నా ఫొటో పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు!

ఎం.రామకృష్ణ అంటే... తెలిసినవాళ్లు చాలా తక్కువ. అదే ‘శత్రు’ అనగానే సినీ ఫ్యాన్స్‌ చప్పున గుర్తుపట్టేస్తారు. విలన్‌, పోలీస్‌ పాత్రల్లో మెప్పిస్తూ... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు శత్రు.

Updated : 15 Jan 2023 09:29 IST

నా ఫొటో పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు!

ఎం.రామకృష్ణ అంటే... తెలిసినవాళ్లు చాలా తక్కువ. అదే ‘శత్రు’ అనగానే సినీ ఫ్యాన్స్‌ చప్పున గుర్తుపట్టేస్తారు. విలన్‌, పోలీస్‌ పాత్రల్లో మెప్పిస్తూ... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు శత్రు. వెండితెర కలలతో ఒంటరిగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన రైతుబిడ్డను నేనంటూ తన జీవితంలోని చేదూ తీపి గురించి ఇలా చెబుతున్నాడు...

వి... సినిమాల్లోకి రావాలని నేను గట్టిగా ప్రయత్నిస్తున్న రోజులు. తెలిసిన అతను కలిశాడు. ‘చిన్నచిన్న ఆర్టిస్టులకు కూలీలకు ఇచ్చినట్టు ఇస్తారంట కదా డబ్బులు..’ అంటూ చులకనగా మాట్లాడాడు. ఆ మాటల్ని ఇప్పటికీ మర్చిపోలేను. బహుశా అతను అలా అనడం వల్లనేమో- ఎలాగైనా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకోవాలనుకున్నా. జీవితంలో ఇలాంటి వాళ్లు ఎదురైనప్పుడే మన బలం మనకు తెలుస్తుంది. సినీ రంగంలో ఎవరూ లేకపోయినా... ఎక్కడో ఒడిశాలోని ఓ మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి అవకాశాలు అందిపుచ్చుకున్నా.  

మా పూర్వీకులది రాజమహేంద్రవరం దగ్గర చిన్నపల్లెటూరు. యాభైఏళ్ల క్రితమే ఒడిశాలోని బర్ఘట్‌ అనే గ్రామం వెళ్లి స్థిరపడ్డారు. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. ఇంట్లోవాళ్లు పెద్దగా చదువుకోలేదు. ముగ్గురు పిల్లల్లో నేను చిన్నవాణ్ని. నన్ను బాగా చదివించాలని ఇంగ్లిష్‌ మీడియం స్కూలుకు పంపేవారు. ఆ రోజుల్లో మాకు తెలిసినవాళ్లు డాక్టర్లూ ఇంజినీర్ల్లూ అయ్యేవారు. దాంతో నేను డాక్టర్‌ కావాలని నాన్న కలలు కనేవారు. అలా నాదీ అదే లక్ష్యమైపోయింది. ఒకసారి స్కూల్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో నాటకం వేయడానికి రిహార్సల్‌ చేస్తున్నారు. అందులో తాగుబోతు పాత్రధారి  సరిగా చేయట్లేదు. నేనైతే ఆ పాత్ర బాగా చేయగలనేమో అనిపించి టీచర్ని అడిగితే ‘సరే’ అన్నారు. అలా ఆ పాత్రలో నటించిన నాకు మంచి పేరొచ్చింది. అప్పట్నుంచి స్కూల్‌లో ఏ కార్యక్రమం జరిగినా అందులో నేను పాల్గొనడం తప్పనిసరి అయ్యింది. క్రమంగా నటన పట్ల ఆసక్తి పెరిగింది. అలాగే పదో తరగతిలో క్లాస్‌ ఫస్ట్‌ రావడంతో ఓ మంచి కాలేజీలో ఫ్రీ సీటు  వచ్చింది. చదువు, వయసుతోపాటు సినిమాల్లో నటించాలనే తపనా పెరిగిపోయింది.

తెలుగు రాదు...

