వరాల తల్లికి... విందు!

వరలక్ష్మీ వ్రతం రోజున... పులిహోర, పాయసం లాంటివి ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆ రెండింటితోపాటూ ఇంకేం చేసుకోవచ్చని ఆలోచిస్తుంటే... వీటిని చూసేయండోసారి.  

Updated : 31 Jul 2022 09:50 IST

వరాల తల్లికి... విందు!

వరలక్ష్మీ వ్రతం రోజున... పులిహోర, పాయసం లాంటివి ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆ రెండింటితోపాటూ ఇంకేం చేసుకోవచ్చని ఆలోచిస్తుంటే... వీటిని చూసేయండోసారి.  


రవ్వ గులాబ్‌జామూన్‌

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, నెయ్యి: రెండు చెంచాలు, పాలు: ఒకటిన్నర కప్పులు, పాలపొడి: రెండు చెంచాలు, చక్కెర: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, వంటసోడా: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బొంబాయిరవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. తరవాత అందులో పాలు పోసి కలిపి... రవ్వ ఉడికిందనుకున్నాక దింపేయాలి. మరో గిన్నెలో చక్కెర, పావుకప్పు నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి... పాకం కాస్త చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు రవ్వలో పాలపొడి, రెండు చెంచాల పాలు, వంటసోడా వేసి బాగా కలిపితే పిండిముద్దలా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తరువాత చక్కెరపాకంలో వేయాలి.


కొబ్బరిపాల పొంగలి

కావలసినవి: బియ్యం: అరకప్పు, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు, బెల్లం తరుగు: ముప్పావుకప్పు, పెసరపప్పు: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, పాలు: అరకప్పు, చిక్కని కొబ్బరిపాలు: పావుకప్పు, జీడిపప్పు-కిస్‌మిస్‌ పలుకులు: పావుకప్పు.

తయారీ విధానం: పెసరపప్పు, బియ్యాన్ని కడిగి కుక్కర్‌లో వేసి...ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. మూడు కూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి. తరవాత ఇందులో బెల్లం తరుగు, కొబ్బరితురుము, యాలకులపొడి వేసి, పాలు పోసి ఓసారి కలిపి మళ్లీ స్టౌమీద పెట్టాలి. పొంగలి దగ్గరకు అవుతున్నప్పుడు కొబ్బరిపాలు వేసి మరోసారి కలిపి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఇప్పుడు బాణలిని స్టౌమీద పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు-కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించి... పొంగలిలో వేసి కలపాలి.


బియ్యప్పిండి గారె

కావలసినవి: బియ్యపురవ్వ: కప్పు, బియ్యప్పిండి: కప్పు, నీళ్లు: రెండు కప్పులు, పచ్చిమిర్చి: మూడు, సన్నగా తరిగిన అల్లం: చెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: రెండు పెద్ద చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. అందులో బియ్యప్పిండి, బియ్యపురవ్వ వేసి బాగా కలిపి స్టౌని కట్టేయాలి. ఆ కడాయిని స్టౌమీదే ఉంచి... పిండిని గరిటెతో మరోసారి కలిపి మూత పెట్టాలి. ఈ మిశ్రమం చల్లారుతున్నప్పుడు... తడి చేత్తో కొద్దికొద్దిగా పిండిని తీసుకుని గారెల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  


కొబ్బరి పూర్ణంబూరెలు

కావలసినవి: మినప్పప్పు: అరకప్పు, బియ్యం: కప్పు, తాజా కొబ్బరి తురుము: మూడు కప్పులు, బెల్లం తరుగు: ఒకటిన్నర కప్పు, యాలకులపొడి: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: అరచెంచా, నెయ్యి: రెండు చెంచాలు.  

తయారీ విధానం: బియ్యం, మినప్పప్పును ఓ గిన్నెలో వేసుకుని ఆరేడు గంటల ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఈ రెండింటినీ మిక్సీలో వేసి చిక్కని దోశపిండిలా రుబ్బుకుని ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి బెల్లం తరుగు, కొబ్బరి తురుము వేయాలి. బెల్లం పూర్తిగా కరిగి ఈ మిశ్రమం దగ్గరకు అయ్యాక యాలకులపొడి వేసి దింపేయాలి. చేతులకు నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక్కో ఉండను దోశపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


చిట్కా

పాయసం పల్చగా అయ్యిందా...

పండుగల సమయంలో వండే పదార్థాల తయారీలో జరిగే కొన్ని పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవచ్చు అంటే...

* వడల పిండిలో కొద్దిగా మొక్కజొన్నపిండి/బియ్యప్పిండిని కలిపితే అవి ఎక్కువసేపు కరకరలాడతాయి.

* బూరెలకోసం చేసిన పూర్ణం పలుచగా అయ్యిందనిపిస్తే... పూర్ణం మోతాదును బట్టి... కొద్దిగా బొంబాయిరవ్వ లేదా సెనగపిండి కలపొచ్చు.  

* పాయసం మరీ పల్చగా అయ్యిందనిపించినా... తీపి మోతాదు ఎక్కువగా ఉందనిపించినా అందులో మొక్కజొన్నపిండిని కలపొచ్చు. చెంచా మొక్కజొన్నపిండిలో పాలు పోసి... చిక్కని పిండిలా చేసుకుని ఆ రువాత పాయసంలో వేసి స్టౌమీద పెట్టి... కలుపుతూ ఉంటే పాయసం చిక్కగా అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు