పొలం ఆరబెట్టేందుకు హెలికాప్టర్లు!

చెర్రీ పంటకు వేడి వాతావరణం ఎంతో అనుకూలమైంది. ఆ పంట చేతికొచ్చేది కూడా వేసవిలోనే. చెర్రీలు బాగా పెద్దవయ్యాక తేమ తగిలితే అవి పగిలిపోయి జ్యూస్‌కి మాత్రమే పనికొస్తాయి. కొన్నిసార్లు కుళ్లిపోయి దేనికీ పనికి రాకుండాపోతాయి. పైగా పగిలిన కాయల్ని చెట్ల నుంచి కోయించడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే.

Published : 29 May 2022 00:26 IST

పొలం ఆరబెట్టేందుకు హెలికాప్టర్లు!

చెర్రీ పంటకు వేడి వాతావరణం ఎంతో అనుకూలమైంది. ఆ పంట చేతికొచ్చేది కూడా వేసవిలోనే. చెర్రీలు బాగా పెద్దవయ్యాక తేమ తగిలితే అవి పగిలిపోయి జ్యూస్‌కి మాత్రమే పనికొస్తాయి. కొన్నిసార్లు కుళ్లిపోయి దేనికీ పనికి రాకుండాపోతాయి. పైగా పగిలిన కాయల్ని చెట్ల నుంచి కోయించడం కూడా ఖర్చుతో కూడుకున్న పనే. అందుకే వర్షాలు పడినప్పుడు హెలికాప్టర్ల సాయంతో పంటని ఆరబెడుతున్నారు చెర్రీ రైతులు. వర్షం కురిసి ఆగిపోయిన వెంటనే చెర్రీ తోటపైన హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టినప్పుడు దాని రెక్కల నుంచి వచ్చే గాలి వల్ల ఆకుపైనా చెర్రీలపైనా నిలిచిన నీళ్లు ఆరిపోయి పొడిగా అవుతాయి. దానివల్ల కాయలు పగలడం, కుళ్లడం వంటివి జరగవు. అందుకే చెర్రీ బాగా పండే కొలంబియా, టర్కీ, ఇరాన్‌, సిరియా, ఇజ్రాయెల్‌, ఇటలీ తదితర దేశాల్లోని సంపన్న చెర్రీ రైతులు ఈ పంటకోసమే ప్రత్యేకంగా హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వీటిని అద్దెకివ్వడమే వ్యాపారంగానూ పెట్టుకుంటున్నారు.


వన వాసానికి పదేళ్లు!

పల్లెల్లో ఉంటున్నా, నగరాల్లో జీవిస్తున్నా ఎక్కడా సౌకర్యాలకు లోటు లేకుండా అన్నీ అమర్చుకుంటాం. ఏ చిన్న అసౌకర్యం వచ్చినా భరించలేం. అయితే మంచిర్యాలకు చెందిన ఓ ఆదివాసి మాత్రం కాలుష్యానికి దూరంగా ప్రకృతికి చేరువగా అడవిలో జీవిస్తున్నాడు. సౌకర్యాలేమీ లేకపోయినా ఆరోగ్యకరమైన జీవనశైలితో ముందుకెళుతున్నాడు. మంచిర్యాల జిల్లా నర్సాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గంపన్‌పల్లికి చెందిన సోయం జంగు పదేళ్లుగా వనవాసం చేస్తున్నాడు. నిరక్షరాస్యుడైన జంగు భార్య కొంత కాలం క్రితం చనిపోయింది. పిల్లలు లేని అతను అడవిలో కలపతోనే ఇల్లు నిర్మించుకుని సోలార్‌ విద్యుత్తును వాడుకుంటున్నాడు. అక్కడే కూరగాయలూ, వరీ, పత్తి పండించుకునే జంగు నెలలో ఒకసారి మాత్రమే దగ్గర్లోని గ్రామానికెళ్లి కావల్సిన నిత్యావసరాలు తెచ్చుకుంటుంటాడు. బియ్యం, కాయగూరలు తాను పండించినవే వాడుకుంటున్నాడు. ఆరోగ్యం కోసం ఆ ఆడవిలోని మూలికల్ని తీసుకుంటూ జీవనంసాగిస్తున్నాడు. అంతేకాదు, చుట్టుపక్కల పల్లెల నుంచీ ఆరోగ్యం బాగోలేని వారు అతని వద్ద వనమూలికలు తీసుకోవడానికి వస్తుంటారు. వన్యప్రాణులకీ భయపడకుండా అడవిలో నివసించే  జంగు ‘ఆహారం, గాలీ, నీరు... అన్నీ కలుషితమైన ఈ రోజుల్లో అడవిలో జీవితమే ఆయువును పెంచుతుంద’ంటున్నాడు.


ఆలోచన అదిరింది!

విశాఖపట్నంలోని గురుద్వార జంక్షన్‌లో ఓ ఐదంతస్తుల హోటల్‌ ప్రధాన ఆకర్షణగా మారింది. ఆ హోటల్‌ బయట నాలుగువైపులా సోలార్‌ప్యానెళ్లను అమర్చడమే ఇందుకు కారణం. విశాఖకు చెందిన అన్నె నారాయణ రావు రూ.5 కోట్లతో ‘నమో ఇన్స్పైర్‌ స్మార్ట్‌ ఇన్‌’ పేరుతో ఆ హోటల్‌ నిర్మించారు. సాధారణంగా ఎలివేషన్‌కోసం అద్దాలను అమర్చడానికి పాతిక నుంచి ముప్ఫై లక్షల వరకూ ఖర్చు అవుతుంది. అయితే అద్దాలు కేవలం అలంకరణకు మాత్రమే అయినా వాటి నిర్వహణకు బాగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే వాటికి బదులు సోలార్‌ ప్యానెళ్లను అమర్చితే విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ హోటల్‌ నిర్వహణకి వాడుకోవచ్చు. కాలుష్యం సమస్య కూడా ఉండదు. మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కీ అమ్మేసుకోవచ్చని ఆలోచించారాయన. అందుకే దాదాపు రూ.45 లక్షల రూపాయలు ఖర్చు చేసి భవనం బయటవైపు 250 సోలార్‌ ప్యానెళ్లను అమర్చారు. ప్రస్తుతం ఈ సౌర ఫలకాలు రోజుకి 100 కేవీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండగా- ఆ భవనం నిర్వహణకు రూ. 30- 35 కేవీ విద్యుత్తును ఉపయోగించి మిగతాది సెంట్రల్‌ గ్రిడ్‌కు సరఫరా చేస్తూ 30-40 వేలు ఆదాయం పొందుతున్నారు నారాయణరావు.


జీతం బంగారమాయె!

కొన్ని సంస్థలు ఉద్యోగులకు బోనస్‌గా బంగారు నగలు, ఇళ్ల స్థలాలు, కార్లు తదితరాలు ఇవ్వడం తెలిసిందే. అయితే బ్రిటన్‌కి చెందిన ఆర్థిక సేవల సంస్థ ‘ట్యాలీమనీ’ తమ ఉద్యోగులు డబ్బు రూపంలోనే కాకుండా మరే రూపంలో అయినా జీతాన్ని తీసుకోవచ్చని ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పౌండ్‌ విలువ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే ‘ట్యాలీమనీ’ ఉద్యోగులకోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంది. పైగా బంగారం విలువ క్రమంగా పెరుగుతుండటంతో జీతం కింద డబ్బులకి బదులు పసిడిని తీసుకోమని కూడా సూచిస్తున్నారు ఆ సంస్థ సీఈవో కామెరాన్‌ ప్యారీ. దాంతో 90 శాతంపైనే ఉద్యోగులు గోల్డ్‌ బిస్కెట్లను తీసుకోవడానికి మొగ్గు చూపితే మిగతావారు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, ఫర్నిచర్‌ రూపంలో జీతాన్ని తీసుకుంటున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..