ఒకసారి అనుకోకుండా డాక్టర్‌ చదువుతున్న ఫ్రెండ్‌ దగ్గరికెళ్లా. తన గదిలోని పుస్తకాలు చూసి షాక్‌ అయ్యా. అవన్నీ చదివీ, డాక్టరై వైద్యం చేయడానికి పదేళ్లు పడుతుందన్నాడు. అదంతా మనవల్ల కాదనిపించింది. ఆ పదేళ్లూ సినిమాల్లోనే ప్రయత్నిస్తే యాక్టర్‌ను కాకపోతానా అనుకున్నా. దానికి ఒడిశాలో ఉంటే కుదరదు. హైదరాబాద్‌ వెళ్లాలి. అందుకే డిగ్రీ సాకుతో ఇక్కడకొచ్చా. అవంతీ కాలేజీలో డిగ్రీ- మైక్రోబయాలజీ కోర్సులో చేరా. నాకు ఫీజు కట్టడం, నెల నెలా డబ్బు పంపడమంటే నాన్నకు కష్టమే. అయినా నేను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో అప్పోసొప్పో చేసైనా పంపేవారు. నేనేమో నా పోర్ట్‌ఫోలియో పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగేవాణ్ని. అలా నా ఫొటోల్ని ఓ టీవీ ఆఫీసులో ఇచ్చా... ఏదైనా అవకాశముంటే చెబుతారని. కొన్నిరోజుల తరవాత ఓ స్నేహితుడు ఫోన్‌ చేసి ‘నువ్వు టీవీలో వచ్చావ్‌ తెలుసా.. స్క్రీన్‌ మీద భలే ఉన్నావ్‌ రా...’ అన్నాడు. తీరా తెలిసిందేంటంటే... ఆ టీవీఛానల్‌ వాళ్లు పోలీస్‌స్టేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కార్యక్రమం చేశారు. సహజంగా స్టేషన్‌ నోటీస్‌ బోర్డులో మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌ ఉంటుంది కదా. అందులో నా ఫొటో పెట్టారు. కనీసం ఇందుకైనా పనికొచ్చాలే అనుకున్నా. నాకు తెలుగు చదవడం రాదు. రోజూ ఈనాడు పేపర్‌ కొని మొదటి పేజీ నుంచి చివరి పేజీవరకూ చదువుతూ సాధన చేసేవాణ్ని. మరోవైపు సినిమా పేజీలో- కొత్తగా ప్రారంభమైన సినిమాల గురించి తెలుసుకుని అవకాశం అడగడానికి ఆఫీసులకు వెళ్లేవాణ్ని. అలా సినిమాలే ప్రపంచంగా బతికినా నాకు మంచి మార్కులే వచ్చేవి. డిగ్రీ ఫైనలియర్‌కి వచ్చాక చదువు- సినిమా... ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలనుకున్నా. అందుకే చివరి పరీక్షల్లో ఒకటి రాయడం మానేశా. ఒకవేళ అది రాసి మంచి మార్కులు వస్తే ఆ తరవాత ఇంకా చదవాలనే ఆశ కలుగుతుంది. రెండు పడవలపైన ప్రయాణం ఎప్పుడూ మంచిది కాదు. ఏదో ఒక స్టేజీలో రిస్కు తీసుకోవాలనిపించి- కావాలనే డిగ్రీ ఫెయిలై చదువుకు దూరమయ్యా. ఆ విషయాన్ని అమ్మానాన్నలతో చెప్పలేదు కానీ, సినిమాల్లోకి వెళ్లాలనుందని మనసులో మాట బయట పెట్టా. ‘ముందుముందు ఏవైనా ఇబ్బందులొస్తే- మానాన్న ఆరోజే నాకు చెప్పుండాల్సింది- అని నన్ను నిందించను అంటే వెళ్లు. నీ మనసుకు నచ్చింది చేసుకో...’ అన్నారు.

స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటూ సినిమావాళ్ల పరిచయాలు పెంచుకునేవాణ్ని. తిన్నా తినకపోయినా ఫోన్‌లో బ్యాలెన్స్‌, బైకులో పెట్రోలు మాత్రం ఉండేలా చూసుకునేవాణ్ని సమయానికి పంట డబ్బు చేతికి అందకపోతే నాన్న డబ్బులు పంపేవారు కాదు. అలానే నెట్టుకొచ్చేవాణ్ని. అసలే చేతిలో డబ్బులేక అవస్థలు పడుతున్న నన్ను కొందరి మాటలు మరింత బాధించేవి. ‘నీ రంగు చూసుకున్నావా ఎలా ఉందో... నువ్వు సినిమాల్లో నటించడమేంటీ’ అనేవారు. ఆ మాటలు విన్నప్పుడు భయం వేసినా ఏదో మూల ఆశ ఉండేది... నేను నటుణ్ని అవుతానని. అదే నన్ను ముందుకు నడిపించేది. ‘జోష్‌’ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి దూరమైంది. కానీ, ఆ సినిమాకి ముందు రెండు నెలలపాటు జరిగిన వర్క్‌షాపు నాకు చాలా ఉపయోగపడింది. తరవాత ‘లీడర్‌’లో అవకాశం వచ్చింది. చిన్న రోల్‌ అయినా నా కెరీర్‌ పట్ల ఓ స్పష్టత ఇచ్చిందీ సినిమా. ‘ఈ కుర్రాడిలో రవితేజకు ఉన్న ఎనర్జీ ఉంది... మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారు. ఆ మాటలు మంత్రాల్లా పని చేశాయి. నేను ఎంచుకొన్న మార్గం సరైందే... కచ్చితంగా సినిమాలకు పనికొస్తానని బలంగా అనిపించింది. వచ్చిన ప్రతి క్యారెక్టర్‌ చేసేవాణ్ని. ‘అత్తారింటికి దారేది’, ‘లెజెండ్‌’, ‘ఆగడు’, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’, ‘లోఫర్‌’ వరకూ చిన్న చిన్న పాత్రలు చేసేవాణ్ని. 2016లో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ నాకు బ్రేక్‌నిచ్చింది.

