అద్దాల చిత్రాలు... అదరహో!

ఇంటి అలంకరణలో మొక్కలూ, పూల కుండీలతోపాటు గోడలకు తగిలించే ఫ్రేములూ ఓ భాగమే. అలాగని కుటుంబసభ్యుల ఫొటోలూ, రకరకాల పెయింటింగ్‌లూ, దేవుళ్ల చిత్రపటాలూ తగిలించేయడంలో కొత్తదనం ఏముంటుంది చెప్పండీ.

Published : 10 Feb 2024 23:27 IST

ఇంటి అలంకరణలో మొక్కలూ, పూల కుండీలతోపాటు గోడలకు తగిలించే ఫ్రేములూ ఓ భాగమే. అలాగని కుటుంబసభ్యుల ఫొటోలూ, రకరకాల పెయింటింగ్‌లూ, దేవుళ్ల చిత్రపటాలూ తగిలించేయడంలో కొత్తదనం ఏముంటుంది చెప్పండీ. అందుకే వాటికి బదులుగా ఈ ‘స్టెయిన్డ్‌గ్లాస్‌ వాల్‌ఆర్ట్‌ ఫ్రేములు’ పెట్టి చూడండీసారి. కోరుకున్న డిజైన్లలో దొరుకుతూ, ఇంటికి ఆధునిక లుక్‌ను తెచ్చిపెట్టే ఈ స్టెయిన్డ్‌గ్లాస్‌ ఫ్రేములదే ఇప్పుడు ట్రెండ్‌ మరి. 

ల్లు చిన్నదైనా పెద్దదైనా సరే... ఫర్నిచర్‌ నుంచి వంటింటి సామగ్రి, పూల కుండీలు, లైట్లు, పరదాలు, బెడ్‌షీట్ల వరకూ ప్రతి వస్తువూ వీలైనంత కొత్తగా, ట్రెండీగా ఉన్నదాన్నే చూసి మరీ ఎంచుకుంటున్నారిప్పుడు. అలా కొంటున్నవాటిల్లో గోడలకు తగిలించే ఫ్రేములూ భాగమే కాబట్టి
అవి కూడా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన డిజైన్లలో వచ్చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో తాజాగా ఈ ‘స్టెయిన్డ్‌గ్లాస్‌ వాల్‌ ఆర్ట్‌ ఫ్రేమ్స్‌’ కూడా చేరిపోయి... ఇంటికి కొత్త అందాన్ని తెస్తున్నాయి. రంగురంగుల గాజు ముక్కల్ని ఓ పద్ధతి ప్రకారం అనుకున్న డిజైనులో వచ్చేలా
అతికించే స్టెయిన్డ్‌గ్లాస్‌ ఆర్ట్‌ ఎంత వర్ణరంజితంగా ఉంటుందో తెలిసిందే. అయితే అలా చేయడం అన్నిసార్లూ కష్టసాధ్యం కాబట్టి... ప్రత్యామ్నాయంగా గాజు పలకలపైన ఓ డిజైను వేసుకుని దానికి రకరకాల రంగుల్ని వేస్తూ స్టెయిన్డ్‌గ్లాస్‌ లుక్‌ వచ్చేలా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు ఆర్టిస్టులు. ప్రకాశవంతమైన రంగుల మేళవింపుతో ముచ్చటగొలిపే ఈ స్టెయిన్డ్‌గ్లాస్‌ కళ ఎక్కువగా కిటికీలూ, తలుపులూ, గదుల్లోని పై కప్పు మీద కనిపించినా... రోజులు మారేకొద్దీ పరదాలపైనా చేరిపోయింది. త్రీడీ రూపంలోనూ దొరికేస్తోంది. ఇప్పుడు ఇదిగో ఇలా వాల్‌ఆర్ట్‌గానూ వచ్చేసి వావ్‌ అంటూ ప్రశంసలూ అందుకుంటోంది.  

కోరుకున్న డిజైనులో...

‘స్టెయిన్డ్‌గ్లాస్‌తో ఫ్రేములా... ఎలా చేస్తారబ్బా’ అనే సందేహం కలగొచ్చు కానీ.. అదేమీ పెద్ద కష్టం కాదు. ఈ ఫ్రేములకోసం కాస్త మందంగా ఉండే టాంపర్డ్‌ గ్లాస్‌ను ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఎక్కువ కాలం మన్నడం, డిజైను కూడా త్వరగా వెలిసిపోకపోవడం, సులువుగా శుభ్రం చేయగలగడం... వంటి కారణాలవల్లే ఈ టాంపర్డ్‌ గ్లాస్‌ను వాడతారు. అలా ఎంచుకున్న గాజు పలకలపైన రకరకాల డిజైన్లను యువి/డిజిటల్‌ తరహాలో ప్రింట్‌ చేస్తే కొందరు కళాకారులు పెయింటింగ్‌ రూపంలోనూ వేస్తున్నారు. ఈ డిజైన్లలో ముద్దుగా కనిపించే కుక్కపిల్లలూ, పిల్లి కూనలూ, క్రూర మృగాలూ, రంగురంగుల పూలూ, పచ్చని చెట్లూ, పక్షులూ, ఆబ్‌స్ట్రాక్ట్‌ డిజైన్లూ... ఇలా రకరకాలు దొరుకుతుండటంతో నచ్చినవాటిని ఎంచుకుంటే... ఇంటికొచ్చేవారి దృష్టి మొదట ఈ ఫ్రేములపైనే పడుతుందంటే నమ్మండి. గృహాలంకరణలో కొత్తగా వచ్చేస్తున్న ఈ స్టెయిన్డ్‌గ్లాస్‌ ఫ్రేములు బహుమతిగా ఇవ్వడానికీ బాగుంటాయి. ఫొటోస్టేషన్‌ డాట్‌కామ్‌ ఎట్సీ, ఫ్లెయిర్‌గ్లాస్‌తోపాటూ ఇతర ఆన్‌లైన్‌ సైట్లలోనూ అందుబాటులో ఉన్న స్టెయిన్డ్‌గ్లాస్‌ వాల్‌ఫ్రేముల్లో మీకేవి నచ్చుతాయో చూసేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..