పిల్లలూ ‘స్టార్టప్‌’ అంటున్నారు!

వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరు చదివే పిల్లలు. చదువు, భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగం గురించి తప్ప మరో ఆలోచన లేని ఆ పిల్లలంతా... ఒక్కసారిగా స్టార్టప్‌ల బాట పట్టారు. తమకు

Updated : 30 Aug 2022 16:01 IST

పిల్లలూ ‘స్టార్టప్‌’ అంటున్నారు!

వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరు చదివే పిల్లలు. చదువు, భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగం గురించి తప్ప మరో ఆలోచన లేని ఆ పిల్లలంతా... ఒక్కసారిగా స్టార్టప్‌ల బాట పట్టారు. తమకు అవగాహన ఉన్న వ్యాపారాలను ప్రారంభించి, ఆదాయం అందుకుంటూ మరికొందరు పిల్లల్లోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. చదువుకునే పిల్లలు వ్యాపారస్తులా... అదెలా సాధ్యమంటారా... ఇదంతా కొన్నాళ్ల క్రితం దిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ‘బిజినెస్‌ బ్లాస్టర్స్‌ ప్రోగ్రాం’లో భాగం మరి.

హార్దిక్‌కి సబ్బు తయారీ వచ్చు. స్నేహితులతో కలిసి కలబంద, తేనె... వంటవాటితో రసాయనాలు లేని సబ్బుల్ని తయారుచేస్తూ... హోటళ్ల నుంచి నలభై కేజీల సబ్బుల ఆర్డర్లు అందుకున్నాడు.

* సాహిల్‌ తండ్రి ఎయిర్‌ఫిల్టర్ల తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. సాహిల్‌కూ వాటి తయారీ తెలియడంతో అతనూ వాటిని తయారుచేసి షోరూంలకు అమ్ముతున్నాడు. 

* యోగిత తన తల్లి దగ్గర ఉన్ని దుస్తుల అల్లికను నేర్చుకుంది. ఇప్పుడు తనే మఫ్లర్లూ స్వెటర్లూ, దుప్పట్లను వైవిధ్యంగా అల్లుతూ మంచి ఆర్డర్లు అందుకుంటూ స్థానిక మహిళలకూ ఉపాధి కల్పిస్తోంది.

* వీళ్లు మాత్రమే కాదు... దిల్లీలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇంటరు  విద్యార్థులు ఆ ప్రభుత్వం కొన్నాళ్లక్రితం ప్రారంభించిన ‘బిజినెస్‌ బ్లాస్టర్స్‌ ప్రోగ్రాం’లో భాగం కావడంతో ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు చిరువ్యాపారస్తులుగా తొలి అడుగులు వేస్తున్నారిప్పుడు. దిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న కారణం పెద్దదనే అంటారు దిల్లీ ఉప ముఖ్యమంత్రి - విద్యాశాఖా మంత్రి మనీష్‌ శిసోడియా. ‘ఇప్పుడు చాలామంది స్టార్టప్‌ల బాట పడుతూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సంఖ్యను పెంచాలనే ఆలోచనతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బిజినెస్‌ బ్లాస్టర్స్‌ ప్రోగ్రాం (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మైండ్‌సెట్‌ కరిక్యులం -ఈఎంసీ)ని ప్రవేశపెట్టాం’ అంటారాయన. కొన్నాళ్లక్రితం... దిల్లీలోని ఓ స్కూల్‌లో నలభై ఒక్కమంది విద్యార్థులతో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమై ఇప్పుడు దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ విస్తరించింది.

పెట్టుబడి పెట్టి మరీ...

