ఓ రెండు నిమిషాలు లేచి నడవండి!

కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మధ్యమధ్యలో లేచి ఓ ఐదూ పది నిమిషాలు నడవాలి అన్నది తెలిసిందే. అయితే టొరంటో యూనివర్సిటీ నిపుణులు చేసిన తాజా పరిశీలనలో మరో విషయం స్పష్టమైంది.

Published : 12 Nov 2022 23:42 IST

ఓ రెండు నిమిషాలు లేచి నడవండి!

దలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. మధ్యమధ్యలో లేచి ఓ ఐదూ పది నిమిషాలు నడవాలి అన్నది తెలిసిందే. అయితే టొరంటో యూనివర్సిటీ నిపుణులు చేసిన తాజా పరిశీలనలో మరో విషయం స్పష్టమైంది. ప్రతి అరగంటకీ ఓ రెండు నిమిషాలు లేచి నడవడంవల్ల కండరాలు శక్తిమంతంగా మారతాయట. కండర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లను మనం తిన్న ఆహారం నుంచే తయారుచేసుకునే శక్తి వ్యాయామం వల్లే చేకూరుతుంది. అదే కదలకుండా కూర్చోవడం వల్ల- ప్రొటీన్‌ సంశ్లేషణ జరగకుండా- తిన్న ఆహారంలో అధికభాగం గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తుంది. పైగా శరీరం ఆహారంలోని ప్రొటీన్లను ఉపయోగించుకోలేక పోవడంతో కండరాలు బలహీనమవుతాయి. అప్పుడు ఆహారంలో ఎన్ని రకాల ప్రొటీన్లు తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని పన్నెండు మందిని ఏడు గంటలపాటు కదలకుండా కూర్చోబెట్టి, మరికొందరిని ప్రతి అరగంటకీ లేచి నడిచేలా చేసి మరీ తెలుసుకున్నారు. సో, మధ్య మధ్యలో ఓ రెండు నిమిషాల లేచి నడవడం అనేది కండరాల సామర్థ్యానికి ఎంతో మేలు.


అవి... ఎందుకు తింటారంటే..!

ఎంత నియంత్రించుకుందామన్నా కొందరు కొవ్వూ తీపి పదార్థాలను తినకుండా ఉండలేరు. అయితే స్వీడన్‌లోని కరోలింస్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన న్యూరాలజీ నిపుణులు అందుకు కారణమైన మెదడు భాగాన్ని గుర్తించారు. భావోద్వేగాలనీ, నిర్ణయాలు తీసుకోవడాన్నీ నియంత్రించే అమిగ్డాలాలోని నాడులే అతి తిండికీ కారణమవుతున్నట్లు గుర్తించారు. అందులో భాగంగా ఎలుకల్లో- కొవ్వు పదార్థాలు తినేటప్పుడు ఏయే నరాలు చురుగ్గా పనిచేస్తున్నాయో గమనించారట. ఆ తరవాత ఆయా భాగాల్లోని నరాల్ని ప్రేరేపించినప్పుడు కూడా ఆ ఎలుకలు కొవ్వుపదార్థాల్ని ఎక్కువగా తినడాన్ని గమనించారు. ఈ విషయాన్ని మరోసారి నిర్ధరించుకునేందుకు ఆయా భాగాల్లోని న్యూరాన్లను పనిచేయకుండా చేయగా- అవి తక్కువ ఆహారం తీసుకున్నాయట. దీన్నిబట్టి కొందరు అతిగా తినడానికి అమిగ్డాలా భాగంలోని న్యూరాన్లే కారణమనీ, దీన్ని నియంత్రించడం ద్వారా కొవ్వు పదార్థాలు తినకుండా చేయవచ్చనీ భావిస్తున్నారు.


కాంతిమంతమైన కిటికీ!

ఫీసులకీ ఇళ్లకీ గాజు కిటికీల్నీ తలుపుల్నీ అమర్చడం చూస్తూనే ఉంటాం. ఇంట్లోకి సూర్యకాంతి రావడం కోసమే గాజు కిటికీల్ని వాడుతుంటారు. అయితే కాంతితోపాటు ఆ గాజులోనుంచి వేడి కూడా లోపలకు వస్తుంది. అందుకే ఇప్పుడు కేవలం కాంతిని ప్రసరింపజేసి వేడిని తగ్గించే హైడ్రోజెల్‌ కిటికీలను చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. ఇందుకోసం వీళ్లు కాంతితో చర్యపొందే రకరకాల పదార్థాలను గాజు కిటికీలకు వాడి చూశారట. వేసవిలో సాధారణ గాజు కిటికీలను వాడినప్పుడు వాటి గుండా లోపలకు వెళ్లిన పరారుణ కాంతి బయటకు రాకపోవడంతో భవనం వేడెక్కి, కరెంటు వాడకం విపరీతంగా పెరుగుతోంది. దాన్ని తగ్గించేందుకు గాజుమీద కొన్ని మిల్లీమీటర్ల మందం మేర హైడ్రో జెల్‌ కోటింగ్‌ను వేసినప్పుడు- ఇది పరారుణ కాంతి బయటకు వచ్చేలా చేస్తుంది. అదేసమయంలో సాధారణ గాజు కన్నా ఎక్కువగా దృశ్యకాంతిని లోపలకు పంపిస్తుంది. దాంతో భవనం కాంతిమంతంగానూ చల్లగానూ ఉంటుంది. దీనివల్ల కనీసం 3.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి మున్ముందు ఈ హైడ్రోజెల్‌ గ్లాస్‌ విండోస్‌తో కరెంటు వినియోగం చాలావరకూ తగ్గుతుంది అని భావిస్తున్నారు పరిశోధకులు.


ఆల్జీమర్స్‌కి చికిత్స!

న్యువులు, పర్యావరణం, అనారోగ్యం, ఇన్‌ఫ్లమేషన్‌... కారణమేదయినా ఆల్జీమర్స్‌ కేసులు పెరుగుతున్నాయనేది నిజం. దీనివల్ల మతిమరుపుతోపాటు ప్రవర్తనకు సంబంధించిన లోపాలనేకం తలెత్తుతున్నాయి. మెదడులో అమిలాయిడ్‌ బీటా పెప్టైడ్స్‌ పేరుకుపోవడంతో తలెత్తే ఈ వ్యాధి నివారణకు సరైన చికిత్స లేదు. అందుకోసం టోక్యో యూనివర్సిటీ నిపుణులు- ముక్కు ద్వారా లవ్‌ హార్మోన్‌గా పిలిచే ఆక్సీటోసిన్‌ను పంపించినప్పుడు జ్ఞాపకశక్తి పెరిగినట్లు ఎలుకల్లో చేసిన పరిశోధనలో తేలింది. ఇది మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంలో అమిలాయిడ్‌ బీటాపెప్టైడ్‌లులేకుండా చేసిందట. మరో వర్గం ఎలుకలకు ఇంట్రాసెరిబ్రో వెంట్రిక్యులర్‌ విధానం ద్వారా మెదడు కణజాలంలోకి ఆక్సీటోసిన్‌ను పంపించారట. అయితే ముక్కు ద్వారా ఆక్సీటోసిన్‌ను పంపించినదానికన్నా నేరుగా మెదడులోకి ఇంజెక్టు చేసిన ఎలుకల్లో జ్ఞాపకశక్తి మరింత ఎక్కువగా పెరిగిందట. మొత్తమ్మీద ఆక్సీటోసిన్‌ ఆల్జీమర్స్‌ నివారణకు తోడ్పడుతుందని తేల్చారు. అందుకే వృద్ధాప్యంలో పిల్లలు ప్రేమగా మెలగడం వల్ల వాళ్లలో సహజంగానే ఆక్సీటోసిన్‌ విడుదలై జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుందని వివరిస్తున్నారు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు