ప్రపంచం అతని కోసం ప్రార్థిస్తోంది!

‘ఓ బఫూన్‌ ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్నాడు!’ - అన్నారు తలపండిన రాజకీయనాయకులు హేళనగా. ‘శత్రుదేశం దురాక్రమణ చేస్తుంటే ఈ పిరికివాడు శాంతిమంత్రం పఠిస్తున్నాడు!’ - అన్నారు విదేశీనేతలు ఈసడింపుగా. ‘మాకు కావాల్సింది ఆయుధాలు...

Updated : 13 Mar 2022 09:27 IST

ప్రపంచం అతని కోసం ప్రార్థిస్తోంది!

‘ఓ బఫూన్‌ ప్రెసిడెంట్‌గా పోటీచేస్తున్నాడు!’ - అన్నారు తలపండిన రాజకీయనాయకులు హేళనగా. ‘శత్రుదేశం దురాక్రమణ చేస్తుంటే ఈ పిరికివాడు శాంతిమంత్రం పఠిస్తున్నాడు!’ - అన్నారు విదేశీనేతలు ఈసడింపుగా. ‘మాకు కావాల్సింది ఆయుధాలు... నేను పారిపోయేందుకు వాహనాలు కాదు. నా దేశాన్ని విడిచి నేనెక్కడికీ పోను..!’ - అని నొక్కి చెప్పి ఒకప్పుడు తూలనాడినవాళ్లనే కాదు... ప్రపంచ ప్రజలందర్నీ అభిమానులుగా మార్చుకున్నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలెదిమిర్‌ జెలెన్‌స్కీ. పోరాటపటిమకి కొత్త చిహ్నంగా మారిన అతని ప్రస్థానమిది...

‘నిన్ను టీవీ ఎడిటర్‌ రమ్మంటున్నాడ్రా’ - అన్నాడు ఇవాన్‌.

ఆ మాటకి ‘హుర్రే’ అంటూ ఎగిరిగంతేయబోయి... స్నేహితుడి ముఖం చూసి ఆగిపోయాడు జెలెన్‌స్కీ. అంత మంచి విషయం చెబుతున్నా ఇవాన్‌ ముఖంలో ఇసుమంత సంతోషం కూడా లేదు. ఏదో విషాదంలో ఉన్నట్టున్నాడు. పైగా ‘నీకు మంచి భవిష్యత్తుందిరా... ఆల్‌ ది బెస్ట్‌’ అంటున్నాడు కన్నీళ్లతో. ‘ఆ ఏడుపేంట్రా... ఏమైందో చెప్పు?’ అంటూ అతణ్ని పట్టుకుని ఊపేస్తుండగా... ఎడిటర్‌ నుంచి పిలుపొచ్చింది. వెళ్లగానే ఆయన ‘మీ స్నేహితులు చెప్పే ఉంటారనుకుంటాను... నిన్ను మా ‘కేవీఎన్‌ టీవీ కంపెనీ’కి స్కిట్‌ ఎడిటర్‌గా తీసుకుంటున్నాం. మాస్కోలోనే ఉద్యోగం!’ అన్నాడు ఎడిటర్‌. ఆ మాటకి జెలెన్‌స్కీ మొహం వెయ్యివాట్లతో వెలిగినట్టే వెలిగి... అంతలోనే ఏదో అనుమానంతో మలిగిపోయింది. అతని చూపుల్ని అర్థం చేసుకున్నట్టు ‘మేం నిన్ను మాత్రమే తీసుకుంటున్నాం... మీ టీమ్‌ని కాదు!’ అన్నాడు ఎడిటర్‌. ఇవాన్‌ కన్నీళ్లకి కారణమేంటో అప్పుడు అర్థమైంది జెలెన్‌స్కీకి. వెంటనే - ‘ఓ టీమ్‌గా మాకు దక్కనిదేదీ నాకు వద్దు సార్‌. నేను మా దేశం వెళ్లిపోతాను!’ అన్నాడు. ‘కేవీఎన్‌లో ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు... అని ఈస్ట్‌ యూరప్‌ మొత్తం ఎదురుచూస్తుంటుంది. అలాంటిది నీకు రష్యాలోనే ఉద్యోగం ఇస్తామంటున్నాం. దాన్ని వద్దంటావా... గెటౌట్‌!’ అన్నాడు ఆ ఎడిటర్‌.

