హారమూ వడ్డాణమూ... అన్నీ కుట్టినవే!

పండుగ రోజు పాపాయికి చక్కటి పట్టులంగా వేసి ఊరుకుంటారా... చిన్నవోపెద్దవో దానికి సరిపోయే నగానట్రా కూడా వేసేస్తారు... కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు మరి... ఎందుకంటే... పెద్దవాళ్లలా పిల్లలకూ నగలతో కుట్టిన బ్లౌజులు వెరైటీ డిజైన్లలో వచ్చేస్తున్నాయి!

Published : 14 Jan 2023 23:40 IST

హారమూ వడ్డాణమూ... అన్నీ కుట్టినవే!

పండుగ రోజు పాపాయికి చక్కటి పట్టులంగా వేసి ఊరుకుంటారా... చిన్నవోపెద్దవో దానికి సరిపోయే నగానట్రా కూడా వేసేస్తారు... కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు మరి... ఎందుకంటే... పెద్దవాళ్లలా పిల్లలకూ నగలతో కుట్టిన బ్లౌజులు వెరైటీ డిజైన్లలో వచ్చేస్తున్నాయి!

ఏ ఫంక్షన్‌కి ఎలా రెడీ అయినా పెళ్లిళ్లూ, పేరంటాలూ, పండుగలప్పుడు మాత్రం చాలావరకూ ట్రెండీ డ్రెస్సుల్ని కాస్త పక్కనపెట్టేసి, మన సంప్రదాయ దుస్తులకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అమ్మలు ఎంచక్కా పట్టుచీరల్ని చుట్టి మెరిసిపోతే, పాపాయిలు పట్టుపావడాలతో అందంగా ముస్తాబవుతారు. వాటిల్లో చక్కటి రంగుల కలబోతతో, జానెడంత అంచులున్న పట్టుచీరలూ, పట్టు లంగాల ఫ్యాషనే చాలా ఏళ్లు నడిచింది. తర్వాత్తర్వాత చీర లుక్కుకు మించి మెరిపించే ఎంబ్రాయిడరీ రంగంలోకి దిగిపోయాక... ఇక హవా అంతా జాకెట్‌దే అయిపోయింది. అందుకే అద్దాలూ, ప్యాచ్‌వర్కులూ, బంగారుతీగల ఎంబ్రాయిడరీలు ఎన్నెన్నో డిజైన్లతో జాకెట్లపైకి చేరిపోయాయి. ఇలాంటి ఎన్ని మెరుపులొచ్చినా మగువ మనసు ఇంకా కొత్తదనాన్నే కదా కోరుకుంటుంది. అందుకే ఫ్యాషన్‌ డిజైనర్లు ఎప్పటికప్పుడు సరికొత్త వర్కు బ్లౌజుల్ని తీసుకొస్తుంటారు. అందులో భాగంగానే కొంతకాలం కిందట కాసుల బిళ్లలూ, ముత్యాల హారాలూ, మువ్వల నెక్లెసులూ... ఇలా ధగధగ మెరిసే బంగారు నగల డిజైన్లూ జాకెట్ల మీదకు వెళ్లిపోయి ‘జ్యువెలరీ ఎంబ్రాయిడరీ బ్లౌజులు’ వచ్చాయి. అసలు నగల మెరుపుల్ని మైమరిపిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అవే జ్యువెలరీ అందాలు పిల్లల బ్లౌజుల మీదా కనిపించేస్తున్నాయి.


నిజానికి దుస్తులకు తగ్గ నగలతో ముస్తాబు చేస్తే పిల్లలెవరైనా ఎంతో అందంగా ఉంటారు. కానీ విలువైన నగలతో వాళ్లను అలంకరించాలంటే కాస్త భయమే. ఎక్కడైనా పడిపోతాయనో, వాటి వల్ల పిల్లలకు ప్రమాదమనో కంగారుపడతాం. అలా అనీ ఇమిటేషన్‌ జ్యువెలరీ వేద్దామంటే కొంతమంది పిల్లల ఒంటికి పడకపోవచ్చు. అసలు ఇవన్నీ సరే అనుకుంటే కొందరు చిన్నారులు... నగలు వేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. వీటన్నింటికీ ఈ నగల బ్లౌజులతో ఇప్పుడు మంచి పరిష్కారం చూపించేయొచ్చు.

చేతులకు అరవంకీల దగ్గర్నుంచి నడుముకు వడ్డాణం వరకూ బ్లౌజు మీద ఎంబ్రాయిడరీ వర్కుతో కావాల్సిన నగలు పెట్టించుకోవచ్చు. పట్టుపావడా రంగుల్నిబట్టి దానికి నప్పే ముత్యాలూ, కుందన్లూ, బంగారు పూసలతో రకరకాల నెక్లెసుల్నీ, హారాల్నీ డిజైన్‌ చేయించుకోవచ్చు. పెద్దవాళ్ల జాకెట్ల అందాన్ని మరింత పెంచడానికి మాత్రమే ఈ నగల ఎంబ్రాయిడరీ వాటిపైకి చేరిందేమో కానీ పిల్లల విషయంలో ఈ బ్లౌజుకు అదనపు అందం తేవడంతో పాటూ ఇటు ప్రత్యేకంగా నగలు పెట్టాల్సిన అవసరమే లేకుండా చేసిందీ ఎంబ్రాయిడరీ. హఠాత్తుగా చూస్తే అచ్చంగా నగలే వేశారా అన్నట్టు కనిపించేలా ఉండే ఈ జ్యువెలరీ వర్కు ట్రెండు
మీకూ నచ్చిందా... అయితే ఫాలో అయిపోండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు