వ్యక్తిత్వ సంపన్నుడు!

నందమూరి తారకరామారావు జీవితం... ఏ కల్పనా సాహిత్యానికి తీసిపోని మలుపుల కదంబం. తెరమీదనే కాదు జీవితంలోనూ తిరుగులేని కథానాయకుడాయన

Updated : 28 May 2023 05:43 IST

నందమూరి తారకరామారావు జీవితం... ఏ కల్పనా సాహిత్యానికి తీసిపోని మలుపుల కదంబం. తెరమీదనే కాదు జీవితంలోనూ తిరుగులేని కథానాయకుడాయన. చక్కటి కళాభిరుచి, క్రమశిక్షణ, శ్రమించే తత్వం, నిజాయతీ, ముక్కుసూటిదనం, ఎదుటివారిపట్ల సహానుభూతి... ఇవన్నీ ఏ ఉదాత్త సినిమా పాత్రకీ తీసిపోవు. ఆ జీవితం కచ్చితంగా ఓ వ్యక్తిత్వ వికాస పుస్తకం. అందులోని కొన్ని పేజీలివి...

ఆ ఇద్దరూ భిన్నధ్రువాలు..

నిమ్మకూరులోని నందమూరివారింటి దాయాదులు. పెద్దాయన పేరు రామయ్య. ‘సోకు రామయ్య’ అంటుంటారు ఆయన్ని ఊళ్ళోవాళ్ళందరూ. మనిషి గొప్ప అందగాడు కాకున్నా ఆకర్షణీయంగా ఉండేవాడు. జులపాల జుట్టు గిరజాలు తిరిగి భుజాల నుంచి కిందికి వేలాడుతుండేది. పల్చటి తెల్లటి లాల్చీ, మల్లుపంచె, పైన కోటు, అందులో గొలుసు గడియారంతో కనిపించేవారెప్పుడూ. మంచి రంగస్థల నటుడు, పాటలు అద్భుతంగా పాడతాడు.
కాకపోతే కష్టం చేయడు... నిత్యం కళల గురించే పలవరిస్తాడు. ఈ నందమూరి రామయ్య తమ్ముడు (ఆయన చిన్నాన్న పెదరామస్వామి కొడుకు) లక్ష్మయ్య ఇందుకు పూర్తిగా భిన్నం. ఆయన కష్టజీవి. మంచి రూపసి. తమ పొలం, పాడి తప్ప ఎందులోనూ ఆసక్తి లేనివాడు. దాయాదులైతేనేం, ఆ ఇద్దరూ తమ పేర్లకు తగ్గట్టు రామలక్ష్మణుల్లా ఉండేవారు! రామయ్య- కృష్ణాజిల్లా కొమరవోలు గ్రామవాసి కాట్రగడ్డ సూరయ్య కూతురు చంద్రమ్మని పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్ళ తర్వాత ఆమె చెల్లెలు- తన మరదలు వెంకట్రావమ్మతో తానే ముందుండి లక్ష్మయ్య పెళ్ళి కుదిర్చాడు. రామయ్య-చంద్రమ్మలకి పిల్లల్లేరు. లక్ష్మయ్య వెంకట్రావమ్మ దంపతులకు 1923 మే 28న మగపిల్లాడు పుట్టాడు.
ఆ బిడ్డను రామయ్య-చంద్రమ్మలు తమ సంతానంగానే చూసుకోసాగారు. ఎంతగా అంటే- ఆ బాబుకి వాళ్ళమ్మ వెంకట్రావమ్మ కృష్ణుడు అని పేరుపెడితే, అది కాదని రామయ్య ‘తారక రాముడు’ అని పెట్టేంతగా! చట్టబద్ధంగా దత్తత తీసుకోకపోయినా నందమూరి తారక రాముడు... రామయ్య ఇంట్లోనే ఉండేవాడు. రామయ్య అతణ్ణి తన కళాభిరుచికి వారసుడిగానే చూశాడు. తనకు తెలిసిన పాటలూ పద్యాలూ రామాయణ మహాభారత కథలన్నీ నేర్పేవాడు. తెలుగుభాషపైన తీరని అభిమానాన్ని పాదుకొల్పాడు. ఎన్టీఆర్‌ అలా అయిదేళ్ళకే ఎన్నో పద్యాలూ, పాటలూ కంఠతా పట్టేశాడు. పాడీపాడి గొంతుకీ శ్రావ్యత తెచ్చుకున్నాడు. వినీవినీ అద్భుతమైన వాచికం అలవర్చుకున్నాడు. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా పాటలూ పద్యాలూ పాడుతూ ప్రధాన ఆకర్షణగా నిలిచేవాడు. కానీ, ఈ కళాభిరుచితోపాటూ కష్టాన్నీ అలవాటు చేసుకున్నాడు. తండ్రి లక్ష్మయ్యతో కలిసి తొమ్మిదేళ్ళ నుంచే పొలం పనులకి వెళ్ళసాగాడు. ‘ఏదీ ఊరికే రాదు... ప్రతి గింజనూ కష్టపడి పోగుచేసుకోవాల్సిందే’ అన్న జీవన సత్యాన్ని లక్ష్మయ్యే ఆయనకి బోధించాడు.  

