స్నేహితుడు

క్షణక్షణానికీ ఉత్కంఠని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో అక్షరదోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు.

Updated : 12 Mar 2023 02:34 IST

స్నేహితుడు

 శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు

నాఇంట్లోనే నన్నో దోషిలా చూస్తున్నారు. నేనేదో మహా అపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు. వారెవరో కాదు- నా కొడుకూ కోడలూ! నా భార్య అయిదేళ్ళ క్రితమే అనారోగ్యంతో కాలంచేసింది. నా కుటుంబ సభ్యులు వారిద్దరే. నేను అంత కాని పనేదో కచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు. నా గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకోవాలంటే- నన్ను అందరూ ‘నాయుడు మాస్టారు’ అని గౌరవంగా పిలుస్తుంటారు. మూడున్నర దశాబ్దాలపాటు స్కూలు మాస్టారుగా ఎందరో ఉత్తమ విద్యార్థినీ విద్యార్థులను సమాజానికి అందించి, ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’గా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులూ రివార్డులే కాక, ఎన్నెన్నో సన్మానాలూ సత్కారాలూ అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని. ఈ మధ్యే రిటైరైన ప్రభుత్వ ఉద్యోగిని. నా వృత్తి నుండి రిటైరైనా, నా ప్రవృత్తికి రిటైర్మెంట్‌ ఎన్నడూ ప్రకటించుకోలేను. రచనా వ్యాసంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి.
నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా, నా రచనల వల్ల ఒకింత ఎక్కడో చిన్నమార్పు సంభవించినా నా జీవితానికి అదో సంతృప్తిని ఇస్తుందని నమ్ముతాను. అలాంటి నేను- నా కుటుంబ సభ్యుల ముందు తల దించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే- క్యాలెండరులోని పేజీలు ఓ ఆరు నెలలు వెనక్కు తిప్పాల్సిందే.

*          *          *

ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా ‘ఆరవ కథల సంపుటి’ పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది. చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా ‘‘సార్‌, నమస్కారం!’’ అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి, నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమి పని అన్నట్టుగా చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న ‘కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుందాం’ అన్నట్టుగా చూశాడు. వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చతికిలపడుతూ ‘ఇప్పుడు చెప్పరా అబ్బాయి...’ అన్నట్టుగా చూశాను.

ఆ కుర్రాడు ‘‘సార్‌, మీ ఆటోగ్రాఫ్‌ ప్లీజ్‌...’’ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు. అలా పుస్తకాలపైన ‘సాహితీప్రియులకు అభినందనలతో...’ అంటూ ఆటోగ్రాఫులు రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది.

నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు ‘శశాంక్‌’ అని చెప్పాడు. ‘శశాంక్‌కి సాహితీపూర్వక అభినందనలతో...’ అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని, ఆ కుర్రాడు తీసుకుంటూ ‘‘సార్‌, నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చూసుకుని వాటిల్లోని లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలను కుంటున్నాను’’ వినమ్రతగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపారా. మూతిమీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టులేదు.

‘‘సరే చూద్దాం’’ అన్నాను క్యాజువల్‌గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని ‘‘సార్‌, ఎక్కడ కలవమంటారు?! మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం...’’ అంటూ అర్థోక్తిగా ఆగిపోయి, నా బదులుకోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతూ ‘‘నా అడ్రసు గట్రా అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట...’’ అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా ‘‘ఇందులో ఉంది కదా సార్‌’’ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కానీ, వదిలేటట్టులేడని నాకర్థమయింది.
ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి ‘‘సాయంత్రం అయిదు గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చేయ్‌. అక్కడ కలుద్దాం’’ అన్నాను బయల్దేరడానికి ఉద్యుక్తమవుతూ. ‘‘సార్‌, ఒక్క సెల్ఫీ...’’ అర్థింపుగా అడిగాడు. ప్రతీ సభల్లోనూ అలవాటైన ప్రక్రియే కావడంతో ఫొటోకి పోజిచ్చాను. తరువాత ఎవరిమానాన వాళ్ళం వెళ్ళిపోయాం.

అదేరోజు సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుండగా నా సెల్‌ఫోన్‌ రింగయింది. లిఫ్ట్‌ చేసి ‘‘హలో’’ అన్నాను. ‘‘నేను సార్‌, శశాంక్‌ని. ఉదయం సభలో కలిశాను కదా...’’ అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం. ఆ సంగతే మర్చిపోయాను. రోజూ వాకింగ్‌ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్ళి, కాసేపు పత్రికలు తిరగేసి రావడం దినచర్యలో ముఖ్యభాగం.
‘‘పది నిమిషాల్లో అక్కడ ఉంటానని’’ చెప్పి హడావిడిగా బయదేరి వెళ్ళాను. ఆ కుర్రాడు ఓ సిమెంట్‌ బెంచీ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నన్ను చూడగానే లేచి నిల్చుని ‘‘రండి సార్‌, కూర్చోండి’’ అంటూ నాపట్ల తన విధేయతను కనబర్చాడు. నేను కూర్చుంటూ తననీ పక్కనే కూర్చోమన్నాను. తను ‘‘ఫరవాలేదు సార్‌’’ అని అలాగే నిల్చున్నాడు. నేను బలవంతంగా చేయిపట్టుకు లాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు.

నేను ఉపోద్ఘాతం లేకుండా ‘‘నీ రచనలు తెచ్చావా?’’ అని కొంచెం చిరాకు ధ్వనించిన స్వరంతో అడిగాను. ‘ఏవేవో పిచ్చిపిచ్చివి రాసుకొచ్చేస్తారు... చదవమంటూ చావగొడుతుంటారు...’ నా మనసులో అనుకుంటుండగా, ఆ కుర్రాడు గబగబా తనవెంట తెచ్చుకున్న ఫైలులోంచి కొన్ని పేపర్లు తీసి, నా చేతికందించాడు. తెల్లటి పేపరుమీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది.