ఆ తరవాత పెద్ద సినిమాల్లో మంచి పాత్రలే వచ్చాయి. ‘మిస్టర్‌’, ‘బాహుబలి2’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘జై లవకుశ’, ‘రాజుగారి గది’, ‘రంగస్థలం’, ‘భరత్‌ అను నేను, ‘అరవింద సమేత’, ‘గద్దల కొండ గణేశ్‌’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’, ‘ఆచార్య’, ‘సీతారామం’, ‘యశోద’, ‘మట్టి కుస్తీ’... ఇలా చెబుతూ పోతే చాలా పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఆర్నెల్లు డిప్రెషన్‌లో...

మొదట్లో ఏ సినిమాలో నటించినా అది విడుదలయ్యే వరకూ నిద్ర పట్టేది కాదు. ఆ సినిమా హిట్‌ అయితేనే మంచి అవకాశాలు వస్తాయన్న టెన్షనే దానికి కారణం. ‘ఆగడు’ తరవాత ఆర్నెల్ల పాటు బ్రేక్‌ వచ్చింది. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా. సరిగ్గా అప్పుడే పెళ్లైంది. భార్యగా వినూత్న నా జీవితంలోకి వచ్చాక నేను కొత్తగా పుట్టాననిపించింది. మానసికంగా తను నాకు చాలా అండగా ఉండేది. నన్ను ఇంకోదారిలోకి తీసుకెళ్లింది. ‘పుష్ప’కి ముందు వరకూ నాకు గడ్డం ఉండేది. ఆ లుక్‌ని మార్చి నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవాలనుకున్నా. దాంతో త్వరగా అవకాశాలు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు సుకుమార్‌ గారిని కలిశా. ‘ఇప్పుడు నీ లుక్‌ బాగుంది. నీకు మంచి పాజిటివ్‌ క్యారెక్టర్‌ ఇస్తా’ అన్నారు. ‘పుష్ప’లో పోలీస్‌ ఆఫీసర్‌ గోవిందప్ప పాత్రలో మంచి పేరొచ్చింది. చాలామంది నన్ను గుర్తుపట్టలేదు. చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ గారికి ఎదురుపడ్డా పోల్చుకోలేకపోయారు. ఆ సినిమా విడుదలయ్యాక ‘గోవిందప్ప’ ఎవరా అని గూగుల్‌లో వెతికారట. అది మాత్రం నాకు మంచి కిక్‌ ఇచ్చింది.

పాదాలు గడ్డకట్టుకుపోయేవి

‘అత్తారింటికి దారేది’లో పవన్‌కల్యాణ్‌ గారితో నటించడానికి భయమేసింది. ఓ ఫైట్‌ సీన్‌లో నన్ను పైనుంచి కింద పడేయడానికి ఒక తాడు కట్టారు.

‘నీకది ఓకేనా, ఇబ్బంది అయితే డూప్‌ని పెట్టి చేద్దాం’ అన్నారు కల్యాణ్‌ గారు. చిన్న ఆర్టిస్టు కోసం అలా ఎవరు ఆలోచిస్తారు అనిపించింది. కానీ ఆ సీన్‌ నేనే చేశా.

‘భీమ్లా నాయక్‌’లో మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. చిన్న ఆర్టిస్టునైనా నా మీద అప్పుడంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారని అడిగా. ‘నటుడిగా చాలా సాహసాలు చేయడంతో నాకు ఫ్రాక్చర్లు అయ్యేవి. నాలా మీకు కాకూడదని’ చెప్పారాయన. ‘సీతారామం’ కోసం మైనస్‌ 40 డిగ్రీల చలిలో షూటింగ్‌... పైగా యూనిఫామ్‌లో. నరాలు బిగుసుకుపోయి, పాదాలు గడ్డకట్టుకుపోయేవి. ఆ బాధ అమ్మో.. మాటల్లో చెప్పలేను. ఆ సినిమాని తెరమీద చూశాక ఆ కష్టమంతా మర్చిపోయా. ‘పుష్ప’ షూటింగ్‌ మారేడుమిల్లి అడవుల్లో జరిగేది. తెల్లవారుజామున నాలుగు గంటలకే హోటల్‌ నుంచి బయల్దేరి రెండు గంటలు గతుకుల రోడ్డులో ప్రయాణించి డీప్‌ ఫారెస్ట్‌లోకి వెళ్లేవాళ్లం. షూటింగ్‌ పూర్తయ్యేసరికి రాత్రి పది దాటేది. తినకుండానే నిద్రపోయేవాళ్లం. పైగా రాత్రిపూట ఆ ప్రాంతంలో పులులు కూడా తిరిగేవంట. ఇలా ప్రతి సినిమాకి ఏదో ఒక అనుభవం ఉంటుంది. అవి ఎలాంటివైనా నాకు తీయని జ్ఞాపకాలే. ‘పుష్ప2’, ‘ఖుషి’, ‘ఉగ్రం’, చంద్రముఖి2’... ప్రస్తుతం చేతినిండా పెద్ద సినిమాలే ఉన్నాయి. ఎన్ని చేసినా మంచి నటుడు అనిపించుకుంటే చాలు... అదే నా లక్ష్యం.

ఫొటోలు: వసంత్‌ ఘంటసాల


తనే ప్రపోజ్‌ చేసింది!

నా భార్య వినూత్న. ‘అలియాస్‌ జానకి’లో నటించినప్పుడు పరిచయమైంది. ఆ సినిమాకి తను కాస్ట్యూమ్‌ డిజైనర్‌. తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌కి గేదె ఫొటోని పెట్టుకోవడంతో ఆసక్తిగా అనిపించి ఛాటింగ్‌ చేసేవాణ్ని. తనే ‘ఐ లవ్‌ యూ’ చెప్పి, ప్రపోజ్‌ చేసింది.పెళ్లి సమయానికి రూమ్‌ అద్దెకు కూడా డబ్బులేదు. అవకాశాలూ లేవు. డిప్రెషన్‌లో ఉన్నా. ఆ సమయంలో పెళ్లి చేసుకుందామంది. అంతా బాగుంటుందనే భరోసా ఇచ్చి పెద్దవాళ్లను ఒప్పించింది. తను ఇంటికొచ్చాకే నా అసలు జీవితం మొదలైంది. బిజీ అయ్యా. నా డైట్‌, కాస్ట్యూమ్స్‌ అన్నీ తనే చూసుకుంటుంది. నేనెలా ఉండాలో గైడ్‌ చేస్తుంది. ప్రస్తుతం తను పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపిస్ట్‌, హిప్నో క్లినికల్‌ థెరపిస్ట్‌గా పని చేస్తోంది.


ఆ పేరు నేనే పెట్టుకున్నా

నా అసలు పేరు రామకృష్ణ. సినీ రంగంలోకి వచ్చిన కొత్తల్లో డైరెక్టర్‌ ‘రామకృష్ణ...’ అని పిలిస్తే ఓ ఐదారుగురు వచ్చేవాళ్లు. అది చూసి స్క్రీన్‌ నేమ్‌ మార్చుకోవాలనిపించింది. ఓ ఫ్రెండ్‌ని అడిగితే కొన్ని పేర్లు చెప్పాడు. వాటిలో ‘శత్రు’ నచ్చింది. కొత్తగా అనిపించి అదే పెట్టుకున్నా.

* నా తొలి సంపాదన మూడొందలు. సినిమాలకోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ టీవీ ఛానల్‌లో నేరాలు- ఘోరాలు కార్యక్రమంలో నటించే అవకాశం వచ్చింది. మా రూమ్‌లో టీవీ లేకపోవడంతో ఓ సెలూన్‌ షాపు యజమానిని బతిమాలుకుని రాత్రి పది గంటలకు ఆ ప్రోగ్రామ్‌ చూసుకున్నా. తెర మీద నన్ను నేను చూసుకోవడం అదే మొదటిసారి.

* స్క్రీన్‌ మీద నన్ను కొడుతుంటే మా అమ్మ చూడలేదు. నాకు నిజంగానే దెబ్బలు తగులుతాయని భయం, బాధ.

* కాలేజీ రోజుల్లో థియేటర్‌ గోడలెక్కి దూకి మరీ టికెట్లు తీసుకుని ‘పోకిరి’ చూశా. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా అదే.

* రంగస్థలం చేశాక ‘నీకు ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా చేయగలవు’ అన్నారు సుకుమార్‌గారు. ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస అది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు