పూర్వ విద్యార్థుల అపూర్వ సేవ!

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోని పెద్దమనసు వారిది. తమ ఉన్నతికి పునాదులైన సంస్థలను తల్లిదండ్రులుగా భావించే సంస్కారమూ వారి సొంతం. వాళ్ల సేవా కార్యక్రమాలు ఇప్పుడు పేద ప్రజలెందరికో ఉపయోగ పడుతున్నాయి. విద్యాపరిమళాలను వెదజల్లుతున్నాయి.

Published : 19 Mar 2023 00:23 IST

పూర్వ విద్యార్థుల అపూర్వ సేవ!

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోని పెద్దమనసు వారిది. తమ ఉన్నతికి పునాదులైన సంస్థలను తల్లిదండ్రులుగా భావించే సంస్కారమూ వారి సొంతం. వాళ్ల సేవా కార్యక్రమాలు ఇప్పుడు పేద ప్రజలెందరికో ఉపయోగ పడుతున్నాయి. విద్యాపరిమళాలను వెదజల్లుతున్నాయి.


గురుకులానికి కొత్త రూపం

ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లా హిందూపురానికి దగ్గర్లో ఉండే కొడిగెనహళ్లిలో 1972లో ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభమైంది. రాయలసీమ జిల్లాల్లోని ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులకు అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడ ఉచితంగా విద్యాబోధన జరుగుతుంది. అక్కడ చదువుకున్న వాళ్లలో చాలామంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో- వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్నారు. మరికొందరు ఇస్రో, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీల్లో శాస్త్రవేత్తలుగానూ; కార్పొరేట్‌ సంస్థల్లో సీఈవోలుగానూ; ఐఐటీ, ఎన్‌ఐటీలతోపాటు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగానూ ఉన్నారు. గురుకులం అందించిన విద్యాఫలాలతో ఎదిగిన ఆ పూర్వవిద్యార్థులు దాన్నింకా మెరుగైన వసతులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని రూ.4 కోట్లకు పైగా పోగుచేశారు. ఆ డబ్బుతో ఆర్వో యంత్రాన్ని అమర్చారు. 2.25 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీళ్ల ట్యాంకునూ , మరుగుదొడ్లనూ నిర్మించారు. వసతి గృహంలో సోలార్‌ హీటర్‌, వంటగదిలో ఆవిరితో ఉడికే యంత్రాలతోపాటు అత్యాధునిక వంట సామగ్రిని అందించారు. 20 కంప్యూటర్లతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఆడిటోరియం-గ్రౌండ్‌లో ఆధునిక సౌకర్యాలు సమకూర్చారు. ఇతర అవసరాల కోసం ట్రాక్టర్‌ను బహూకరించారు. గురుకులంపై ప్రేమతో నాటి విద్యార్థులు సమకూర్చిన మెరుగైన వసతులతో ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి.


రూ.86 కోట్లతో...

ఆ ప్రభుత్వాసుపత్రిలో ఒకే పడకపై ఇద్దరు ముగ్గురు తల్లులనూ, వారి పిల్లలనూ ఉంచాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి బాధపడి... ప్రసూతి చికిత్సలకోసం అక్కడ ఓ కొత్త బ్లాక్‌ను కట్టించి ఇవ్వాలనుకున్నారు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) పూర్వవిద్యార్థులు. 1960ల్లో ఉత్తర అమెరికాలో వైద్యులుగా స్థిరపడిన వారిలో కొందరు ఆ కళాశాలలో చదువుకున్నారు. మరికొందరు హౌస్‌సర్జన్లుగా గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌)లోనూ పనిచేశారు. తమను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన జీఎంసీ, జీజీహెచ్‌లకు ఏదైనా చేయాలనే భావనతో చికాగోలో ‘గుంటూరు మెడికల్‌ కాలేజీ అలుమినీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా’ అసోసియేషన్‌ (జింకానా)ను ప్రారంభించారు. మొదట పదిమందితో మొదలైన ‘జింకానా’లో- జీఎంసీ, జీజీహెచ్‌లతో అనుబంధం ఉండి వేర్వేరు దేశాల్లో స్థిరపడిన మూడు వేల మంది దాకా సభ్యులయ్యారు. ఏడాదికోసారి సమావేశమయ్యే వీరంతా కొన్నాళ్ల కిత్రం అమెరికాలోని డల్లాస్‌లో కలుసుకున్నారు. అప్పుడే రూ.86 కోట్లతో జీఎంసీలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నారు. నలభై ఏళ్లుగా ‘జింకానా’ సభ్యురాలైన డాక్టర్‌ ఉమా గవని రూ.22 కోట్లు విరాళమిచ్చారు. గతంలో జీఎంసీలో రూ.6కోట్లతో 850 మంది కూర్చోవడానికి వీలైన ఏసీ ఆడిటోరియాన్ని ‘జింకానా’ సభ్యులు కట్టించారు. అలానే 13 పడకలతో ఐసీయూ నిర్మించారు. 2008-09లో ప్రభుత్వం-‘జింకానా’ సంయుక్త భాగస్వామ్యంతో జీజీహెచ్‌లో ‘పొదిలి ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌’ రూపుదిద్దుకొంది. దాంతో హాస్పటల్‌లో పడకలు మరో 250కి పెరిగాయి. అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లతో కూడిన ఈ బ్లాక్‌ ద్వారా గుండె, న్యూరాలజీ, యూరాలజీ వంటి విభాగాల్లో సామాన్యులకు ప్రత్యేక, అత్యవసర వైద్యసేవలు అందుతున్నాయి. దాదాపు వందమంది విద్యార్థులకు ‘జింకానా’ ట్రస్టు నుంచి ఏటా ఉపకారవేతనాలు అందిస్తున్నారు.

కాకర్ల వాసుదేవరావు, ఈనాడు, గుంటూరు


అంతా తానై...

పంజాబ్‌లోని నరన్‌వాలిలోని ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్‌ స్కూళ్లకు ఏమాత్రం  తీసిపోదు. ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దుకు చాలా దగ్గర్లో ఉండే కుగ్రామంలోని బడి ఆ స్థాయిలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. అంతలా మార్చిన వ్యక్తి 1973లో ఆ ప్రైమరీ స్కూల్‌లోనే చదువుకుని వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడిన  కుల్జీత్‌ సింగ్‌ గోశాల్‌. న్యాయవాదిగా పనిచేస్తున్న కుల్జీత్‌ అయిదేళ్ల క్రితం సొంతూరుకు వచ్చినప్పుడు తాను చదువుకున్న స్కూలుని కూలిపోయే స్థితిలో చూసి బాధపడ్డాడు. అప్పుడే దాన్ని సకల వసతులతో తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. రూ.75 లక్షలకు పైగా ఖర్చు చేసి ప్రైమరీ స్కూల్‌ను కొత్తగా కట్టించాడు. ఇంకో కోటిన్నర రూపాయలు పెట్టి మరో భవంతినీ సరిచేయించి రంగులు వేయించాడు. కొత్త బెంచీలూ, బల్లలూ, ఆట సామగ్రీ; మరుగుదొడ్లూ, తాగునీరూ తదితర సౌకర్యాల్నీ కల్పించి ఆధునికంగా మార్చేశాడు. పిల్లలందరికీ ఉచితంగా బట్టలూ, పుస్తకాలూ అందించే కుల్జీత్‌ కల్పించిన సౌకర్యాల వల్ల స్కూల్‌లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. డ్రాపవుట్లు తగ్గిపోయారు. అంతేకాదు, చుట్టుపక్కల ఇరవై గ్రామాల్లోని పిల్లలు సౌకర్యంగా చదువుకునేలా చూస్తున్న కుల్జీత్‌ ఎందరికో ఆదర్శం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..