జెలెన్‌స్కీ బయటకొచ్చి చూస్తే ఇవాన్‌తోపాటూ పికలోవ్‌, లెంకా, రోమా ఒమరావ్‌, యుర్కా క్రాపా కూడా ఉన్నారు. జెలెన్‌స్కీ వాళ్ల దగ్గరకి వెళ్లగానే పికలోవ్‌ ‘కంగ్రాట్స్‌ రా!’ అన్నాడు. ‘ఏమిట్రా కంగ్రాట్స్‌... చంపేస్తా ఒక్కొక్కణ్ణీ! ఉద్యోగం వద్దని చెప్పొచ్చాను ఆ ఎడిటర్‌కి... మీరు లేకుండా నాకేదీ వద్దురా!’ ఎంత కోపం నటించాలనుకున్నా జెలెన్‌స్కీకి దుఃఖం ఆగలేదు. అంతే తమ మిత్రుడి ఔన్నత్యాన్ని చూసి... స్నేహితులు నలుగురూ అతణ్ణి కన్నీళ్లతో కావలించుకున్నారు.

...ఆ నలుగురు (లెంకా ఓ కారు ప్రమాదంలో చనిపోయింది) బాల్యస్నేహితుల మైత్రి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జెలెన్‌స్కీ దేశాధ్యక్షుడిగా పదవులు చేపట్టాక వీళ్లూ మంత్రులయ్యారు! ఇప్పుడు రష్యాతో యుద్ధం నేపథ్యంలో జెలెన్‌స్కీ ఎంత చెప్పినా పట్టించుకోకుండా వాళ్లే అతనికి రక్షణ కవచంగా ఉంటున్నారు. ‘ఇది మా గొప్పతనం కాదు... మావాడి వ్యక్తిత్వం అలాంటిది. అందుకే, దేశం కోసం వాడు ప్రాణాలిస్తానంటే... మేం వాడి కోసం ఇస్తామంటున్నాం!’ అంటారు వాళ్లు. జెలెన్‌స్కీలోని ఆ వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుందో... చూద్దామా...

*  *  * 

హోలోకాస్ట్‌...  సామూహిక హననం... అంటే ఓ జాతి ప్రజల్ని మూకుమ్ముడిగా హతమార్చడం. హిట్లర్‌ పాలనా కాలంలో ఉక్రెయిన్‌లోనూ ఈ ఘోరం చోటుచేసుకుంది. 1941-44 మధ్య జరిగిన ఈ మారణహోమంలో దాదాపు 16 లక్షలమంది యూదుల్ని చంపేశారు. ఆ ఘోరకాండకి బలైనవాళ్లలో... జెలెన్‌స్కీ కుటుంబం కూడా ఒకటి. అతని తాతయ్య సైమన్‌ జెలెన్‌స్కీ రెండో ప్రపంచ యుద్ధం నాటి రష్యన్‌ సైన్యంలో పనిచేశాడు. ఆయన ఓ చోట పోరాడుతుంటే... మరోచోట ఆయన తండ్రితోపాటూ ముగ్గురు అన్నదమ్ములనీ ఊచకోత కోసింది నాజీ సైన్యం! ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్న ఆ కుటుంబం ఉక్రెయిన్‌లోని క్రివొయ్‌ రాగ్‌లో స్థిరపడింది. జెలెన్‌స్కీ తండ్రి అలెగ్జాండ్రా అక్కడే కంప్యూటర్‌ సైంటిస్టుగా ఎదిగారు. ఆయన భార్య రిమా ఇంజినీరుగా చేస్తుండేది. వాళ్లకి 1978లో పుట్టిన జెలెన్‌స్కీ చిన్నప్పటి నుంచీ డిస్కోలూ, రాక్‌ అండ్‌ రోలూ నేర్చుకున్నాడు. రంగస్థల నటనా ఎంతోకొంత వచ్చేసింది. వీటికి అదనంగా కాసింత రౌడీయిజమూ వంటపట్టింది.