అప్పటికి నిమ్మకూరులో బడిలేదు. నిడుమోలుకి చెందిన వల్లూరి వెంకటసుబ్బారావు రోజూ ఉదయం వచ్చి సాయంత్రం దాకా పిల్లలకి పాఠాలు చెప్పేవారు. పాఠాల్లోని విషయాలన్నీ పెదనాన్న రామయ్య దగ్గర ముందుగానే నేర్చుకోవడం వల్ల ఎన్టీఆర్‌ బడిలో అందరికన్నా ముందుండేవాడు. మూడో తరగతి పూర్తయ్యాక రామయ్య తన కొడుక్కి ఇంగ్లిషు చదువులు చెప్పించాలనుకున్నాడు. అందుకోసం సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆవురుపాడులో ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాడు. రోజూ తానే భుజాలమీద ఎక్కించుకుని బడికి తీసుకెళ్ళేవాడు. ఐదో తరగతి దాకా సోకు రామయ్య దినచర్య అదే. ఐదో తరగతి తర్వాత ‘ఇక వాడు చదివింది చాలు. నాతోపాటూ పొలంపనికి వస్తాడు’ అన్నాడు లక్ష్మయ్య. కానీ రామయ్య మాత్రం ‘బాబు చదవాల్సిందే’ అని పట్టుబట్టాడు. కానీ, ఆరో తరగతంటే విజయవాడకి వెళ్ళాలి... ఎలా? ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ చదువుకోసం తానే అక్కడ కాపురం పెడతానని బెజవాడకి మకాం మార్చాడు రామయ్య. ఎన్టీఆర్‌ని విజయవాడ మున్సిపల్‌ హైస్కూల్‌లో(నేటి గాంధీజీ స్కూలు) చేర్చాడు. అక్కడ ఎన్టీఆర్‌ చదువుకయ్యే ఖర్చుని లక్ష్మయ్యే పంపిస్తుండేవాడు. ఓ దశలో ఇది ఆయనకి తలకుమించిన భారమైంది. తన సాగుభూమిని పెంచుకుంటేనైనా ఇందుకు పరిష్కారం దొరుకుతుందని... అప్పుచేసి కొంత పొలం కొన్నాడు. కానీ 1929లో బస్తా బియ్యం ధర పదకొండు రూపాయల నుంచి రెండ్రూపాయలకి పడిపోయింది! దాంతో లక్ష్మయ్య ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయాడు. అప్పులవాళ్ళ ఒత్తిడి భరించలేక తనకు వారసత్వంగా వచ్చిన 18 ఎకరాలని అమ్మేశాడు. ఎన్టీఆర్‌ చదువుకి ఆయన వద్ద డబ్బుల్లేవు.... దాదాపు బడి మాన్పించేయాల్సిన పరిస్థితి. కానీ రామయ్య అందుకు అంగీకరించలేదు. అప్పటిదాకా జీవితంలో ఏ పనీచేయని ఆయన... ఎన్టీఆర్‌ చదువుకోసం విజయవాడలో బస్సు కండక్టర్‌గా మారాడు. అయినా, విధి పరిహాసం ఆగలేదు. ఓ రోజు బస్సు మెట్లపై నుంచి పడి ఆయన కాలు విరిగింది. ఉద్యోగం చేయలేని పరిస్థితిలోకి నెట్టింది! అంతే...‘ఇక మనవాడిని చదువు మాన్పిద్దామా?’ అడిగాడు లక్ష్మయ్య ఊరికి తిరిగొచ్చిన రామయ్యతో. అప్పటికే ఆయనకి రెండో కొడుకు త్రివిక్రమరావు ఉన్నాడు. ‘కుదర్దు... నువ్వే విజయవాడలో ఉండి వాణ్ణి చదివించు’ అన్నాడు రామయ్య. అన్నమాటని జవదాటని లక్ష్మయ్య... కుటుంబంతో విజయవాడకొచ్చాడు.

కటిక నేలమీదే...  

కొడుకు చదువు కోసం బెజవాడ వచ్చిన లక్ష్మయ్య-వెంకట్రావమ్మ దంపతులు పాలవ్యాపారం పెట్టారు. విజయవాడ శ్రీరామా టాకీసు ఎదురుగా ప్రముఖ వ్యాపారి కౌతా సూర్యనారాయణకి చెందిన స్థలాన్ని అద్దెకు తీసుకుని పూరిపాక వేసుకున్నారు. రెండు గేదెలతో వ్యాపారం మొదలుపెట్టారు. వాళ్ళ జీవితంలో అవి చాలా గడ్డురోజులు. ఆ ఇంట్లో ఒక్క నులకమంచం మాత్రమే ఉండేది. తండ్రి, తమ్ముడు త్రివిక్రమరావు మంచంపైన పడుకుంటే తల్లీ రామారావూ చాపమీద నిద్రించేవారు. ఇంటికి బంధువులొస్తే ఆ చాప వాళ్ళకిచ్చి... నేలపైనే పడుకునేవారు. తండ్రి రోజూ కావిళ్ళు మోసి, చెమటోడ్చి తనని చదివించడం చూశాక తనకి కష్టం విలువ
తెలిసిందంటారు ఎన్టీఆర్‌. ‘భోగలాలసత్వం నా జీవనరీతి కారాదని ఆనాడే నిర్ణయించుకున్నాను’ అనేవారాయన ఆ రోజుల్ని తలచుకుని. తొమ్మిదో తరగతికి వచ్చాక తానూ నాన్నకి సాయపడసాగాడు. తండ్రితోపాటే ఉదయం రెండున్నరగంటలకి లేచి పాక ఊడ్చేవాడు. బెజవాడ హోటళ్ళ కోసం పాలు సరఫరా చేయడానికి తండ్రి ఓవైపు వెళితే, తాను మరోవైపు వెళ్ళేవాడు. ఆ కష్టమంతా ఫలితాన్నిచ్చింది. నాణ్యమైన పాలు ఇవ్వడంతో... మంచి పేరొచ్చి వ్యాపారం పుంజుకోవడంతో మరో రెండు పశువుల్ని కొన్నారు. కొడుక్కి హెర్క్యులస్‌ సైకిల్‌ కొనిపెట్టాడు లక్ష్మయ్య. దానికి రెండు వైపులా పాలబిందెలు కట్టుకుని ఎన్టీఆర్‌ రోజూ విజయవాడ వెల్‌కమ్‌ హోటల్‌కి అందించేవాడు. ఆ హోటల్‌కి వచ్చే మిగతా పాలవాళ్ళు అక్కడ తమకి ఉచితంగా అందించే కాఫీ తాగుతూ పిచ్చాపాటికి కూర్చుంటే... ఎన్టీఆర్‌ మాత్రం వచ్చిన పనికాగానే ఇంటికెళ్ళిపోయేవాడు. క్యాష్‌కౌంటర్‌లో కూర్చునే యజమాని అతనిచేత ఓ కప్పు కాఫీ తాగించాలని ఎంత ప్రయత్నించినా... ‘వద్దండీ, పనులున్నాయి’ అంటూ వెళ్ళిపోయేవాడట. ఏదేమైతేనేం, వ్యాపారంలో వచ్చిన లాభాలతో లక్ష్మయ్య ఓ పెంకుటిల్లు కొని... అందులో ఓ భాగాన్ని సూర్యనారాయణ అనే వ్యాపారి కుటుంబానికి అద్దెకిచ్చాడు. తన తమ్ముడు నాగయ్య అమ్మకానికి పెట్టిన పొలాన్నీ కొనుగోలు చేశాడు. పైసా పైసా కూడేసి... డబ్బులు దాచుకోవడం, అత్యవసరమైతే కానీ ఖర్చుచేయకపోవడం ఎన్టీఆర్‌కి ఆ వయసులోనే అలవాటైంది. అంతేకాదు, స్కూలు చదువు పూర్తవ్వగానే ఆయన ఓ వ్యాపారం పెట్టాడు. అదీ... బొంబాయిలో!

ఆంధ్రా మెస్‌...

విజయవాడ జనతా స్టూడియో యజమాని కోటేశ్వరరావుతో ఎన్టీఆర్‌కి స్నేహం కుదిరింది. 1940లో ఎన్టీఆర్‌ స్కూల్‌ చదువు పూర్తవ్వగానే- ఆయనతో కలిసి బొంబాయి వెళ్ళాడు. అక్కడ అబ్దుల్లా ఇన్‌స్టిట్యూట్‌లో కోటేశ్వరరావు ఫొటోగ్రఫీలో చేరితే, ఎన్టీఆర్‌ సౌండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు తీసుకున్నాడు. పదిహేను రోజుల తర్వాత... ఎన్టీఆర్‌కి ఆ కోర్సు నచ్చలేదు. ట్రైనింగ్‌ మానేసి, మాతుంగా ప్రాంతంలో ‘ఆంధ్రా మెస్‌’ నడిపాడు. లక్ష్మయ్యకి అది నచ్చక తిరిగొచ్చేయమన్నాడు. దాంతో బెజవాడకొచ్చిన ఎన్టీఆర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. అక్కడ కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ఆయన గురువు. ఎన్టీఆర్‌కి తెలుగుభాషపైనున్న పట్టుని మరింత పదునెక్కించారాయన. ఓసారి కాలేజీలో విశ్వనాథ రాసిన ‘రాచమల్లుని దౌత్యం’ నాటకం వేస్తున్నారు. అందులో ప్రధాన స్త్రీపాత్ర నాగమ్మకి ఎన్టీఆర్‌ని కష్టంమీద ఒప్పించారు విశ్వనాథ. ఎన్టీఆర్‌ రిహార్సల్స్‌ మొదలుపెట్టాడు. కానీ... ఆ పాత్ర కోసం మీసాలు తీయాలనడంలోనే చిక్కొచ్చిపడింది. నూనూగు మీసాలైతేనేం తాను తీసేది లేదంటూ భీష్మించాడు ఎన్టీఆర్‌. గురువు విశ్వనాథకి పట్టుదల ఎక్కువ. ఎలా తీయవో చూస్తానన్నా... ఎన్టీఆర్‌ ససేమిరా అన్నారు. చివరికి విశ్వనాథే దిగొచ్చి... ‘ఎలాగో కానీయ్‌!’ అన్నారు. ఎన్టీఆర్‌ మేకప్‌తోనే చాకచక్యంగా మీసాలని కవర్‌ చేశాడు. నాగమ్మ పాత్రకి తనదైన అభినయంతో జీవంపోసి... తాను నటించిన తొలి నాటకానికే బహుమతినీ సాధించాడు! ఇంటర్మీడియట్‌ రోజుల్లోనే కర్రసాము, మల్లయుద్ధం, యోగాసనాలు అభ్యసించాడు ఎన్టీఆర్‌. చిత్రలేఖనంలోనూ అభినివేశం ఉండేది. కానీ ఇంటర్మీడియట్‌ రెండో ఏడాదికి... మిగతా వ్యాపకాలన్నీ పక్కకుపోయి నాటకాలే ప్రధానమయ్యాయి.

ఇంటర్‌ కష్టాలు...

మూణ్ణాలుగు నెలల్లో ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు ఉన్నాయనగా... ఓ అవాంతరం వచ్చింది. ఎన్టీఆర్‌ వాళ్ళ ఇంట్లో అద్దెకున్న వ్యాపారి సూర్యనారాయణ బొంబాయి వెళ్ళి... అక్కడో వ్యాపారం పెట్టారు. అక్కడ ఆయన భాగస్వాములు మోసం చేయడమే కాదు... సూర్యనారాయణపైన తప్పుడు కేసు బనాయించి జైల్లో పెట్టించారు. ఆయన భార్య ఎన్టీఆర్‌ తల్లి వెంకట్రావమ్మ దగ్గర భోరుమన్నారు. ఆమె దైన్యం చూసి జాలిపడ్డ ఆమె కొడుకుని సాయంగా పంపించారు.
దగ్గర్లోనే ఫైనల్‌ పరీక్షలున్నా ఆయన తల్లిమాటని కాదనలేకపోయాడు. బొంబాయి రైలెక్కాడు. అక్కడ రెండు నెలలపాటు ఉండి... సూర్యనారాయణ లాయర్‌కి సాయపడ్డాడు. ఆయన నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చాక తిరిగొచ్చాడు కానీ అప్పటికి పరీక్షలకి గట్టిగా నెలన్నర కూడా లేదు. శాయశక్తులా చదివినా... రెండు పేపర్లలో తప్పాడు. అప్పట్లో ఇంటర్లో తప్పి ఇంటిపట్టున ఉన్న కుర్రవాళ్ళకి పెళ్ళి చేసేస్తుండేవారట! ఎన్టీఆర్‌కి రెండు సంబంధాలొచ్చాయి. ఒకటి - లక్ష్మయ్య తమ్ముడు నాగయ్య తెచ్చిన సంబంధం. రెండోది- తల్లి వెంకట్రావమ్మకి అన్నవరసయ్యే కాట్రగడ్డ చెంచయ్య కూతురి సంబంధం. ఎన్టీఆరే కాదు... రామయ్య కూడా చెంచయ్య సంబంధం వైపే మొగ్గారు. పెళ్ళి ఖరారైంది. ఇది నాగయ్యకి కోపం తెప్పించింది. ఆయన కోపానికి జంకి పెళ్ళి బాధ్యతని రామయ్యకే వదిలేశారు ఎన్టీఆర్‌ తల్లిదండ్రులు. అంతేకాదు, పెళ్ళికి కూడా రాకుండా విజయవాడలోనే ఉండిపోయారు. శుభలేఖల్లోనూ తల్లిదండ్రులుగా రామయ్య, చంద్రమ్మల పేర్లే వేశారు! అంతచేసినా- నాగయ్య కోపం తగ్గలేదు. ఇదివరకు లక్ష్మయ్య తన దగ్గర కొన్న భూమిని మళ్ళీ అమ్మకానికి పెట్టాడు! పత్రాలేవీ లేకుండా నోటిమాటతో కొన్న పొలం కాబట్టి - లక్ష్మయ్యా ఏమీ చేయలేకపోయాడు. చేజేతులా పొలం పోయిందన్న బాధ... ఆయన్ని కుంగదీసింది. ఆర్థిక కష్టాలతో ఎన్టీఆర్‌ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అరవైనాలుగు రూపాయల జీతంతో విజయవాడలో కోర్టు అటెండర్‌గా తాత్కాలిక ఉద్యోగంలో కుదిరాడు. అప్పుడే బబ్బూరి వెంకయ్య అన్న మిత్రుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి సిగరెట్లూ బీడీలూ చుట్టల టోకు వ్యాపారం మొదలుపెట్టారు. ఓ దశలో కోర్టు ఉద్యోగం వదిలేసి దానిపైనే దృష్టిపెట్టాడు. అది బాగానే కలిసొచ్చింది. ‘ఇక తన జీవితం నల్లేరుపైన నడకే’ అనుకుంటుండగానే... బబ్బూరి వెంకయ్య జబ్బునపడ్డాడు. తానొక్కడే నడిపేంత వ్యాపార జ్ఞానం లేకపోవడంతో ఎన్టీఆర్‌కి నష్టాలొచ్చాయి. వీటన్నింటి నడుమ రెండోసారీ ఇంటర్‌ ఫెయిలయ్యాడు! అప్పుడే కొడుకు రామకృష్ణ (సీనియర్‌) పుట్టాడు. ‘కుటుంబం పెద్దదవుతోంది. తర్వాత ఏం చేయాలి?’ అన్న ప్రశ్న ఆయన్ని తొలిచేయసాగింది. తర్వాతి ఏడాది ఇంటర్‌ పాసైనా... వ్యవసాయం చేయాలనుకున్నాడు. నిమ్మకూరు వెళ్ళి పెదనాన్నతో ఆ విషయమే చెప్పాడు.

