అందుకే ముందే పెళ్లి చేసేశారు!

మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. క్రమంగా నిర్మాతగానూ మారి కొత్త నటుల్ని ప్రోత్సహిస్తున్న దుల్కర్‌ తన గురించి

Updated : 17 Aug 2022 15:05 IST

అందుకే ముందే పెళ్లి చేసేశారు!

మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. క్రమంగా నిర్మాతగానూ మారి కొత్త నటుల్ని ప్రోత్సహిస్తున్న దుల్కర్‌ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడిలా.

బాల్యం బస్సుల్లో...

చిన్నప్పుడు మేం చెన్నైలో ఉండేవాళ్లం. నాన్న హీరో అయినా ఆ ప్రభావం మాపై  పడకుండా విలాసాలకు దూరంగా  అక్కనీ, నన్నూ పెంచింది అమ్మ. బస్సులోనే మమ్మల్ని స్కూలుకు పంపేది. సెలవు రోజుల్లోనూ సిటీ బస్సుల్లోనే చెన్నై అంతా తిరిగేవాడిని. స్నేహితులతో కలిసి కాఫీ షాపుల్లో కూర్చునేవాడిని. అలా పెరిగిన నేను డిగ్రీ పూర్తి చేశాక అమెరికా వెళ్లి ఎంబీఏ చదివా.


నటన నచ్చదు...

ఎందుకో తెలియదు నాకు చిన్నప్పుడు నటనంటే ఇష్టముండేది కాదు. డైరెక్టర్ని అయి సినిమాలు తీయాలని కలలు కనేవాడిని. నాన్న మాత్రం నన్ను హీరోను చేయాలనుకున్నారు. అందుకే చదువు పూర్తి చేసి అమెరికా నుంచి వచ్చాక బోలెడు అవకాశాలు వచ్చినా ఏదీ ఒప్పుకోకుండా ఓ ఆర్నెల్ల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. ఆ తరవాతే సినిమాలు ఒప్పుకున్నా. నా రెండో సినిమా ‘జనతా హోటల్‌’కి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు రావడంతో సినిమాలపైన ఆసక్తి పెరిగింది.


వాటినే కొత్తగా..

నాకు పాత కార్లని కొత్తగా చేయించడం చాలా ఇష్టం. అలా చేయించిన బోలెడు కార్లుంటాయి నా గ్యారేజీలో. కాస్త సమయం దొరికితే చాలు కార్లకు సంబంధించిన పుస్తకాలు కొని చదువుతుంటా. యూట్యూబ్‌లోనూ గంటలు గంటలు కార్లను ఆధునికీకరించే వీడియోలనే చూస్తుంటా.


పెళ్లితో స్థిరత్వం...

చాలామంది స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటే మంచిదంటారు. నాన్న మాత్రం పెళ్లితోనే స్థిరత్వం వస్తుందని నమ్ముతారు. అందుకే పాతికేళ్లకే సినిమాల్లోకి కూడా రాకముందే తమకు నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి చేశారు. నాభార్య అమల్‌ సూఫియా ఆర్కిటెక్ట్‌. పెళ్లి తరవాత ఇంటికే పరిమితం అయింది. మా పాప మరియమ్‌కి ఐదేళ్లు.


ఆరోగ్య రహస్యం

కప్పు కాఫీతోనే నా రోజు మొదలవుతుంది. తరవాత ఓ గంటపాటు కార్డియో వ్యాయామాలు చేసి మూడు గ్లాసుల వేణ్నీళ్లు తాగుతా. బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్లూ, పండ్లూ, ఓట్స్‌ తీసుకుంటా. మధ్యాహ్నం కాల్చిన కూరగాయలు, గ్రీన్‌ సలాడ్‌ తింటా. రాత్రిపూట రోటీతోనే సరిపెట్టుకుంటా.


భయపడింది...

‘మహానటి’లో జెమినీ గణేశన్‌ పాత్ర వచ్చినప్పుడు ఎంతో సంతోషించా. ఆ తరవాత ఆ పాత్రకి న్యాయం చేస్తానో లేదో అని చాలా భయపడ్డా. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆ సినిమాలో నటించా. అయినాసరే ‘మహానటి’ విడుదలై ‘జెమినీ పాత్రలో నిన్ను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం’ అని చాలామంది చెప్పేవరకూ నాలో ఆ భయం పోలేదు.


మనసు పడింది...

నాకు కార్లతోపాటు డ్రైవింగ్‌ కూడా చాలా ఇష్టం. ఒకవేళ హీరోని కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని. అలానే నాకు కొత్త ఫీచర్లతో వచ్చే కార్లు కొనడం కూడా చాలా ఇష్టం. ఈ మధ్య మెర్సిడెజ్‌ ఏఎమ్‌జీ జీ63 ఎఫ్‌ఎల్‌ మోడల్‌కి చెందిన కారు మీద మనసు పడ్డా. దాని రేటు రెండున్నర కోట్లకు పైమాటే అయినా కొనేసి గ్యారేజీలో పెట్టా. ఈ బులెట్‌ ప్రూఫ్‌ కారు అత్యధిక వేగంతో దూసుకెళుతుంది.


ఆ సినిమాలిష్టం...

చిన్నతనంలోనే చెన్నైలో పెరగడం వల్ల నాకు  తెలుగు త్వరగా వచ్చింది. రాజమౌళికి వీరాభిమానిని. ‘మగధీర’, ‘బాహుబలి’ ఎంత ఇష్టమో. అలానే నాన్న నటించిన ‘స్వాతికిరణం’ ఎప్పటికీ నా ఫేవరెట్‌ మూవీ. వీలుంటే ఈ తరం వారికోసం మళ్లీ ఆ సినిమాను విడుదల చేయాలనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..