ఈ అంకురాలు యువతకు నేస్తాలు!

యువ భారత్‌ ప్రతి అవసరమూ, వాళ్లు ఎదుర్కొనే ప్రతి సమస్యా వ్యాపారులకు ఓ అవకాశమే. అందుకు చేయాల్సిందల్లా వాటికి సరైన పరిష్కార మార్గాలు చూపడమే. ఈ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆ పనే చేశారు. ఆపైన విజయవంతంగా దూసుకుపోతున్నారు.

Published : 11 Feb 2023 23:55 IST

ఈ అంకురాలు యువతకు నేస్తాలు!

యువ భారత్‌ ప్రతి అవసరమూ, వాళ్లు ఎదుర్కొనే ప్రతి సమస్యా వ్యాపారులకు ఓ అవకాశమే. అందుకు చేయాల్సిందల్లా వాటికి సరైన పరిష్కార మార్గాలు చూపడమే. ఈ అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆ పనే చేశారు. ఆపైన విజయవంతంగా దూసుకుపోతున్నారు.


ఉన్నతికి.. ఓ స్కూల్‌

ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తూ విజయవంతమైన సంస్థలెన్నో. ఆ విభాగంలో మరో సంచలనం గ్రోత్‌ స్కూల్‌. కెరియర్‌లో కొత్తగా అడుగు పెట్టేవారితోపాటు ఇప్పటికే స్థిరపడిన వాళ్లకీ లైవ్‌ కోర్సులు అందిస్తోంది గ్రోత్‌ స్కూల్‌. దీని వ్యవస్థాపకుడు వైభవ్‌ సిసింటీ. ఉబర్‌, ట్రావెల్‌ టెక్‌ సంస్థ క్లూక్‌లలో పనిచేశాడు. ‘ఇంజినీరింగ్‌ చదివేటప్పుడే రెండు స్టార్టప్‌లు పెట్టాను. ఆఫ్‌లైన్‌లో వర్క్‌షాప్‌లూ నిర్వహించేవాణ్ని. 2015లో ఉబర్‌లో చేరినప్పుడు కొత్త నగరాలకు వెళ్లి సేవలు ప్రారంభించే బాధ్యతలు చేపట్టేవాణ్ని. నా వ్యూహాలు బావున్నాయని కొన్ని నెలలకే ఉబర్‌ ఇండియా మార్కెటింగ్‌ మేనేజర్‌ని చేశారు. తర్వాత దక్షిణ అమెరికాలోనూ కొన్నాళ్లు పనిచేశా’ అంటూ తన కెరియర్‌ నేపథ్యాన్ని వివరించే వైభవ్‌.. ఓసారి వర్షాల కారణంగా హోటల్‌ రూమ్‌లో రెండ్రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లను పెంచుకోవడంపైన పాఠం చెబుతానని లింక్డిన్‌లో ప్రకటించి రూ.500 ఫీజుగా పెడితే వందల మంది చేరారు. ఆపైన లింక్డిన్‌ వినియోగంపైనా ఓ కోర్సు చేశాడు. ఈ అనుభవంతో భారతీయులు ఆన్‌లైన్లో డబ్బు చెల్లించి నేర్చుకోరన్న తన అభిప్రాయంలో మార్పు వచ్చిందంటాడు వైభవ్‌. యువతలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష, ఎదగాలన్న తపనే అందుకు కారణమంటాడు. ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గానూ, మెంటార్‌గానూ ఉన్న వైభవ్‌.. గతేడాది బెంగళూరు కేంద్రంగా ‘గ్రోత్‌ స్కూల్‌’ని ప్రారంభించాడు. యూట్యూబ్‌లో విజయవంతం కావడం, ఎథికల్‌ హ్యాకింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, డేటా సైన్స్‌లాంటి 30 రకాల కోర్సులతోపాటు మెంటార్‌షిప్‌నూ అందిస్తోందీ సంస్థ.  ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా ఈ కోర్సుల్ని చేశారు.


