Published : 15 May 2022 01:11 IST

ప్లాస్టిక్‌ని అడ్డుకుంటున్నారు!

పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్‌ వాడకానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు కొందరు. సరికొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారంటే..!


పశువులు తినొచ్చు

గేదెలూ, ఆవుల కడుపులోంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీయడం మనకు తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ పడేసే ప్లాస్టిక్‌ గ్లాసుల్నీ, క్యారీ బ్యాగుల్నీ గడ్డితోపాటు తినడం వల్ల ఇలాంటి ప్రమాదం సంభవిస్తుంది. అందుకే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా రకరకాల పదార్థాలను వాడి  ప్లేట్లూ, గ్లాసులూ, చెంచాలూ, టేక్‌అవే కంటైనర్లు తయారు చేస్తున్నాడు కోయంబత్తూరుకి చెందిన కల్యాణ్‌ కుమార్‌. ఆర్థిక పరిస్థితుల వల్ల డిగ్రీ మధ్యలోనే మానేసిన ఇతను గోధుమలు, తవుడు, చెక్క పొడి, కొబ్బరిపీచు, కూరగాయ వ్యర్థాలు, పెండలం వంటి వాటితో నాలుగైదు రకాల టీ కప్పులూ, గ్లాసులూ, చెంచాలూ, ప్లేట్లూ, వాటర్‌ బాటిళ్లూ తయారు చేస్తున్నాడు. టీస్టాళ్లూ, జ్యూస్‌ సెంటర్లూ, హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడి ఆ వస్తువులన్నింటినీ అందిస్తున్నాడు. అలానే పెళ్లిళ్లకూ వాటిని సప్లై చేయమని ఆర్డర్లు వస్తుండటంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ఈ వస్తువులని పడేస్తే భూమిలో త్వరగానే కరిగిపోతాయి, లేదంటే వాటిని పశువులకి మేతగా కూడా అందించొచ్చు. అందుకే కొందరు డెయిరీ నిర్వాహకులు టీ స్టాళ్లూ, హోటళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని వాడేసిన ఈ ప్లేట్లనీ గ్లాసుల్నీ చెంచాల్నీ తీసుకెళ్లి పశువులకు మేతగా పెడుతున్నారు.


ప్లాస్టిక్‌తో ఇటుకలు

సోంకు చెందిన మౌసమ్‌, రూపమ్‌, డేవిడ్‌లు స్నేహితులు. ఒకే కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులు. ఒకసారి కాలేజీ ప్రాజెక్ట్‌లో భాగంగా- పర్యావరణహితమైన ఒక కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించమని చెప్పారు లెక్చరర్లు. అందుకు సంబంధించి అధ్యయనం చేస్తున్నప్పుడే ప్లాస్టిక్‌ ఇటుకల గురించి తెలుసుకున్నారు ఈ ముగ్గురు స్నేహితులు. దాంతో కాలేజీ ప్రాజెక్టును పక్కన పెట్టేసి ‘గిరాండ్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టి ఇటుకల తయారీకి సిద్ధమైపోయింది మౌసమ్‌ మిత్ర బృందం. మొదట్లో ప్లాస్టిక్‌ను కరిగించి ఇటుకలు చేద్దామనుకున్నారు. కానీ, ఆ ప్రకియ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనీ, దానికి బదులుగా పొడి చేస్తే అలాంటి ఇబ్బందులేవీ ఉండవనీ తెలుసుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ పొడి చేయడమంటే ప్రయాసతో కూడుకున్నది. అందుకే ఓ యంత్రాన్ని స్వయంగా రూపొందించి ప్లాస్టిక్‌ను పొడిగా మార్చడం మొదలుపెట్టారు. ఆ పొడిలో థర్మల్‌ పవర్‌ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థాలూ, కొన్ని రసాయనాలూ, కాస్త సిమెంట్‌నూ జోడించి ఇటుకల్ని తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన ఇటుకలకు పేటెంట్‌ కూడా పొందారీ మిత్రులు. అలానే భూమిపై ప్లాస్టిక్‌ ప్రభావం తగ్గిస్తున్నందుకుగానూ అసోం ప్రభుత్వం, ఐఐఎమ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లు కూడా వీరి ఆర్థిక సాయం అందించాయి. రోజుకి పదివేల ఇటుకల్ని తయారు చేస్తున్న వీరు పెద్ద ఎత్తున మార్కెటింగ్‌ చేస్తూ నెలకి రెండు కోట్లు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ ఇటుకల్ని నేరుగానే కాకుండా తమ వెబ్‌సైట్‌, ఇండియామార్ట్‌, మరికొన్ని ఈకామర్స్‌ సైట్లలో సైతం అమ్ముతున్నారు.


మాత్రల రూపంలో ద్రావణాలు

నేలా, అద్దాలూ, బాత్రూమ్‌లు తుడిచే లిక్విడ్‌ క్లీనర్లూ, డిష్‌వాష్‌ లిక్విడ్లూ ప్లాస్టిక్‌ బాటిళ్లలోనే వస్తుంటాయి. అవి ఇంట్లో నిత్యం అవసరం కాబట్టి వాటిని తరచూ కొనుగోలు చేస్తూనే ఉంటాం. అసలే ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని చేస్తుంది. అందుకే దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ముంబయికి చెందిన సుమిత్‌ గోయల్‌, ప్రాచీ బన్సాల్‌లు ‘ఎకోసిన్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించి ఇళ్లలో వాడే క్లీనింగ్‌ లిక్విడ్లను మాత్ర రూపంలో తయారు చేసి కాగితం కవరులో అందిస్తున్నారు. ఈ కవరు నీళ్లలో వేయగానే కరిగిపోతుంది. అలానే మాత్రను లీటరు నీళ్లలో వేస్తే చిక్కటి ద్రావణంలా మారిపోతుంది. 2016లో ఈ స్టార్టప్‌ను మొదలుపెట్టిన సుమిత్‌ ఒకసారి బీచ్‌కి వెళితే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయున్న పరిసరాలు అతని కంట పడ్డాయి. ఆ వ్యర్థాలు సముద్రంలో కలిస్తే జీవులకి ఎంతో హాని కలుగుతుందని బాధపడ్డాడు. అప్పుడే మిలాన్‌లో ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివిన ప్రాచీ బన్సాల్‌ పరిచయమైంది. అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి చిన్న చిన్న మాత్రలు దొరుకుతాయనీ, వాటిని నీళ్లలో వేస్తే చిక్కటి లిక్విడ్‌ తయారవుతుందనే విషయం సుమిత్‌కి చెప్పడంతో అతనికి ఓ ఆలోచన వచ్చింది. నేలనీ, అద్దాల్నీ, బాత్రూమ్‌లనీ తుడవడానికీ- గిన్నెలు తోమడానికీ కూడా లిక్విడ్లకు బదులుగా అలాంటి మాత్రలు తయారు చేసి.. వాటిని కాగితంలో ప్యాకింగ్‌ చేస్తే బాగుంటుందనుకున్నాడు. దాంతో కెమికల్‌ సైన్స్‌ నిపుణుల్ని సంప్రదించి వారి సూచనలతో ఇద్దరూ క్లీనింగ్‌ మాత్రలను తయారు చేయడం మొదలుపెట్టారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని