కంటైనర్‌లో కుంకుమపువ్వు సాగు

బంగారంతో సమానంగా తులతూగే కుంకుమపువ్వు... చలచల్లని కశ్మీర్‌లో మాత్రమే కనిపిస్తుంది. అదీ కొన్ని నెలల్లో మాత్రమే సాగవుతుంది.

Updated : 08 Jan 2023 04:29 IST

కంటైనర్‌లో కుంకుమపువ్వు సాగు

బంగారంతో సమానంగా తులతూగే కుంకుమపువ్వు... చలచల్లని కశ్మీర్‌లో మాత్రమే కనిపిస్తుంది. అదీ కొన్ని నెలల్లో మాత్రమే సాగవుతుంది. అలాంటిది పుణెకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఏకంగా తన ముంగిట్లోనే ఏడాదంతా కుంకుమ పువ్వును పండిస్తున్నాడు. శీతల వాతావరణంలో సాగయ్యే ఈ పంట పుణెకి ఎలా వచ్చిందీ అనే కదా సందేహం... అయితే చదివేయండి.

పంటలు పండాలంటే పొలం ఉండాలీ... నీళ్లు పుష్కలంగా అందాలీ అనే రోజులు పోయాయి. అవేం లేకపోయినా రకరకాల ప్రయోగాలతో పంటలకు కావల్సిన వాతావరణాన్ని రైతులే సృష్టించి సాగు చేస్తున్న రోజులివి. అందులో భాగంగానే సాగుకు కంటైనర్లను ఎంచుకున్నాడు పుణెకి చెందిన హైటెక్‌ రైతు శైలేశ్‌ మోడక్‌. మట్టితో పని లేకుండా షిప్పింగ్‌ కంటైనర్‌లో ఏరోపోనిక్‌ విధానంలో గాలితో పంటలు పండిస్తున్నాడు... అదీ కశ్మీర్‌లోనే పండే కుంకుమ పువ్వును. నూతన మార్కెటింగ్‌ విధానాన్ని అవలంబించడంలో భాగంగానే శైలేశ్‌ షిప్పింగు కంటైనర్‌లో సాగు చేస్తున్నాడు. అదేంటంటే... పొలానికీ, మార్కెట్లకీ చాలా దూరం ఉంటుంది. ఉత్పత్తుల్ని తరలించడానికి రవాణా ఖర్చు కూడా అవుతుంది. అందుకే మార్కెట్‌ వద్దకే పొలాన్ని తీసుకెళితే అని ఆలోచించిన శైలేశ్‌ సాగు కోసం ఈ కంటైనర్లని ఎంచుకున్నాడు. అలానే కుంకుమ పువ్వును సాగు చేయాలనే ఆలోచన శైలేశ్‌కి ఎలా వచ్చిందంటే...

దాదాపు పద్నాలుగేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన శైలేశ్‌కి కొంత కాలానికి ఉద్యోగం విసుగనిపించి రాజీనామా చేశాడు. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించిన శైలేశ్‌- తేనెటీగల్ని పెంచి పాలినేషన్‌ కోసం రైతులకు అద్దెకివ్వడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు వాటిని రాత్రిపూట తరలించడంలో ఇబ్బందులు రావడంతో ఆ పని మానేశాడు. అప్పుడే హైడ్రోపోనిక్‌ సాగు గురించి లోతుగా అధ్యయనం చేశాడు. మట్టిలేకుండా కంటైనర్లలో నీళ్లలోనే పంటలు పండించొచ్చని తెలుసుకున్నాడు. పైగా ఈ రోజుల్లో తాజాదనం కోరుకునే వారి కోసం కాయగూరలు పండించిన కంటైనర్లను నేరుగా మార్కెట్‌ వద్దకే తీసుకెళితే... కొనుగోలు చేసేవారే వాటిని మొక్కల నుంచి కోసుకుంటారని గమనించాడు. అందుకే కంటైనర్‌లో సాగుకు మొగ్గు చూపాడు శైలేశ్‌. ఎన్నో సౌలభ్యాలుండి- సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదంతా కంటైనర్‌లోనే పంటలు పండించాలనే ఉద్దేశంతో ‘365 డీ ఫార్మ్స్‌’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించి స్ట్రాబెరీ, బ్రకొలీ, ఆకుకూరల సాగును మొదలుపెట్టాడు.

గాలితో పంట...

వెలుతురుకి ఎల్‌ఈడీ లైట్లూ, చల్లదనానికి ఏసీ, ఉష్ణోగ్రతకి హీటర్లను ఏర్పాటు చేశాడు. ఎక్కడి నుంచైనా
పంటకు అనుకూలమైన వాతావరణాన్నీ కల్పించేందుకు ఆటోమేటెడ్‌ టెక్నాలజీనీ, విద్యుత్‌ కోసం జనరేటర్లనీ అమర్చాడు. అలా సేంద్రియ పద్ధతిలో సాగుకు వాడిన కంటైనర్లనే మార్కెట్‌కి తరలించి కాయగూరల్ని అమ్మేవాడు. అది లాభసాటిగా ఉన్నప్పటికీ కొవిడ్‌, అనారోగ్య సమస్యల కారణంగా ఆ పనులకు బ్రేక్‌ పడింది.

కొంత కాలానికి మళ్లీ సాగు ఆలోచన

చేసిన శైలేశ్‌ ఈసారి ప్రయోగం చేయాలనుకున్నాడు. మన దగ్గర కేవలం కశ్మీరులోనే పండే కుంకుమపువ్వు అత్యంత ఖరీదైన సుగంధద్రవ్యం. క్రోకస్‌ సాటివస్‌ అనే మొక్క పూలలోని కేసరాలే కుంకుమ పువ్వు. దీని ధర కేజీ లక్షల్లోనే ఉంటుంది. అందుకే దాన్నే సాగు చేయాలనుకున్నాడు. పైగా కుంకుమ పువ్వు లభించే క్రోకస్‌ సాటివస్‌ మొక్క చాలా తక్కువ ఎత్తు పెరుగుతుంది. కంటైనర్‌లో ఒక ట్రే పైన మరొకటి ఎక్కువ ట్రేలు అమర్చుకోవడం కూడా కుదురుతుంది. ఉల్లిపాయ లాగా ఉండే క్రోకస్‌ సాటివస్‌ విత్తనాలు(బల్బులు) ఒకసారి నాటితే ఐదారేళ్లపాటు పంట వస్తుంది. దాంతో పది లక్షల రూపాయల పెట్టుబడితో కశ్మీర్‌ నుంచి 12 కేజీల విత్తనాలను సేకరించి-  కంటైనర్‌ లోపల 320 చదరపు అడుగుల్లో 4500 బల్బులతో సాగుకు శ్రీకారం చుట్టాడు శైలేశ్‌. ఏరోపోనిక్‌ విధానంలో ఎప్పటికప్పుడు ఆ పంటకు అనుకూలమైన వాతావరణం అందేలా ఏర్పాటు చేస్తూ కుంకుమ పువ్వు సాగు చేస్తున్నాడు. ఈ కంటైనర్‌ సాగు ద్వారా ఏడాదికి కేజీ కుంకుమ పువ్వును సేకరిస్తున్నాడు. ఇంటి ఆవరణలోనే సరికొత్తగా సేద్యం చేస్తూ లక్షలు అర్జిస్తున్న శైలేశ్‌ కొత్తతరం రైతులకు నవీన సాగు మార్గాలెన్నో చూపుతున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..