Updated : 18 Sep 2022 10:44 IST

కింద పడ్డాను... తిరిగి లేచాను..!

నడికట్టు రామిరెడ్డి - గోల్కొండ హోటల్స్‌ అధినేత... ‘వ్యాపారం చేద్దామని ఉన్నా డబ్బులేక ఆగిపోతున్నాం’ అనే వారెందరికో ఆయన జీవితం ఓ సమాధానం. పనిచేసే సామర్థ్యం ఒక్కటి చాలు... దేన్నైనా సాధించగలమని నిరూపించారు. ఒకవైపు తోడుగా నిలిచిన భార్యని కోల్పోయినా... మరో వైపు వ్యాపారంలో కోలుకోలేని ఎదురు దెబ్బలుతిన్నా... మనోనిబ్బరంతో నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారు. ఉన్నదాంట్లోంచి ఊరికీ ఇస్తూ సేవా మార్గంలో వడివడిగా సాగుతున్న రామిరెడ్డి జీవనప్రస్థానం ఆయన మాటల్లోనే...

మాది పల్నాడులోని చిరుమామిళ్ల అనే పల్లెటూరు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచీ నేనూ నాన్నతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడిని. అందుకే ఆయన నుంచి ఆ కష్టపడేతత్వమూ, సమయపాలనా నేర్చుకున్నాను. అవే నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టాయని చెప్పొచ్చు.

నా ఆరో ఏట అమ్మ జబ్బుచేసి చనిపోయింది. నన్నూ, చెల్లినీ చూసుకోవడానికి నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచీ ఎక్కువగా తాతయ్య దగ్గరే ఉండేవాణ్ణి. మా ఊళ్లో బడి లేదు. నాకు కాస్త ఊహ రాగానే
ఓ గురువు దగ్గర వీధి బడిలో చేర్పించారు. ఇప్పటిలా సిలబస్‌ అదీ ఏమీ ఉండేది కాదు. అక్షరాలూ, గుణింతాలూ, చిన్న లెక్కలూ నేర్పించేవారంతే. అలా మాఊళ్లోనే అయిదో తరగతి వరకూ చదివాను. మా స్నేహితుడొకడు హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో వచ్చేవాడు. వాడి ప్రభావమో ఏమోగానీ నాకూ చదువంటే విపరీతమైన ఇష్టం పెరిగింది. మా నాన్నకేమో నేను వ్యవసాయం చేయాలని ఉండేది. దాంతో చదువు మానేయమన్నారు. కానీ ఎలాగోలా తాతయ్య ద్వారా నాన్నని ఒప్పించాను.

వీధి బడి నుంచి నేరుగా హైస్కూల్‌ అంటే ఇబ్బంది పడతానని ఏడాది పాటు ప్రైవేటు టీచర్‌ని పెట్టించారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న ఫిరంగిపురంలోని హైస్కూల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాశాను. స్కూల్లో సీటు ఇచ్చారు కానీ హాస్టల్లో రూము ఇవ్వలేదు. ఇక చేసేదేం లేక మళ్లీ ప్రైవేటు టీచర్‌ దగ్గరే చదివాను. ఏడో తరగతి పూర్తయ్యేసరికి మా ఇంటికి అయిదు కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఒక హైస్కూల్‌ ప్రారంభించారు. రోజూ పోనూ రానూ పది కిలోమీటర్ల దూరం నడుస్తూ స్కూలుకెళ్లివచ్చేవాడిని. చదువు అంటే నాకున్న ఇష్టాన్ని చూసి ‘నీ పట్టుదల చూసి చదివిస్తున్నాను. కానీ ఎప్పుడు ఫెయిలయితే అప్పుడే మానేయాలి’ అని నాన్న షరతు పెట్టారు. ఆ మాటల్ని సవాలుగా తీసుకున్నాను. ఎప్పుడూ క్లాస్‌లో ఫస్ట్‌ వచ్చేవాణ్ణి. పదో తరగతిలోనూ స్కూల్‌ టాపర్‌ని. బడిలో అంతా బాగానే జరిగినా అసలు కథ అప్పుడే మొదలైంది. గుంటూరులోని హిందూ కాలేజీలో ఎంపీసీలో చేరాను. హఠాత్తుగా ఇంగ్లిషు మీడియంలోకి మారటంతో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. కానీ ఎలాగోలా ఇంటర్‌ గట్టెక్కాను. ఆ తర్వాత డిగ్రీకి హైదరాబాద్‌ వెళ్లాను. యూనివర్సిటీలో సీటు రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలో చేరాను. అలా 1962లో డిగ్రీ పట్టాతో పాటూ టైపు లోయర్‌ కూడా పాసయ్యాను. అదే ఏడాది పరీక్ష రాసి ఎల్‌ఐసీలో చిన్న ఉద్యోగం సంపాదించాను.

