Published : 29 Oct 2022 23:45 IST

ఈ దిండ్లతో ఆడుకోవచ్చు... పడుకోవచ్చు..!

దిండుతో ఏం చేస్తాం... ‘ఏముందీ తలకింద పెట్టుకుంటాం... కాళ్ల నొప్పులుంటే పాదాల అడుగున వేసుకుంటాం అంతేగా’... అంతేకాదు... ఈ దిండ్లు తలకింద పెట్టుకోవడానికీ నచ్చిన ఆకారంలో పేర్చుకుని పిల్లలు హాయిగా ఆడుకోవడానికీ ఉపయోగపడతాయి తెలుసా. మెత్తగా ఉండే దిండ్లను ఓ వైపు పేరుస్తుంటే మరోవైపు పడిపోతుంటాయిగా... అంటారేమో... ఈ ‘మ్యాగ్నెటిక్‌ పిల్లో ఫోర్ట్‌’ దిండ్లతో అలాంటి సమస్యేమీ ఉండదు. ఎందుకంటే... వీటిల్లో అయస్కాంతం ఉంటుంది మరి... 

చిన్నారులకు ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు. నిజమైన ఇల్లు బొమ్మ కావాలనీ, జారుడుబల్ల కొనమనీ, ఎవరికీ కనిపించకుండా ఆడుకునేందుకు గోడలాంటిది ఏర్పాటు చేయమనీ.... ఇలా ఒకటేమిటి, వాళ్లకు ఆ క్షణానికి ఏది కావాలనిపిస్తే అది అడిగేస్తుంటారు. అన్నీ కాకపోయినా కనీసం ఒకటిరెండు అయినా కొనిచ్చి పిల్లల సరదా తీర్చాలని పెద్దవాళ్లకు ఉన్నా.. అవేమో బోలెడు ఖరీదులో ఉంటాయి. పైగా నాల్రోజులయ్యాక వాళ్లకు అవి బోర్‌కొడితే వాటిని ఏం చేయాలో తెలియదు. ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది

‘మ్యాగ్నెటిక్‌ పిల్లో ఫోర్ట్‌’. ఇది కూడా దిండ్ల సెట్టే కానీ.. వీటితో పిల్లలు తమకు నచ్చిన ఆకారాన్ని పేర్చుకుంటూ అవన్నీ ఎక్కడ పడిపోతాయోననే భయం లేకుండా ఎంతసేపైనా ఆడుకోవచ్చు. చెప్పాలంటే... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పిల్లల దిండ్లు ఎన్నో డిజైన్లలో వాళ్లు కోరుకున్నట్లుగా వచ్చేస్తున్నాయి. వాటిలో చీకట్లో వెలిగేవీ, పూలు- జంతువులు- వాహనాలు- ఆహారపదార్థాల ఆకారాల్లో ఉన్నవీ, వాళ్లెంతో ఇష్టపడే కార్టూన్‌ పాత్రలు, అక్షరాలూ-కథలూ నేర్పించేవీ, దిండులోనే దుప్పటి ఉన్నవీ.... ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వెరైటీల్లో దొరుకుతున్నాయి. ఎన్ని ఉన్నా వాటితో సరదాగా ఆడుకోగలరే తప్ప... లెగోల్లా వాళ్లు ఇష్టపడే ఆకారాన్ని మాత్రం చేసుకోలేరు. ఈ దిండ్లు ఆ లోటును తీర్చేస్తాయన్నమాట. 

ఎలా పేర్చుకోవచ్చు...

పేరుకు తగినట్లుగానే..ఈ ‘మ్యాగ్నెటిక్‌ పిల్లో ఫోర్ట్‌’లో అయస్కాంతం ఉంటుంది. ఇవి ఓ సెట్‌ రూపంలో రకరకాల ఆకృతుల్లో వస్తాయి. ఫోమ్‌తో తయారైన ఈ దిండ్ల కవర్ల అంచులకే అయస్కాంతం ఉంటుంది. వీటితో కోరుకున్న ఆకారంలో చిన్న ఇల్లు, గోడ, పరుపు, సోఫా, జారుడుబల్ల, టేబుల్‌, మెట్లు... ఇలా తోచింది చేసుకోవచ్చు.ఆడుకోవడం అయిపోయాక, అన్నింటినీ వేరుచేసి ఒకదానిమీద మరొకటి సర్దేసుకుని ఓ మూల పెట్టేసుకుంటే చోటు సమస్య కూడా ఉండదు. ఒకవేళ ఇవి కాస్త మురికిగా ఉన్నాయనిపిస్తే ఆ కవర్లను విడిగా తీసి శుభ్రంగా ఉతికే విధంగా డిజైన్‌ చేశారు తయారీదారులు. అంతేకాదండోయ్‌... ఈ దిండ్లు గుండ్రం, త్రికోణం, చతురస్రం, దీర్ఘచతురస్రం... ఇలా రకరకాల షేపుల్లో దొరుకుతాయి. వాటి కవర్లు కూడా నీలం, ఊదా, పసుపు, ఆకుపచ్చ... అంటూ బోలెడు రంగుల్లో ఉంటాయి. ఆలస్యమెందుకు మరి.. ఇంటినిండా బొమ్మల్ని నింపేసి... పిల్లలు పెద్దయ్యాక వాటిని ఏం చేయాలో తెలియక, ఎవరికీ ఇవ్వలేక వృథాగా ఓ మూలన పడేసే బదులు ఇలాంటి దిండ్లను కొనుక్కుంటే సరిపోతుంది. పిల్లలు ఆడుకోవడం మానేశాక వాటిని దిండ్లు రూపంలో హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఐడియా బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు