అవగాహనే ఆయుధం!

తెలిసో తెలియకో వినియోగదారులు ఏదో ఒక సందర్భంలో మోసపోతుంటారు. హక్కుల మీద అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందుకే, కొందరు తమ అనుభవాలనే పాఠాలుగా చెబుతూ.. వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.వినియోగదారుడా.. మేలుకో!

Published : 27 Feb 2022 00:34 IST

అవగాహనే ఆయుధం!

తెలిసో తెలియకో వినియోగదారులు ఏదో ఒక సందర్భంలో మోసపోతుంటారు. హక్కుల మీద అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అందుకే, కొందరు తమ అనుభవాలనే పాఠాలుగా చెబుతూ.. వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


వినియోగదారుడా.. మేలుకో!

సినిమా ఆలస్యంగా మొదలుకావడం, ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ప్యాకింగ్‌ ఛార్జీలంటూ అదనంగా వసూలుచేయడం, ట్యాక్సీ బుక్‌ చేశాక కాసేపటికి డ్రైవర్‌ క్యాన్సిల్‌ చేయడం - వీటిలో ఏదో ఒక సంఘటన నిత్య జీవితంలో చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. ఆ సందర్భంలో విసుక్కుంటారు.. తిట్టుకుని వదిలేస్తారు. కానీ, హైదరాబాద్‌కు చెందిన విజయ్‌ గోపాల్‌ పని మాత్రం అక్కడే ప్రారంభమవుతుంది. ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తూనే.. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త అతడు. వినియోగదారుల హక్కులూ, చట్టాలపై నిత్యం అధ్యయనం చేస్తూ.. వివిధ మార్గాల్లో ప్రజలకూ అవగాహన కల్పిస్తున్నాడు. 2014లో బస్టాప్‌లో నిల్చున్న కొందరు రోడ్డుపైన దుమ్ముతో ఇబ్బంది పడుతుండటం చూశాక.. అసలు ఆ సమస్యకు బాధ్యులెవరు... అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. దాన్ని పరిష్కరించే క్రమంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) గురించి తెలుసుకున్నాడు. అప్పటినుంచీ వినియోగదారుల సమస్యలపైన పోరాటం మొదలుపెట్టాడు. కోర్టుల్లో కేసులు వేయడం దగ్గర్నుంచి.. వాదించడం వరకూ ప్రతి ఖర్చునూ సొంతంగానే భరించాడు. ఆ తరువాత తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. స్నేహితులతో కలిసి ‘ఫోరం అగైనెస్ట్‌ కరప్షన్‌’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. సమయానికి సినిమా వేయనందుకూ, టికెట్‌ బుకింగ్‌కు ఇంటర్నెట్‌ ఛార్జీలు అధికంగా వసూలు చేసినందుకూ సంబంధిత మాల్స్‌కు కోర్టు జరిమానా విధించడంతో వారు విజయ్‌ను బెదిరించారు కూడా. తన వల్ల కుటుంబసభ్యులకు ఇబ్బంది కలగకూడదనుకున్న విజయ్‌ అందరూ ఉన్నా ఒంటరిగా జీవిస్తున్నాడు.


స్టాక్‌ మార్కెట్‌లో నష్టపోకుండా..

షేర్లు తదితర అంశాలపైన సరైన అవగాహన లేకపోవడంతో స్టాక్‌ మార్కెట్లో చాలామంది చేతులు కాల్చుకుంటున్నారు. విశాఖపట్నంలో నివసిస్తున్న రేవంత్‌, లేఖంత్‌ సోదరులదీ అదే పరిస్థితి. తెలిసీతెలియని వయసులో తాము చేసిన పొరపాటు మరెవరూ చేయొద్దని, సామాన్యులకు స్టాక్‌ మార్కెట్‌ మీద అవగాహన కల్పించేందుకు ‘డే ట్రేడర్‌ తెలుగు’ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఇంతకీ ఆ సోదరులు చేసిన పొరపాటు ఏంటంటే - చిన్న ఉద్యోగం చేస్తూ అమ్మ పొదుపు చేసిన లక్ష రూపాయలను స్టాక్‌ మార్కెట్లో పెట్టి పోగొట్టడం. దాంతో పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పాలని ఇంటి బాధ్యతలను వారికే అప్పగించారామె. అప్పటి నుంచి సోదరులిద్దరూ అనవసర ఖర్చులు తగ్గించుకొని.. నెల చివర్లో  మిగిలిన కొద్దిమొత్తాన్ని దాచుకుంటూ.. ఆరేళ్లపాటు స్టాక్‌ మార్కెట్‌పైన లోతుగా అధ్యయనం చేశారు. తరువాత నుంచి - తాము పొదుపు చేసిన సొమ్మునూ, కాలేజీ అయ్యాక సాయంత్రాల్లో హోం ట్యూషన్లు చెప్పగా వచ్చిన సొమ్మునూ స్టాక్‌ మార్కెట్‌లో కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. అలా గత ఆర్థిక సంవత్సరంలో రూ.77 లక్షలు సంపాదించినట్లు వాళ్లే స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఎవరో చెబితే కాకుండా సొంతంగా కొంత అధ్యయనం చేసి.. తెలుసుకున్నాకే స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారీ సోదరులు.


సైబర్‌ నేరాలపై..

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. బాధితులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఆత్మహత్యకూ పాల్పడుతుండటం హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గడ్డం మల్లేష్‌ను కలచివేసింది. అత్యాశ, అమాయకత్వమే అందుకు కారణాలని గ్రహించి.. సైబర్‌ నేరాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాడు. భార్య సుశీలతో కలిసి ‘క్రైం ఫ్రీ ఇండియా’ పేరిట ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ప్రతి వారం ఒక్కో తరహా మోసంపై.. ‘అసలు సైబర్‌ క్రైం అంటే ఏంటి? నేరం ఎలా జరుగుతుంది? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? నష్టపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?’ తదితర అంశాలతో వీడియో రూపొందించి ఛానల్‌లో పోస్టు చేస్తున్నాడు. విధులు ముగిసిన తర్వాత ఇంటి దగ్గరుండే సమయాన్ని ఈ పనులకు కేటాయిస్తుండటంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలూ దక్కాయి. ‘అవగాహన పెంచుకో.. నిన్ను నువ్వు కాపాడుకో’ నినాదంతో ముందుకెళ్తున్న ఈ దంపతులు.. నెలలో రెండో, నాలుగో శనివారం సాయంత్రం 8 నుంచి 9 వరకు లైవ్‌లో ప్రజల సందేహాలూ నివృత్తి చేస్తున్నారు. వివిధ రంగాల నిపుణులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేసి.. కొత్త చట్టాలతో పాటు ప్రభుత్వ ఆప్స్‌ గురించీ ఛానల్‌లో వివరిస్తున్నారు. సైబర్‌ వలలో చిక్కిన 48 గంటల్లోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును సులభంగా రాబట్టగలమంటూ.. తెలియని వారికి బ్యాంకు ఖాతా వివరాలూ, ఓటీపీలూ చెప్పొద్దని సూచిస్తున్నాడీ రక్షక భటుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..