సిసింద్రీ

పట్టుమని పదేళ్లైనా నిండకుండానే... ఓ బుడత పేటెంట్‌ దక్కించుకుంది. మనదేశంలో అతిచిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన రికార్డునూ తన సొంతం చేసుకుంది.

Published : 05 Mar 2023 00:03 IST

సిసింద్రీ

పిట్టకొంచెం.. పేటెంట్‌ ఘనం!

పట్టుమని పదేళ్లైనా నిండకుండానే... ఓ బుడత పేటెంట్‌ దక్కించుకుంది. మనదేశంలో అతిచిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన రికార్డునూ తన సొంతం చేసుకుంది. తమిళనాడులోని శివకాశికి చెందిన వైశాలిని 2014లో పుట్టింది. వరదల సమయంలో ప్రభావితం కాని ఇంటి నమూనాను రూపొందించింది. దీనికి గాను 2020లో పేటెంట్‌ను పొందింది. ఈ ఇల్లు వరదనీటిలో మునగదు. నీటిలో తేలియాడుతుంది. నీటిమట్టం ఎంతపెరిగితే ఇల్లు అంత పైకి తేలుతుంది. అంటే వరదల వల్ల ప్రాణ, ధన నష్టం ఉండదు. ఈ తేలియాడే ఇంట్లో ఆక్సిజన్‌ సిలిండర్‌, నిల్వ చేసిన ఆహారపదార్థాలు, నీరు, ప్రథమ చికిత్స పెట్టె కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో వీటిని ఉపయోగించుకొని ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇంత చిన్నవయసులోనే ఈ ఆవిష్కరణ చేసిన చిన్నారి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. అంతేకాదు... ఏకంగా ప్రధాని నుంచీ ప్రశంసలు అందుకుంది.


మేకల కాపరి తెలివి!

అనగనగా ఓ ఊరు. అందులో సోమయ్య అనే మేకల కాపరి ఉండేవాడు. అతడు ఒక రోజు నిద్రలేవగానే, ఎప్పటిలానే మేకలను మేతకు తీసుకువెళ్లబోయాడు. కానీ మందలో ఒక మేక తగ్గింది. నిన్న సాయంత్రం చూసినప్పుడు లెక్క సరిపోయింది. తెల్లారేసరికి మాత్రం ఒకటి తగ్గింది. దీంతో సోమయ్య చాలా ఆందోళన చెందాడు. చుట్టుపక్కల అంతా వెతికాడు. ఎక్కడా తన మేక కనిపించలేదు. ఇది కచ్చితంగా ఎవరో దొంగ చేసిన పనే అనుకున్నాడు. మర్నాడు పొరుగూరులో జరిగే మేకల సంతకు వెళ్తే తన మేక అక్కడ కనిపించవచ్చని అనుకున్నాడు. సోమయ్య తెల్లవారుజామునే మేకల సంతకు బయలుదేరాడు. అక్కడ ఒక వ్యక్తి తన మేకను అమ్మడం గమనించాడు. వెంటనే అతడితో... ‘ఈ మేక నాది. నీ దగ్గరకు ఎలా వచ్చింది?’ అన్నాడు. బదులుగా ఆ వ్యక్తి.. ‘ఈ మేక నీదా... భలేవాడివే. ఇది నా మేక. నేను దీన్ని మూడు సంవత్సరాలుగా పెంచుతున్నా తెలుసా’ అని దబాయించాడు. ఇంతలో జనం పోగయ్యారు. కాసేపటికి రాజభటులు కూడా వచ్చారు. అప్పుడు సోమయ్య... ‘అవునా... ఇది నిజంగా నీదా?. అయితే ఈ మేకకు ఓ చెవి వినిపించదు. అది ఏ చెవో వెంటనే చెప్పు’ అన్నాడు. మేకలు అమ్మే వ్యక్తి కాసేపు తటపటాయించి ‘కుడి చెవి’ అన్నాడు. ‘అవునా.. సరిగా ఆలోచించి చెప్పు’ అన్నాడు సోమయ్య. మేకలు అమ్మే వ్యక్తికి చెమటలు పట్టాయి. ‘వెంటనే కుడి కాదు... ఎడమ చెవి’ అని మాటమార్చాడు. ‘తప్పు.. దీనికి రెండు చెవులూ వినిపించవు’ అన్నాడు సోమయ్య. ‘అవునవును రెండు చెవులూ వినిపించవు. కంగార్లో మర్చిపోయా’ అన్నాడు మేకల వ్యాపారి. ‘నువ్వు తప్పు చెబుతున్నావు. ఈ మేకకు ఏ లోపమూ లేదు. దీనికి రెండు చెవులూ వినిపిస్తాయి’ అన్నాడు సోమయ్య. మేకల వ్యాపారికి ఏం మాట్లాడాలో అర్థంకాక తేలుకుట్టిన దొంగలా ఉండిపోయాడు. జనాలందరూ దాడి చేయడానికి చేతులు పైకెత్తడంతో మేకల వ్యాపారి పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజభటులు పట్టుకుని చెరసాలలో వేశారు. మేకను సోమయ్యకు అప్పగించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..