వేల బతుకుల్ని వెలిగిస్తున్నారు!

‘మీకు చదువురాదు పశువులు కాయడం నయం!’ అని ఎదుటివాళ్ళంటే అవునేమో అనుకున్నారు. చదువుకీ పేదరికానికీ లంకె కుదరదని బలంగా నమ్మారు.

Published : 10 Feb 2024 23:38 IST

‘మీకు చదువురాదు పశువులు కాయడం నయం!’ అని ఎదుటివాళ్ళంటే అవునేమో అనుకున్నారు. చదువుకీ పేదరికానికీ లంకె కుదరదని బలంగా నమ్మారు. కానీ ఎప్పుడో ఎక్కడో మనసులో ఓ వెలుగు పుట్టింది. అది వీళ్ళకి దారిచూపి విద్యావంతుల్నిచేసింది. ఆ చిన్న ఆసరాతో నేడు నిరుపేద పిల్లల్ని ఉన్నతవిద్యావంతుల్ని చేస్తున్నారు. ఇద్దరూ- దేశంలోని చెరోమూలలో ఉంటేనేం... ఒకేరకం జీవితానుభవంతో స్ఫూర్తిపాఠమై నిలిచారు...

కటికపేదరికం నుంచి...

సాధారణంగా బ్లాక్‌బోర్డుల్ని మనం బడిలోనే చూస్తుంటాం. కానీ- పశ్చిమ్‌ బంగలోని ఆ ఏడు జిల్లాల గ్రామాల్లో ప్రతి పేదింట్లోనూ ఇవి కనిపిస్తాయి. కేవలం పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులూ, అవ్వాతాతలుకూడా ఒకేచోట వాటి ద్వారా పాఠాలు నేర్చుకుంటారు. సాయంత్రం కాగానే- ఈ బోర్డుల ద్వారా మూడుతరాలకి సంబంధించిన రకరకాల పాఠాలు చెప్పడానికి టీచర్లు వస్తారు. పుస్తకాలతోపాటు పుష్టికరమైన చిరుతిళ్ళూ తెచ్చి పంచుతారు. ఈ పాఠాలతో ప్రస్తుతం ఏడుజిల్లాల్లో 10 వేలమంది నిరుపేద విద్యార్థులూ వారి పెద్దలూ లబ్ధి పొందుతున్నారు. ఈ చదువుల కార్యక్రమాన్ని ‘రాస్తార్‌ మాస్టర్‌’(వీధి మాస్టార్‌) ఉద్యమం అంటున్నారు. పేదలకిలా చదువుచెప్పడానికని ప్రస్తుతం 150 మంది వీధి మాస్టార్లున్నా... ఇదంతా ఒక్కరితో మొదలైంది. ఆ ఒక్కడు... దీప్‌ నారాయణ్‌ నాయక్‌! 

పశ్చిమ్‌ బంగలోని జమూరియా జిల్లాలోని నందిగావ్‌ దీప్‌ నారాయణ్‌ సొంతూరు. తండ్రి చేసే కూలిపనులతోనే ఆ ఇంట తొమ్మిదిమంది కడుపు నిండాల్సిన పరిస్థితి. పదో తరగతిదాకా పుస్తకాలనే కాకుండా యూనిఫార్మ్‌లని కూడా సీనియర్‌ల తల్లిదండ్రుల దగ్గర దానమడిగి తెచ్చుకునేవాడట- దీప్‌ నారాయణ్‌! ఆ గడ్డుపరిస్థితులు దాటుకునే టెన్త్‌ పాసయ్యాడు. అంతటితో చదివింది చాలనుకుని కూలిపనులకెళ్లాడు. సాయంత్రాల్లో ట్యూషన్‌లు చెప్పేవాడు. ఆ పాఠాల్లో దీప్‌ నారాయణ్‌ ప్రతిభ గమనించిన ఓ వ్యక్తి తానే ఫీజుకట్టి ఆ తర్వాతి ఏడాది అతణ్ణి ఇంటర్‌లో చేర్చాడు. ఇంటర్‌ ముగించి, స్కాలర్షిప్పుతో బీఎస్సీ డిగ్రీ చేశాడు దీప్‌ నారాయణ్‌. టీచర్‌ ట్రైనింగ్‌ ముగించి సొంత జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలకి వచ్చాడు. జీతం తీసుకున్న ప్రతిసారీ ఇద్దరికి పుస్తకాలూ, యూనిఫామూ కొనిచ్చేవాడు. అంతకుమించి ఏదో చేయాలనుకున్నప్పుడే ‘ఇంటింటికీ బ్లాక్‌బోర్డు’ ఆలోచనొచ్చింది. గ్రామాల్లో నిరుపేదలకి దగ్గరగా ఉన్న ప్రతి గోడకీ వాటిని ఏర్పాటుచేశాడు. రోజూ ఉదయం సాయంత్రాల్లో ఇంటింటికీ వెళ్ళి వరసగా పాఠాలు చెప్పేవాడు. రెండేళ్ల తరవాత- సీనియర్‌ విద్యార్థులు వలంటీర్లుగా మారారు. పిల్లలతోపాటూ వారి తల్లిదండ్రులకీ, నాన్నమ్మాఅమ్మమ్మలకీ అక్షరాలతోపాటూ ప్రపంచజ్ఞానమూ నేర్పించసాగాడు. ఈ 3జీ మోడల్‌ అద్భుతమే చేసింది. ఒకప్పుడు అమ్మాయిల చదువుని వ్యతిరేకించే పెద్దల్లో మార్పొచ్చింది. బడికెళ్ళే అమ్మాయిల సంఖ్య పెరిగింది! అలా గత పదేళ్ళలో ఈ కుగ్రామాల నుంచి పదుల సంఖ్యల్లో ఇంజినీర్లూ, ప్రభుత్వోద్యోగులూ అయ్యారు.

