అద్దం ముందు నిల్చుని మాట్లాడుకుంటా!

అనుపమా పరమేశ్వరన్‌... ‘ప్రేమమ్‌’తో తెలుగుతెరకు పరిచయమైన ఈ మలయాళీ కుట్టి... త్వరలో ‘ఈగిల్‌’, ‘టిల్లు స్క్వేర్‌’తో సందడి చేయబోతోందనేది తెలిసిందే. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాలూ అలవాట్ల గురించి చెప్పుకొస్తోందిలా...

Updated : 21 Jan 2024 00:30 IST

అనుపమా పరమేశ్వరన్‌... ‘ప్రేమమ్‌’తో తెలుగుతెరకు పరిచయమైన ఈ మలయాళీ కుట్టి... త్వరలో ‘ఈగిల్‌’, ‘టిల్లు స్క్వేర్‌’తో సందడి చేయబోతోందనేది తెలిసిందే. ఈ సందర్భంగా తన ఇష్టాయిష్టాలూ అలవాట్ల గురించి చెప్పుకొస్తోందిలా...


ఎన్ని టేకులో...

ప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ టేకులు తీసుకున్నదంటే ‘18 పేజెస్‌’కే. ఒక్కో సీన్‌కు పాతిక నుంచి ముప్ఫై వరకూ టేకులు తీసుకున్నా. దర్శకుడు ప్రతి సీనూ తాను అనుకున్నట్లుగా వచ్చేందుకు ప్రయత్నించడం ఒక కారణమైతే... నేనూ రాజీపడకపోవడం మరొక కారణం. అందుకే ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చింది.


సంతృప్తినిచ్చిన సినిమా

‘ప్రేమమ్‌’. అది లేకపోతే నేను ఇండస్ట్రీకి రాకపోయి ఉండేదాన్నేమో...


కోపం వచ్చేస్తుంది

కొన్నిసార్లు నాకు చటుక్కున కోపం వచ్చేస్తుంది. లేదా ఉన్నట్టుండి మూడీగా మారిపోతుంటా. అలాగని మనసులో పెట్టుకునేందుకు ప్రయత్నించను. నా కోపానికి కారణమైన వారితో వెంటనే గొడవపడి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తా తప్ప దాన్ని కొనసాగించను. తరువాత వాళ్లతో మళ్లీ మామూలుగానే మాట్లాడేస్తాను.


షూటింగ్‌లు లేకపోతే...

ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతా. అప్పుడు కూడా విశ్రాంతి పేరుతో పడుకోకుండా తోటపని, ఇంటిని శుభ్రం చేయడం, దుస్తులు ఉతికి ఇస్త్రీ చేయడం, కూరగాయలు తరగడం.. వంటివన్నీ చేస్తా. వీటితోనే నేను ఎక్కువగా రీఛార్జ్‌ అవుతాను మరి.  


మార్పును ఇష్టపడలేను

నేను ఏ మార్పునూ వెంటనే స్వీకరించలేను. ఉదాహరణకు మా ఇంట్లో ఓ మొక్క పూర్తిగా వడలిపోయి.. తీసేయాల్సి వచ్చినా బాధపడిపోతుంటా. అలాగే నాకు సంబంధించిన చిన్న వస్తువు కనిపించకపోయినా కంగారుపడిపోతా. ‘కార్తికేయ 2’ షూటింగ్‌లో ఉన్నప్పుడు అనుకుంటా... నేను ఉపయోగిస్తున్న పెన్ను ఒకటి కనిపించలేదు. నిజానికి అది చిన్న పెన్నే...దాని ఖరీదు కూడా తక్కువే. అయినా కూడా సెట్‌ మొత్తం వెతికేశా.


ప్రస్తుతమే ముఖ్యం

నేను మంచి రోజులు, చెడు రోజులు అంటూ లెక్కపెట్టుకోను. అంతా బాగుందా... ఆనందంగా గడిపేస్తా. ఒకవేళ బాధపడే సందర్భాలు/రోజులు ఉన్నాయా... ఆ పరిస్థితులూ అనుభవాల నుంచి ఎంతో కొంత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా తప్ప అదేపనిగా మథనపడుతూ ఏడుస్తూ మాత్రం కూర్చోను.


నాతో నేను...

న మనసును మించిన ఫ్రెండ్‌ మరొకటి ఉండదని నా అభిప్రాయం. అందుకే వీలున్నప్పుడల్లా అద్దంముందు నిల్చుని నాతో నేను కాసేపు మాట్లాడుకుంటూ ఉంటా. ఆ సమయంలో నాలో నేనే ప్రశ్నించుకుంటా, విమర్శించుకుంటా, ప్రశంసించుకుంటాను కూడా. ఇలా చేస్తూనే ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నిస్తా.


అదో సరదా  

స్కూల్లో ఉన్నప్పుడు చాక్లెట్‌ ర్యాపర్స్‌, పెళ్లికార్డులపైన వచ్చే దేవుళ్ల బొమ్మలు, ఇన్విటేషన్లపైన కనిపించే ఫొటోలను కత్తిరించి దాచుకునేదాన్ని. అలా సేకరించినవి మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి.


ఎక్కువసార్లు చూసిన సినిమాలు

టైటానిక్‌, మమ్మీ.


ఇష్టపడే నటి

సాయి పల్లవి... తనది సహజమైన అందం. తన వ్యక్తిత్వం కూడా అంతే బాగుంటుంది.


ఇష్టంగా తినేది...

నేను మాంసాహారినే అయినా శాకాహారాన్నీ అంతే ఎక్కువగా ఇష్టపడతా. ముఖ్యంగా బెండకాయ, దొండకాయ వంటి కూరలు కనిపించినప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటాను. అలాగే వంట కూడా బాగానే చేస్తాను. నేను చేసే చికెన్‌ స్ట్యూ బాగుంటుందని తిన్నవాళ్లు చెబుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు