గగన్‌యాన్‌ రాకెట్లు... మేమే చేస్తున్నాం!

పాతాళం నుంచి గంగను తోడి రైతుల కష్టాలు తీర్చే మోటారు పంపుల్ని ఉత్పత్తి చేస్తుండేదా కంపెనీ. ఆ తర్వాత రోడ్డు రోలర్లని తయారుచేసింది. ఎందులోనూ లాభాలు రాక సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా సంస్థ బాధ్యతలు తీసుకున్నాడు కంపెనీ యజమాని కొడుకు.

Updated : 06 Nov 2022 11:39 IST

గగన్‌యాన్‌ రాకెట్లు... మేమే చేస్తున్నాం!

పాతాళం నుంచి గంగను తోడి రైతుల కష్టాలు తీర్చే మోటారు పంపుల్ని ఉత్పత్తి చేస్తుండేదా కంపెనీ. ఆ తర్వాత రోడ్డు రోలర్లని తయారుచేసింది. ఎందులోనూ లాభాలు రాక సంక్షోభంలో పడింది. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా సంస్థ బాధ్యతలు తీసుకున్నాడు కంపెనీ యజమాని కొడుకు. దాన్ని దేశం గర్వించే సంస్థగా మార్చాడు. భారత రక్షణ వ్యవస్థకు కీలకమైన జలాంతర్గాముల నుంచీ ‘గగన్‌యాన్‌’ దాకా ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో భాగం చేశాడు. ఆ ప్రయత్నాల ప్రస్థానాన్ని ఇలా వివరిస్తున్నారు ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఎండీ... విద్యాసాగర్‌ దొంతినేని...

అదో రోబోటిక్‌ మెషీన్‌... ఈ మధ్యే జర్మనీ నుంచి తెప్పించాం. దానితో ఇస్రో రాకెట్లకి కావాల్సిన విడిభాగాలని తయారుచేయొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న మా కంపెనీ ప్రాంగణంలో ఈ భారీ మెషీన్‌ని నా మిత్రులు కొందరు చూశారు. దానికి ఎంత ఖర్చయ్యిందని అడిగితే ‘16 కోట్లు... మూడేళ్ళకిందట ఆర్డర్‌ చేస్తే కొవిడ్‌ లాక్‌డౌన్‌ల తర్వాత ఇప్పుడు తెచ్చారు!’ అన్నాను. ‘పదహారు కోట్లా... ఇదే డబ్బు స్థిరాస్తిలో పెట్టుంటే ఈ మూడేళ్లలో రెండింతలై ఉండేది. ఈ మెషీన్‌తో ఆ పెట్టుబడికి తగ్గ రాబడి వచ్చేమాట అటుంచి అసలు పెట్టిన సొమ్మైనా వస్తుందో రాదో,  ప్చ్‌..’ అంటూ సానుభూతి వ్యక్తంచేశారు. నేనవేవీ పట్టించుకోలా. నా మనసంతా మనదేశం తొలిసారి అంతరిక్షానికి మనుషుల్ని పంపిస్తున్న ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టుపైనే ఉంది. ఈ కొత్త మెషీన్‌తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ కోసం మేం తయారుచేయబోతున్న ప్రధాన విడిభాగాల గురించే ఆలోచిస్తోంది. ఇప్పుడేకాదు, నేనెప్పుడూ లాభనష్టాలకి ప్రాధాన్యం ఇచ్చిందిలేదు. అలా ఇచ్చేవాళ్లెవరూ తయారీ రంగంలో... అందులోనూ దేశరక్షణకి అవసరమైన పరికరాల తయారీ వ్యవస్థలో ఇమడలేరు. మరి అలా లాభాల్ని పట్టించుకోకుండా ఈ సంస్థని నిర్వహిస్తున్న మమ్మల్ని నడిపిస్తున్నదేమిటీ అంటారా... దాని గురించే మీతో చెప్పాలనుకుంటున్నా... మ్యునిక్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం... ప్రపంచవ్యాప్తంగా పేరున్న వర్సిటీ అది. అందులో చదవాలన్నది నా కల. ఆ కలతోనే 1985లో జర్మనీ వెళ్లాను. అంతకుముందు హైదరాబాద్‌లో ఇంటర్‌ చదివి... చెన్నై గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీఈ మెకానికల్‌ చేశాను. నా జర్మనీ కలకి అక్కడే బీజం పడింది. అక్కడి ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌లో అప్రెంటిస్‌షిప్‌ అవకాశం రావడంతో చేరిపోయాను. నేను ఉంటున్న గది నుంచి బెంజ్‌ ఫ్యాక్టరీ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేను అక్కడికి ఏప్రిల్‌లోనే వెళ్లాను కాబట్టి... ఆ కాలంలో చాలా ఆహ్లాదకరంగానే అనిపించింది. కానీ చలికాలం మొదలయ్యేకొద్దీ చుక్కలు కనిపించాయి. జీరో డిగ్రీకి చేరువయ్యే చలిలో... దట్టంగా పేరుకున్న మంచులో నడవలేక నానా అవస్థలు పడేవాణ్ణి. ట్యాక్సీలో వెళ్లేందుకూ డబ్బులుండేవి కావు చేతిలో. పైగా ఒక్క నిమిషం లేటైనా... సగం రోజు జీతానికి కోతపడేది. వాళ్ళ సమయపాలనా, క్రమశిక్షణా ఆ స్థాయిలో ఉండేవి. దాంతో అవసరానికన్నా అర్ధగంట ముందు బయల్దేరితేకానీ... ఆ ఎముకలు కొరికే చలిలో ఆఫీసుకి చేరుకోలేకపోయేవాణ్ణి. రాత్రిపూట నడవాలంటే మరింత నరకం కనిపించేది. అలా ఏడాది అప్రెంటిస్‌షిప్‌ తర్వాత ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళ ఉద్యోగానుభవం తర్వాత ఎంతోకాలంగా నేను కోరుకుంటున్న మ్యునిక్‌ టెక్నికల్‌ వర్సిటీలో పీజీ సీటొచ్చింది. రెండేళ్లపాటు పీజీ, మరో ఏడాది ఉద్యోగం చేసి... నింపాదిగా ఇండియాకి వద్దామన్న నా ఆశను గల్లంతు చేస్తూ ఓ రోజు మా నాన్న ఫోన్‌ చేశారు. ‘మన కంపెనీని ఇక నువ్వే చూసుకోవాలి. తొందరగా వచ్చెయ్‌’ అన్నారాయన. ‘అదెలా... నేను ఇక్కడ పీజీ చేయాలి కదా!’ అన్నాను. ఇక తప్పదన్నట్టు మా కంపెనీ ఉన్న పరిస్థితిని చెప్పారు నాన్న...

కిసాన్‌ల కోసం మొదలుపెట్టి...

మాది గుంటూరుజిల్లా పొన్నూరు దగ్గర బోడిపాలెం అనే గ్రామం. మా నాన్న దొంతినేని శేషగిరిరావు డిగ్రీ చదువుకున్నా రైతుగానే స్థిరపడ్డారు. అప్పట్లో వ్యవసాయానికి వాడే పంపు సెట్ల ధర చాలా ఎక్కువగా ఉండేది. వాటిని రైతులకి తక్కువ ధరలో అందించాలన్న లక్ష్యంతో నాన్న 1954లో శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ(ఎస్‌ఈసీ)ని విజయవాడలో ప్రారంభించారు. అప్పట్లో ఆయన రూపొందించిన ‘శ్రీరామ్‌ మోటారు పంపులు’ మంచి ఆదరణకి నోచుకోవడంతో నాన్న కంపెనీని హైదరాబాద్‌కి మార్చారు. ఆ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో కరవొచ్చింది. అప్పట్లో మోటారు పంపుల విక్రయాలన్నీ... అప్పుతోనే నడిచేవి. అంటే, ముందు రైతులకి మోటార్లని ఇచ్చి... కొద్దికొద్దిగా వసూలుచేసేవారు. తీవ్ర కరవు కారణంగా మా దగ్గర మోటార్లు తీసుకున్న రైతులెవరూ కిస్తీలు చెల్లించలేకపోయారు. అసలే పంట చేతికిరాక అల్లాడుతున్న రైతుల్ని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక నాన్న వాటిని వదిలేశారు. ఆ నష్టాల్ని పూడ్చడానికి ‘సహాయక్‌’ పేరుతో నిర్మాణ పనులకి అవసరమైన రోడ్డు రోలర్‌లూ, మిక్సర్‌లూ తయారుచేయడం ప్రారంభించారు. అప్పట్లో బడా సంస్థలున్న ఆ రంగంలో ఓ చిన్నతరహా సంస్థగా ఎస్‌ఈసీ మాత్రమే తక్కువ ధరకి వాటిని అందిస్తుండేది. కానీ ఇలాంటి పరికరాలను చిన్నతరహా పరిశ్రమల నుంచి కొనకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మా కంపెనీని కుదిపేసింది. ఆ సంక్షోభ సమయంలోనే... విదేశాల్లో పనిచేసిన నా అనుభవం కంపెనీకి పనికొస్తుందన్న ఆశతో నాన్న నన్ను ఇక్కడికి రమ్మన్నారు.  

జవాన్‌ల వైపుగా...  

నాన్న చెప్పడంతో... జర్మనీ ఉద్యోగానికి అయిష్టంగానే రాజీనామా ఇచ్చి హైదరాబాద్‌ వచ్చేశాను. ముందు మా కంపెనీ పరిస్థితిని అవగాహన చేసుకున్నాక... దాన్ని కొత్త తరహా వస్తువుల తయారీవైపు తీసుకెళ్లడమే ఉత్తమం అనిపించింది. అలా ఫార్మా కంపెనీలకి అవసరమైన రియాక్టర్స్‌ని తయారుచేయడం మొదలుపెట్టాను. అలా సంస్థ కాస్త కుదురుకున్నాక... మాకో మంచి అవకాశం కనిపించింది. భారత రక్షణశాఖకి చెందిన డీఆర్‌డీఓ తమ ఆయుధాల తయారీ పనుల్లో కొంతభాగాన్ని ప్రయివేటు కంపెనీలతో పంచుకోడానికి సిద్ధమైనట్టు తెలిసింది. కానీ- మాలాంటి అనుభవంలేని కంపెనీకి ఆ అవకాశం ఇవ్వాలంటే మాటలా అందుకే మా సంస్థని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనుకున్నాను. జర్మనీలో నేను చూసిన పద్ధతుల్ని ఇక్కడ ఆచరణలో పెట్టడం ప్రారంభించాను. హైదరాబాద్‌లో మా కంపెనీకి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వర్క్‌షాపుల్ని నిర్మించాలనుకున్నాను. మరి వాటన్నింటికీ పెట్టుబడి కావాలి కదా... బ్యాంకుల వద్దకి రుణానికని వెళితే పైసా ముట్టలేదు. చివరికి మా కంపెనీ ఉన్న ఐదెకరాల స్థలాన్ని తాకట్టుపెట్టి... డబ్బు సేకరించాను. నా జర్మనీ పద్ధతులు కొత్తవైనా సరే నన్ను నమ్మి నాతో నడిచారు మా ఉద్యోగులు. అలా అందరినీ కలుపుకుని వెళ్ళి... ఎట్టకేలకు డీఆర్‌డీఓ ఆర్డర్‌ని సాధించాను.

పృథ్వీ ఘనత మనదే...  

మన దేశం తయారుచేసే క్షిపణుల్లోని ఇంధనాన్ని ప్రొపెల్లంట్స్‌ అంటారు. వాటిని నిల్వచేసే ట్యాంక్‌ని తయారుచేయడమే మాకు వచ్చిన తొలి అవకాశం. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో... క్షిపణుల్ని నిలిపే లాంచర్ల బాధ్యతల్ని అప్పగించారు. నాలుగేళ్లు తిరక్కుండానే... భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పృథ్వీ క్షిపణి పనుల్ని సాధించాం. అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చి విదేశాల్లోని యంత్రాల్ని తెప్పించాం. నాతో సహా ఉద్యోగులందరూ ఆ కొత్త సాంకేతికతని నేర్చుకుని... ఎన్నో వైఫల్యాల్ని ఎదుర్కొని... రకరకాల ప్రయోగాల ద్వారా పృథ్వీ నిర్మాణంలోని కీలక భాగాలన్నింటినీ రూపొందించాం. విడిభాగాలుగా తయారుచేస్తున్నంత కాలం పెద్దగా అనిపించలేదుకానీ... 1997 భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల పరేడ్‌లో ఆ క్షిపణిని చూసినప్పుడు గర్వంతో మా గుండెలు ఉప్పొంగాయి. ఎంత ఆపుకుందామన్నా ఆనందబాష్పాలు ఆగలేదు మాకెవ్వరికీ!  

అత్యాధునిక జలాంతర్గాములు...

మన భారత రక్షణ శాఖ... అత్యాధునిక యుద్ధపరికరాలని ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి తెప్పిస్తుంటుంది. అలా మన నుంచి కాంట్రాక్ట్‌ తీసుకున్న విదేశీ సంస్థలు తమ ఆయుధాల్లో 30 శాతాన్ని... స్వదేశీ కంపెనీల సహకారంతోనే చేయాలని 2008లో కేంద్ర ప్రభుత్వం ఓ నిబంధన(ఆఫ్‌సెట్‌ పాలసీ) తెచ్చింది. అలా విదేశీ సంస్థలతో చేతులు కలిపి పనిచేసేపాటి స్వదేశీ కంపెనీలు ఉండాలి కదా! దేశంలో వేళ్లమీద లెక్కపెట్టగలిగే అలాంటి సంస్థల్లో మేమూ ఒకళ్ళమై నిలిచాం. దానికింద- ప్రఖ్యాత ఇజ్రాయెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇండస్ట్రీ(ఐఏఐ) నుంచి అత్యాధునిక టెక్నాలజీనీ సొంతం చేసుకోగలిగాం. అంతేకాదు, వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాల మరమ్మతుల్ని చూసే (మెయింటెనెన్స్‌ రిపేర్‌ ఓవర్‌హాలింగ్‌-ఎమ్మార్వో) బాధ్యతా మాకే ఇచ్చారు. ఈ ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయిగా నిలిచింది - ‘స్కార్పిన్‌’ జలాంతర్గాముల ప్రాజెక్టు. ఇందుకోసం మనదేశంలో ఏడెనిమిది పెద్ద సంస్థలు పోటీపడితే... మాకొక్కరికే అది దక్కింది! డీసీఎన్‌ఎస్‌ అన్న ఫ్రెంచి సంస్థతో కలిసి జలాంతర్గామిలో అతికీలకమైన 14 అసెంబ్లీ యూనిట్స్‌ని తయారుచేశాం. దాదాపు 520 కోట్ల రూపాయల ప్రాజెక్టు అది. అలా నేను జర్మనీ నుంచి వచ్చిన 20 ఏళ్ళకు... మా సంస్థ తొలిసారి పెద్ద లాభాలని గడించింది! ఆ తర్వాతే మేం ఇదివరకున్న చోట స్థలం సరిపోక హైదరాబాద్‌ ఆదిభట్లలో పదిహేను ఎకరాల స్థలంలో కంపెనీని విస్తరించాం.

సమస్యనే అవకాశంగా చేసుకున్నాం...

ఈ జలాంతర్గాముల నిర్మాణం కోసం మా ప్రాంగణంలో అతిపెద్ద వర్క్‌షాపుని నిర్మించుకున్నాం. మేం తయారుచేసినవాటిల్లో- జలాంతర్గాముల నుంచి శత్రువులపైన దాడిచేసేందుకు వాడే ‘వెపన్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌’ కీలకమైంది. వాటిపైన భారత నౌకాదళానికి మేమే శిక్షణ ఇచ్చాం! కాకపోతే, మేం మొత్తం 12 జలాంతర్గాముల కోసం పనిచేయాల్సి ఉంటే... ఆరింటికే చేశాం. మరో ఆరు జలాంతర్గాముల కోసం పనిచేసేలోపు... మనదేశంలో ప్రభుత్వం మారి... కాంట్రాక్ట్‌ ఆగిపోయింది. మరి వాటికోసం కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటుచేసిన వర్క్‌షాపూ, ఇతర ఆధునిక వసతులూ ఏం కావాలి... అనిపించింది. అప్పుడే నా దృష్టి ‘ఇస్రో’పైన పడింది. మా సంస్థ అప్పటికే డీఆర్‌డీఓ కోసం భారీ ఎత్తున ‘ఆకాశ్‌’ క్షిపణుల్నీ, అత్యాధునిక ఎల్‌ఆర్‌సామ్‌ క్షిపణుల్నీ తయారుచేసి ఇస్తుండేది. ప్రాథమికంగా చూస్తే క్షిపణికీ, రాకెట్‌ తయారీకీ పెద్దగా తేడా లేదు. కాబట్టి రాకెట్‌ పనులు ఇవ్వండని అడిగితే ‘అందుకు తగ్గ సౌకర్యాలు మీకున్నాయా?’ అని అడిగారు శాస్త్రవేత్తలు. దాంతో- జలాంతర్గాముల్ని తయారుచేసిన మా వర్క్‌షాపుని అప్పటికప్పుడు ఇస్రో రాకెట్‌ల తయారీ కేంద్రంగా మార్చి చూపాం. అలా మాకు- మనదేశం మొట్టమొదటిసారి ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌)లో కీలకభాగాల్ని రూపొందించే అరుదైన అవకాశం దక్కింది. దాంతోపాటూ తొలిసారి మానవసహిత అంతరిక్షయాత్రకి సంబంధించిన ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టుకి కావాల్సిన ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3(ఎల్‌ఎల్‌వీ3) రాకెట్‌లోని కీలక భాగాల్నీ మేం రూపొందిస్తున్నాం. అంతేకాదు, ఆ ప్రాజెక్టుకి సంబంధించి మరో అరుదైన అవకాశాన్నీ మేం చేజిక్కించుకున్నాం. అదేమిటంటే...2003 సంవత్సరం. మన భారతీయ సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా ‘కొలంబియా’ అంతరిక్ష నౌక ద్వారా భూమికి తిరిగొస్తోంది. మరో కొద్ది నిమిషాల్లో...  భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందనగా రాకెట్‌ పేలిపోయింది! మన వ్యోమగాములకి ఆ పరిస్థితి రాకుండా చూసే ‘క్రూ ఎస్కేప్‌ మాడ్యుల్‌’(సీఈఎం)నే ఇప్పుడు మేం తయారుచేస్తున్నాం. దాంతోపాటూ వ్యోమగాములకి అతితీవ్రమైన వేడి అంటకుండా చూసే ప్రత్యేక కవచాన్నీ(హీట్‌ షీట్‌) రూపొందించే బాధ్యతా తీసుకున్నాం. మనదేశంలో మరే ప్రయివేటు సంస్థకీ దక్కని ఈ అరుదైన అవకాశం... నాకూ, మా కంపెనీలో ఉన్న 450 మంది ఉద్యోగులకే కాదు, తెలుగువారందరికీ గర్వకారణమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..