మా సంక్రాంతి సంబరాలిలా!

ఏడాది తొలినాళ్లలో వచ్చి... సకల శుభాలను నింపే పండుగ సంక్రాంతి. రంగు రంగుల రంగ వల్ల్లులతో... గంగిరెద్దుల సందడితో ప్రాంతానికో రీతిలో జరుపుకుంటారు. మరి మనం పంటల పండుగగా పిలుచుకునే సంక్రాంతిని ఈ తారలు ఎలా జరుపుకుంటారో చూద్దామా...

Published : 13 Jan 2024 23:38 IST

ఏడాది తొలినాళ్లలో వచ్చి... సకల శుభాలను నింపే పండుగ సంక్రాంతి. రంగు రంగుల రంగ వల్ల్లులతో... గంగిరెద్దుల సందడితో ప్రాంతానికో రీతిలో జరుపుకుంటారు. మరి మనం పంటల పండుగగా పిలుచుకునే సంక్రాంతిని ఈ తారలు ఎలా జరుపుకుంటారో చూద్దామా...

చీర అలా కట్టుకుంట: రష్మిక మందన్నా

కర్ణాటకలోని పర్యటక ప్రదేశమైన కూర్గ్‌ ప్రాంతం మాది. మా దగ్గర సంక్రాంతిని ప్రకృతి పండుగగా భావిస్తారు. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. గోవులనూ కుటుంబ సభ్యులుగా భావించడం మా సంప్రదాయం. అందుకే వాటినీ చక్కగా అలంకరించి పూజలు చేస్తాం. ఇరుగు పొరుగు వారికి స్వీట్లు పంచితే శుభం జరుగుతుందని నమ్మకం. పండుగరోజు చీర కట్టుకోవడం నాకెంతో ఇష్టం. అయితే మా సంప్రదాయం ప్రకారం కొడగు స్టైల్‌లో చీరను ధరిస్తాం. పమిట చెంగును ఎడమ చేతి కింద నుంచి తీసుకొచ్చి కుడి చేతిపైనుంచి ముందుకు వేసుకోవడం మా ఆనవాయితీ. ఆ కట్టు అంటే నాకెంతో ఇష్టం. పండుగల సమయంలో కచ్చితంగా నేను అమ్మానాన్నల దగ్గరకు వెళ్లి కొడగు చీరకట్టుతో ముస్తాబైపోతుంటా.


తప్పకుండా పూజ చేస్తా...: సంయుక్తా మేనన్‌

కేరళలోని ఓ పల్లెటూరిలో పుట్టి పెరిగిన నాపైన అమ్మమ్మ ప్రభావం చాలా ఎక్కువ. చిన్నతనంలో శ్లోకాలు నేర్పింది, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివించింది. పండుగలప్పుడు నా చేత పూజ చేయించేది. సంక్రాంతి పండుగను అయితే మా ఊళ్లో చాలా బాగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి నలుగు పెట్టుకుని తలస్నానం చేసి సూర్యుడికి నీళ్లూ, పూలూ సమర్పిస్తాం. తరవాత పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యుడికి నివేదిస్తుంది మా అమ్మ. నేను మాత్రం స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తుంటా. పంటపొలాలకు వెళ్లి సరదాగా గడుపుతా. సాయంత్రం పూట మాత్రం ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకుంటా. నాకెంతో ఇష్టమైన శివుడిని ఆరాధిస్తా.


నల్ల దుస్తులు వేసుకుంటాం: మృణాల్‌ ఠాకూర్‌

నాకు చిన్నప్పట్నుంచీ సంక్రాంతి అంటే చాలా ఇష్టం. భోగి రోజు సాయంత్రం మంట వేసి కుటుంబ సభ్యులమంతా దాని చుట్టూ తిరుగుతూ బెల్లం, నువ్వులు, పల్లీలు, మరమరాలు అగ్నికి సమర్పిస్తాం. మకర సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేశాక- మా అమ్మ బెల్లం, నువ్వులు, మరమరాలతో బోలెడు వంటలు చేస్తుంది. మా సంప్రదాయం ప్రకారం ఈ పండుగ సమయంలో నల్ల దుస్తులు ధరిస్తారు. మూడురోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకుని ఏడాదికి సరిపడా రీఛార్జ్‌ అయిపోతుంటా. సినీ రంగంలోకి వచ్చాక నాకు తెలుగు సంప్రదాయం గురించి తెలిసింది. ఇక్కడ ముగ్గులకు ఇచ్చే ప్రాధాన్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది.


ఇల్లంతా అలంకరిస్తా: కీర్తి సురేశ్‌

అమ్మ వల్ల నాకు భక్తి అలవడింది. కొత్త సంవత్సరం తొలినాళ్లలో వచ్చే సంక్రాంతికి ఇంట్లోనే ఉండటం చిన్నప్పట్నుంచీ అలవాటు.ఆరోజు గ్యాడ్జెట్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటా. పండుగనాడు అక్కా, నేనూ కలిసి ఇంటిని చెరకు గడలూ, అరటి ఆకులూ, పూల రంగవల్లులతో అలంకరిస్తాం. ఆరుబయట రాళ్లతో పొయ్యిని ఏర్పాటు చేసి పెద్ద మట్టికుండలో పాలు పొంగిస్తాం. ఆ ప్రసాదాన్ని బంధువుల ఇళ్లకు వెళ్లి పంచుతాం. లేదంటే అందర్నీ ఆహ్వానించి, స్వర్గస్తులైన పెద్దల్ని స్మరించుకుంటాం. టాలీవుడ్‌లో నటిస్తూ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండే నాపైన తెలుగు సంప్రదాయం ప్రభావం కూడా ఎక్కువే. ఈమధ్య ముగ్గులు నేర్చుకుని ఇంటి ముంగిట వేయడమూ అలవాటైంది.


చక్కెర పొంగలి ఉండాల్సిందే: శృతీ హాసన్‌

సంక్రాంతి అంటే నాకు బాల్యమే గుర్తొస్తుంది. అప్పటిలా ఇప్పుడు ఎంజాయ్‌ చేయట్లేదనే చెప్పాలి. అప్పట్లో పండుగలకు కొన్నినెలల ముందు నుంచే మా ఇంట్లో సందడి మొదలయ్యేది. ఎందుకంటే నాన్న సినిమా తప్పకుండా పొంగల్‌కి విడుదలయ్యేది. సినిమా బృందం ఆ ఏర్పాట్లలో మునిగిపోయేది. దాంతో మాక్కూడా ముందే పండుగ వచ్చినట్టు ఉండేది. పొంగల్‌ రోజున ఉదయం నాన్నతో కలిసి సినిమా చూడ్డం, తరవాత చక్కెర పొంగలి తినడం ఆనవాయితీగా ఉండేది. తరవాత నేను సినిమాల్లోకి వచ్చి ముంబయిలో స్థిరపడటంతో పండుగ జరుపుకునే విధానం మారింది. ఆ రోజున మా బంధువులతో మాట్లాడతా. వాళ్లని కలిసే వీలుంటే బహుమతులతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటా. చక్కెర పొంగలి మాత్రం తప్పకుండా తింటా. నాకెంతో ఇష్టమైన పండుగ వంటకమది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..