చక్కనమ్మకో చిట్టి ముత్యాల హారం!

చందమామ వన్నెలతో మెరిసిపోయే ముత్యాల దండే... ఒకనాటి అసలు సిసలైన హారమంటే. ఏడువారాల నగల్లో ఒకటైన ఆ ముత్యాల నగ... ఈతరానికి దూరంగా ఉంటే ఎలా.. అందుకే ట్రెండీ బంగారు నగల నగిషీల్లోనూ ఒకటైపోతూ సరికొత్త డిజైన్లలో రూపం మార్చుకుంది.

Published : 29 Jan 2023 00:58 IST

చక్కనమ్మకో చిట్టి ముత్యాల హారం!

చందమామ వన్నెలతో మెరిసిపోయే ముత్యాల దండే... ఒకనాటి అసలు సిసలైన హారమంటే. ఏడువారాల నగల్లో ఒకటైన ఆ ముత్యాల నగ... ఈతరానికి దూరంగా ఉంటే ఎలా.. అందుకే ట్రెండీ బంగారు నగల నగిషీల్లోనూ ఒకటైపోతూ సరికొత్త డిజైన్లలో రూపం మార్చుకుంది. ఆ నయా ముత్యాల సొగసులేంటో మీరూ ఓ లుక్కేయండి మరి!

ఒకసారి అమ్మని అడిగి చూడండి... తాను వేసుకున్న మొదటి హారమేంటని... ఎంతో అపురూపంగా చూపిస్తుంది వరసలుగా గుచ్చిన తన ముత్యాల దండని. అలంకరణతో పాటూ తీయటి జ్ఞాపకాల్ని ఇచ్చే ముత్యాల హారానికి ఒకప్పుడు ఉన్న వైభవం అలాంటిది మరి. విలువైన రాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ, నవరత్నాలన్నింటిలోనూ- అమ్మమ్మల కాలం నుంచీ అతివలకు బాగా దగ్గరైంది ముత్యాలే అన్నది నిస్సందేహం. అంతేకాదు... ఎలాంటి పసిడి కాంతుల జత లేకుండా వాటికున్న సహజమైన నిగారింపుతోనే కనువిందుచేశాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే మగువల కోసం అన్ని ఫ్యాషన్లలాగే ఆభరణాలూ మారాలిగా అనుకున్న బంగారు నిపుణులు... పసిడి నగలకే చూడచక్కని నగిషీలు చెక్కుతూ చంద్రహారాలు మొదలు చోకర్ల వరకూ ఎన్నో డిజైన్లను తీసుకొచ్చారు. ఏ డిజైన్‌ అయినా ఎంతోకాలం ట్రెండ్‌లో ఉండదుగా... అమ్మాయిల మెడలో అందంగా ఒదిగిపోవడానికి సరికొత్త మోడల్‌గా రావాల్సిందేగా. అందులో భాగంగానే ఇప్పుడు ఆనాటి ముత్యాల మురిపాల్ని జోడిస్తూ ఈ నయా జ్యువెలరీకి రూపమిచ్చారు.
ఉంగరాలూ, కమ్మలూ, పెండెంట్లకే ఎక్కువగా పరిమితమైన ముత్యాలు- నెక్లెసులూ, హారాలూ, కంటెలూ... ఇలా అవీ ఇవీ అని కాదు... దాదాపు అన్ని రకాల నగలతో కలిసిపోయి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. గుండ్రటి చిన్న చిన్న ముత్యాలే కాకుండా రైస్‌ పెరల్స్‌ పేరుతో అందుబాటులో ఉన్న చిట్టి చిట్టి మల్లె మొగ్గల్లాంటి ముత్యాలు ఈ నగల్లో మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. చైనా, అమెరికాల్లో ఎక్కువగా సాగుచేస్తున్న ఈ రైస్‌ పెరల్స్‌ని ఇదివరకు నగలకు అలంకరణగా మాత్రమే జోడిస్తే... ఇప్పుడు అచ్చంగా వాటితోనే నగకే ముత్యాల ముసుగేసినట్టుగా ఈ సరికొత్త హారాల్ని తయారుచేస్తున్నారు.

ఇంట్లో ఉన్న కొద్ది బంగారానికే ఇలా ముత్యాల్ని కలిపారంటే... ఎంచక్కా మీ నగల పెట్టెలోకి ఓ కొత్తరకం ఆభరణం చేరిపోయినట్టే. అంతేకాదు, ఈసారి ఏదైనా వేడుకకు చక్కటి చీర కట్టి ఎప్పటి నగలకు బదులు దాని మీద ఒకే ఒక్క ముత్యాల దండా, దానికి మ్యాచింగ్‌ దిద్దులూ పెట్టుకుని వెళ్లండి... అందరి చూపూ మీ నయా నగ మీదే పడుతుందంటే నమ్మండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..