పరీక్ష కోసం దేశమంతా గప్‌చుప్‌!

ఏటా ఒక రోజు ఆ దేశం దాదాపు నిశ్శబ్దం అయిపోతుంది. కార్యాలయాలన్నీ అతి తక్కువ సిబ్బందితో కొద్ది గంటలే పనిచేస్తాయి. రోడ్లమీద చాలా తక్కువ వాహనాలు ఏమాత్రం శబ్దం లేకుండా వెళ్తాయి.

Published : 25 Mar 2023 23:17 IST

పరీక్ష కోసం దేశమంతా గప్‌చుప్‌!

ఏటా ఒక రోజు ఆ దేశం దాదాపు నిశ్శబ్దం అయిపోతుంది. కార్యాలయాలన్నీ అతి తక్కువ సిబ్బందితో కొద్ది గంటలే పనిచేస్తాయి. రోడ్లమీద చాలా తక్కువ వాహనాలు ఏమాత్రం శబ్దం లేకుండా వెళ్తాయి. విమానాల రాకపోకలు స్తంభిస్తాయి. పోలీసులంతా పాఠశాలల చుట్టుపక్కల మోహరిస్తారు. దక్షిణ కొరియాలో యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రోజు పరిస్థితి ఇది.

దువుకునే పిల్లలకు పరీక్షలు మామూలే. మనకి ఎంసెట్‌, నీట్‌, జేఈఈ... అంటూ రకరకాల పరీక్షలున్నట్లే దక్షిణ కొరియాలోనూ పన్నెండో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్సిటీలో చేరడానికి ఒక పరీక్ష నిర్వహిస్తారు. దాని పేరు ‘సన్‌అంగ్‌’. పిల్లలకు యూనివర్సిటీలో చేరే అదృష్టం ఉందో లేదో తేల్చి చెప్పే పరీక్ష ఇది. పరీక్ష ఎంత ప్రత్యేకమో దాని నిర్వహణా అంతే ప్రత్యేకం. మొత్తం దేశమంతా పరీక్ష రాస్తున్నట్లుగా కనిపిస్తుంది.

కొరియాలో తల్లిదండ్రులు పిల్లలకు ఏం చదవాలో చెప్పరు, ‘బాగా చదువుకో, మంచి యూనివర్సిటీలో సీటు వస్తుంది’ అని మాత్రమే చెబుతారు. దాంతో పిల్లల ఏకైక లక్ష్యం అదే అవుతుంది. యూనివర్సిటీలో చేరాకే ప్రొఫెషనల్‌ కోర్సులైనా మరొకటైనా ఎంచుకుంటారు. దేశవ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగానే యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. మంచి ర్యాంకు వస్తే సోల్‌ నేషనల్‌ యూనివర్సిటీలాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చు. అంటే పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ప్రధాన పరీక్ష ఇదేనన్నమాట.

ఒకే రోజు... ఎనిమిది గంటలు

దక్షిణ కొరియాలో విద్యాసంవత్సరం మార్చిలో మొదలై డిసెంబరులో ముగుస్తుంది. నవంబరులో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఒకేరోజు ఎనిమిది గంటలపాటు జరిగే పరీక్షలో కొరియా భాషతో పాటు ఇంగ్లిష్‌, గణితం, చరిత్ర, సైన్సు తదితర సబ్జెక్టులు ఉంటాయి. పై చదువులు ఏ సబ్జెక్టులో చదవాలనుకుంటారో ఆ సబ్జెక్టులో ప్రధాన పరీక్షను ఎంచుకుంటారు. హైస్కూలుకు వచ్చినప్పటినుంచి స్కూలు ప్రారంభానికి ముందో రెండు గంటలూ, అయిపోయాక మరో నాలుగైదు గంటలూ స్కూల్లోనే ఉండి చదువు కుంటారు. పాఠశాల యాజమాన్యాలు కూడా తగిన వసతులు కల్పిస్తాయి. హోంవర్కులు ఇంటికెళ్లాకే చేస్తారు. ఇళ్లలోనూ పిల్లల్ని చదువుకోమని చెప్పి పెద్దలు తమ పని తాము చేసుకోరు. ఇంట్లో సన్‌అంగ్‌ పరీక్ష రాసే పిల్లో పిల్లాడో ఉంటే ఆ కుటుంబమంతా పరీక్ష రాస్తున్నట్లే భావిస్తారు. టీవీలూ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ మూగబోతాయి. పిల్లలకు మంచి ఆహారాన్ని తయారుచేసి పెట్టడం మీదా, వారి చదువుకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా చూసు కోవడం మీదా దృష్టిపెడతారు. పిల్లల సందేహాలు తీర్చడానికి తల్లో తండ్రో ఎవరో ఒకరు పిల్లలతో పాటు అవే సబ్జెక్టులు చదవడమూ కద్దు. పిల్లలు ఒత్తిడికి లోనవకుండా చూసుకునేందుకు   శతవిధాలా ప్రయత్నిస్తారు. 

సహకారం అపూర్వం

పరీక్ష రాసే పిల్లలకు అక్కడి ప్రభుత్వమూ పెద్దలూ తోటి విద్యార్థులూ సహకరించే తీరు మాత్రం అపూర్వం. రోడ్లమీద ట్రాఫిక్‌ పిల్లలకు అడ్డం రాకూడదని కోర్టులూ బ్యాంకులూ స్టాక్‌మార్కెట్‌తో సహా కార్యాలయాలన్నిటినీ కొద్దిపాటి సిబ్బందితో ఆలస్యంగా ప్రారంభించి త్వరగా మూసేస్తారు. భాషకి సంబంధించిన పరీక్షలో విని రాయాల్సింది ఉంటుంది. అందుకని వారి ఏకాగ్రతకి భంగం కలగకుండా చూడడానికి దేశమంతటా విమానాల రాకపోకల్ని నిలిపేస్తారు. మిలిటరీ శిక్షణనీ, నిర్మాణ పనుల్నీ ఆపేస్తారు. ఆరోజు పిల్లలకోసం ఎక్కువ బస్సుల్ని ట్యాక్సీల్నీ ఉచితంగా నడుపుతారు. వాటికి తోడు రోడ్డుమీద ఎక్కడ పరీక్షకు వెళ్లే పిల్లలు కనిపించినా వారిని కార్లలో పరీక్షా కేంద్రానికి చేర్చడం పోలీసుల బాధ్యత. అందుకోసం ప్రత్యేక బలగాలను విధుల్లోకి దించుతారు. అయితే ఏ వాహనమైనా పరీక్షాకేంద్రానికి 200మీటర్ల దూరాన ఆగాల్సిందే. ఇన్విజిలేటర్లు అందరూ అడుగుల శబ్దం వినిపించకుండా మెత్తని బూట్లు మాత్రమే ధరించాలి.

ఇక, పరీక్షా కేంద్రాల దగ్గరైతే యూనివర్సిటీలో చదువుకునే పిల్లలూ తల్లిదండ్రులూ టీచర్లూ పొద్దున్నే ఆరింటికే వచ్చి బారులు తీరతారు. బెస్టాఫ్‌ లక్‌ చెబుతూ బ్యానర్లూ బెలూన్లూ పట్టుకుంటారు. స్నాక్స్‌, జ్యూస్‌, చాకొలెట్లు తెచ్చి పంచుతారు. మంచి బహుమతులిస్తారు. ఇదంతా కూడా నిశ్శబ్దంగానే జరిగిపోతుంది. పిల్లలు టెన్షన్‌ లేకుండా నవ్వుతూ పరీక్షకు వెళ్లాలన్నదే అందరి ఆశయం. ఐదారు లక్షలమంది రాసే పరీక్ష కోసం ఇంత హడావుడా... అంటే- అవును మరి, పిల్లలంటే రేపటి దేశ భవిష్యత్తు. అందుకే ఇదంతా... అంటారు కొరియన్లు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..