ఆధునిక హాస్టల్‌.. స్టాంజా

ఉన్నత చదువులూ, ఉద్యోగాల కోసం దేశంలో ఏటా లక్షల మంది కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అలాంటప్పుడు ఏదైనా హాస్టల్లో చేరాలంటే సరైన సదుపాయాలు ఉంటాయా ఉండవా, ఎంత ఖర్చవుతుందీ.. లాంటి సందేహాలెన్నో. అలాంటివారి సమస్యల్ని గుర్తించిన అనింద్యా దత్తా వాటికి చూపిన పరిష్కారమే స్టాంజా లివింగ్‌. ఐఐటీ ఖరగ్‌పుర్‌, ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థి అయిన అనింద్యా.. గోల్డ్‌మాన్‌ శాక్స్‌, ఓక్‌ట్రీ లాంటి సంస్థల ఐరోపా విభాగాల్లో పనిచేశాడు. ఆ అనుభవంతోనే ‘స్టాంజా’ను  ప్రారంభించాడు. ఇవి ఆధునిక హాస్టళ్లు. దిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని 25 నగరాల్లో సేవలు అందిస్తోంది. ప్రతి నగరంలో పదుల సంఖ్యలో భవనాలు వీరికి ఉంటాయి. మహిళలకూ, పురుషులకూ వేర్వేరుగానూ ఈ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఫర్నిచర్‌, రోజువారీ ఉపయోగపడే వస్తువులూ, ఆహారం, వినోదం.. ఇలా అన్ని రకాల సదుపాయాల్నీ అక్కడ కల్పిస్తున్నారు. వెబ్‌సైట్లో అవసరమైన నగరం, ప్రాంతం ఎంపిక చేసుకుంటే నెలవారీ అద్దె వివరాలు కన్పిస్తాయి. వీరి పరిధిలో 75 వేల బెడ్లు ఉన్నాయి. కాలేజీ హాస్టళ్ల నిర్వహణ విభాగంలోకీ ఇటీవల ఈ సంస్థ విస్తరించింది.


ఆప్‌లో మాట్లాడుకుందాం..

ఈమధ్య ఆడియో రూపంలో అందించే సేవలకూ ఆదరణ పెరుగుతోంది. తాజా డేటింగ్‌ ఆప్‌ ఫ్రెండ్‌ కూడా ఆ కోవకే చెందుతుంది. ఈ ఆప్‌లో వ్యక్తిగత వివరాలు చెప్పకుండా ఆడియో ద్వారా ఇతర వ్యక్తులతో సంభాషణ జరపొచ్చు. ఆ సంభాషణల మధ్య వినోదాన్ని పెంచడానికి గొంతుల్ని పోల్చడం, ప్రశ్నలకు జవాబివ్వడం లాంటి కొన్ని గేమ్స్‌ కూడా ఉంటాయి. ఆ  తర్వాత ఇష్టమైతే వారితో స్నేహాన్ని కొనసాగించవచ్చు లేకుంటే లేదు. ఐఐటీ పూర్వ విద్యార్థులైన భానుప్రతాప్‌ సింగ్‌, హర్షవర్ధన్‌, హార్దిక్‌లు దీన్ని 2019లో ప్రారంభించారు.

ఇది భారతీయులకు ప్రత్యేకం. ప్రస్తుతం ఇది పది భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌ ఐఎన్‌సీ సహా మరికొన్ని సంస్థలు దీన్లో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ‘భారతీయ భాషల్లో తేవడానికి కారణం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన యువత కూడా దీన్ని వినియోగించుకునేలా చేయడమే. యువతీ యువకులు ఆన్‌లైన్లో మాట్లాడుకునే వేదికల్లో మాది ప్రత్యేకం. ఇక్కడ ప్రైవసీకి ప్రాధాన్యం ఉంటుంది. దీనివల్ల అమ్మాయిలూ మా వినియోగదారుల్లో ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోటిమంది మా ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు’ అని చెబుతారు భానుప్రతాప్‌.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు