ఈ ఆలయం దగ్గరికి కాకులు రావు

వివాహాలు కుదిర్చే స్వామిగా, అపర ధన్వంతరిగా... పూజలు అందుకుంటున్నాడు వెయ్యినూతుల కోనలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి. శాంతరూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం.

Updated : 15 Jan 2023 03:03 IST

ఈ ఆలయం దగ్గరికి కాకులు రావు

 

వివాహాలు కుదిర్చే స్వామిగా, అపర ధన్వంతరిగా... పూజలు అందుకుంటున్నాడు వెయ్యినూతుల కోనలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి. శాంతరూపంలో దర్శనమిచ్చే ఈ స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. వివాహ దోషాలనూ తొలిగించే ఈ స్వామి ఆలయం చుట్టుపక్కల కాకులూ గద్దలూ తిరగవనీ చెబుతారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా ఎలా వెలిశాడంటే...

ఎత్తయిన పర్వతాలూ... వాటి మధ్య నుంచి పారే జలపాతాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తుంది నరసింహస్వామి ఆలయం. వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని చిన్న దాసరపల్లెలో ఉండే ఈ ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు. వెయ్యినూతుల కోనగానూ పిలిచే ఈ ఆలయంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని ప్రతీతి.

స్థలపురాణం

నుయ్యి అంటే బావి. ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలోని ఓ పర్వతంపైన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడనీ, రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడనీ చెబుతారు. స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే... హిరణ్యకశిపుడిని సంహరించిన స్వామి ఆ తరవాత ఉగ్రరూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారట. అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న వెయ్యినూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారట. ఆ తరవాత స్వామి శాంతించడంతో ఇక్కడ కొలువు దీరమంటూ వేడుకున్నారట. అలా మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని కథనం. ఈ క్షేత్రంలో కాకులూ, గద్దలూ సంచరించకపోవడం వెనకా మరో ఆసక్తికరమైన కథనం ఉంది. రాముడు సీతాసమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేదతీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడట. దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడిపైన బ్రహ్మాస్త్రం సంధించాడట. దాన్నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడినే శరణు కోరాడట. అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి.. లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడట. అప్పటినుంచీ ఇక్కడ కాకులు తిరగవని అంటారు.

అనారోగ్యాలను నివారించే స్వామి....

గర్భాలయంలో స్వామి శంఖుచక్రాలూ, అభయముద్రతో లక్ష్మీసమేతంగా దర్శనమిచ్చినా... ఈ ఆలయానికి కొద్ది దూరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంటుంది. స్వామిపైన అలిగిన లక్ష్మీదేవి ఆలయానికి కొద్దిగా దూరం జరిగి.. శిలగా మారడంతో అక్కడే ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులూ, దేవతలూ స్వామిని దర్శించుకుంటారనీ.. అందుకే ఆ సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయనీ చెబుతుంటారు స్థానికులు. నలభై రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమపూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట. ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలోనే సుమారు వెయ్యివరకూ బావులు ఉన్నాయని అంటారు. ఆలయ సమీపంలోని కొండపై నుంచి వర్షాకాలంలో ప్రవహించే జలపాతాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడం విశేషం. ఇక్కడి స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు. సంక్రాంతి సమయంలోనూ రెండురోజులపాటు పంచామృత అభిషేకం, కల్యాణోత్సవం, స్వామివారి ఊరేగింపులను ఘనంగా చేస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు  రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల భక్తులూ ఇక్కడకు వస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం కడప నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలో పులివెందుల రహదారిలో ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కడప వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే... అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

బుడుబుడుకల విశాల్‌, ఈనాడు డిజిటల్‌, సంగారెడ్డి

ఫొటోలు: బి.రామసుబ్బారెడ్డి, పెండ్లిమర్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..