నాటకాల కోసం ‘ఎన్‌ఏటీ’...

‘నీ చేత వ్యవసాయం చేయించాలంటే... ఐదో తరగతితోనే చదువు మాన్పించేవాళ్ళం కదా!’ అంటూ ఎన్టీఆర్‌పైన ఒంటికాలిమీద లేచాడు రామయ్య. ‘ఆరునూరైనా సరే నువ్వు బీఏ చదివి... ప్రభుత్వోద్యోగం చేయాల్సిందే’ అన్నాడు. ఆయన మాట కాదనలేక గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ ఎకనామిక్స్‌లో చేరాడు ఎన్టీఆర్‌. ఎప్పట్లానే- తండ్రికి ఉదయాన్నే పాలవ్యాపారంలో సాయం చేసి, కాస్త జొన్న అన్నం తిని రైల్వేస్టేషన్‌కి నడుచుకుంటూ వెళ్ళి గుంటూరు రైలెక్కేవాడు. కాలేజీ కాగానే నాలుగున్నరకి తిరిగివచ్చేవాడు. అలా వస్తున్నవాడు కాస్తా ఓ దశలో రాత్రి పదకొండున్నరకి ఇంటికి రావడం మొదలుపెట్టాడు! కారణం నాటకాలే. నాటి ఏసీకాలేజీ నాటక కళకి కాణాచి! నటుడు కొంగర జగ్గయ్య ఎన్టీఆర్‌ సహాధ్యాయి. ఇద్దరిదీ అప్పట్లో బెస్ట్‌ కాంబినేషన్‌. నాటకాల కోసమని 1946లో ‘నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌’ని స్థాపించాడు ఎన్టీఆర్‌. లాభాపేక్షలేని సంస్థగా నడపసాగాడు. ఓసారి ‘వేనరాజు విప్లవం’ నాటకం వేస్తే... అందుకు కావాల్సిన సిల్కుపంచె కొనడానికి డబ్బులేదు. దాంతో తన తల్లి వెంకట్రావమ్మ చీరెనే పంచెలా కట్టి నటించాడు. తల్లి తిడుతుందని భయపడ్డా ‘పంచెగా కట్టిన ఆ చీరలో నువ్వెంత బాగున్నావో తెలుసా’ అని నవ్వేశారట ఆమె! ఓసారి ‘నాయకురాలు నాగమ్మ’ నాటకం వేశారు. అందులో ఎన్టీఆర్‌ది నలగామ రాజు పాత్ర. తర్వాతి రోజుల్లో సినీ దర్శకుడైన ఎం.మల్లికార్జునరావేమో బాలచంద్రుడు. ఆ నాటకాన్ని చూడటానికి ఆయన తండ్రి నాగుమణి వచ్చారు. ఎన్టీఆర్‌ అందానికీ, రాజసానికీ, సంభాషణలు పలికే విధానానికీ ఆయన ముగ్ధుడైపోయాడు! తర్వాత విజయవాడ వచ్చిన దర్శకుడు సి.పుల్లయ్య వద్దకి ఎన్టీఆర్‌ని తీసుకెళ్ళారు.

అనుకుంటే... అవ్వాల్సిందే!

భారతీయ సాముద్రికా శాస్త్రం ‘త్రిసమ వదనం’ అనే అరుదైన ముఖాకృతి గురించి చెబుతుంది. నుదురు పైభాగం నుంచి భ్రుకుటి దాకా, భ్రుకుటి నుంచి ముక్కుకొనదాకా, ముక్కుకొన నుంచి చుబుకం దాకా... మూడుభాగాలనూ కొలిస్తే వాటి మధ్య దూరం వెంట్రుకవాసి తేడాలేకుండా సమానంగా ఉంటే దాన్ని త్రిసమవదనం అంటారు. అలాంటి అందమైన ముఖ నిర్మాణం కోటిమందిలో ఒక్కరికే ఉంటుంది. ఎన్టీఆర్‌ మోము అలాంటిది. కాబట్టే... ఆయన్ని చూడగానే ఎవరైనా ముగ్ధులవుతారు. అందుకే - సి.పుల్లయ్య కూడా మొదటిసారి ఎన్టీఆర్‌ని అలా చూస్తూ ఉండిపోయాడట. అందమైన ముఖ వర్చస్సుకి తోడు ఆయన గాంభీర్యం, రాజసం... పుల్లయ్యని కట్టిపడేశాయి. మద్రాసు వెళ్ళిన వెంటనే సినిమా కబురు చెబుతానన్నారాయన. చెప్పినట్టే కబురు చేశారుకానీ... ఎన్టీఆర్‌ మనసు మార్చుకున్నాడు. బీఏ తర్వాతే సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాటే చెబితే పుల్లయ్య ఆశ్చర్యపోయినా చేసేదిలేక వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ మిగతా వ్యాపకాలన్నీ వదిలేసి చదువుపైనే దృష్టిపెట్టాడు. 1947 ఏప్రిల్‌ 11న తుది పరీక్షలు రాశాడు. అనుకున్నట్టే పరీక్ష పాసైపోయాడు. ‘ఎన్‌.టి.రామావు బి.ఎ.’ అని గర్వంగా రాసుకోసాగాడు. ఆ తర్వాత- ఆయన మిత్రుడు, ఫొటోగ్రాఫర్‌ వెంకట సుబ్రమణ్యం ఎల్‌.వి.ప్రసాద్‌ దగ్గరకి తీసుకెళ్ళాడు. గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ స్క్రీనింగ్‌ కోసం వచ్చిన ఎల్వీకి చూడగానే రామారావు నచ్చేశాడు. ‘శ్రీమతి’ సినిమాకి హీరోగా అనుకుని... ‘మే నెల స్క్రీన్‌ టెస్టుకు రండి’ అని చెప్పి వెళ్ళాడు. అలా టెస్టు కోసం తొలిసారి మద్రాసు వెళ్ళినప్పుడే జైహింద్‌ సత్యం ఎన్‌టీ రామారావు ఫొటోలని తీశాడు. మద్రాసు వెళ్ళొచ్చాక స్క్రీన్‌ టెస్టు రిజల్టు కోసం ఎదురుచూడసాగాడు ఎన్టీఆర్‌.

ఆ డబ్బు చేదే...

కుటుంబం పెద్దదవుతోంది. తమ్ముడు త్రివిక్రమరావు కూడా పెళ్ళీడుకొచ్చాడు. అందువల్ల డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే ఉద్యోగవేటలో పడ్డాడు ఎన్టీఆర్‌. గన్నవరం విమానాశ్రయంలో ఐఏటీసీ క్యాడెట్‌గా ప్రాథమిక శిక్షణ పొందాడు. నాటి బ్రిటిష్‌ వైమానిక దళంలో ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగానికి ఆంధ్రా ప్రాంతం నుంచి ఇద్దర్ని ఎన్నుకుంటే... అందులో ఎన్టీఆర్‌ ఒకడు. కానీ ‘మిలటరీ ఉద్యోగం మనకొద్ద’ంటూ తల్లీభార్యా అడ్డుచెప్పడంతో దాన్ని వదులుకున్నాడు. మద్రాస్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పరీక్ష రాశాడు. ఈలోపు ఎల్వీ ప్రసాద్‌ నుంచి ఉత్తరం... ఎన్టీఆర్‌ని హీరోగా పరిచయం చేయాలనుకున్న ‘శ్రీమతి’ చిత్రం ఆగిపోయిందనీ, ‘మన దేశం’ సినిమా తీస్తున్నామనీ అందులో ఓ పాత్ర ఉందని దానికోసం రావాలన్నది సారాంశం! ఎల్వీ ప్రసాద్‌కి ఆయన ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదు. ఈలోపు సబ్‌-రిజిస్ట్రార్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. జీతం రూ.190. కానీ వారానికే ఆ ఉద్యోగంపైన విరక్తి వచ్చింది. మొదటిరోజే ఆయన తన కోటును విప్పి కుర్చీకి తగిలిస్తే బంట్రోతు దాని జేబులో డబ్బు ఉంచాడట. ‘ప్యూను గేటు దగ్గర కూర్చోవడం, పనుల మీద వచ్చే వారి దగ్గర చేయి చాపడం. ఆ డబ్బుతో ఉద్యోగులకి కాఫీలూ టీలూ తేవడం. మిగిలింది కోటు జేబులో ఉంచడం- నేను ఈ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించాను...’ అని తర్వాతి రోజుల్లో చెప్పుకున్నారు. ఆ వ్యతిరేకతవల్ల ప్రశాంతంగా పనిచేయలేకపోయాడు. ‘ఆత్మని అమ్ముకుని బతకాల్సి వస్తోంది’ అంటూ బాధతో మిత్రుడు కొంగర జగ్గయ్యకి లేఖరాశాడు. సరిగ్గా అప్పుడే ‘పల్లెటూరి పిల్ల’ సినిమా తీస్తున్న దర్శకుడు బి.ఎ.సుబ్బారావు నుంచి లేఖ వచ్చింది. అదే కవర్లో ఎల్వీ ప్రసాద్‌ రాసిన మరో లేఖ కూడా ఉంది... ‘సుబ్బారావు సినిమా అవకాశాన్ని వదులుకోవద్దు’ అన్నది దాని సారాంశం. ఎన్టీఆర్‌కి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఉద్యోగానికి రాజీనామా చేసి... సినిమాల వైపు వెళ్ళి... విఫలమైతే? అప్పటికే పాతికేళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వోద్యోగాలకి ప్రయత్నిస్తే తీసుకోరు. ఆ సందిగ్ధంలో ఉన్నవాడికి ఆయన పై అధికారి జాయింట్‌ రిజిస్ట్రార్‌ చలపతిరావు... ‘అప్పనంగా వస్తే కప్పు టీ కూడా తాగనివాడివి. ఈ ఉద్యోగం నీలాంటివాళ్ళకి సరిపడదు...’ అంటూ హితబోధ చేసి తానే స్వయంగా టికెట్టు కొనిపెట్టి ఎన్టీఆర్‌ని మద్రాసు మెయిల్‌ ఎక్కించాడు. అలా వెళ్ళిన ఎన్టీఆర్‌ ఎల్వీ ప్రసాద్‌ చలవతో రెండు సినిమాలకి ఒప్పందం కుదుర్చుకుని తిరిగొచ్చాడు. అందులో ఒకటి ‘పల్లెటూరి పిల్ల’. దానికి పారితోషికంగా వెయ్యిన్నూట పదహార్లు ఇచ్చారు. మరో సినిమా ‘మనదేశం’... అందులో చిన్న పాత్రే అయినా... రెండువేల రూపాయలు అందజేశారు. ప్రభుత్వోద్యోగిగా దాదాపు ఏడాదిన్నర పనిచేస్తే వచ్చే జీతంతో సమానం అది! అదిచ్చిన నమ్మకంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు మెయిల్‌ ఎక్కాడు ఎన్టీఆర్‌.  

