ఎముకలకీ మెదడుకీ సంబంధం ఉందా?

వయసు మీదపడేకొద్దీ ఎముకల్లో పటుత్వం తగ్గిపోవడంతోపాటు మతిమరుపూ వస్తుంటుంది. కాబట్టి అవన్నీ వయసు ప్రభావమే అనుకుంటాం.

Published : 02 Apr 2023 01:04 IST

ఎముకలకీ మెదడుకీ సంబంధం ఉందా?

వయసు మీదపడేకొద్దీ ఎముకల్లో పటుత్వం తగ్గిపోవడంతోపాటు మతిమరుపూ వస్తుంటుంది. కాబట్టి అవన్నీ వయసు ప్రభావమే అనుకుంటాం. కానీ ఎముకల సాంద్రత తక్కువగా ఉన్నవాళ్లలోనే మతిమరుపూ వచ్చే ప్రమాదం ఎక్కువట. అందుకే మలివయసులోనూ చకచకా నడుస్తూ అన్నివిధాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో డిమెన్షియా, ఆల్జీమర్స్‌... వంటి సమస్యలు పెద్దగా కనిపించవు అన్నది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ నిపుణుల ఉవాచ. అలాగని ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం కూడా మతిమరపునకు కారణం కాదు. ఈ రెండింటికీ సంబంధం మాత్రం ఉందనేది వీళ్ల పరిశీలన. సాధారణంగా వృద్ధాప్యంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడంవల్ల ఎముకల్లో బలం తగ్గుతుంది. వాటి ప్రభావం మెదడుమీదా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికీ సంబంధం ఉండొచ్చు అని భావించిన నిపుణులు డెబ్భై ఏళ్లు దాటి మతిమరుపు లేనివాళ్లని ఎంపికచేసి నాలుగైదేళ్లకోసారి పరీక్షలు చేస్తూ వచ్చారట. అందులో ఏడు వందలమందికి పదేళ్ల కాలంలో మతిమరుపు పెరిగింది. ఆ తరవాత వాళ్లలో ఎముకల సాంద్రతనీ పరీక్షించినప్పుడు- ఇది తగ్గినవాళ్లలోనే మతిమరుపూ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఈ రెండింటికీ సంబంధం ఉండొచ్చనీ ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు మతిమరుపు రాకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనీ సూచిస్తున్నారు నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..