సిల్లీపాయింట్‌

ఇంగ్లిషు మాట్లాడే పాశ్చాత్య దేశాలవాళ్ళెవరూ- తమ బంధువుల్ని తప్ప ఇంకెవర్నీ అంకుల్‌, ఆంటీఅని పిలవరు!

Published : 04 Feb 2024 02:29 IST

ఇంగ్లిషు మాట్లాడే పాశ్చాత్య దేశాలవాళ్ళెవరూ- తమ బంధువుల్ని తప్ప ఇంకెవర్నీ అంకుల్‌, ఆంటీఅని పిలవరు!

  • మధ్య నిర్మించే చాలా ఆపరేషన్‌ థియేటర్‌లలో మ్యూజిక్‌ సిస్టమ్‌ తప్పనిసరిగా ఉంటోందట. 80 శాతం సర్జన్‌లు సంగీతం వింటూ శస్త్రచికిత్స చేస్తుండటమే ఇందుకు కారణమంటున్నారు.
  • కాకులు తమలోతాము ఆటలపోటీలు పెట్టుకోగలవు. మరే పక్షిజాతికీ ఈ ప్రత్యేకత లేదు.
  • కుక్కల కాళ్ళలో కూడా వాసనని పసిగట్టే గ్రంథులుంటాయి.
  • సింగపూర్‌లో 1992 నుంచి బబుల్‌గమ్‌ తినడంపైన నిషేధం ఉంది. అతిక్రమించినవాళ్ళకి సుమారు 80 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు! 2014లో ఈ కఠినశిక్షని కాస్త సడలించి... వైద్యుల సూచనతో రోగులు మాత్రం తినొచ్చంటూ చిన్న మినహాయింపునిచ్చారు.
  • సమావో దేశంలో... భార్య పుట్టినరోజుని మరిచిపోవడం పెద్ద నేరం. భర్త తన బర్త్‌డే మరచిపోయాడని భార్య పోలీసులకి మొదటి సారి ఫిర్యాదుచేస్తే అతణ్ణి హెచ్చరించి పంపిస్తారు. రెండోసారీ ఇలాంటి ఫిర్యాదు వస్తే భారీ జరిమానా లేదా ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తారు.



ఎంత అందంగా ఉన్నా... అమ్మాయిల్లో కేవలం రెండు శాతం మాత్రమే తాము అందగత్తెలమని చెప్పుకుంటారట.

  •  ఇప్పుడు ఏ నోట విన్నా మైదా ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు కానీ... ఒకప్పటి ఇంగ్లండులో దీన్ని ఓ స్టేటస్‌ సింబల్‌గా చూసేవారు. సంపన్నులు మాత్రమే కొనగలిగేవారట!
  • 1939 నుంచి 1988 దాకా అమెరికాలో పాట్సీ అవార్డులని ఇస్తుండేవారు. ఎవరికనుకున్నారు... సినిమాల్లో ఉత్తమ నటన కనబరచిన పక్షులూ, కుక్కలూ, పిల్లులూ, గుర్రాలకి!
  • రెండో ప్రపంచయుద్ధానికి కాస్త ముందుదాకా ఆస్ట్రేలియాలో క్రికెట్‌ని ఓవర్‌కి ఆరుకి బదులు... ఎనిమిది బంతుల వంతున ఆడుతుండేవారు!
  • అవకాడోలో పెర్సిన్‌ అనే రసాయనం ఉంటుంది. అది మనకి మంచిదేకానీ... పక్షులకి మాత్రం విషంతో సమానం.


ఆపిల్‌ కంపెనీ... 1986లో బట్టల బిజినెస్‌లోకి కూడా దిగింది. కొన్నాళ్ళు టీషర్టులూ, జీన్స్‌ప్యాంటులూ అమ్మి, మళ్ళీ ఎందుకో అర్థాంతరంగా ఆపేసింది.

కేరళలో ఏనుగులకన్నా... ఏనుగుల విగ్రహాలు ఎక్కువ! ఆలయాల్లోనూ, ఇంట్లోనూ పెంచుకునే ఏనుగు చనిపోయాక  వాటి విగ్రహాలని తయారు చేయించి అదే ప్రాంగణంలో పెట్టుకోవడం అక్కడ ఆచారం. ఇందుకోసం ప్రత్యేకంగా శిల్పులూ ఉంటారక్కడ.

 భూమిలో ఇప్పటిదాకా మనుషులు సహా 15 శాతం జీవాలనే శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగతా 85 శాతం జీవరాశులకింకా పేర్లు పెట్టలేదు!


‘చందమామ’ పత్రిక గుర్తుంది కదా! దానికి 1960ల దాకా ‘పిల్లల మాసపత్రిక’ అన్న ట్యాగ్‌లైన్‌ ఉండేది. ‘అదేమిటీ! పిల్లలతోపాటూ దాన్ని మేమూ చదువుతున్నాం కదా!’ అంటూ పెద్దవాళ్ళూ, నాటి తెలుగు రచయితలూ పోరాడి మరీ ఆ ట్యాగ్‌లైన్‌ తీసేయించారు.

మొఘల్‌ చక్రవర్తులందరికీ పరోటా చాలా ఇష్టమైన వంటకమట! ముఖ్యంగా ఢాకాకి మాత్రమే పరిమితమైన- పొరలుపొరలుగా సాగే పరోటాని వాళ్ళే భారత ఉపఖండం మొత్తానికీ తీసుకెళ్ళారట.

రోజులో మనం 20 వేల సార్లు కళ్లార్పుతాం..! ప్రతిసారీ 0.1 నుంచి 0.4 సెకన్లు ఇందుకోసం ఖర్చవుతాయి. అలా మనం మెలకువతో ఉన్న సమయంలో పదిశాతం కళ్లార్పడానికే కేటాయిస్తాం.

సింహాల్లో- రెండుమూడు కుటుంబాలు కలిసే జీవిస్తాయి. కూనలు కూడా ఒకే తల్లిదగ్గర కాకుండా చుట్టూ ఉన్న ఆడ సింహాలన్నిటి దగ్గరా పాలుతాగి ఎదుగుతాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..