ఆ పిల్లాడి మాటలు వింటుంటే కన్నీళ్ళాగలేదు!

ఓ క్వారీ కూలీ ఐపీఎస్‌ ఆఫీసరయితే ఆ జీవితాన్ని ‘12thఫెయిల్‌’ సినిమాగా తీసి గత ఏడాది జాతీయ అవార్డుల్లో వెలిగిపోయింది బాలీవుడ్‌!

Updated : 11 Feb 2024 13:24 IST

ఓ క్వారీ కూలీ ఐపీఎస్‌ ఆఫీసరయితే ఆ జీవితాన్ని ‘12th ఫెయిల్‌’ సినిమాగా తీసి గత ఏడాది జాతీయ అవార్డుల్లో వెలిగిపోయింది బాలీవుడ్‌! ఆ విజయంతో ఇప్పుడు మరో ఐపీఎస్‌ అధికారి జీవితాన్ని తెరపైకి తీసుకురాబోతోంది. దిల్లీ మెట్రో పోలీస్‌ అధికారిగా ఎన్నో ‘హైప్రొఫైల్‌’ కేసుల్ని ఛేదించిన ఆ ‘ఐపీఎస్‌’ డాక్టర్‌ రామ్‌గోపాల్‌ నాయక్‌. కాకపోతే, ఈయన ఆంధ్రావాడు... తెలంగాణ అల్లుడు. ఇంతకీ నాయక్‌ కెరీర్‌లో సినిమాగా తీసేంతగా ఏముందో... ఆయన మాటల్లోనే చూద్దామా?

మాది గుంటూరు. నాన్న కస్టమ్స్‌ కార్యాలయంలో అధికారి. అమ్మ గృహిణి. ఇంట్లోని ఐదుగురు పిల్లల్లో నేను నాలుగోవాణ్ణి. విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను..

అక్కడ మూడో ఏడాదిలో ఉండగానే మా కుటుంబంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో గొడవలతో మా బావ దారుణ హత్యకి గురయ్యాడు. హంతకుల వెనక పేరుమోసిన గూండాలు ఉండటంతో- మా కుటుంబం నిస్సహాయంగా నిల్చోవాల్సి వచ్చింది. అప్పుడే- ఓ పోలీసు అధికారి మాకు సాయం చేశాడు. ఎంతో ధైర్యంగా ఆ హంతకుణ్ణి జైల్లోపెట్టగలిగాడు. ఆయన్ని చూశాకే- నేనూ పోలీసు అధికారిని కావాలనుకున్నాను. డాక్టర్‌గా సేవలందిస్తూనే సివిల్స్‌కి ప్రిపేరయ్యాను. మూడో ప్రయత్నంలో నేను కోరుకున్న ఐపీఎస్‌ సాధించాను! 2002లో తొలి పోస్టింగ్‌గా లక్షద్వీప్‌లో డీఎస్పీగా వెళ్ళాను. అక్కడ పెద్ద ఎత్తున వినియోగమవుతున్న మాదకద్రవ్యాల గుట్టురట్టుచేశాను. ఆ కేంద్రపాలిత ప్రాంతం చరిత్రలో తొలి నార్కొటిక్స్‌ కేసుని నమోదుచేయగలిగాను. ఆ తర్వాత దిల్లీ క్రైమ్‌ విభాగానికి బదిలీ అయ్యాను. 2008లో జరిగిన దిల్లీ వరుస బాంబుల ఘటనకి సంబంధించిన ఉగ్రవాదుల్ని కేవలం మూడుగంటల్లో అరెస్టు చేయడం, క్రికెట్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడి లండన్‌కి పారిపోయిన సంజీవ్‌ చావ్లాని భారత్‌కి తీసుకురావడం- ఆ దేశం నుంచి ఓ ఖైదీనలా తీసుకొచ్చిన తొలి కేసు అదే కావడం... ఇలా నా కెరీర్‌లో చెప్పుకోదగ్గవి చాలానే ఉన్నాయి. కానీ నా మనసుకి బాగా దగ్గరైన కేసు ఒకటుంది. దాని గురించి చెబుతాను...

ఐదేళ్ళ బాబు కిడ్నాప్‌...

2018 జనవరి 25 సాయంత్రం.

ఓ స్కూలు బస్సుని కొందరు దుండగులు అటకాయించి విక్రాంత్‌ అనే బాబుని అపహరించారు. ఆ బాబు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొడుకు. కిడ్నాప్‌ జరిగిన వారం తర్వాత కేసు మా క్రైమ్‌బ్రాంచి చేతికొచ్చింది. స్థానిక పోలీసుల ద్వారా- గత వారం పది రోజులుగా ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన క్రిమినల్స్‌ వివరాలు తీసుకున్నాను. ఓ ముగ్గురివి దొరికాయి. కిడ్నాప్‌లో వాళ్ళ హస్తం ఉండొచ్చని భావించాం. అది నిజమైంది. బాబు వాళ్ళ నాన్న మాతో చెప్పకున్నా- అతనికి దుండగుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు అడుగుతూ ఫోన్‌ వస్తున్నట్టు పసిగట్టాం. ఫోన్‌ చేస్తున్నవారిలో మేము సందేహించిన నితిన్‌ అనే వ్యక్తీ ఉన్నాడని తేలింది. ఓ రోజు రాత్రి 12.30కి అతణ్ణి పట్టుకున్నాం. బాబుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో దాచినట్లు చెప్పాడు. అటువైపున్నవాళ్ళు సాయుధులైతే మా పోలీసు బలగం ఏమాత్రం సరిపోదు- కానీ ఆలస్యమయ్యేకొద్దీ బాబు ప్రాణానికి ముప్పనిపించి తెగించాం. అపార్ట్‌మెంటులోకి ముందు నితిన్‌ని పంపించాం. అతణ్ని చూడగానే వాళ్ళకేదో సందేహం వచ్చినట్టుంది- చటుక్కున తలుపునీ, ఇనుపగ్రిల్‌నీ వేసేశారు. ఏం చేయాలి?! గ్రిల్‌పైన కాస్త ఖాళీ కనిపించింది. మాలో బలంగా ఉన్న అధికారి దాన్ని వంచితే ఆ ఖాళీ పెద్దదైంది. అందరికన్నా సన్నగా ఉన్న నేను అందులోంచి లోపలికి దూకాను! నేను అలా దూకగానే హాల్లోంచి తూటా ఒకటి దూసుకొచ్చింది- నా తలకి పక్కగా వెళ్ళింది. మరో తూటా వచ్చేంతలో కాస్త మరుగున దాక్కుని అసలు హాల్లో బాబు ఉన్నాడా లేడా అని చూశాను. లేడు. దాంతో, మా బృందంతో కలిసి తూటాల వర్షం కురిపించాను. మావాళ్ళలో ఇద్దరికి తూటా గాయాలయ్యాయి. అయినా- నిమిషాల్లో దుండగులందరినీ మట్టికరిపించాం. హాలు పక్కగదిలో ఉన్న బాబు దగ్గరకి నేనే వెళ్ళాను. తుపాకుల శబ్దానికి భయంతో వణుకుతూ కనిపించాడు. వాణ్ణి ఎత్తుకుని హాల్లో ఉన్న రక్తపాతాన్ని చూడకుండా చేతులతో కళ్ళు మూసి బయటకు తీసుకొచ్చాను. ఎలా చూశాడో కానీ ‘అక్కడ పడున్న వాడు నన్ను బాగా కొట్టాడు అంకుల్‌! బ్యాడ్‌ బాయ్‌!’ అని అమాయకంగా అంటుంటే నా కళ్ళలో నీళ్ళాగలేదు...

విక్రాంత్‌ని కాపాడినందుకే నాకు రాష్ట్రపతి- పోలీస్‌ గ్యాలంట్రీ పతకాన్ని అందించారు. ఈ సంఘటన గురించి వినే బాలీవుడ్‌వాళ్ళు నన్ను సంప్రదించారు. యువ హీరో ఇమ్రాన్‌ జాహిద్‌ నా పాత్ర పోషిస్తాడని చెప్పారు! అది విని ఇంటిల్లిపాదీ ఆశ్చర్య పోయాం... నిజమా, కలా అనుకున్నాం. ఇంతకీ నా కుటుంబం గురించి చెప్పలేదు కదూ! నా భార్య సొనాలి. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కూతురు. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు టెన్త్‌ చదువుతుంటే, చిన్నవాడు తొమ్మిదో తరగతిలో ఉన్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..