అతిథులు మెచ్చిన అందాల విడిది!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల హోటళ్లతో పోటీపడి నంబర్‌ వన్‌గా నిలిచిందంటే.. అదెంత ప్రత్యేకమై ఉండాలి! ఒక సంవత్సరంలోనే అయిదు వేలకు పైగా ఫైవ్‌స్టార్‌ రివ్యూలను సొంతం చేసుకుందంటే..

Updated : 13 Apr 2024 15:47 IST

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల హోటళ్లతో పోటీపడి నంబర్‌ వన్‌గా నిలిచిందంటే.. అదెంత ప్రత్యేకమై ఉండాలి! ఒక సంవత్సరంలోనే అయిదు వేలకు పైగా ఫైవ్‌స్టార్‌ రివ్యూలను సొంతం చేసుకుందంటే.. అందులో సౌకర్యాలెంత అద్భుతంగా ఉండాలి! ఇంద్రభవనమనే మాటే చిన్నదయ్యేంత అందమైన ఆ హోటల్‌.. రామ్‌బాగ్‌ ప్యాలెస్‌. దానికే మరోపేరు...‘జ్యువెల్‌ ఆఫ్‌ జైపూర్‌’. కళ్లు తిప్పుకోనీయని అలంకరణతో అడుగడుగునా రాజసం ఉట్టి పడే ఆ విలాసాల  విడిదిని మనమూ చుట్టొద్దాం రండి...

ఆతిథ్యరంగమంటే అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి... విలాసవంతమైన హోటళ్లు అంటే పాశ్చాత్య దేశాలే కళ్లముందు కదలాడతాయి. కానీ ఆ లగ్జరీ  టళ్లన్నింటినీ తలదన్ని మొదటిస్థానంలో నిలబడిన రామ్‌బాగ్‌ ప్యాలెస్‌ ఒకప్పుడు రాజ సౌధం. కాలక్రమేణా లగ్జరీ హోటల్‌గా మారి- మనదేశంలోని మొట్టమొదటి ప్యాలెస్‌ హోటల్‌గానూ ప్రసిద్ధి చెందింది.ఆ హోటల్‌లో అడుగడుగునా భారతీయ వాస్తు, సాంస్కృతిక, వారసత్వ సౌందర్యం ఉట్టిపడుతుంది. భవనం నిర్మాణం నుంచి లోపలి అలంకరణ దాకా ప్రతిదీ ప్రత్యేకమే.

విలాసవంతమైన గదులు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లు- దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందిన కమ్మని వంటకాలు- ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంటాయి.

ప్రేమ కానుక

రామ్‌బాగ్‌ ప్యాలెస్‌ కొలువుతీరిన ప్రాంతం ఒకప్పుడు అందమైన అటవీ ప్రదేశం. 1835లో మహారాజా రామ్‌ సింగ్‌-2 అర్ధాంగి తనకు ఇష్టమైన చెలికత్తె కేసర్‌కోసం నగరానికి దూరంగా ఓ భవనాన్ని కట్టించి ఇచ్చింది. ఆ చెలికత్తె మరణానంతరం మహారాజు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుని కొన్ని మార్పులు చేయించాడు. వేెటకు వెళ్లినప్పుడు విశ్రాంతి మందిరంగా దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. క్రమంగా ఆ భవనానికి రామ్‌ బాగ్‌ అనేపేరు వచ్చింది. కొన్నేళ్లకు అదే వంశానికి చెందిన మహారాజా మాన్‌సింగ్‌-2 రామ్‌బాగ్‌ను తన ప్రధాన నివాసంగా చేసుకుని- 1931లో ఆ భవనాన్ని రాజమందిరంగా విస్తరించి తన భార్య అయిన మహారాణి గాయత్రీ దేవికి ప్రేమకానుకగా అందించాడు.

లగ్జరీ హోటల్‌గా...

విశాలమైన ఈ భవనం నిర్వహణ కష్టంగా మారడంతో 1957లో రామ్‌బాగ్‌ ప్యాలెస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చారు. 1972లో తాజ్‌ గ్రూప్‌ దీన్ని కొనుగోలు చేసి మరిన్ని హంగూ ఆర్భాటాలతో అద్భుతమైన హెరిటేజ్‌ హోటల్‌గా తీర్చిదిద్దింది. 47 ఎకరాల విస్తీర్ణంలో 104 గదులుగా ఉన్న కోటను 79 విశాలమైన గదులుగా మార్చింది. కోటలోపల మరమ్మతు చేసి మీనాకారి, థీక్రి లాంటి కళలతో బంగారు రేకులతో గోడల్నీ సీలింగ్‌నీ అలంకరించింది. పందిరి మంచాలు, పెయింటింగులు, అద్దాలు, రంగులదీపాలు, జర్దోసీ వర్కు చేసిన ఫర్నిచరుతోపాటు ఆనాటి రాజులు విరివిగా వాడే అంతర్జాతీయ బ్రాండెడ్‌ ఉత్పత్తుల్నీ గదుల్లో అమర్చింది. ప్రతిసూట్‌లోనూ రాజస్థానీ పాలరాతి సోయగం, కళానైపుణ్యం ప్రతిబింబించేలా తీర్చిదిద్దింది. స్మార్ట్‌ టీవీ, వైఫై, ల్యాప్‌టాప్‌, ఫ్రిజ్‌, మినీబార్‌, విలాసవంతమైన స్నానాల గది- మినీపూల్స్‌... ఖరీదైన ఫర్నిచర్‌, ఎటుచూసినా మిరుమిట్లు గొలిపే షాండ్లియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రాజభవనంలో సదుపాయాలూ, అలంకరణను బట్టి- ప్యాలెస్‌ రూమ్‌లు, హిస్టారికల్‌, రాయల్‌, గ్రాండ్‌ రాయల్‌, గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌గా విభజించారు. గ్రాండ్‌ రాయల్‌ సూట్స్‌ విభాగంలో మాత్రం మహారాణి సూట్‌, ప్రిన్స్‌ సూట్‌ అని రెండు ఉన్నాయి. ఒకప్పుడు గాయత్రీ దేవి వాడిన గదే మహారాణి సూట్‌. అద్దాలూ, రంగురాళ్లూ పొదిగిన గోడలూ, ఖరీదైన ఫర్నిచర్‌తోపాటు అందమైన రాజస్థానీ పెయింటింగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందది. గాయత్రీదేవి కొడుకు జగత్‌సింగ్‌ వాడిన గదే ప్రిన్స్‌ సూట్‌. మహారాణి సూట్‌కి ఏ మాత్రం తక్కువకాకుండా మరింత ఆధునిక హంగులతో ఉంటుంది. ఇక్కడ లాంజ్‌లో కూర్చుంటే ఉద్యానవనంలో అందాల్నీ, పచ్చిక బయళ్లలో పురివిప్పి నాట్యమాడే నెమళ్ల సొగసుల్నీ హాయిగా వీక్షించొచ్చు. అలానే గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ విభాగంలో సూర్యవంశీ సూట్‌, సుఖ్‌నివాస్‌ సూట్‌ అని రెండు ఉన్నాయి. సూర్యవంశీ సూట్‌లో ఆకుపచ్చని ఉదయ్‌పూర్‌ రాళ్లతో నిర్మించిన ఆర్చ్‌లతో కూడిన సీలింగ్‌లు రాజపుత్రుల వైభవాన్ని కళ్లకు కడతాయి. రెండోది సుఖ్‌ నివాస్‌... క్రిస్టల్‌ షాండ్లియర్లు, బంగారు రేకులతో అలంకరించిన ఈ సూట్‌ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అక్కడ అద్దాల బాత్‌రూమ్‌తోపాటు విశాలమైన లాంజ్‌, డైనింగ్‌హాల్‌ వంటి సదుపాయాలలో రాజసం ఉట్టిపడుతుంటుంది.

ఆధునిక వసతులూ

పోలో మైదానం, జిమ్‌, స్పా, యోగా కేంద్రంతోపాటు... ఎన్నో అత్యద్భుత సౌకర్యాలతో రామ్‌బాగ్‌ అతిథులకు సేవలందిస్తోంది. పెద్ద పెద్ద కాన్ఫరెన్స్‌ హాళ్లతో- బిజినెస్‌ మీటింగులకు వేదికగా మారి- కెఫేలూ, రెస్ట్టరంట్లతో కార్పొరేట్‌ ప్రపంచానికీ స్వాగతం పలుకుతోంది. అలానే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకూ వేదికై వధూవరుల జీవితాల్లో మరిచిపోలేని ఎన్నో మధురఘట్టాలకు నెలవుగా మారింది. ప్యాలెస్‌లో 20-2000 మంది వరకూ పట్టే పలు వేదికలు అందుబాటులో ఉన్నాయి.
డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం తీసుకెళ్లే అతిథుల సంఖ్యనూ ఎంచుకునే అలంకరణనూ విందునూ బట్టి రోజుకు దాదాపు రూ.60 లక్షల నుంచి కోటి వరకూ ఛార్జ్‌ చేస్తారు. మరి రాజభవనాల్లో విడిది అంటే ఆ మాత్రం ఉండదా అంటే... అక్కడ గడిపే ప్రతిక్షణం అద్భుతంగానూ విలువైందిగానూ చెబుతారు బస చేసిన అతిథులు. ఒక్కసారైనా ఆ రాచరిక మర్యాదల్లో తడిసిముద్దవ్వాల్సిందేనంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..