Mohammed Siraj: ‘ఆటో నడుపుకో’ అన్నారు!

మహమ్మద్‌ సిరాజ్‌... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్‌. గణాంకాల్లోనే కాదు, సిరాజ్‌ నేపథ్యమూ నేటి తరానికి స్ఫూర్తిదాయకమే! ఈ హైదరాబాదీ గురించి తన మాటల్లోనే... 

Updated : 07 Oct 2023 14:53 IST

మహమ్మద్‌ సిరాజ్‌... ఒక ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్‌. గణాంకాల్లోనే కాదు, సిరాజ్‌ నేపథ్యమూ నేటి తరానికి స్ఫూర్తిదాయకమే! ఈ హైదరాబాదీ గురించి తన మాటల్లోనే...  

డో తరగతి నుంచీ స్కూల్‌ జట్టు తరఫున ఆడేవాణ్ని. మొదట బ్యాటర్‌ని, టెన్త్‌కి వచ్చాక బౌలర్‌గా మారా. టెన్త్‌ తర్వాత చదువు ఆపేశా. ఇంటి దగ్గర్లో ఉండే గ్రౌండ్‌లో రోజూ టెన్నిస్‌ బాల్‌ మ్యాచ్‌లు ఆడేవాణ్ని. ‘అన్నయ్య ఇంజినీరింగ్‌ చదువుతుంటే నువ్వు ఆటలతో కాలక్షేపం చేస్తున్నావ’ంటూ అమ్మ కోప్పడేది. నాన్న మాత్రం ప్రోత్సహించేవారు. ఆటో నడపగా వచ్చిన డబ్బుల్లోనే పాకెట్‌ మనీ ఇచ్చేవారు. ఓసారి మా మామయ్యకి నా గురించి బెంగ పడుతూ చెప్పింది అమ్మ. ఆయనకి క్రికెట్‌ క్లబ్‌ ఉంది. దాని తరఫున ఓ మ్యాచ్‌లో ఆడిస్తే తొమ్మిది వికెట్లు తీశాను. అది చూసి మామయ్య- నా సంగతి తనకు వదిలేయమని అమ్మతో చెప్పడంతో... తన తీరు మారింది. ఆరోజు మ్యాచ్‌కు రూ.500 తీసుకోవడం ఇప్పటికీ గుర్తు. 19 ఏళ్లప్పుడు మొదటిసారి గ్రేస్‌బాల్‌తో క్రికెట్‌ ఆడి... అయిదు వికెట్లు తీశా. షూ వేసుకొని ఆడటం అదే తొలిసారి కూడా. అప్పటికి బంతిని స్వింగ్‌ చేయడం తెలియదు. తర్వాత నుంచి స్థానిక లీగ్‌లు ఆడేవాణ్ని. ఆపైన కొన్నాళ్లు ఎలాంటి ముందడుగూ పడలేదు. రెండు నెలలు వేరే జాబ్‌లో చేరా కూడా. అది నచ్చక మళ్లీ క్రికెట్‌ కొనసాగించి... అండర్‌-23 హైదరాబాద్‌ జట్టుకి ఎంపికయ్యా.

  • 2016లో బెంగళూరు -హైదరాబాద్‌ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతుంటే నెట్‌ బౌలర్‌గా వెళ్లా. అప్పటికి రెండు రంజీ మ్యాచ్‌లూ ఆడాను. అక్కడ ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న భరత్‌ అరుణ్‌ సర్‌ నన్ను చూసి... ‘ఎవరీ కుర్రాడు బౌలింగ్‌ బావుంది’ అని లక్ష్మణ్‌ సర్‌కి చెప్పారు. నా అదృష్టం బావుండి... ఆ ఏడాది భరత్‌ సర్‌... హైదరాబాద్‌ రంజీ జట్టుకి కోచ్‌గా వచ్చారు. అప్పటికి రంజీ జట్టులో నేను లేను. ఆయన పట్టుబట్టి నన్ను తీసుకున్నారు. ఆ సీజన్లో 45 వికెట్లు తీశా.

  • 2017 ఐపీఎల్‌ సీజన్‌కి వేలం జరుగుతోంది... నా పేరు చెప్పగానే 10 సెకన్లు ఎవరూ చెయ్యెత్తలేదు. తర్వాత ఆర్సీబీ స్పందించింది. అంతకు ముందే భరత్‌ సర్‌ చెప్పారు. ఎంత మొత్తం అనీ చూడలేదు. ఆనందంలో ఫ్రెండ్స్‌తో బయటకు వచ్చా. ఇంటికి వచ్చేసరికి... సన్‌రైజర్స్‌ జట్టు రూ.2.6 కోట్లకు ఎంపిక చేసిందని తెలిసింది. ఆర్సీబీకి అప్పటికి వేలంలో రూ.2.4 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. అంతవరకూ అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. నెలరోజుల్లో సొంత ఇల్లు కొన్నా. జీవితంలో మంచి పని చేశానని చాలా సంతృప్తి చెందా ఆరోజు. ఆ సీజన్లో ఆరు మ్యాచ్‌ల తర్వాత... ఆడే అవకాశం వచ్చింది. స్టేడియం నిండిపోయింది... అంత మంది మధ్యలో ఆడటం అదే తొలిసారి. ఒత్తిడి అంటే ఏంటో ఆరోజు తెలిసింది. మొదటి మూడు బంతులూ బౌండరీలే. నాలుగో బంతికి వికెట్‌ పడ్డాక ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నా. అదే ఏడాది ఇండియా తరఫున టీ20లో చోటు దక్కింది కానీ ఆరంభం బాలేదు.
  • 2018లో ఆర్సీబీ జట్టు కొంది. అక్కడ ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా విరాట్‌ నుంచి క్రమశిక్షణ పాటించడం... సున్నాకే ఔటయినా, సెంచరీ చేసినా రాత్రి 11 తర్వాత కనిపించడు. తెల్లవారి జిమ్‌లోనే కనిపిస్తాడు. మొదటి సంవత్సరం ఆడేందుకు అవకాశాలు రాలేదు. 2019 పెద్దగా కలిసి రాలేదు. వికెట్లు పడుతున్నా పరుగులు ధారాళంగా పోయేవి. సోషల్‌ మీడియాలో ట్రోల్‌చేసేవారు. ‘ఆటో నడుపుకో’ అన్నవాళ్లూ ఉన్నారు. నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇస్తే నాకూ మనశ్శాంతి ఉండదు. లాక్‌డౌన్‌ సమయంలో... ‘ఈ ఏడాదంతా బాగా కష్టపడతా. కుదురుకుంటే సరే లేకపోతే మరో పనేదైనా చూసుకుంటా’ అనుకున్నా. రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామాలూ, బౌలింగ్‌ ప్రాక్టీసూ చేసేవాణ్ని. 2020 ఐపీఎల్‌లో ఆ ఫలితం కనిపించింది. కేకేఆర్‌తో మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌. మూడు వికెట్లు తీశా. ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆస్ట్రేలియాతో 2020-21 టెస్ట్‌ సిరీస్‌ విజయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.  

  • క్రికెటర్‌ అయితే అమ్మానాన్నలకి మంచి జీవితం ఇవ్వాలనుకునేవాణ్ని. కానీ నా విజయాల్ని పూర్తిగా చూడకుండానే మరణించారు నాన్న. ఆయన ఆరోగ్యం విషమించిన సంగతి నాకు చెప్పలేదు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ఆయన చనిపోయారు. దేశం పేరు నిలబెట్టాలనేవారు నాన్న. మ్యాచ్‌ మధ్యలో రావడమంటే ఆయన మాటల్ని వమ్ము చేయడమే అనిపించింది. జట్టుతోనే కొనసాగా. ఆయన లేరన్న బాధ ఇప్పటికీ ఉంటుంది. సిరీస్‌ ముగిసి ఇంటికి వచ్చిన ప్రతిసారీ చిన్నప్పుడు టోలీచౌకీలో ఆడిన ‘ఫస్ట్‌ లాన్సర్‌’ బస్తీ గ్రౌండ్‌కి వెళ్తా.  ఫ్రెండ్స్‌తో కలిసి ఆడతా. చాయ్‌ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం.రిటైరయ్యాక... మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో హాయిగా గడపాలన్నది కోరిక. అంతకంటే ముందు ప్రపంచకప్‌ తేవాలన్నది నా లక్ష్యం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..