తొలి సంపాదన...
కడపలో పోస్టింగ్‌ ఇచ్చారు. జీతం 140 రూపాయలు. అప్పుడే పెళ్లి సంబంధాలు వచ్చాయి. పదో తరగతి చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అప్పటి వరకూ నా సొంత నిర్ణయాలతోనే నడిచే నా జీవితంలో నా భార్య
లక్ష్మీరాజ్యం పాత్ర కీలకమైంది. తన కోరికమేరకు కడప నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేయించుకున్నాను. మా పాప పుట్టినప్పుడు నా భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పుడు నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే నాలో బోలెడన్ని ఆలోచనలు. చదువుకోవాలనే ఆశా తీరింది. ఉద్యోగమూ దొరికింది. చక్కని జీవిత భాగస్వామీ వచ్చింది. కానీ ఇంకేదో సాధించాలనే ఆలోచన... నా సమయం నా చేతిలో ఉండేలా, నెల జీతానికి లోబడి కాకుండా జీవితాశయాలకు అనుగుణంగా బతకడానికి అవసరమయ్యే వనరుల్ని సమకూర్చుకోవాలి అనిపించింది. అందుకు వ్యాపారమే సరైన మార్గం అని నిర్ణయించుకున్నాను. కానీ పెట్టుబడి కావాలి కదా, అందుకే మరింత కష్టపడి డబ్బులు సంపాదించే పనిలో పడ్డాను.

అదే మలుపు...
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఎల్‌ఐసీ పాలసీలూ చేసుకుంటూ మరింత కష్టపడేవాణ్ణి. అలా మూడువేల రూపాయల్ని జమ చేశాను. నా భార్య కూడా తన నగలు అమ్మేసి 3500 రూపాయలు ఇచ్చింది. ఆ మొత్తంతో కొంతమంది మిత్రులతో కలిసి భూమి కొనుగోళ్లూ, అమ్మకాలూ చేసే ‘కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ’ని ఏర్పాటు చేశాను. మా సొసైటీ ద్వారా హైదరాబాద్‌లో 21 ఎకరాలతో దత్తాత్రేయ నగర్‌, సిద్ధార్థ నగర్‌ పేర్లతో వెంచర్లు ప్రారంభించాం. స్నేహితులు భాగస్వాములుగా ఉన్నారు కానీ బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. లాభాలు పెద్దగా రాకపోయినా కస్టమర్లకు మా మీద నమ్మకం పెరిగింది. ఇలా ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో వెంచర్లు వేసేవాళ్లం. మొదటిసారిగా రెండు వెంచర్లలో కలిపి నా వాటాకు ఓ రెండు లక్షల రూపాయలు వచ్చాయి. రెండు స్థలాలూ మిగిలాయి. కానీ లాభం వచ్చింది అనుకుని సంతోషించేలోపే ఆవిరైపోయింది. మా మామయ్య ఒకరు చెబితే విని - వచ్చిన రెండు లక్షల రూపాయల్ని వేరే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అదంతా పోయి 20 వేలు మిగిలాయి.

సర్వస్వం పోయింది...
ఎలాగోలా మళ్లీ వ్యాపారంలో నిలదొక్కుకున్నాను. ఇంతలో రెండో కాన్పు తర్వాత నా భార్య ఆస్తమాతో చనిపోయింది. అప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఆ సమయంలోనే మనిషికి తోడు ఎంత అవసరమో తెలిసింది. జీవచ్ఛవంలా మారిపోయాను. కొద్ది రోజులకు ఆ బాధ నుంచి కోలుకుని మనసును మెల్లగా వ్యాపారం వైపు మళ్లించుకున్నాను. హైదరాబాద్‌లో అప్పట్లో మంచి హోటళ్లు లేవు. భాగస్వాములతో చర్చించి మాసాబ్‌ ట్యాంక్‌ దగ్గర త్రీస్టార్‌ హోటల్‌ కట్టాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగానికి రాజీనామా చేసి ‘సుజనా రిసార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ రిజిస్టర్‌ చేశాం. బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని 150 గదులతో ఉన్న తొమ్మిది అంతస్తుల హోటల్‌ని కట్టాలనుకున్నాం. కానీ ఉన్న బడ్జెట్‌ సరిపోలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మిగిలిన ప్లాట్లూ, సొంత ఇల్లూ అన్నీ అమ్మేశాను. అంతలోనే త్రీస్టార్‌ హోటళ్ల గదుల అద్దె రోజుకు 500 రూపాయలకు మించి ఉండకూడదంటూ ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. దీంతో లాభాల సంగతి అటు ఉంచితే గదులన్నీ నిండినా నష్టాలే వచ్చాయి. పరిస్థితులన్నీ చూస్తూ నా బిజినెస్‌ పార్ట్నర్‌ ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘వ్యాపారంలో నేను కొనసాగలేను. హోటల్‌ అమ్మేద్దాం.

లేదంటే నా పెట్టుబడి నాకు ఇచ్చేయండి’ అన్నారు. వరసగా దెబ్బమీద దెబ్బ తగలడంతో మానసికంగా కుంగిపోయాను. పిల్లల మీదున్న బాధ్యత మాత్రమే నన్ను పిచ్చివాణ్ణి కాకుండా చూసింది. ఆ బాధ్యతే నాకు కొత్త ఆలోచననూ తెప్పించింది. నా ఓటమికి కారణమేంటని వెతికాను. ఒత్తిడిని అధిగమించడానికి ఇలాంటి సందర్భాల్లో గొప్పవాళ్లు ఏం చేశారో తెలుసుకోవడానికి కొన్ని పుస్తకాలు చదివాను. ‘నా భార్య మరణం నేను ఏమీ చేయలేని సమస్య. కానీ వ్యాపారంలో కష్టనష్టాలు నేను అధిగమించగలిగేవి’ అని అర్థమైంది. ఇక వాటిని ఢీకొట్టడానికే సిద్ధమయ్యాను...

అడుగు ముందుకేశా...
ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం చాలాకాలంగా లిటిగేషన్‌లో ఉన్న స్థలాన్ని రాజీ ద్వారా సరిచేసుకుని వచ్చినకాడికి అమ్మేశాను. మరిన్ని పెట్టుబడుల కోసం నలుగురు భాగస్వాముల్ని చేర్చుకున్నాను. అలకాపురిలో హైదరాబాద్‌ మొత్తంలోనే చక్కని మోడల్‌ టౌన్‌షిప్‌ని ఏర్పాటు చేశాను. లాభాలే కాదు, మంచి పేరూ తెచ్చిపెట్టిందది. ఇక నా హోటల్‌ పార్ట్నర్‌కి తన పెట్టుబడి డబ్బులన్నీ ఇచ్చేసి హోటల్‌ బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను. అదే గోల్కొండ హోటల్‌. మన పని మనం సరైన దారిలో చేసుకుంటూపోతే లాభాలు అవే వస్తాయనేది నా నమ్మకం. అదే సమయంలో ప్రభుత్వం అద్దె నిబంధననూ ఎత్తేసింది. దాంతో హోటల్‌ని మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది, నాణ్యమైన ఆహారపదార్థాల్ని అందించడం మొదలుపెట్టాం. నెమ్మదిగా హోటల్‌ లాభాల బాట పట్టింది. భిన్నసంస్కృతులూ, ఆచార వ్యవహారాలూ తెలుసుకోవడమంటే నాకు చాలా ఇష్టం. అందుకే మరెన్నో దేశాలకు వెళుతూ వివిధ రకాల రిసార్ట్స్‌, హోటల్స్‌ చూశాను. వాటి గురించి చక్కటి అవగాహన ఏర్పర్చుకుని గండిపేట చెరువు గట్టున 14 ఎకరాల స్థలంలో 2004లో గోల్కొండ రిసార్ట్స్‌ అండ్‌ స్పాని ఏర్పాటుచేశాం. ఇక అప్పటి నుంచీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనుకున్నది సాధించాను. మా అమ్మాయీ, అబ్బాయీ వాళ్లకిష్టమైన పనుల్లో స్థిరపడ్డారు. అయినా మనసులో ఏదో వెలితి... అప్పుడే నా అడుగులు మా ఊరివైపు కదిలాయి.

ఊరికీ తిరిగివ్వాలని...
నేను పుట్టక ముందు నుంచీ మా ఊళ్లో ఫ్యాక్షనిజం ఉండేది. ఆ తర్వాత గ్రూపిజం మొదలైంది. దాన్ని పోగొట్టి ఊరికి సకల సౌకర్యాలూ కల్పించాలనేది నా ఆశయం. ఆ ఆలోచనతోనే ఊరివాళ్లను పిలిచి మాట్లాడాను. ‘ఊరి అభివృద్ధి కోసం ఒక సొసైటీని రిజిస్టర్‌ చేయించండి. మిగతా పనులు నేను చూసుకుంటాను’ అని చెప్పాను. సరే అన్నారు కానీ ఆ సొసైటీలో ఎవరు సభ్యులుగా ఉండాలన్న విషయమై గొడవలు పడి అసలు దాన్ని పూర్తిగా వదిలేశారు. దాంతో 2007లో నేనే స్వయంగా చిరుమామిళ్లకు వెళ్లాను.

ఊరి చుట్టూ చెత్తాచెదారమూ ఉంది. చెరువూ కాలుష్యమయంగా ఉంది. దాన్నంతటినీ శుభ్రం చేయించాను. నాకున్న పరిచయాలు ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి మంచినీటి చెరువూ, ఓవర్‌ హెడ్‌ ట్యాంకూ నిర్మాణానికి అనుమతి తీసుకున్నాం. ఈ పథకం అమలవుతున్నప్పుడే రూ.45 లక్షలు పెట్టి ప్రతి ఇంటికీ మంచి నీళ్ల కుళాయి ఏర్పాటుచేశాను. కొంతమేర ప్రభుత్వ సాయం తీసుకుని నా డబ్బునీ కలిపి మరుగుదొడ్లూ, మురుగు కాలువలూ నిర్మింపజేశాను. 3 ఎకరాల భూమిని కొని ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చాను. మా గ్రామాన్ని బయటి ప్రపంచంతో కలుపుతూ నరసరావు పేటకు ఒక సింగిల్‌ లైన్‌ రోడ్డు మాత్రమే ఉండేది. ఊరు దాటగానే వాగు. దాని మీద వంతెన లేదు. పెద్ద వర్షం వస్తే బయటకు వెళ్లే అవకాశమే ఉండదు. అందుకే ప్రభుత్వంతో సంప్రదించి మా ఊరి నుంచి పక్క గ్రామాలకూ వెళ్లడానికి వీలుగా మరో నాలుగు తారు రోడ్లు మంజూరు చేయించాను.

ఊరి ముందు వాగు మీద వంతెనా ఏర్పాటుచేశారు. రైతుల కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలకు ఒక రైతు భవనమూ, గ్రంథాలయమూ, కల్యాణమండపమూ నిర్మించాను. అంతేకాదు... మా ఊళ్లో నాలుగు బడులు కులాల వారీగా ఉండేవి. విద్యార్థులందరూ కలిసి 54 మందే ఉన్నా ఇలా వేరు వేరుగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఊళ్లోవాళ్లని ఒప్పించి ఎకరం స్థలంలో చక్కని వసతులతో ప్రైమరీ స్కూల్‌నీ ఆ తర్వాత 20 గదులూ, ఆటస్థలంతో చక్కటి హై స్కూల్‌నీ కట్టించాను. కొంతమంది పేదవాళ్లకు పక్కా ఇళ్లూ కట్టించాను. అలా ఇప్పటివరకూ సుమారు అయిదు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాను. నా 81 ఏళ్ల జీవితాన్ని ఎప్పుడైనా నెమరేసుకుంటే... వ్యాపార విజయాలన్నింటి కన్నా నా ఊరికి సేవ చేయడమే నాకు ఎక్కువ  సంతృప్తినిస్తుంది!

సహకారం: డి.నాగేష్‌బాబు, ఈనాడు, పల్నాడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts