సిల్లీపాయింట్‌

ఎస్కిమోలు పెదాలతో ముద్దుపెట్టుకోరు. వాళ్లే కాదు... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పపువా న్యూగినియాల్లోని ఆదిమజాతులు కూడా చుంబనానికి దూరమే!

Updated : 13 Mar 2022 04:56 IST

సిల్లీపాయింట్‌

ఎస్కిమోలు పెదాలతో ముద్దుపెట్టుకోరు. వాళ్లే కాదు... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పపువా న్యూగినియాల్లోని ఆదిమజాతులు కూడా చుంబనానికి దూరమే!

* ఫిల్ము, మూవీ, బొమ్మ, ఆట... సినిమాని ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా మనం! అమెరికాలోని సామాన్య జనం ‘నేబ్‌’ అనే పిలుస్తారు. అదేం పదం అంటారేమో... ‘నైబర్‌హుడ్‌ థియేటర్స్‌’ అన్న మాటకి అది పొట్టి రూపమట.


* హ్యాష్‌ట్యాగ్‌ అని ఇట్టే అంటున్నాం కానీ దాని అసలు పేరు అక్టోతోర్పే. అక్టో అంటే ఎనిమిది. దీనికి ఎనిమిది అంచులుంటాయి కాబట్టి ఆ పేరొచ్చిందట.


* 19వ శతాబ్దంలో కాగితాలని పత్తితోనే తయారుచేసేవారు. పుస్తకాలూ అంతే. ఆ తర్వాత వచ్చిన పుస్తకాలకన్నా ఇవే ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటున్నాయట!
* పావురం ఎముకలు దాని ఈకలకంటే తక్కువ బరువు ఉంటాయి.

* అండమాన్‌ రాష్ట్ర జంతువు... ‘నీటి ఆవు’ అని ముద్దుగా పిలిచే ‘డుగాంగ్‌’. మనదేశంలో మరే సముద్ర జీవికీ ఇలా రాష్ట్రజంతువు హోదా లేదు!


* అమెరికాలో కోడిగుడ్లని శుభ్రంగా కడిగి శానిటైజ్‌ చేశాకే అమ్మాలి. అదే యూకేలో అలా కడిగి అమ్మడాన్ని అసహజంగా భావిస్తారు. ఈ కారణంవల్ల అమెరికా గుడ్లని యూకే లోనూ... యూకే గుడ్లని అమెరికాలోనూ నిషేధించారు!
 

* వృక్షశాస్త్రపరంగా...వెదురు మొక్క కూరగాయల (వెజిటబుల్‌) కోవలోకే వస్తుంది!


*  పక్షి జాతుల్లో వాసన గుర్తించగలిగేవి ఒక్క కివీలే.

నెదర్లాండ్స్‌ ప్రపంచ ‘డీజే’ల రాజధాని! ప్రపంచంలోని టాప్‌-10 డీజేల్లో ఏడుగురు అక్కడివారే ఉంటారు. ఆ నైపుణ్యాలు నేర్పించేందుకు ప్రత్యేకంగా కాలేజీలూ ఉన్నాయక్కడ!



పిల్లలు కొందరు బొటనవేలు చీకినట్లే... గున్న ఏనుగులకి తమ తొండాన్ని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది!



ఐదువేళ్లూ ఒకేలా ఉండనట్టే... వాటిపైన గోరు ఎదిగే క్రమమూ ఒకలా ఉండదు. మధ్య వేలి గోరు వేగంగా పెరిగితే... బొటనవేలిది మెల్లగా ఎదుగుతుంది. మిగతావాటి గోళ్లు... ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి!




ఆఫ్రికా దేశం మొజాంబిక్‌ జాతీయ పతాకంలో ‘ఏకే 47’ ఆయుధం కూడా ఉంటుంది! ఆ దేశం స్వాతంత్య్రం సాధించడానికి అది ఎంతో ఉపయోగపడటం వల్ల జెండాలో దాన్నీ పెట్టారట.  


అమెరికాలో సొర చేపల దాడికన్నా... ఆవులు కుమ్మడంతో చనిపోయేవాళ్ల సంఖ్యే ఎక్కువట. ఏటా సొరచేప దాడివల్ల చనిపోయేవాళ్లు ఐదుగురుంటే... గోవు ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోతుంటారు.




భార్యో, భర్తో, పిల్లలో, ప్రియమైన కుక్కో... ఎవరైనా సరే, మీరు ప్రేమించేవాళ్ల పక్కన పడుకుంటే తొందరగా నిద్రొస్తుందట!


పదికి తొమ్మిది మంది అమ్మాయిలు మస్కారా వేసుకునేటప్పుడు నోరు తెరుస్తారు! కంటి రెప్పకూ నోటికీ సంబంధించిన నరాలు చాలా దగ్గరగా ఉండటం వల్ల... రెప్ప పైన ఇలా వస్తువేదో పెట్టగానే అలా నోరు అసంకల్పితంగా తెరుచుకుంటుందట!


మీకు తెలుసా!

అదో బొగ్గు(కోల్‌) గిడ్డంగి. అక్కడికి వెళ్లాలంటే ఓ గ్రామాన్ని దాటుకుని వెళ్లాలి... కాబట్టి ఆ గ్రామానికి కోల్‌గేట్‌ అని పేరు. ఇంగ్లండులో ఉన్న ఆ ఊరి నుంచి వచ్చిన విలియమ్‌ స్థాపించిన సంస్థే కోల్‌గేట్‌. అలా ఈ టూత్‌పేస్ట్‌ కంపెనీ పేరు వెనక ఓ ఊరుందన్నమాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..