Published : 15 May 2022 00:17 IST

సిసింద్రీ

కొక్కొరొక్కో... నేనెవరో చెప్పుకో!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎండలు మండిపోతున్నాయి కదూ! బయటకు వెళ్లి ఆడుకోవడానికి కుదరడం లేదు కదా! అందుకే ఎంచక్కా ఇంట్లోనే, లేదంటే చెట్టు నీడనే ఉండి ఆడుకునే ఓ ఆట గురించి ఈ రోజు తెలుసుకుందామా. ఆరుగురి నుంచి ఇరవై మంది వరకూ ఈ ఆటను ఆడుకోవచ్చు. ముందుగా మనలో ఒకరు అచ్చం కోడిలా తల ముందుకు వంచి, కళ్లు మూసుకొని.. ‘కొక్కొరొక్కో.. కొక్కొరోక్కో..’ అని అరుస్తుండాలి. మిగతా వారంతా చుట్టూ వృత్తంలా కూర్చుంటారు. వారిలోంచి ఒకరు వచ్చి మధ్యలో కూర్చుని ‘కొక్కొరొక్కో.. కొక్కొరొక్కో’ అని అరుస్తున్న పిల్లాడిని నెమ్మదిగా తాకి, మళ్లీ తన స్థానంలో తాను కూర్చోవాలి. ఇప్పుడు చుట్టూ కూర్చున్నవాళ్లు ‘కొక్కొరొక్కో.. కొక్కొరోక్కో.. నేనెవరో చెప్పుకో’ అని మూడు సార్లు అనాలి. ఇలా అన్న తర్వాత మధ్యలో కూర్చున్న పిల్లాడు కళ్లు తెరిచి చుట్టూ చూసి తనను తాకింది ఎవరో గుర్తించాలి. సరిగ్గా గుర్తిస్తే తాకిన వారు ఈ సారి మధ్యలోకెళ్లి కూర్చుంటారు. గుర్తించకుంటే ఆ పిల్లాడే మరోసారి మధ్యలో కోడిలా కూర్చుని కళ్లు మూసుకోవాలి. తిరిగి ఆట ప్రారంభమవుతుంది. ఇలా ఎంతసేపైనా ఆడుకోవచ్చు. మొత్తానికి ‘కొక్కొరొక్కో’ ఆట భలే సరదాగా ఉంది కదూ!


దేవుడు చేయలేని పని!

ఓ రాత్రి పాన్పుపై నిద్రిస్తున్న అక్బర్‌ చక్రవర్తికి టక్కున ఓ ఆలోచన వచ్చింది. ‘దేవుడు సర్వసమర్థుడు. ఆయన చేయలేని పనంటూ ఉండదు. అలాగే రాజునైన నేను కూడా సర్వసమర్థుణ్ని. నాకు కూడా అసాధ్యమైన పనిలేదు. కానీ సృష్టి మాత్రం నాకు అసాధ్యం. అలాగే, భగవంతుడికి కూడా సాధ్యం కాని పని ఏదైనా ఉందా?’ అని సందేహం కలిగింది. ఎంత ఆలోచించినా అక్బర్‌కు దీనికి సమాధానం దొరకలేదు. మరుసటి రోజు దర్బారులో ఇదే విషయమై బీర్బల్‌ను అడిగాడు. ‘బీర్బల్‌! నేను చక్రవర్తిని. సమస్త పనులనూ చేయగలను. నాలాగే భగవంతుడు కూడా అన్ని పనులూ చేయగలడా?’ అని ప్రశ్నించాడు. ‘చిత్తం... జహాపనా! మీరు సర్వసమర్థులు. దేవుడు మీకు సరిరాడు. మీరు చేయగల కొన్ని పనులు ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదు’ అన్నాడు. తనను దేవుడికన్నా గొప్పవాడిగా బీర్బల్‌ పొగుడుతుంటే చాలా ఆనందం వేసింది. కానీ తాను ఏ విషయంలో దేవుడికన్నా గొప్పవాణ్నో తెలుసుకోవాలని అక్బర్‌కు అనిపించింది. కానీ నేరుగా అడగడం తన హోదాకు తగదు అనుకున్నాడు. అందుకే... ‘బీర్బల్‌! నీ మాటలను నేను ఒప్పుకుంటున్నా. అయితే, నేను ఏ విషయంలో భగవంతుడి కన్నా గొప్పవాణ్నో... పాపం, ఈ సభలో ఉన్నవాళ్లకు తెలియదు కదా. వాళ్ల కోసం కాస్త చెబుతావా?’ అన్నాడు అక్బర్‌. ‘అలాగే... తప్పకుండా జహాపనా! ఈ సువిశాల ప్రపంచం అంతా దేవుడిదే! అలాగే తమకున్న సామ్రాజ్యమంతా తమదే. మీకు ఎవరి మీదనైనా కోపం వస్తే, వారిని మీ రాజ్యాన్ని విడిచి ఎక్కడికైనా పొమ్మని శాసించగలరు. కానీ ఇది దేవుడికి సాధ్యం కాదు. ఈ జగత్తు అంతా ఆయనదే కదా... ఆయనకు ఎవరి మీదనైనా కోపం వస్తే వారిని వేరే చోటుకు ఎక్కడికని పొమ్మనగలడు. ‘మీరు చేయగల ఈ పని దేవుడు చేయలేడు జహాపనా!’ అని చెప్పాడు బీర్బల్‌. తాను ప్రతి చిన్న నేరానికీ దేశబహిష్కరణ శిక్ష విధిస్తున్న విషయాన్ని బీర్బల్‌ చెప్పకనే చెప్పాడని అక్బర్‌కు అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా అప్పటికి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నుంచీ- ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేయడం మానుకున్నాడు.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని