చేదునిజాలు

వ్యక్తి స్థాయిలోనూ, వ్యవస్థాపరంగానూ సంస్కారాన్నీ అభ్యుదయాన్నీ ఆకాంక్షించే 22 రచనల సమాహారమిది.

Updated : 04 Feb 2024 05:45 IST

వ్యక్తి స్థాయిలోనూ, వ్యవస్థాపరంగానూ సంస్కారాన్నీ అభ్యుదయాన్నీ ఆకాంక్షించే 22 రచనల సమాహారమిది. చేదు నిజాలకు ఆశావాదాన్నీ కల్పనల తీపిపూతనూ మిళితం చేసిన కథలివి. స్వార్థం చూసుకోకుండా నలుగురికీ సాయపడటంలో సమయం వెచ్చించేవారు సన్నిహితుల దృష్టిలో నిరర్థక జీవులుగా మిగలడం సహజం. కాలక్రమంలో వారే సమాజంలో బలీయమైన స్థానాలకు చేరుకోగలిగితే పర్యవసానాలు ఎంత విస్మయకరంగా ఉంటాయో ‘వేస్ట్‌ ఫెలో’, ‘రఘుపతి రాఘవ రాజారాం’ చెపుతాయి. వ్యవసాయ సంక్షోభాన్నీ రైతుల ఆత్మహత్యల్నీ నివారించేందుకు ఇద్దరు వ్యక్తులు సోషల్‌మీడియా ద్వారా తెచ్చిన కదలిక, సాగించిన కార్యాచరణ ‘సమాహారం’ ఇతివృత్తం. జనహితం కోసం పాటుపడేవారూ, డబ్బు కంటే బంధాలకు విలువనిచ్చే వ్యక్తులూ ఈ కథల్లో తారసపడతారు. అన్ని కథలూ సరళంగా, ఆసక్తికరమైన శైలిలో సాగుతాయి.

 సీహెచ్‌. వేణు

సమాహారం (కథలు)
రచన: శరత్‌ చంద్ర
పేజీలు: 293; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9848787284  


తనదాకా వస్తే...

మానసిక వైద్యురాలైన మనోజ్ఞ వివాహేతర సంబంధాలూ, బాల్యంలో లైంగిక హింసా లాంటి ఎన్ని సమస్యలనో ఓపిగ్గా విని సలహాలిచ్చేది. మందులతో సాంత్వన చేకూర్చేది. ఆఖరికి భర్తమీద అనుమానంగా ఉందని కూతురు చెబితే ‘నువ్వంటే ప్రేమలేనివాళ్లతో కలిసి ఉండక్కర్లేదు వదిలెయ్య’మని సలహా ఇచ్చింది. తండ్రి పట్ల అసంతృప్తితో రగిలిపోయే తల్లి ఆ కోపాన్ని తనమీద తీర్చుకుంటుంటే భరించలేక చచ్చిపోవాలనుకుని, స్నేహితురాలి కారణంగా జీవితం మీద ప్రేమ పెంచుకుని, తండ్రి అండతో చదువుకుని డాక్టరైన నేపథ్యం మనోజ్ఞది. అలాంటి మనోజ్ఞకు అచ్చం కూతురికి ఎదురైన సమస్యే ఎదురైంది. మరి ఆమెకు చెప్పిన సలహా తాను ఆచరించిందా... అన్నదే కథ.

 సుశీల  

మనోజ్ఞ (నవల), రచన: సలీం
పేజీలు: 239; వెల: రూ.200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు  


వందేళ్లనాటి వంద కథలు

ప్రేమ్‌చంద్‌ రచనలకు భారతీయ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. వందేళ్లనాటి ఈ కథలు సామాన్యుల బతుకుపోరాటాల్నీ, మానవ సంబంధాల్లోనీ సంక్లిష్టతల్నీ, నాటికీ నేటికీ సమాజంలో వచ్చిన మార్పుల్నీ కళ్లకు
కడతాయి. సంపన్నుడైన సేఠ్‌ ఒక అనాథ బాలికకు తండ్రిలా ప్రేమను పంచి, చదివించి కోడలిగా చేసుకుంటాడు. తర్వాత ఆమె తల్లిని ఇప్పుడిక నువ్వు పూర్తిగా నా కూతురివి అనడాన్ని చూస్తే ఆ మంచితనానికి పాఠకుల కళ్లు చెమరుస్తాయి. కార్యాలయాల్లో అవినీతి, రైతుల్ని వేధించే జమీందారులు, విదేశానికి వెళ్లి అక్కడ మరో పెళ్లి చేసుకోవడం...లాంటి సమస్యల్ని చర్చించే కథలతోపాటు ‘పెళ్లికి కారణాలు’ లాంటి సరదా కథలూ వీటిలో ఉన్నాయి.ఆయన రాసిన వంద కథలకు చక్కటి తెలుగు అనువాదాలివి.  

పద్మ

ప్రేమ్‌చంద్‌ కథావళి
అనువాదం: అచ్యుతుని రాజ్యశ్రీ
పేజీలు: 710; వెల: రూ. 699/-
ప్రతులకు: ఫోన్‌- 9908284105


గ్రామీణ ఇతివృత్తం

కులవృత్తులపై ఎంతో పరిశోధించి రాసిన నవల ఇది. విశ్వబ్రాహ్మణ కులంలో ఐదు వృత్తులు ఉండగా వాటిల్లో మిగిలినవాటిలా సాహిత్యంలో కన్పించని కంచర వృత్తిని వస్తువుగా ఎంచుకున్నారు రచయిత. ఈ వృత్తినిపుణులు ఇత్తడితో రకరకాల వస్తువులనూ విగ్రహాలనూ చేస్తారు. కథానాయకుడు విశ్వరూపాచారి ఉద్యమకారుడూ ప్రగతిశీలభావాలున్నవాడూ. ‘పని చేసుకునేవాడికి ఎప్పుడూ పని ఉంటది. కాకుంటే ఆ పని కాలానికి తగ్గట్టు చేసుకుంటూ పొవ్వాల’ అంటూ కులవృత్తులు దెబ్బతిన్న సంధికాలంలో తోటివారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు. తాను తయారుచేసిన కళాత్మక వస్తువులతో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. గ్రామీణ ప్రజల సమష్టి జీవన సంప్రదాయాలనూ, విలువలనూ, రాజకీయాలనూ చర్చిస్తుందీ నవల.

 శ్రీ

పరంపర (నవల)
రచన: శిరంశెట్టి కాంతారావు
పేజీలు: 289; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 9849890322



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..