‘నా శవం మీద నడిచి వెళ్ళు’

రష్యా నుంచి ఉక్రెయిన్‌ 1992లో వేరయ్యాక క్రివొయ్‌ ప్రజలకి కొత్త స్వేచ్ఛ దక్కిందికానీ... కొందరు దాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. రౌడీయిజం పెరిగింది. టీనేజీ జెలెన్‌స్కీకి మనసు అటువైపే మొగ్గింది. పోరాటాలపైన పట్టు సాధించాలని రెజ్లింగ్‌ నేర్చుకున్నాడు, వెయిట్‌లిఫ్టర్‌గానూ మారాడు. చెవులకి దుద్దులుపెట్టుకుని రౌడీలా తిరిగేవాడు. వీటన్నింటినీ వాళ్లనాన్న సహించలేకపోయాడు. ఇంటి ముందు రెండు స్తంభాలూ, మధ్యలో ఓ చెక్కా పెట్టించి... దానికి కోదండం వేయించేవాడు! ఆ రౌడీల ప్రభావం నుంచి బయటపడ్డాక జెలెన్‌స్కీ తానో దౌత్యవేత్త కావాలనుకునేవాడట. అందుక్కావాల్సిన కోర్సు రష్యాలోనూ ఇజ్రాయిల్‌లోనూ ఉండేది. జెలెన్‌స్కీ ఇజ్రాయిల్‌నే ఎంచుకుని 16 ఏళ్లకే టోఫెల్‌ పరీక్ష రాసి పాసయ్యాడు. కానీ వాళ్లనాన్న ‘ఇజ్రాయిల్‌కి వెళ్లడమంటే... మనకు మనం యూదు జాతీయులం అని చెప్పుకోవడమే. మనం విశ్వమానవులుగా ఎదగాలనుకుంటాన్నేను. నువ్వు వెళ్లాలనుకుంటే నా శవం మీద నడిచి వెళ్లు!’ అన్నాడట. టీనేజీ జెలెన్‌స్కీకి అవన్నీ అర్థంకాలేదు. తండ్రిమీద కోపం పెంచుకుని... ఇంటి నుంచి పారిపోయాడు. ఆరునెలలపాటు తన స్నేహితుడు పికలోవ్‌ ఇంట్లో తలదాచుకున్నాడు. ‘ఇప్పుడు ఆలోచిస్తే... నాన్న నిర్ణయమే సరైందనిపిస్తోంది. నేను ఇజ్రాయల్‌లో చదువుకుని ఉంటే నన్నందరూ ఉక్రెయిన్‌ పౌరుడిగా కాకుండా యూదుడిగానే చూసేవాళ్లు. నేను అసలు సహించలేని విషయం అది!’ అంటాడు జెలెన్‌స్కీ. ఏదేమైతేనేం, తిరిగొచ్చి క్రివొయ్‌ రాగ్‌ వర్సిటీలోనే లా చదివాడు. అక్కడ చదువుతున్నప్పుడే... అతని కెరీర్‌ దారి మళ్ళింది. అందుకు ‘కేవీఎన్‌’ కారణమైంది!

కామెడీ కింగ్‌!

కేవీఎన్‌... రష్యా నుంచి ప్రసారమయ్యే టాప్‌ టీవీ కామెడీ షోల్లో ఒకటి. ఈటీవీ ‘జబర్దస్త్‌’లాగా వివిధ టీమ్‌ల మధ్య పోటీపెడుతూ సాగే కామెడీ షో ఇది. రష్యా సహా మాజీ సోవియట్‌ యూనియన్‌లోని 15 దేశాల కాలేజీ విద్యార్థులు పాల్గొంటారు ఇందులో. ఆయా దేశాల్లోని ప్రతి మండలానికీ(‘క్వార్టల్‌’ అంటారు) ఓ కేవీఎన్‌ క్లబ్‌ ఉంటుంది.. అలా తన బాల్య స్నేహితులు ఇవాన్‌ జబకోవ్‌, పికలోవ్‌, లెంకా, రోమా ఒమరావ్‌, యుర్కా క్రాపాలను జతచేసుకుని ఆ పోటీలకి వెళ్లాడు జెలెన్‌స్కీ. మండలం నుంచి మాస్కోదాకా వాళ్లది జైత్రయాత్రే అయింది. 1997లో జరిగిన ఫైనల్లో వాళ్లే ఛాంపియన్స్‌గా నిలిచి ఏటా ఫైనల్‌ ఈవెంట్‌లో కార్యక్రమాలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఐదేళ్ల తర్వాత 2003లో కేవీఎన్‌ చీఫ్‌ ఎడిటర్‌, జెలెన్‌స్కీని స్కిట్‌ ఎడిటర్‌గా చేరమంటే స్నేహితుల కోసం కాలదన్నుకున్నాడు. స్నేహితులతోే కలిసి ‘క్వార్టల్‌ 95’(వాళ్ల మండలం పేరు) సంస్థని స్థాపించి కామెడీ షోలు నిర్వహించాడు.  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎదుటే ఎన్నో రాజకీయ వ్యంగ్యనాటకాలు వేశాడు (ఎన్ని జోకులేసినా పుతిన్‌ నవ్వరు అంటాడు జెలెన్‌). ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాడు. 2008లో వచ్చిన ‘లవ్‌ ఇన్‌ ది బిగ్‌ సిటీ’ సినిమా, ఆ తర్వాత మూడు సీక్వెల్స్‌గా వచ్చి అతణ్ణి మెగాస్టార్‌ని చేసింది. అన్నిదేశాల్లాగానే ఉక్రెయిన్‌లోనూ సినిమాలకీ రాజకీయాలకీ దగ్గరి సంబంధం ఉంది. కాకపోతే- జెలెన్‌స్కీ రాజకీయాల్లోకి వచ్చిన వైనం చాలా చిత్రమైంది...

‘రీల్‌’ అధ్యక్షుడు...

2014లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పెట్రో పొరొషెంకో ఎంపికయ్యాడు. రష్యాకి తొత్తుగా మారారని పాత సర్కారుని విప్లవవాదులు కూలదోస్తే... వాళ్లలో ఒకడిగా పోరాడి అధ్యక్షుడైనవాడు పెట్రో. వచ్చీరాగానే రష్యన్‌ ఆర్టిస్టులు ఉక్రెయిన్‌లోకి రావడాన్ని నిషేధించాడు. ఓ కళాకారుడిగా జెలెన్‌స్కీ దాన్ని తప్పుపట్టి సంచలనం సృష్టించాడు. దాంతో ప్రభుత్వం అతని సినిమాలని నిషేధించింది! నిషేధాన్ని ఎత్తివేయమని అడిగితే ‘మీరు మాపార్టీలో చేరండి. మంత్రిపదవి ఇస్తా’ అన్నాడట. దానికి జెలెన్‌స్కీ ‘నేనొక్కణ్ణే కాదు. మా టీమ్‌ మొత్తానికీ పదవులివ్వండి... దేశం కోసం ఎంతకైనా పాటుపడతాం!’ అని బదులిచ్చాడట. దాంతో ‘నువ్వు రాజకీయాల్లో ఎదగలేవు’ అనేసి వెళ్లిపోయాడు పొరొషెంకో. కానీ తనకి తెలిసిన రాజకీయాలేంటో ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ వెబ్‌సిరీస్‌ ద్వారా చూపించాడు జెలెన్‌స్కీ! ‘ఓ హిస్టరీ లెక్చరర్‌ అనుకోని పరిస్థితుల్లో దేశాధ్యక్షుడైతే ఏమవుతుంది’ అన్నది ఆ సిరీస్‌ ఇతివృత్తం. మూడు సీజన్‌లుగా వచ్చిన ఈ కామెడీ సిరీస్‌తో ప్రజలు జెలెన్‌స్కీని భవిష్యత్తు అధ్యక్షుడిగానూ చూడటం మొదలుపెట్టారు. 2019 నాటి అన్ని సర్వేల్లోనూ అతనికే పాలనాపగ్గాలు అందిస్తామని చెప్పారు! వాళ్ల అభీష్టానికి తగ్గట్టే దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు జెలెన్‌స్కీ. తన పార్టీక్కూడా ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ అనే పేరుపెట్టాడు. కానీ... ఎక్కడా ఎన్నికల ప్రచారం చేయలేదు! అందుకు బదులు ఊరూరా తిరిగి కామెడీ షోలు నిర్వహించాడు. మరోవారంలో ఎన్నికలనగా- నాటి అధ్యక్షుడు పెట్రోతో కలిసి అతిపెద్ద ప్రత్యక్ష చర్చలో పాల్గొన్నాడు. ఎవర్నీ ఎక్కడా తూలనాడలేదు. ప్రజల ఇబ్బందుల్ని వివరిస్తూ- ఓ పౌరుడిగా అతనికి ఓటేసి మోసపోయానని మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు. అది బాగా పనిచేసిందేమో... 2019 నాటి ఎన్నికల్లో 73 శాతం ఓట్లతో అధ్యక్షుడయ్యాడు. ఉక్రెయిన్‌ చరిత్రలో ఆ స్థాయి ఓట్లు సాధించినవాళ్లు లేరు.

‘మట్టికోసం బలిపెట్టలేను!’

2014లోనే రష్యా క్రిమియాని సొంతం చేసుకుంది. అప్పటి నుంచీ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో పోరాడుతూనే ఉంది. జెలెన్‌స్కీ అధికారంలోకి రాగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చల్లో పాల్గొన్నాడు. ఆ చర్చల తర్వాత రష్యాతో సంక్షోభం తగ్గడం అటుంచితే... దాన్‌బాస్‌ ప్రాంతంలోని వేర్పాటువాదుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లకి ఆయుధాలు సరఫరా చేశారు పుతిన్‌. మామూలుగా వేర్పాటువాదులపైన ఎవరైనా సైనికచర్యకి దిగుతారు కానీ అతనేమో ‘దేశం అంటే మట్టీమశానం కాదు... ప్రజలు! మట్టికోసం మనుషుల్ని బలిపెట్టడానికి నేను వ్యతిరేకం. దేనికైనా చర్చలే శరణ్యం!’ అన్నాడు. ‘ఇంత పిరికి అధ్యక్షుణ్ణి ఎక్కడా చూడలేదు...’ అన్నాయి ప్రతిపక్షాలు. అతనేమీ స్పందించలేదు కానీ... దేశంలోనే ఉంటూ రష్యాకి తొత్తుగా మారుతున్న పారిశ్రామికవేత్తల(ఒలిగార్చీస్‌ అంటారు స్థానికంగా) పనిపట్టాడు. పుతిన్‌ దగ్గరి స్నేహితుడు దిమిత్రోవ్‌ రజుమెజోవ్‌ ఆస్తుల్ని 2021 ఏప్రిల్‌లో జప్తు చేశాడు. సరిగ్గా ఆ తర్వాతి వారం నుంచే ఉక్రెయిన్‌ సరిహద్దులన్నింటా పుతిన్‌ సైన్యాన్ని మోహరించడం మొదలుపెట్టాడు. నేటి యుద్ధానికి అదీ నాంది!

ఏడాదికిందట చోటుచేసుకున్న అఫ్గానిస్థాన్‌ యుద్ధాన్ని ఎవరం మరచిపోలేం. యుద్ధం మొదలుకావడానికి వారం ముందే... దేశం వదిలి పారిపోయాడు దాని అధ్యక్షుడు. కానీ జెలెన్‌స్కీని దేశం దాటించే ఏర్పాట్లు చేస్తామని సాక్షాత్తూ అమెరికానే ప్రకటించినా ‘ఆ ప్రసక్తే లేదు!’ అంటూ అందరి హృదయాల్నీ దోచుకున్నాడు. అతని తెగింపు చూశాకే అప్పటిదాకా ఆచితూచి వ్యవహరిస్తున్న హంగరీ, టర్కీ, జర్మనీ దేశాలు... రష్యాకి వ్యతిరేకంగా గళమెత్తాయి.

ప్రస్తుత యుద్ధం రష్యా- జెలెన్‌స్కీల మధ్య అన్నట్టే సాగుతోంది. అతణ్ణి చంపడానికే 400 మంది ప్రత్యేక సిబ్బందిని పంపారని చెబుతున్నారు. తొలివారంలోనే నాలుగుసార్లు అతని హత్యకి ప్రయత్నించారట. జెలెన్‌స్కీకి సైనిక రక్షణ కవచంతోపాటూ చిన్నప్పటి నుంచీ వీడని స్నేహితులూ తోడుగా ఉన్నారు. వీళ్లకి కాస్త దూరంలో జెలెన్‌స్కీతో కలిసి చదువుకుని ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్య ఒలెనా... పిల్లలూ అతని క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన వాళ్లదే కాదు... ప్రపంచవ్యాప్తంగా మరెందరిదో కూడా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..