సమయస్ఫూర్తి!

ఒక రోజు అక్బర్‌ తన సభలో ఉన్నవారిని ఉద్దేశించి.. ‘నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి టక్కున జవాబిచ్చిన వారికి మంచి బహుమతి ఉంటుంది’ అని, ఇలా ప్రశ్నించాడు... ‘నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది.

Published : 29 Oct 2022 22:54 IST

సమయస్ఫూర్తి!

ఒక రోజు అక్బర్‌ తన సభలో ఉన్నవారిని ఉద్దేశించి.. ‘నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి టక్కున జవాబిచ్చిన వారికి మంచి బహుమతి ఉంటుంది’ అని, ఇలా ప్రశ్నించాడు... ‘నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది. కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్క కూడా అంటుకోలేదు, ఇదెలా సాధ్యం?’ అంటూ చేతి కట్టును చూపించాడు. అందరూ ఎంత ఆలోచించినా జవాబు చెప్పలేకపోయారు. అదే సమయంలో బీర్బల్‌ రాజదర్బార్‌లోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకొని.. ‘జహాపనా! తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. అందుకే సాధ్యం కాలేదు’ అన్నాడు. ‘చాలా చక్కగా సరైన సమాధానమిచ్చారు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడిచేతి వేలికి గాయమైంది. నా ఎడమ చేతితో తాకినా రక్తమంటుకోలేదు. మరి దీనికి కారణమేమై ఉంటుంది’ అని ప్రశ్నించాడు. వెంటనే బీర్బల్‌ ‘మరేం లేదు, జహాపనా! నిన్న రాత్రి తమరికి కలలో మీ కుడిచేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకువ వచ్చి ఎడమచేతితో తాకి చూసుకుని ఉంటారు, కలలో కదా గాయమైంది అందుకే ఎడమచేతికి రక్తమంటుకోలేదు’ అన్నాడు. ‘శెభాష్‌! బీర్బల్‌, ఇక చివరి ప్రశ్న. నా ఎడమచేతికి గాయమైంది. కలలో అయింది కాదు, అయినప్పటికీ కుడి చేతితో తాకినా రక్తపు మరకలంటుకోలేదు. మరి దీనికి కారణమేమై ఉంటుంది చెప్పు’ అన్నాడు. ‘ఏముంది జహాపనా! గాయంతో రక్తమోడుతున్న ఎడమ చేతితో ఉన్న తమరి చిత్రం అయిఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలంటుకోవు’ అని తడుముకోకుండా చెప్పేసరికి సింహాసనంపై నుంచి లేచివచ్చి బీర్బల్‌ను సంతోషంతో కౌగిలించుకున్నాడు. అతని సమయస్ఫూర్తికీ, చమత్కారానికీ మెచ్చి తగిన బహుమతి ఇచ్చి పంపించాడు.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


వయసు చిన్న... ప్రతిభ మిన్న!

కేవలం పద్నాలుగేళ్ల వయసు. కానీ ఒకేసారి రెండు పీహెచ్‌డీలు. అదీ అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల నుంచి. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గీత్‌ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి పరాగ్‌, తల్లి కాజల్‌ ఇద్దరూ వైద్యులే. వీళ్లిద్దరూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. వీళ్లిద్దరి ప్రభావం గీత్‌పైన పడింది. దీంతో యోగాపైన దృష్టి పెట్టింది. తాను నేర్చుకోవడమే కాకుండా చాలా మందికి శిక్షణ కూడా ఇస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలలు మూతపడడంతో పిల్లల్లో ఫోన్‌ వాడకం మితిమీరిపోయింది. ఇలా అధికంగా ఫోన్‌ వినియోగంతో పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని గ్రహించింది గీత్‌. అంతటితో ఆగిపోకుండా.. ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు వాటిని పంపించింది. వీటిని పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు గీత్‌కు డాక్టరేట్‌ను ప్రకటించాయి. ఇంత చిన్న వయసులోనే ఏకంగా రెండు పీహెచ్‌డీలు సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ!



జవాబులు

తేడాలేంటి?: 1. తలుపు మీదనున్న బొమ్మ తోక 2. మేఘం 3. కుర్చీ 4. బాతు బొమ్మ రంగు 5. ఎయిమ్‌ బోర్డుపైన రింగు 6. బాబు చొక్కాపైన గీతలు 7. నిల్చున్న బాబు నిక్కరుకు జేబు 8. పాత చేతిలో తుపాకి.

కనిపెట్టగలరా?: సూర్యకు ఆరు, ఆర్యకు అయిదు

అది ఏది?: C

పోలికలేంటి?: అడ్డం: చిచ్చుబుడ్డి, దీపం, బ్రకోలి; నిలువు: మిఠాయిలు, డైస్‌, కళ్లద్దాలు; ఐమూలగా: గిఫ్ట్‌ బాక్సు, కిటికీ.

జత లేనిది ఏది?: ప్యాంటు ధరించిన పాప.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..