Updated : 21 Aug 2022 13:51 IST

ప్రీస్కూలు ఆటలతో ఎంతో మేలు!

చిన్నారులు ఆడుకోవడానికి ఎన్ని రకాల బొమ్మలూ ఆటవస్తువులూ ఉన్నా వాళ్లను చూసుకునేందుకు ఎంతమంది పెద్దవాళ్లు ఉన్నా తోటి పిల్లలతో ఆడుకున్నప్పుడే వాళ్లు ఆరోగ్యంగా పెరుగుతారు. ఈ విషయాన్నే కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు శాస్త్రీయంగా శోధించి మరీ చెబుతున్నారు. ప్రీస్కూలుకి వెళ్లి తోటి పిల్లలతో కలసిమెలసి ఆడుకునే పిల్లలు- పెద్దయ్యాక ఎలాంటి మానసిక సమస్యలూ లేకుండా హాయిగా పెరుగుతున్నారట. ఇలాంటి పిల్లల్లో భావోద్వేగాలని తట్టుకునే శక్తి చిన్నతనం నుంచే అలవడుతుంది. ఇతర పిల్లలతో పేచీలూ ఉండవు. ఇందుకోసం వీళ్లు 3-7 ఏళ్ల వయసున్న రెండు వేల మంది పిల్లల్ని ఎంపికచేసి మరీ పరిశీలించారట. అంతేకాదు, ప్రీస్కూల్లో బిల్డింగ్‌ బ్లాక్స్‌, దాగుడుమూతలు... వంటి ఆటలు ఆడిస్తే త్వరగా ఇతర పిల్లలతో కలసిపోయి చక్కగా ఆడుకోగలుగుతారు. ఈ రకమైన ఆటలవల్ల ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌నీ బాగా అర్థంచేసుకోగలుగుతారు. కాబట్టి ప్రీస్కూలు అనేది పిల్లల పెరుగుదలకి ఎంతో ఉపయుక్తం అని సూచిస్తున్నారు.


అరవైకి పైబడితే..!

ఒంటరితనం, చుట్టుపక్కలవాళ్లతో సరైన సంబంధాలు లేకపోవడం,... ఇవన్నీ రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉద్యోగుల్ని నిద్రలేమికి గురిచేస్తున్నాయి అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ముఖ్యంగా అటు వృత్తి జీవితంలోనూ ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యే ఒత్తిడిని సమన్వయం చేసుకోలేక పెద్ద వయసు ఉద్యోగులు ఎక్కువగా నిద్రలేమికి గురవుతున్నట్లు వాళ్ల అధ్యయనంలో తేలిందట. సుమారు 60-69 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లలో 70 శాతం మంది నిద్రపట్టక బాధపడుతున్నారట. అయితే ఎక్కువమందిలో దీనికి ప్రధాన కారణం ఒంటరితనమేనట. మిగిలినవాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులకు గురవడం, కుటుంబీకుల్లో ఎవరైనా మరణించడం... వంటి పరిస్థితులన్నీ కూడా వాళ్లను నిద్రకు దూరం చేస్తున్నాయట. కాబట్టి ఆ వయసులో వృత్తిలో ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడంతోపాటు కుటుంబీకులతోనూ చుట్టుపక్కల వాళ్లతోనూ వీలైనంత కలసిమెలసి ఉండటం మేలని సూచిస్తున్నారు.


జుట్టు ఊడిపోతుంటే...

కోవిడ్‌ వచ్చి తగ్గాక కొందరిలో హృద్రోగాలు, అలసట, ఊపిరి అందకపోవడం... వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. మరికొందరిలో తలనొప్పి, ఆలోచనాశక్తి తగ్గడం, డిప్రెషన్‌, ఒత్తిడి, నిద్రలేమి... ఇలా ఎన్నో సమస్యలు బయటపడుతున్నాయని ఇప్పటికే అనేక పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి జుట్టు ఊడిపోవడం, శృంగారేచ్ఛ తగ్గిపోవడం కూడా చేరాయి అంటున్నారు బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ముఖ్యంగా ఆసుపత్రిలో చికిత్స పొందకుండా ఇంట్లోనే ఉండి దీర్ఘకాలంపాటు కోవిడ్‌తో బాధపడినవాళ్లలో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు వాళ్ల అధ్యయనంలో తేలిందట. ఏదిఏమైనా ‘హమ్మయ్య కోవిడ్‌... వచ్చి తగ్గింది’ అనుకోవడానికి లేకుండా దాదాపుగా ఎనభైశాతం మందిలో ఏదో ఒక సమస్య బయటపడుతోందట. అందుకే తగ్గిన తరవాత పూర్తిస్థాయి ఆరోగ్యం చేకూరాలంటే సరైన పోషకాహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామం కూడా విధిగా చేయాలని సూచిస్తున్నారు.


స్నేహానికి వాసనా కీలకమే!

ర్మం మీద ఉండే బ్యాక్టీరియా కారణంగా ప్రతి వ్యక్తి శరీరం నుంచీ ఒక్కో రకమైన వాసన వస్తుంది. అయితే ఒకేలాంటి వాసన ఉన్నవాళ్లు త్వరగా స్నేహితులు అవుతారట. వైజ్‌మ్యాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన పరిశోధకులు- ఎలక్ట్రానిక్‌ నోస్‌(ఇ-నోస్‌) అనే పరికరం ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారట. పెర్‌ఫ్యూమ్స్‌ వాసనల్ని గుర్తించినట్లుగా మన ముక్కు బాడీ ఓడర్‌ని గుర్తించలేకపోవచ్చు. కానీ మెదడులో మాత్రం ఆ వాసన నిక్షిప్తమవుతుందనీ, తమకు తెలియకుండానే అవతలి వాళ్ల వాసననీ తెలుసుకోగలరనీ అంటున్నారు. అందువల్లే ఒకే రకమైన బాడీ ఓడర్‌ ఉన్నవాళ్లే స్నేహితులు అవుతున్నట్లు గుర్తించారు. ఈ పరిశోధన కోసం- అస్సలు పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్ని ఎంపికచేసుకుని ఇ-నోస్‌ ద్వారా వాళ్ల శరీర వాసనని నోట్‌ చేసుకున్నారట. తరవాత ఒకే రకమైన వాసన ఉన్నవాళ్లనీ వేర్వేరుగా ఉన్నవాళ్లనీ కలిసేలా చేశారట. అలా ఇద్దరిద్దరు వ్యక్తుల్ని కలిసేలా చేసి పరిశీలించినప్పుడు- ఒకేలాంటి వాసన కలిగి ఉన్నవాళ్ల మధ్య త్వరగా స్నేహబంధం ఏర్పడి, బలపడినట్లు తెలుసుకున్నారు. నిజానికి ఇలా ముక్కుతో వాసన చూసి, స్నేహం చేసే గుణం మనిషిలో తప్ప మిగిలిన అన్ని జంతువుల్లోనూ కనిపిస్తుందట. ఉదాహరణకు కుక్కలు ఎక్కువగా ఇలా వాసన ద్వారానే మరో కుక్కతో స్నేహం చేయడం, లేదా దాన్ని శత్రువుగా చూడటం చేస్తాయి. అదేవిధంగా మనుషుల్లోనూ స్నేహం కుదురుకోవడానికి వాసనా కారణమే. కాకపోతే ఇది పైకి కనిపించదు. ఒకేలాంటి అభిరుచులూ, విలువలూ, సారూప్యం, నేపథ్యం ఉన్నవాళ్లు త్వరగా స్నేహితులయినట్లే బాడీ ఓడర్‌ కూడా స్నేహానికి కారణమవుతుందనీ, దీన్నే సోషల్‌ కెమిస్ట్రీ అనీ అంటున్నారు సదరు పరిశోధకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..