గోడ మీద బొమ్మా...ఆడుకోవచ్చమ్మా!

పిల్లల్ని రోజంతా ఒకట్రెండు ఆటబొమ్మలతో ఆడుకోమంటే ఊరుకుంటారా... అందుకే ఒకటి పాటలు వినిపించేదీ, ఇంకోటి రంగులు కలిపేదీ, మరోటి మాటలు చెప్పేదీ... అంటూ తీరుతీరునా బొమ్మలు కొనేస్తుంటాం...

Published : 25 Mar 2023 23:59 IST

గోడ మీద బొమ్మా...ఆడుకోవచ్చమ్మా!

పిల్లల్ని రోజంతా ఒకట్రెండు ఆటబొమ్మలతో ఆడుకోమంటే ఊరుకుంటారా... అందుకే ఒకటి పాటలు వినిపించేదీ, ఇంకోటి రంగులు కలిపేదీ, మరోటి మాటలు చెప్పేదీ... అంటూ తీరుతీరునా బొమ్మలు కొనేస్తుంటాం... కానీ వాటన్నింటితో ఇల్లంతా నిండిపోదూ... మరైతే అటు పిల్లలూ ఆడుకోవాలీ, ఇటు ఇల్లూ నిండిపోకూడదు అంటే... ఇక్కడున్న ‘వాల్‌ టాయ్స్‌’ని ప్రయత్నించొచ్చు!

టలంటే ఇష్టపడని చిన్నారులు ఎవరైనా ఉంటారా... ఒకరిద్దరు బుజ్జాయిలు కలిసినా సరదాగా టెడ్డీబేర్‌లాంటి బొమ్మలు ముందరేసుకుని ఏదో ఒక ఆట మొదలెట్టేస్తారు. కాస్త పెద్ద పిల్లలైతే ఇంట్లోనే లూడో, చదరంగం, క్యారమ్స్‌... అంటూ రకరకాల బోర్డ్‌ గేమ్స్‌ ఆడుకుంటారు. అందుకే మరి పసిపాపాయిల దగ్గర్నుంచి పద్నాలుగేళ్ల పిల్లల వరకూ అన్ని వయసుల చిన్నారుల ఆటపాటల్నీ దృష్టిలో పెట్టుకుని మార్కెట్లోకి ఎన్నెన్నో బొమ్మలు వస్తుంటాయి. అలా వచ్చినవి వచ్చినట్టుగా ఎప్పటికప్పుడు పిల్లల అల్మారాల్లోనూ చేరిపోతుంటాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ ఒక్కోసారి చిన్నారులున్న ఇంట్లో మిగతా సామగ్రి కంటే ఆ ఆట బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడు ఏ బొమ్మతో ఆడుకుంటారోనని పైన అరల్లో కాకుండా కిందే ఉంచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు అవే బొమ్మలు- ఇల్లంతా అలా నిండిపోకుండా, పిల్లలు ఆడుకోవడానికి చేరువలోనే ఉండేలా వచ్చేశాయి. గదుల్లో గోడలపైన అతికించి పెట్టుకునే ‘వాల్‌ టాయ్స్‌’లా దొరుకుతున్నాయి. ఇవీ మామూలు బొమ్మల్లాంటివే కానీ వీటికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి ఒకేదాంట్లోనే చాలా రకాల బొమ్మలు కలిపి ఉండటం, రెండోది ఆ బొమ్మల సెట్‌ అంతా కూడా గోడకు అతికించుకునేలా ఉండటం. ‘బోర్డుగేమ్‌ల్లాంటివాటిల్లో ఒకే దాంట్లో రెండు రకాల ఆటలు రావడం తెలిసిందే గానీ బొమ్మలు అతికించడం ఎలా కుదురుతుందబ్బా, ఇవేమైనా కాగితపు బొమ్మలా ఏంటీ’ అంటారేమో... కానే కాదండీ. అవన్నీ కూడా కలప, క్లాత్‌, మెటల్‌, ప్లాస్టిక్‌... ఇలా రకరకాల పదార్థాలతో తయారుచేసిన నిజమైన బొమ్మలే. కానీ గోడకు అతికి ఉండేలా వాటి వెనకాల జిగురూ, వ్యాక్యూమ్‌ హోల్డర్స్‌, వెల్‌క్రోలాంటి ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. అందువల్లే ఆయా బొమ్మలన్నీ కూడా గోడపైన చక్కగా అతుక్కుపోతాయి.

ఎలా ఆడాలి?

చిన్న పిల్లల కోసం జైలోఫోన్‌, మేజ్‌, షేప్‌ పజిల్‌, మ్యాగ్నెటిక్‌ టాయ్‌, కౌంట్‌ అండ్‌ మూవింగ్‌ పజిల్స్‌, రూబిక్స్‌ క్యూబ్‌, లెగో బ్రిక్స్‌... ఇలా ఎన్నో ఉన్నాయి. కాస్త పెద్దపిల్లలు ఆడుకునేలా సుడొకు, క్రాస్‌వర్డ్‌, చదరంగం లాంటి బోర్డ్‌ గేమ్స్‌ కూడా వాల్‌ టాయ్స్‌లా వచ్చాయి. కానీ ఈ గేమ్స్‌ని ఎలా ఆడొచ్చూ, పజిల్స్‌ని ఎలా పూర్తిచేయొచ్చూ... అన్న సందేహం వచ్చింది కదూ. అవన్నీ కూడా ఆడుకోవడానికి వీలుగా మ్యాగ్నెట్‌ సెన్సర్‌తో ఉంటాయి. అందుకే కింద పడిపోకుండా గోడకున్న బోర్డు మీద ఉంచే అటూ ఇటూ కదుపుతూ ఆడుకోవచ్చన్నమాట. ఈ ప్రత్యేకమైన ఆట బొమ్మల్లో పిల్లలకు నచ్చినవి తెచ్చామంటే హాయిగా ఆడుకోవడమే కాదు, అటు ఇల్లంతా బొమ్మలతో చిందరవందరగానూ ఉండదు, ఇటు నిలబడి ఆడటం వల్ల పిల్లలకు కాస్త వ్యాయామంగానూ ఉంటుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..