ఆకలిని దాచుకుని...

‘మనదేశం’ సినిమా తొందరగానే పూర్తయినా... ‘పల్లెటూరి పిల్ల’ షూటింగ్‌ సవ్యంగా సాగేది కాదు. కొత్త సినిమా అవకాశాలూ రాలేదు. ఒప్పందంతో వచ్చిన డబ్బులో చాలా భాగం ఇంట్లో ఇవ్వడంతో ఇక్కడ రోజు గడవడమే కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో భోజనం తొమ్మిదణాలు. మూడుపూటలకి ఖర్చు 14 అణాలయ్యేవి. అంత డబ్బులేక టీతో సరిపెట్టుకున్న రోజులెన్నో! ఆ కష్టాల నుంచి ఆయన్ని బయటపడేయడానికా అన్నట్టే ‘సంసారం’ సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత విజయావారి ‘షావుకారు’ మొదలైంది. షావుకారు తర్వాత- విజయా సంస్థవాళ్ళు అప్పట్లో నటులతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకునే నూతన ఒరవడిని తీసుకొచ్చారు. ఎన్టీఆర్‌ని రెండేళ్ళ కాంట్రాక్ట్‌ కోసం అడిగితే - తన జీవితాన్ని మలుపుతిప్పే అరుదైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారాయన. ఓ సరికొత్త షరతు పెట్టారు. కాంట్రాక్టు కాలంలో ఆ సంస్థ తీసే ‘పాతాళభైరవి, మల్లీశ్వరి, చంద్రహారం, పెళ్ళిచేసి చూడు’ సినిమాలలోనూ తననే హీరోగా పెట్టుకోవాలన్న షరతు అది. ‘మన సరకు నాణ్యమైనదైతే మార్కెట్టుకు మనం వెళ్ళక్కర్లేదు. అదే మన దగ్గరకు వస్తుందని’ తాను చదువుకున్న ఎకనామిక్స్‌ సూత్రాన్ని అలా ఉపయోగించి ఉంటారాయన. విజయా సంస్థ అధినేత నాగిరెడ్డి, చక్రపాణిలు ఆశ్చర్యపోయినా ఒప్పుకున్నారు కానీ... పాతాళభైరవి దర్శకుడు కె.వి.రెడ్డి అంగీకరించలేదు. దాంతో- ఎన్టీఆర్‌ కాంట్రాక్టులో సంతకం చేయనన్నాడు. నిజానికి, ఆయన చేతిలో అప్పటికి సినిమాలేవీ లేవు... అయినా సరే తనపైన ఉన్న అచంచల విశ్వాసం అలా పట్టుబట్టేలా చేసింది. చివరికి కె.వి.రెడ్డి దిగిరావడంతో అంగీకారం కుదిరింది. షూటింగ్‌ ఉన్నా లేకున్నా నెలకి రూ.500 జీతం, ప్రతి చిత్రానికీ అయిదు వేలుపారితోషికం... ఇదీ ఒప్పంద సారాంశం! దాంతో ఎన్టీఆర్‌ నటుడిగానే కాదు ఆర్థికంగానూ కుదురుకున్నాడు! తన చదువుకోసం అమ్ముకున్న, తన పినతండ్రి మోసం చేసి చేజిక్కించుకున్న భూములన్నింటినీ కొని తండ్రికి తొలి కానుకగా అందించాడు. విజయవారి ఆ సినిమాలతోనే- తెలుగు సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతారలా ఎన్టీఆర్‌ తొలి అడుగులు మొదలయ్యాయి!        


డబ్బూ నడకా!

చిన్ననాటి కష్టాలు ఆయన్ని మహా పొదుపరిగా మార్చాయి. సూర్యనారాయణ కేసు నిమిత్తం బొంబాయి వెళ్ళినప్పుడు లాయర్‌ ఆఫీసుకి దాదాపు 12కి.మీ. నడిచే వెళ్ళేవారు ఎన్టీఆర్‌. సూర్యనారాయణ కుటుంబం డబ్బు ఇస్తామన్నా ‘అసలే కష్టాల్లో ఉన్నవాళ్ళకి అదనపు ఖర్చెందుకు?’ అనేవారట. మద్రాసుకి తొలిసారి వెళ్ళినప్పుడు అక్కడో లాడ్జికి తీసుకెళ్ళారట. గది అద్దె రోజుకి ఐదు రూపాయలు. అంతఖర్చు అక్కర్లేదన్న ఆయన... మరో లాడ్జికి తీసుకెళ్ళమన్నాడట. అక్కడా అద్దె ఐదురూపాయలే కానీ... ఆ గదిని మరొకరితో కలిసి పంచుకునే అవకాశం ఉండటంతో దాన్నే తీసుకున్నాడు.


గురువందనం!

1958లో... విజయవాడలో అగ్గిరాముడు విజయోత్సవం జరుగుతోంది. అందులో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ అక్కడ తాను తిరిగిన వీధులూ, తన బడి రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు. అకస్మాత్తుగా ప్రసంగం ఆపేశారు. ఉన్నపళంగా వేదిక దిగి వెళ్ళి జనాల్లో ఉన్న ఓ పెద్దాయన్ని చేయి పట్టుకుని స్టేజీపైకి తీసుకొచ్చారు. తన పక్కసీట్లోనే కూర్చోబెట్టి పాదాభివందనం చేశారు. నిమ్మకూరులో తనకి తొలి పాఠాలు నేర్పిన వల్లూరి వెంకటసుబ్బారావు మాస్టారు ఆయనేనని సభాముఖంగా చెప్పారు!


అందుకే... కృష్ణ, ఈశ్వరి!

ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం (అబ్బాయిలు: రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ-జూనియర్‌, జయశంకర్‌కృష్ణ; అమ్మాయిలు: లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి). వీరిలో రామకృష్ణ-సీనియర్‌ చిన్నప్పుడే మశూచి సోకి చనిపోయారు. సాయికృష్ణ, హరికృష్ణ, ఉమామహేశ్వరి కాలంచేశారు. ఎన్టీఆర్‌ శనివారం వేంకటేశ్వరుణ్ణి, సోమవారం శివుణ్ణి భక్తిశ్రద్ధలతో నిష్ఠగా కొలిచేవారు. కృష్ణుడు తన ఆరాధ్య దైవం కూడా. మగ పిల్లల పేర్ల చివరన కృష్ణ అనీ, ఆడపిల్లల పేర్ల చివర ఈశ్వరి అనీ వచ్చేట్టు పెట్టడం వెనక కారణం ఇదేనని చెబుతారు.


శ్రీమతి ఎదురు రావాల్సిందే!

నటుడిగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎన్టీఆర్‌ రోజుకు 16 గంటలు పనిచేసేవారు. నియమనిబద్ధతలతో కూడిన ఆ జీవితంలో ప్రతి ఉదయం 5.30 నుంచి 6.30 వరకే కుటుంబ వ్యవహారాలు పట్టించుకునేవారు. ఆ విషయాలూ భార్య బసవతారకంతోనే మాట్లాడేవారు. ఎక్కువగా ఆమె సలహాలే వినేవారు. సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ ఏ కొత్త ప్రాజెక్టు కోసం వెళుతున్నా సరే భార్య బసవతారకం ఎదురు రావాలని కోరుకునేవారు. అదో సెంటిమెంటు ఆయనకి. 1982 మార్చి 29న... రాజకీయ పార్టీ స్థాపన కోసం హైదరాబాద్‌ వెళుతున్నప్పుడూ అలాగే ఎదురుచూశారు కానీ ఆమె రాలేదు! ‘ఎక్కడున్నారామె?’ అని వాకబు చేస్తే ‘కారులో ఉన్నారండీ... మీతోపాటే ఎయిర్‌పోర్టుకి వస్తున్నారు’ అని జవాబు వచ్చింది. ఆయన ఏమీ మాట్లాడలేదు. కారు మద్రాసు ఎయిర్‌పోర్టుని సమీపించింది. అప్పుడు సడెన్‌గా కారు ఆపించారు బసవతారకం. ఆపి... ఆయన విమానాశ్రయంలోకి అడుగుపెడుతుండగా అప్పుడు చిరునవ్వుతో ఎదురొచ్చారు! ఆ శుభసంకేతంతోనే హైదరాబాద్‌ చేరుకుని పార్టీని స్థాపించారు ఎన్టీఆర్‌.


ఒక్క మెతుకు కూడా..!

అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు ఎన్టీఆర్‌. ఒక్క మెతుకు కూడా కిందపడనిచ్చేవారు కాదు. పొరపాటున మెతుకు కింద పడితే తిరిగి తీసుకుని కళ్లకద్దుకుని నోట్లో పెట్టుకునేవారు. ‘అదేమిటి ఒక్క మెతుకే కదా!’ అని అంటే... ‘మనం కష్టపడేది ఈ మెతుకు కోసమే కదా’ అనేవారట.


చదువంటే అంత మమకారం!

ఎన్టీఆర్‌కి చెందిన ‘నేషనల్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌’ సంస్థ మేనేజర్‌... పరుచూరి శివప్రసాద్‌. ఆయన ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన తన కొడుకు సురేంద్రని అమెరికాలో ఉన్నత చదువులకి పంపాలనుకున్నాడు. సురేంద్రకేమో సినిమాల్లోకి వెళ్ళాలని కోరిక! ఆ విషయం ఎన్టీఆర్‌ వద్దకు వచ్చింది. ‘జీవితంలో ఏ పని ఎప్పుడైనా చేయొచ్చు... చదువుని మాత్రం నిర్దిష్ట వయసులో పూర్తిచేయాలి’ అని సురేంద్రని మందలించి ఒప్పించారు ఎన్టీఆర్‌. ఆయనకి ప్రోత్సాహంగా ఉంటుందని తానే స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి సెండాఫ్‌ ఇచ్చారు! దర్శకుడు కె.వి.రెడ్డి సైతం అవసాన దశలో ఇలాగే - ఐఐటీ పూర్తిచేసిన వాళ్ళబ్బాయిని అమెరికాకి పంపించాలనుకున్నారు. కానీ డబ్బు లేదు. ఆయన నలుగురిని అడిగే వ్యక్తి కాదు. ఓ రోజు యథాలాపంగా ఎన్టీఆర్‌తో తన కొడుకు విషయం చెబితే ‘మన కుటుంబాల్లో ఎవరూ అమెరికాకి వెళ్ళలేదు. మీవాణ్ణి వెళ్ళనివ్వండి’ అన్నారట. అంతేకాదు, ఆయన చేతిలో రూ.20 వేలు పెట్టారు. ఊరకే ఇస్తానంటే కెవి రెడ్డి నొచ్చుకుంటారని ‘నేను తీసే శ్రీకృష్ణ సత్య సినిమాకి మీరే దర్శకులు. దానికిది అడ్వాన్స్‌’ అన్నారట. ఎన్టీఆర్‌కి చదువన్నా, చదువుకునేవాళ్లన్నా అంత ఇష్టం!


బ్రహ్మ ముహూర్తం...

బ్రహ్మ ముహూర్తమంటే ఎన్టీఆర్‌కు ఎంతో నమ్మకం. ఆయన ఆ ఘడియలలోనే నిద్రలేచేవారు. అందుకని రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకల్లా నిద్ర పోయేవారు. పిల్లల్ని కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవమని చెప్పేవారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లోనే కాదు, నటనను ఔపోసన పట్టిన తరువాతా వేకువన మూడు గంటలకే లేచి డైలాగులు ప్రాక్టీసు చేసేవారు. పెద్దగొంతుతో ఆయన డైలాగులు చెబుతుంటే ఇల్లంతా అదిరిపోయేదట.


పెళ్ళికి పౌరోహిత్యం!

