వజ్రాలు... ఓ ఫౌంటెయిన్‌లా!

‘వజ్రాలు... ఫౌంటెయిన్‌ నీళ్ళలా ఎగసిపడటమేంటీ?!’ అనిపిస్తోంది కదూ! ఒకప్పుడు మన గోల్కొండ రాజ్యం వజ్రాలకి నెలవు. ఇప్పుడేమో అవి దక్షిణాఫ్రికాలోనే ఎక్కువగా దొరుకుతున్నాయి. అసలు ఈ ప్రాంతాల్లో మాత్రమే వజ్రాల నిక్షేపాలు ఎలా వచ్చాయి... అన్న సందేహం కలిగింది శాస్త్రవేత్తలకి. సాధారణంగా వజ్రాలు భూమికి 150 కిలోమీటర్ల లోతులో ఉన్న అగ్నిగోళంలాంటి ‘మాంటెల్‌’ అనే ప్రాంతంలో పుడతాయంటారు.

Updated : 04 Feb 2024 00:07 IST

‘వజ్రాలు... ఫౌంటెయిన్‌ నీళ్ళలా ఎగసిపడటమేంటీ?!’ అనిపిస్తోంది కదూ! ఒకప్పుడు మన గోల్కొండ రాజ్యం వజ్రాలకి నెలవు. ఇప్పుడేమో అవి దక్షిణాఫ్రికాలోనే ఎక్కువగా దొరుకుతున్నాయి. అసలు ఈ ప్రాంతాల్లో మాత్రమే వజ్రాల నిక్షేపాలు ఎలా వచ్చాయి... అన్న సందేహం కలిగింది శాస్త్రవేత్తలకి. సాధారణంగా వజ్రాలు భూమికి 150 కిలోమీటర్ల లోతులో ఉన్న అగ్నిగోళంలాంటి ‘మాంటెల్‌’ అనే ప్రాంతంలో పుడతాయంటారు. అవి అక్కడి నుంచి ఎలా వచ్చాయీ ఎందుకొచ్చాయీ అన్నది ఇప్పటిదాకా తేలలేదు. దీనిపైన- ఇంగ్లండుకి చెందిన సౌతాంప్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనకి దిగారు. ఇందుకోసం ల్యాబుల్లో 50 కోట్ల సంవత్సరాల నాటి భూమి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ పరిశోధనలు తేల్చిన విషయం ఇది - ‘ప్రస్తుతం భూమిపైన ఉన్న ఖండాలన్నీ ఒకప్పుడు ఓ పెద్ద ముద్దగా కలిసుండేవి. దానిపేరు గోండ్వానా. అక్కడి నుంచే భారత ఉపఖండం, ఆఫ్రికా, వంటివి విడిపోయి దూరమయ్యాయి. అప్పటిదాకా దగ్గరున్నవి కాస్త దూరమైపోతే వాటికింద భూఫలకాలు(టెక్టానిక్‌ ప్లేట్స్‌) కదులుతాయి కదా! అలా కదిలినప్పుడే మాంటెల్‌పైన తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి- అగ్నిపర్వతంలా పేలి వజ్రాలు ఓ ఫౌంటెయిన్‌లా భూమి పైపొరకి చిమ్ముకొచ్చాయట. అందుకే- గోండ్వానా నుంచి దూరమైన ఆసియా, ఆఫ్రికాల్లో ఇవి ఉంటున్నాయని తేల్చారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మరెన్నో వజ్రాల గనుల్ని సులభంగా వెతకడానికి ఈ పరిశోధన ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..