క్షణక్షణానికీ ఉత్కంఠని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను. కథ ముగింపు అద్భుతంగా ఉంది. అతను రాసిన వాక్యాల్లో అక్షరదోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు. కథా నిర్మాణం పకడ్బందీగా కొనసాగింది. అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు. ప్రతీ వాక్యమూ చేయి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా ఉంది అతని రచన.
ఆ ఇరవైఏళ్ళ కుర్రాడి రచన అరవైయేళ్లు పైబడిన నన్నే ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థంకాక కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాను. కొన్నిక్షణాల అనంతరం ‘‘ఏమో అనుకున్నాను. కథ బాగా రాశావయ్యా. రచనా రంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. కీపిటప్‌...’’ అంటూ ప్రశంసించాను.
ఓ సీనియర్‌ రైటరుగా నాకో పెద్దరికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసిచేసి అతి కష్టమ్మీద రెండు మూడు విషయాలు చెప్పాను. నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించనక్కరలేదు.
ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను.
వెంటనే ఇంకొక కథ తీసిచ్చాడు. ‘‘ఎన్ని రాశావేంటి..?’’ అని నివ్వెరపోతూ అడిగాను. ఓ ఆరు కథలదాకా ఉన్నాయి సార్‌’’ అన్నాడు వినయంగా. ‘‘అవన్నీ ఇక్కడ చదవడం వీలుకాదుగాని ఇంటికి తీసుకెళ్ళి చదువుతాను. రేపు ఇదే టైమ్‌కి ఇక్కడికే వచ్చేయ్‌’’ అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను.
ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నింటినీ ఏకబిగువునా చదివేశాను. కథలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ప్రతీ రచనలోనూ పరిణతి కనిపించింది. వాడి రచనలన్నీ చదవగానే నాకో విషయం బోధపడింది. వాడు ఏదో రోజు కచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని గట్టి నమ్మకం కుదిరింది.
అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్‌. ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను. కథల హడావిడిలో పడి అంతవరకూ ఆ అబ్బాయి గురించి ఏ వివరమూ అడగలేకపోయాను. అప్పుడు అడిగాను.
అమ్మానాన్నలకు తానొక్కడినేనని చెప్పాడు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాననీ, తనకు కాలేజీ నాన్నకు ఆఫీసూ దూరమైతున్నాయనీ... విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామనీ, దగ్గర్లోనే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నామనీ చెప్పాడు.
రోజురోజుకీ మా మధ్య బంధం బలపడసాగింది. రోజూ సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఒక్కోసారి నా కథలకు మలుపులూ ముగింపులూ ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్‌ని అడగడానికి మొహమాటపడేవాణ్ణి కాదు.
నిత్యమూ మా మధ్య సాహిత్యంపైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్థమానంగా సాగిపోతోంది. ప్రాచీన సాహిత్యం మొదలుకుని నేటి ఆధునిక సాహిత్యం వరకూ మా చర్చలు విస్త్రృతంగా కొనసాగేవి.
ఒకరోజు శశాంక్‌ చాలా మూడీగా కనిపించాడు. విషయమేంటని అడిగాను. ‘‘సాహితీ వ్యాసంగంలోపడి చదువుకోవట్లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్‌’’ అన్నాడు బాధగా. ‘‘వాళ్ళు చెప్పిందీ నిజమే కదా శశాంక్‌. సాహిత్యమే జీవితం కాకూడదు. జీవితంలో ఒక భాగం మాత్రమే’’ అన్నాన్నేను నచ్చజెప్తున్న ధోరణిలో.
‘‘గురువుగారూ, మీరు కూడా మా అమ్మా నాన్నాల్లాగే మాట్లాడుతున్నారు. రోజూ కచ్చితంగా రెండు గంటలు నా చదువుకి కేటాయిస్తున్నాను... చాలదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్‌ల్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను’’ అంటూ
తన ఆవేదనను వ్యక్తపర్చాడు.
‘‘అది సరే, ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో అది చెప్పు’’ అంటూ ఆసక్తిగా అడిగాను. ‘‘ఎనిమిది గంటలు సార్‌!’’ అంటూ చప్పున బదులిచ్చాడు శశాంక్‌.
‘‘అదీ సంగతి! మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే- చెయ్యరూ..! ఆ ఇంజినీరింగ్‌ చదువు సమయాన్ని సాహిత్యానికీ... సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకీ మార్చుకో. అప్పుడు ఏ గొడవా ఉండదు. ఇదే ఆచరణీయం-ఆమోదయోగ్యం’’ సరైన జీవనమార్గాన్ని ప్రభోదిస్తున్నట్టుగా సూచించాను.
‘‘లేదు గురువుగారూ, కాలేజీకీ నిద్రకీ ఆరేసి గంటల చొప్పున అవిరైపోతున్నాయి. సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో తెలియని వెలితి. సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని సాంత్వన, అంతులేని ఆనందం దొరుకుతాయి సార్‌. ఇదో వ్యసనమైపోయింది’’ ఉద్వేగంగా అన్నాడు నన్ను కన్విన్స్‌
చేస్తోన్న ధోరణిలో.
సాహిత్యంపేరిట ఇకమీద వాడి విలువైన సమయాన్ని వృథా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను. నేను కావాలనే
ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు. శశాంక్‌ ఫోన్‌ చేశాడు. ఒంట్లో నలతగా ఉందని అబద్దం చెప్పాను. నేను వెళ్ళలేనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది.
ఆ మరుసటి రోజు కలిశాం.
కాసేపు సాహితీ సంగతులు మాట్లాడు కున్నాం. పోటీకి పంపించడానికి ఏదో కథ తీసుకువచ్చాడు. అది చదివి ఒకటీ రెండు సూచనలు చేసి బయదేరిపోయాను. శశాంక్‌ మొహంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది.
ఆ మరుసటిరోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను. బయట నా కొడుకూ కోడలితో ఎవరో గొడవపడుతున్నారు. నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను. గొడవ చేస్తున్నది ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు నన్ను చూడగానే ‘‘ఏమయ్యా పెద్దమనిషీ, ఇది నీకు ధర్మంగా ఉందా?’’ అంటూ ఆ ఆడమనిషి నిలదీస్తోంది. అక్కడేం జరుగుతోందో నాకర్థం కాలేదు. అయోమయంగా నా కొడుక్కేసి చూశాను.
‘‘ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం?’’ నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు. అప్పుడు నాకర్థమయింది- గొడవ చేస్తున్నవారిద్దరూ శశాంక్‌ తల్లిదండ్రులని.
నా కొడుకు మాటలకు ఎలా బదులివ్వాలో తెలియక కాసేపు తటాపటాయించాను.
‘‘నేనూ బాగా చదువుకోమనే చెప్తున్నాను. ముందు బతుకు తెరువు తర్వాతే ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను’’ అంటూ శశాంక్‌ తల్లిదండ్రులకీ, కొడుకూ కోడలికీ సమాధానంగా చెప్పాను.
‘‘చాలు చాల్లేవయ్యా! మాస్టారుగా పనిచేసిన వారు. ఆ మాత్రం మీకు తెలియదా? ఇలా కథలూ కవితలనీ... చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా?’’ అంటూ శశాంక్‌ తల్లి నా మొహమ్మీదే నన్ను నిలదీసింది.
‘నాయుడు మాస్టారు’గా ఎంతో మంచి పేరున్న నేను, శశాంక్‌ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తల కొట్టేసినంత పనైంది.
నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారులేరని మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు వారికి నచ్చజెప్పుకుంటున్నాడు. ‘ఇకమీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు’ అని గట్టిగా మాటిచ్చి వారిని పంపించేశాడు. తరువాత నా కొడుకూ కోడలూ ‘పెంటమీదవన్నీ ఇంటిమీదకి తెస్తున్నారు, మీ సమవయస్కులుతో స్నేహం చేసుకోండని’ ఈ స్కూల్‌ మాస్టారుకే క్లాసు తీసుకున్నారు.

*          *          *

మా పరిచయానికి అప్పుడే ఆరు నెలలు నిండిపోయాయా అనిపిస్తోంది. అయినాగానీ వాడి భవిష్యత్‌ దృష్ట్యా కొన్నాళ్ళపాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదనీ శశాంక్‌ని కలవకూడదనీ గట్టిగానే తీర్మానించుకున్నాను. ఆరోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్‌ కాల్‌ చేశాడు. నేను కావాలనే లిఫ్ట్‌ చేయలేదు. మళ్ళీ చేశాడు. ఇక బాగోదని ఫోనెత్తి మాట్లాడాను.
ఉదయం జరిగినదంతా చెప్పి, అమ్మానాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపర్చాను. శశాంక్‌ ‘సరే’నంటూ తన తల్లిదండ్రుల తరఫున నాకు క్షమాపణలు చెప్పాడు. శశాంక్‌ గొంతులో నిరాశా నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
వాడి మనసుకి కష్టంగా అన్పించినా అస్తమానం ఫోన్లు చెయ్యొద్దని సున్నితంగా చెప్పేశాను. నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టుంది.
చివర్లో మళ్ళీ చెప్పాను... సాహిత్యాన్ని కొన్నాళ్ళు పక్కనపెట్టి, క్లాస్‌ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని. వాడేమి మాట్లాడలేదు. నేను- ‘ఉంటాను’ అని తన బదులుకోసమైనా చూడకుండా కాల్‌ కట్‌ చేసేశాను. నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే, వాడు ఇకమీదట నాకు కాల్‌ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది.
ఆ తర్వాత నాలుగు రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోనుగానీ, మెసేజ్‌గానీ రాలేదు. నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అన్పించి, చాలాసార్లు కాల్‌ చేద్దామనుకున్నా, శశాంక్‌ తల్లిదండ్రుల మాటలు జ్ఞప్తికివచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్‌ నాన్న మా ఇంటికి వచ్చాడు. నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనం ఏదైనా బలంగా తలుచుకుంటే, అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను. అతను చాలా బేలగా, వేదనగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు కాంతివిహీనంగా లోనికి చొచ్చుకుపోయి, దైన్యంగా ఉన్నాడు.
అతన్ని చూసీ చూడగానే ‘‘మీవాడు ఇప్పుడైనా బుద్ధిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడా?’’ అడిగాను భయంభయంగా.
అతను నా మాటలకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు. శశాంక్‌- వాళ్ళుంటున్న సెకండ్‌ ఫ్లోర్‌ నుండి దూకేసి, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ. నేను ఒక్కసారిగా హతాశుడనయ్యాను.
ఆ సంఘటన జరిగి మూడురోజులైందని, తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్‌ తండ్రి బావురుమన్నాడు. నా మెదడుని ఒక్కసారిగా వెయ్యి వోల్టుల విద్యుత్‌ తరంగం తాకినట్టయ్యింది. అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే- నా మానసిక పరిస్థితి, అతనికంటే దారుణంగా తయారయ్యింది. అతనితో కలిసి శశాంక్‌ను చూసేందుకు హడావుడిగా ఆసుపత్రికి బయల్దేరాను.

శశాంక్‌ ఐసీయూలో బెడ్‌పైన అచేతనంగా పడుకుని ఉన్నాడు. ఆక్సిజన్‌ గొట్టాలు వాడి ముక్కుకీ నోటికీ తగిలించి ఉన్నాయి. వాడిని అలా చూడగానే నా గుండె చెరువైంది. నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆసుపత్రివారు కేటాయించిన గౌను లాంటి కోటుని తొడుక్కుని లోనికి వెళ్ళాను.
బెడ్‌పై వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు. ‘‘శశాంక్‌... శశాంక్‌...’’ అంటూ చిన్నగా గొంతు పెగుల్చుకుని పిలిచాను. వాడికి నా మాటలేవీ వినిపించలేదు. ‘‘శశాంక్‌, లే... నేను నీ కోసమే వచ్చాను...’’ మళ్ళీ మళ్ళీ పిలిచాను. వాడిలో ఎటువంటి స్పందనా కన్పించలేదు. నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను.
‘ఇదంతా ఎలా జరిగిందని’ బయట నిరీక్షిస్తోన్న తల్లిదండ్రులను అడిగాను. శశాంక్‌ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శశాంక్‌ తల్లి నీరసంగా గొంతు పెగుల్చుకుంది.
‘‘అంతా ఈయనే చేశారండీ. వాడి సాహిత్యపు పుస్తకాలన్నీ తగలబెట్టేస్తానని ప్రతిరోజూ బెదిరించేవారు. ఆ రోజు పుస్తకాలన్నిటినీ కుప్పలా పడేసి, వాటిపై పెట్రోల్‌ పోసి వాడి కళ్ళముందర అన్నంత పనీ చేయబోయారు. వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలోంచి కిందకి దూకేశాడు’’ అంటూ బావురుమంది ఆ కన్నతల్లి.
‘‘వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను అంతేకానీ చదువుకున్నవాడిని, పుస్తకాల్ని నేనెందుకు తగలబెడతాను, సార్‌?! నిజానికి మారాల్సింది వాడుకాదు, నేను. నా కళ్ళతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. ఇకమీదట వాడి ఇష్టానికే బతకమంటాను’’ అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూ రోదిస్తున్నాడు. వారిని అలా చూడగానే నా మనసెంతగానో క్షోభించింది.
కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టరుని ‘‘శశాంక్‌ కోమాలోంచి ఎప్పుడు బయటకొస్తాడని...’’ ఆశగా అడిగాను. శశాంక్‌ మెదడులో పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఎప్పుడు కలిగినా కోమాలోంచి బయటపడొచ్చని డాక్టరు స్పష్టంగా చెప్పాడు. నేను శశాంక్‌ గురించే ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను.
నా ఆలోచనల్లో శశాంకే నిండిపోయాడు. టీపాయ్‌పైన కనిపిస్తోన్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరగేశాను. ఏదీ చదవాలన్పించలేదు. యాంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమితానందానికి గురిచేసింది.
ప్రముఖ సాహితీ సంస్థవారు పెట్టిన కథల పోటీలో యువ రచయిత శశాంక్‌ కథకు ప్రథమ బహుమతి ‘లక్ష రూపాయలు’ అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది. ఆ పక్కనే శశాంక్‌ ఫొటో కూడా వేశారు. నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది.
ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకుని శశాంక్‌ ఉన్న ఆసుపత్రికి వెళ్ళేందుకు వడివడిగా అడుగులు వేశాను. సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచల్లగా నన్ను స్పర్శిస్తున్నాయి.
‘ఈ వార్త ఒక్కటి చాలు... వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి!’ నాకు బాగా తెలుసు. ‘సాహిత్యమే వాడి ఊపిరీ ఆయుష్షూ’ అని!?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..