నాగభైరవ కోటేశ్వర్రావు... ఎన్టీఆర్‌ ఎంతో అభిమానించిన కవి. 1988 జులై 7న కోటేశ్వరరావు వాళ్ళబ్బాయి పెళ్ళి. ఉదయం ఆరున్నరకి ముహూర్తం. ఎప్పట్లాగే టైమ్‌కి ఠంచనుగా వచ్చిన ఎన్టీఆర్‌... నేరుగా వివాహ వేదికనెక్కి కోటేశ్వరరావు చెవిలో ఏదో చెప్పారు. అంతే... అప్పటిదాకా పెళ్ళిమంత్రాలు చదువుతున్న పురోహితుడు వేదిక దిగితే, ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ కూర్చున్నారు! మైక్‌ అందుకున్న ఎన్టీఆర్‌ ‘ఈ పెళ్ళికి నేను పౌరోహిత్యం వహిస్తాను’ అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పౌరోహిత్యం చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోతుంటే తాను మాత్రం తాళి పరమార్థం, సప్తపది ఔన్నత్యం, వివాహ వ్యవస్థ గొప్పతనాల గురించి సంస్కృత శ్లోకాలని అలవోకగా చెప్పి వాటి అర్థాలని విపులీకరించారు.


ఇందిరమ్మ మెచ్చుకున్నారు!

1984లో ముఖ్యమంత్రిగా తొలిసారి దిల్లీ వెళ్ళారు. ప్రధాని ఇందిరాగాంధీని కలవాలి. అప్పటిదాకా ఆమె విధానాలని తీవ్రంగా తూర్పారపట్టినవాడాయన. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ ఆమె ఛాంబర్‌లోకి వెళ్లారు. ముందు ఇందిర ఆయన పట్ల బింకంగానే ఉన్నా ఆయనలోని నిరాడంబరత, సంస్కారాన్ని ఇట్టే అర్థం చేసుకుని ప్రసన్నంగా మాట్లాడారు. ‘మా రాష్ట్రంలో మిమ్మల్ని అమ్మ అంటారు...’ అని మొదలుపెట్టి, ‘పెట్టే అమ్మనే కదా ఎవరైనా అడుగుతారు’ అంటూ ఏ కపటమూ లేకుండా రాష్ట్రం అవసరాలని చెప్పిన తీరు ఆమెకి బాగా నచ్చిందట. ఐదు నిమిషాలన్నది కాస్తా 30 నిమిషాల ఆత్మీయ సమావేశంగా సాగింది. ఎన్టీఆర్‌ విచక్షణ కలిగిన ముఖ్యమంత్రి అని ఆ తర్వాత తన అధికారుల దగ్గర సంతృప్తి వ్యక్తంచేశారట ఇందిర.


పిల్లలకూ ఆ డాబు లేదు!

పిల్లలెవరికీ తండ్రి పేరు చెప్పుకుని లబ్ధి పొందడమనే ప్రసక్తే ఉండేది కాదు. ఓసారి రామకృష్ణ(జూనియర్‌) ముషీరాబాద్‌లో తన స్కూటర్‌ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారట. ‘నో పార్కింగ్‌... అన్నచోట పార్కింగ్‌ చేశావు. బండికి తాళం కూడా వేయవా’... అంటూ దురుసుగా మాట్లాడి చలానా కట్టమన్నారట. చలానా రాస్తూ తండ్రి పేరు అడిగితే... ఎన్‌టీ రామారావు అని చెప్పారట, ఏం చేస్తారని అడిగితే సీఎం అని బదులిచ్చారట. తర్వాత ‘పొరపాటైంది, బండి పట్టుకుపోండ’ని చెప్పినా... ఆయన మాత్రం చలానా కట్టి మరీ వచ్చారట.


సొంతూరి కోసం...

నిమ్మకూరుకు వెళ్ళాలంటే నాగలేరు దాటుకునే పోవాలి. ఇందుకోసం ఒకప్పుడు పంట్‌లు ఉపయోగించేవారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన ఏడాదిలోనే... దీనిపైన వంతెన కట్టించి తొలిసారి రోడ్డు వేయించారు. రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీని ఏర్పాటుచేశారు. వీటితోపాటూ మహిళల ఉపాధి కోసం మహిళా ప్రాంగణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనీ తన సొంతూరికి అందించారాయన. తన పెద్దమ్మ చంద్రమ్మ కోరిక మేరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.తిరుమల ఆలయాన్ని పోలిన ఈ గుడిని ఇప్పటికీ తితిదే సంస్థే నిర్వహిస్తోంది!


హరికృష్ణకి మాత్రమే ఆ ధైర్యం..

ఎన్టీఆర్‌తో మాట్లాడాల్సి వస్తే పిల్లలు పెద్దాయన కళ్లలోకి చూసేవారు కాదు. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత విషయం ఏదైనా చెప్పినప్పుడు ఎన్టీఆర్‌ సరేననడమో, ఇలా చేయండని చెప్పడమో, వద్దనడమో ఉండేదట. ఆ మాటకు పిల్లల నుంచి మారు ప్రశ్న వచ్చేది కాదు. డబ్బు విషయంలోనూ పొదుపుగా ఉండాల్సిందే. ఓసారి పండక్కి అమ్మాయిలు చీరలు కొనడానికి వెళ్లినప్పుడు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తం ఖర్చయింది. అదనపు డబ్బు పంపిస్తామని షాపు యజమానికి చెప్పి చీరల్ని ఇంటికి తీసుకువెళ్లారట. విషయం ఎన్టీఆర్‌కు చెబితే, ‘మీకు ఇచ్చిన డబ్బుతో ఎన్ని వస్తే అన్నే తీసుకోండి. మిగతావి తిరిగి ఇచ్చేయండ’ని చెప్పారట. పిల్లల్లో హరికృష్ణ, పురందేశ్వరి మాత్రం ఇందుకు కొంత మినహాయింపు. హరికృష్ణ నిమ్మకూరులో తాతగారి దగ్గర పెరిగారు. ఆ పల్లెటూరి పెంపకం హరికృష్ణకి మిగతావాళ్ళకి లేని ధైర్యాన్నిచ్చింది. రెండో కుమార్తె పురందేశ్వరి తల్లితోపాటు ఎక్కువగా ఉండేవారు. అలా నాన్నతోనూ కొంత చనువు ఉండేది.


తెలుగు కోసం

ఇంగ్లిష్‌ మీడియం చదువుల్లోపడి పిల్లలు ఎక్కడ తెలుగులో వెనకబడతారోనని ప్రత్యేకంగా తెలుగు నేర్పేందుకు మర్నూరి కృష్ణరంగం అనే గురువుని పెట్టారు ఎన్టీఆర్‌. మోహనకృష్ణ, సాయికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఈయన దగ్గర తెలుగు పాఠాలు నేర్చుకున్నారు.


 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..