సిసింద్రీ

సిసింద్రీ

Published : 15 Oct 2022 23:25 IST

సిసింద్రీ

శెభాష్‌ రితికా..!

నేస్తాలూ.. మనకు అంతరిక్షమన్నా, దానికి సంబంధించిన ప్రయోగాలన్నా బోలెడు ఆసక్తి కదూ! ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రితికా ధ్రువ్‌కు కూడా చిన్నప్పటి నుంచి సైన్స్‌ అన్నా, రాకెట్‌ ప్రయోగాలన్నా చాలా ఇష్టమట. ఆ ఇష్టమే పదకొండో తరగతి చదువుతున్న ఈ అక్కకు అరుదైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘నాసా’ చేపట్టిన ‘సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టు’లో భాగంగా ‘ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ క్యాంపెయిన్‌’కు రితికా ఎంపికైంది. ఇస్రోతో కలిసి నాసా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురికి అవకాశం దక్కింది. వారిలో రితికా ఒకరు. సైన్స్‌ మీద ఆసక్తితో పాఠశాలలో ఉన్నప్పటి నుంచే వివిధ క్విజ్‌ పోటీలకు హాజరయ్యేదట. చిన్నారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నాసా చేపట్టిన ఈ ‘ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ క్యాంపెయిన్‌’కు నాసా దరఖాస్తులను ఆహ్వానించడంతో తానూ పేరు నమోదు చేసుకుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించాక, ఐఐటీ-భిలాయ్‌లో ఓ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చిందట. అక్కడా మంచి ప్రతిభ చూపడంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ఇస్రోలో తొలి దశ శిక్షణకు ఎంపికైంది. అది పూర్తయ్యాక.. బెంగళూరులోని ఇస్రో క్యాంపస్‌లో మలి విడత శిక్షణకు హాజరుకానుంది. మారుమూల ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన రితికాకు అభినందనలు తెలియచేద్దామా.


కోతి చేతిలో అద్దం!

అడవిలోని ఓ చెట్టుపైన కోతితోపాటు కాకి, గుడ్లగూబ నివసించేవి. అవి మూడూ స్నేహంగా ఉండేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చుకొని.. రోజూ తన ముఖం చూసుకొని మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన రామచిలక, నెమలి, పిచ్చుక, పావురం రోజూ కోతి దగ్గరకు రావడం.. అరటి పండ్లు ఇచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. అది గమనించిన కాకి, గుడ్లగూబ.. ‘మిత్రమా! పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు. నీ దగ్గర అద్దం ఉన్నంతవరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు’ అని హితవు చెప్పాయి. ‘అందరూ నా దగ్గరకే వస్తున్నారని మీకు కుళ్లు. నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ సలహాలు ఇవ్వనవసరం లేదు’ అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు కాకి, గుడ్లగూబ చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో గాలిదుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కిందపడి పగిలిపోయింది. అది చూసిన కోతి భోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న పక్షులు.. క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. అరటి పండ్లు తెచ్చి ఇవ్వడమూ ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్క పక్షీ పలకరించడానికి కూడా రాలేదు. అనారోగ్యంతో కోతి ఆహార సేకరణకు కూడా వెళ్లలేకపోయింది. కోతి బాధను చూసిన కాకి.. ఆహారంతోపాటు కుందేలును అడిగి మూలికలూ తీసుకొచ్చింది. రాత్రుళ్లు గుడ్లగూబే కోతి బాగోగులు చూడసాగింది. కొద్దిరోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. ‘మిత్రులారా.. నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు, అది లేదని తెలిశాక.. నా దగ్గరకి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గర చేరే వారు నిజమైన స్నేహితులుకారని తెలుసుకోలేకపోయాను. మీ మాటలను పెడచెవిన పెట్టాను. నన్ను మన్నించండి’ అంటూ క్షమాపణ కోరింది కోతి.

- మొర్రి గోపి









గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..