప్యూటర్లమో కాదు కాబట్టి వైవిధ్యాన్ని కోరుకోవడంలో తప్పులేదు. అలా చేయడం వల్ల అలవాట్లకు కట్టుబడే స్వభావం మరింతగా పెరుగుతుంది.

సమీక్ష: రోజూ రాత్రి ఒక ఐదు నిమిషాలు- ఇవాళ నా లక్ష్యం దిశగా నేనేం చేశాను, మంచి పనులేమిటి, పొరపాట్లేమిటి... డైరీలో రాసుకోవడం మొదలెడితే స్వీయ సంస్కరణ చాలా సులువవుతుంది.

మంచి అలవాట్లు

అలవాట్లు ఎలా చేసుకోవాలో చూశాం కానీ ఇంతకీ మంచి అలవాట్లంటే ఏమిటి... వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మరింత మంచి స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడేవి ఏవైనా మంచి అలవాట్లే. ప్రధానంగా ఇవి నాలుగు రకాలుంటాయి. ఐదుగంటలకు లేవడం, త్వరగా పడుకోవడం లాంటి దినచర్యలో మార్పులకు కారణమయ్యేవాటిని ‘కీస్టోన్‌ హ్యాబిట్స్‌’ అంటారు. శారీరక శ్రమను కలిగించేవి- వ్యాయామం, నడక లాంటివి ‘మోటార్‌ హ్యాబిట్స్‌’. పరిశీలన, తార్కికంగా ఆలోచించడం లాంటివి అలవర్చుకోవడాన్ని ‘మేధోపరమైన అలవాట్లు’ అంటారు. చివరగా భావోద్వేగాలకు సంబంధించినవి- ఎమోషనల్‌ హ్యాబిట్స్‌. ఇతరులకు సహాయపడడం, సహానుభూతి చూపడం లాంటివి. ఈ నాలుగు రకాల అలవాట్లూ కలిసి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. కొత్త అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు అదేదో శిక్షలానో, తప్పదు కాబట్టో అయిష్టంగా మొదలెట్టకూడదు. ఇష్టంగా, దానివల్ల కలిగే లాభాన్ని తలచుకుంటూ మొదలుపెట్టాలి. అలాగే దేన్నైనా వదిలించుకోవాలనుకున్నప్పుడు దానిమీద అయిష్టత పెంచుకుని కంటికి కనపడకుండా దూరంగా ఉంటే మానడం తేలికవుతుంది.  

కాబట్టి ఎవరికి వారు తమ జీవన విధానాన్ని ఒకసారి విశ్లేషించి చూసుకుని ఏయే రంగాల్లో మార్పులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారో ఆయా రంగాలకు సంబంధించిన మంచి అలవాట్లను ఎంచుకుని సాధన చేయడం మొదలుపెట్టాలి. మార్పుని స్వాగతించడానికీ సవాళ్లను స్వీకరించడానికీ సిద్ధమైతే... అలవాట్లు ఆధీనంలో ఉంటాయి. అప్పుడిక, విజయం వెనువెంటే ఉంటుందనడానికి సందేహం ఎందుకూ..!


ఎన్ని రోజులు!

లవాట్లు ఎందుకు ముఖ్యం అంటే- మనం మెలకువగా ఉన్న సమయంలో చేసే పనుల్లో 70 శాతం అలవాటుగానే చేస్తాం తప్ప ఆలోచించి చేయమట. అందుకే అవసరం లేని అలవాట్లను వదిలించుకోవాలి, అవసరమైన వాటిని అలవర్చుకోవాలి. చాలామంది కొన్ని తేలిగ్గా చేసేస్తారు, కొన్ని విషయాల్లో ‘మావల్ల కాదు’ అనేస్తారు. నిజానికి వల్లకానిది అంటూ ఏదీ ఉండదు. ఒక అలవాటు చేసుకోగలిగినవారికి ఇంకో అలవాటు చేసుకోలేకపోవడమనేది ఉండదంటున్నారు నిపుణులు. ఏదైనా అలవాటుగా మారడానికి సాధారణంగా 21 రోజులు పడుతుందంటారు శాస్త్రవేత్తలు. అందుకే డైటింగ్‌, వ్యాయామం లాంటివి చేయాలనుకునేవారు ‘21 రోజుల సవాలు’ చేపడుతుంటారు. మరి కొందరు 18 రోజులే చాలంటే ఇంకొందరు రెండు నెలలు పడుతుందంటారు. ఇది మనిషిని బట్టి మారుతుందా లేక ఎంచుకున్న అలవాటును బట్టి మారుతుందా అన్నదానికి పరిశోధన ఏం చెబుతోందంటే- మనుషుల్ని బట్టి ఒక అలవాటు అవడానికి 18 రోజుల్నుంచీ 8 నెలల వరకూ ఎంతైనా పట్టొచ్చట. సమయం సంగతి ఎలా ఉన్నా అలవాటు చేసుకోవడం, కొనసాగించడం, వదిలించుకోవడం... అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయన్నది న్యూరోసైంటిస్టుల మాట.


చేసుకోవచ్చూ... వదిలించుకోనూవచ్చు!

వును... రెండూ మన చేతిలోనే ఉన్నాయి. కొత్త అలవాటు చేసుకోవాలనుకునేవారికి నిపుణులు చెప్పేదేమిటంటే- మంచిరోజు కోసం వేచి చూడవద్దు. ఇవాళే మొదలెట్టండి. పొద్దున్నే లేచే అలవాటు చేసుకోవాలంటే అలారం పెట్టుకుని 66 రోజులు వరసగా లేవండి. ఆ తర్వాత అలారంతో పనిలేకుండానే లేస్తారు. అలాగే ఒకేసారి పెద్ద లక్ష్యం పెట్టుకోకూడదు. ఏడింటికి లేచేవాళ్లు అకస్మాత్తుగా
ఐదింటికే లేస్తే శరీరం ఇబ్బందిపడుతుంది. దాంతో మొదటికే మోసం వస్తుంది. మెల్లగా అరగంట చొప్పున తగ్గిస్తూ వెళ్తే ఎక్కువ ఇబ్బందిలేకుండా అలవాటవుతుంది. అలాగే ఒకేసారి ఒకటికి మించి ఎక్కువ అలవాట్లు చేసుకోవాలని ప్రయత్నించవద్దు. గందరగోళంగా తయారవుతుంది. నెలకొకటి చొప్పున ప్రయత్నించవచ్చు.  

వదిలించుకోవాలా: చాలామంది ప్రయత్నించకుండానే చెడు అలవాట్లను వదిలించుకోవడం కష్టమనుకుంటారు. ఉదాహరణకు- స్వీట్లు, జంక్‌ఫుడ్‌ తినడం ఇష్టం. మానలేకపోతున్నారు. ఉన్నపళాన మానేయడం ఎవరివల్లా కాదు. అందుకని ముందు తగ్గించుకోవాలి. రోజూ తింటున్నట్లయితే ఒకవారం రోజు విడిచి రోజు తినాలి. ఆ తర్వాత మూడు రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి... ఇలా క్రమంగా సమయం పెంచుకుంటూ మోతాదు తగ్గించుకుంటూ ప్రయత్నిస్తే మానెయ్యడానికి నెల కూడా పట్టదు. స్వీట్లనే కాదు, సిగరెట్లకైనా ఇదే వర్తిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..