ఆదివాసీలకి ‘ట్యాబ్‌’లిచ్చాడు!

ఏడాది మొత్తంలో మూణ్ణాలుగు నెలలు మాత్రమే బడిలో ఉండేవాడు దామోదరన్‌. మిగతా సమయంలో తల్లిదండ్రులతోపాటూ కూలీగా పొలాలకెళ్ళేవాడు. తొమ్మిదో తరగతి తర్వాత చదువుమీద కొంత దృష్టిపెట్టాడుకానీ... టెన్త్‌లో ఒక సబ్జెక్టు తప్పాడు. దాంతో దామోదరన్‌ తమ ఊళ్ళోని అందరు యువకుల్లాగే కేరళలోని ఇసుకబట్టీల్లో పనికెళ్ళాడు. రెండేళ్ళు అలా కేరళలో ఉండటం- అక్కడ చదువుకిస్తున్న ప్రాధాన్యం చూడటం అతనిలో మార్పు తీసుకొచ్చింది. ఇంటికొచ్చి చదువుకుంటానన్నాడు.  దాన్ని అందరూ వ్యతిరేకిస్తే- వాళ్ళమ్మ మాత్రం తోడు నిలిచింది. అప్పు చేసి మరీ ఇంటర్‌ చదివించింది. తమిళనాడులోని కళ్ళకురిచ్చి జిల్లాలో కచ్చిరాయపాళెం అన్న వాళ్ళ ఊరిలో తొలిసారి ఇంటర్‌ పూర్తిచేసినవాడు అతనే! దాంతో వాళ్ళమ్మ డిగ్రీ చదవమంది. ఆ కోరిక తీరకుండానే ఓ ప్రమాదంలో చనిపోయింది! అంత బాధనీ పంటికింద భరించి, అనారోగ్యంపాలైన తండ్రీ- బడికెళుతున్న తమ్ముళ్ళ బాధ్యతని తీసుకుని చెన్నైలోని కాలేజీలో చేరాడు. బీఎస్సీ మొదటి ఏడాది చదువుతుండగా- ఎయిడ్‌ ఇండియా అన్న ఎన్జీఓ సభ్యులు పరిచయమై అతణ్ణి మురికివాడలకి తీసుకెళ్ళారు. ఆర్థికంగా, సామాజికంగా అణగారిన ఆ కుటుంబాల దుస్థితి చూసి చలించిపోయిన అతను... ఆ విద్యార్థుల అభ్యున్నతికి కంకణం కట్టుకున్నాడు.

మురికివాడ పిల్లలకీ సులువుగా అర్థమయ్యేలా మ్యాథ్స్‌, ఇంగ్లిషు పాఠాల బోధనా పద్ధతుల్నీ, సాధనల్నీ అభివృద్ధి చేశాడు. ఎయిడ్‌ ఇండియాలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరయ్యాడు. ఆ క్రమంలోనే చెన్నై శివార్లలో పాములుపట్టే ఇరుళర్‌ ఆదివాసీల తెగ పిల్లలకి చదువుచెప్పాలని వెళ్ళాడట. పాతబట్టలూ సినిమా పోస్టర్‌లని కప్పి గుడిసెలు కట్టుకున్న వాళ్ళ దైన్యాన్ని చూసి కదిలిపోయాడు. వెంటనే- తమ సంస్థ ద్వారా 480 కుటుంబాలకి పక్కా ఇళ్ళు కట్టిచ్చి ఆ తర్వాత చదువు చెప్పసాగాడు. మాంటిస్సోరి పద్ధతిలో పిల్లలకి బొమ్మలతో ఆటాపాటా నేర్పించడం మొదలుపెట్టి- ఆరేళ్ళ వయసులో అందరూ స్థానిక బడిలో చేరేలా చూశాడు. ఐదోతరగతి పిల్లలకి ట్యాబ్‌లని అందించి పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఈ అనుభవాలతో తానూ ఆంత్రపాలజీలో పీజీ చేసి...గతేడాది డాక్టరేట్‌ కూడా అందుకున్నాడు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..