స్టార్టప్‌ ఐడియా, దాన్ని అమలు చేసేందుకు చక్కని ప్రణాళికతో విద్యార్థులు బృందంగా ఏర్పడితే చాలు... వాళ్లకు సీడ్‌మనీ కింద రెండువేల రూపాయలు ఇస్తుంది దిల్లీ ప్రభుత్వం. ఆ డబ్బుతోనే పైన చెప్పిన హార్దిక్‌, సాహిల్‌, యోగిత వంటివాళ్లు తమ స్నేహితులతో కలిసి సబ్బులు, ఎయిర్‌ఫిల్టర్లు, ఉన్ని దుస్తుల తయారీ మొదలుపెట్టి... లాభాల బాట పడుతూ, మరికొన్ని ఆర్డర్లు అందుకుంటున్నారు. డిజిటల్‌ సురక్షా పేరుతో దుకాణాల్లో దొంగతనం జరగకుండా ఆపే అలారంలు, ఎలక్ట్రిక్‌ వీలైఛెయిర్లు, మ్యాజిక్‌సెన్సార్‌ డోర్‌బెల్‌, సోలార్‌ పవర్‌బ్యాంక్‌ల తయారీ వంటివన్నీ... ఈ ప్రాజెక్టులో భాగమే. ఈ పిల్లల్లో మార్కెటింగ్‌ మెలకువలు పెంచేందుకు ఎప్పటి కప్పుడు క్యాష్‌కరో, ఎర్న్‌కరో... వంటి సంస్థల వ్యవస్థాపకులతో బిజినెస్‌ స్కిల్స్‌ను పెంచే వర్క్‌షాప్‌లనూ నిర్వహిస్తున్నారు. అయితే... ప్రతి స్టార్టప్‌ విజయం సాధిస్తుందని చెప్పలేం కాబట్టి... పక్కా ప్రణాళికతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దిల్లీ ప్రభుత్వం. ఎలాగంటే... మొదట పిల్లలు చెప్పే ఆలోచనల్లో ఉపయోగపడేవాటినే పరిగణిస్తారు. ఆ తరువాత విజయం సాధిస్తాయనుకున్న వాటినే ఎంపికచేస్తారు. ఇప్పటివరకూ పిల్లల నుంచి యాభైఒక్కవేల ఆలోచనలు వస్తే... వాటిని వడపోసి వెయ్యి స్టార్టప్‌ ఐడియాలను ఎంపికచేశారు. వాటిల్లోంచి వంద వ్యాపారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా సరైన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు షీరోస్‌ను ప్రారంభించిన సాయిరీఛలాల్‌, అర్బన్‌క్లాప్‌ సీఈవో అభిరాజ్‌ సింగ్‌ భల్‌, ఎపీజే పార్క్‌హోటల్స్‌ ఎండీ ప్రియాపౌల్‌... వంటివాళ్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

భయం పోవాలనే ఉద్దేశంతోనే...

ఇదంతా బాగానే ఉంది... ఒకవేళ ఆ స్టార్టప్‌ ఫెయిలయితే... డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందా అంటే... అక్కర్లే దంటున్నారు అధికారులు. పిల్లల్లో వ్యాపారం పట్ల ఉన్న భయాలను పోగొట్టి ఇప్పుడున్న అవకాశాలు తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాబట్టి... ఒకవేళ విఫలమైనా ఏ ఇబ్బందీ ఉండదు. నిజానికి ఇప్పటికే ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో సుమారు ఆరువందల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పదకొండుకోట్ల రూపాయల్ని అందించారు. ఈ పిల్లల్ని గైడ్‌ చేయడానికీ, వీళ్ల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికీ ఎంతోమంది ఆసక్తి చూపడం విశేషం. ఈ స్టార్టప్‌లకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు దిల్లీ ప్రభుత్వం యూట్యూబ్‌లో విడుదల చేయడం కొసమెరుపు.


ఆట బంతులనుకునేరు...

క్కడున్న ఫొటోల్ని చూస్తే... ‘పచ్చని గడ్డితో ఎవరైనా ఇలా బంతులు చేశారా... వాటిని తీసుకొచ్చి నీటిలో కుమ్మరించారా’ అనిపిస్తోంది కదూ! కానీ ఇవి ఇక్కడే సహజంగా ఏర్పడిన నాచు బంతులు. వీటిని ‘మారిమో, మాస్‌బాల్స్‌, లేక్‌ బాల్స్‌’ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ‘వీటిని మన దగ్గర ఎప్పుడూ చూడలేదే’ అనుకుంటున్నారేమో...  ఐస్‌లాండ్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, జపాన్‌ దేశాల్లోని కొన్ని సరస్సుల్లో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన దృశ్యం ఇది. అక్కడ ఒక రకమైన నాచు... బంతుల  గుట్టలుగా పెరిగిపోతుంది. నాచు ఇలా గుండ్రంగా బంతుల్లా మారడానికి కారణం మారిమో అనే ఆల్గే. నీళ్లలో ఎదిగే ఈ ఫంగస్‌- కొంచెం కొంచెంగా ఎదుగుతూ బంతుల్లా మారిపోతుంది. చూస్తే ఏదో పచ్చటి రాళ్లు నీటి అడుగున ఉన్నాయా... అన్న భ్రాంతిని కలిగిస్తుంది. క్రికెట్‌ బాల్‌ నుంచి ఫుట్‌బాల్‌ అంత పరిమాణం వరకూ ఎన్నో సైజుల్లో పెరిగేస్తుంటాయివి. జపాన్‌లోని ‘ఆకన్‌’ సరస్సులో పరుచుకుని ఉన్న వీటిని చూడ్డానికి పర్యటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఐస్‌లాండ్‌ దేశం ఈ నాచుబంతుల్ని- పరిరక్షించాల్సిన జీవ జాతుల జాబితాలో చేర్చింది. సుతిమెత్తగా ఆకుపచ్చని రంగులో ఉండే ఈ మాస్‌ బంతుల్ని అక్వేరియాల్లో అలంకరణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..