ఆన్‌లైన్‌లో ఏం తెప్పిస్తామంటే..!

రోజూ ఇంట్లో తినీ తినీ బోర్‌ కొట్టినప్పుడో, డైటింగ్‌ చేసేటప్పుడు చీట్‌మీల్‌ తినాలనిపించినప్పుడో- హోటల్‌ ఫుడ్‌కు జై కొడతారు భోజనప్రియులు. మరి తమకు సమయం దొరికి, నచ్చిన ఫుడ్‌ తినాలనుకున్నప్పుడు ఈ సెలబ్రిటీలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి తెప్పించుకునేవి ఏంటో తెలుసా..!

Updated : 04 Feb 2024 17:08 IST

రోజూ ఇంట్లో తినీ తినీ బోర్‌ కొట్టినప్పుడో, డైటింగ్‌ చేసేటప్పుడు చీట్‌మీల్‌ తినాలనిపించినప్పుడో- హోటల్‌ ఫుడ్‌కు జై కొడతారు భోజనప్రియులు. మరి తమకు సమయం దొరికి, నచ్చిన ఫుడ్‌ తినాలనుకున్నప్పుడు ఈ సెలబ్రిటీలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి తెప్పించుకునేవి ఏంటో తెలుసా..!


అదో హాబీ 
ప్రభాస్‌

మొదటినుంచీ మాంసాహారం ఎక్కువగా తినడం అలవాటు. ఒకట్రెండు ఐటమ్స్‌తో సరిపెట్టుకోకుండా రకరకాల పదార్థాలను కోరుకుంటా. ఎంత డైటింగులో ఉన్నా ఏడెనిమిది రోజులకోసారి చీట్‌మీల్‌ ఉండాల్సిందే. ఆ రోజు రకరకాల బిర్యానీలూ, కూరలతోపాటు మాంచి ఘాటుగా ఉండే రొయ్యల పలావ్‌ కూడా తెప్పించుకుంటా. బయట నుంచి ఆర్డర్‌ చేసుకోవడమే కాదు నాకూ వండటం వచ్చు. సెట్‌లో నటీనటుల అభిరుచులు తెలుసుకుని ఆతిథ్యం ఇవ్వడం నాకో హాబీ.


ఆ రుచే వేరు
నాగచైతన్య

ఫిట్‌గా ఉండటానికి డైటింగ్‌ తప్పనిసరి. ఒక్కోసారి సినిమాలో పాత్రకు తగినట్టు బరువు పెరగడమో తగ్గడమో చేయాలి. అలాంటప్పుడు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ చెప్పిందే తినక తప్పదు. షూటింగ్‌ మధ్యలో విరామం దొరికినప్పుడో, పండుగల సమయంలోనో నచ్చినవి తినే వెసులుబాటు దొరుకుతుంది. అలాంటప్పుడు ఆన్‌లైన్‌లో నాకు ఎంతో ఇష్టమైన పచ్చిపులుసు, ముద్దపప్పు, మటన్‌, రొయ్యల వేపుడు ఆర్డర్‌ పెట్టుకుంటా. వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, పప్పు, నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు. అందులోకి మటన్‌, రొయ్యల వేపుడు నంజుకుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈ పదార్థాలను నా స్నేహితులకు కూడా అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటా.


ఇప్పటికీ ఇష్టం
శ్రీలీల

చిన్నప్పట్నుంచీ నాకు ఇంట్లో చెంచాల కొద్దీ నెయ్యి వేసిన ముద్దపప్పు అన్నం తినిపించేవారు. నాకు మాత్రం బేకరీ ఫుడ్‌ నచ్చేది. అమ్మ డాక్టర్‌ కావడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది. అందుకే అవి తినడానికి ఒప్పుకునేది కాదు. నేను స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు అమ్మకు తెలియకుండా ప్లమ్‌ కేక్‌, బనానా పుడ్డింగ్‌ తినేదాన్ని. ఇప్పటికి కూడా ఏమీ తోచనప్పుడు వాటిని ఆర్డర్‌ చేసుకుని తింటుంటా. అలానే మల్బరీ క్రీమ్‌తో చేసే షా దూధ్‌ మలై కూడా చాలా చాలా ఇష్టం నాకు. నా ఫోన్‌లోని ఫుడ్‌ ఆప్స్‌ ఆర్డర్స్‌ హిస్టరీలో ఈ ఐటమ్సే కనిపిస్తాయి.


ఏదో మ్యాజిక్‌ ఉంది
విజయ్‌ దేవరకొండ

చిన్నప్పుడు హాస్టల్‌లో ఉండటం వల్ల ఇష్టమైన ఫుడ్‌ని మిస్‌ అయ్యా. సినిమాల్లోకి వచ్చాక ఫిట్‌నెస్‌ కోసం తినడం లేదు. సహజంగా నేను ఫుడీని. బిర్యానీ అంటే ఎంతిష్టమో. పండుగలూ, ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో చేసిన బిర్యానీని ఇష్టంగా తింటా. బయట కూడా హైదరాబాదీ బిర్యానీని చూస్తే ఆగలేను. అసలు దాని వాసనలోనే ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. అలా కారులో హోటళ్ల ముందు నుంచీ వెళుతున్నప్పుడు బిర్యానీ వాసన వస్తే దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తా. అంత ఇష్టం కాబట్టే అప్పుడప్పుడూ వేర్వేరు హోటళ్ల నుంచి తెప్పించుకుంటా. బిర్యానీతోపాటు పిజ్జాలు కూడా ఉండాల్సిందే. అప్పుడే నాకిష్టమైన భోజనం పూర్తి అయిన ఫీలింగ్‌ కలుగుతుంది.


ఇంటిల్లిపాదికీ తినిపిస్తా
దుల్కర్‌ సల్మాన్‌

మాంసాహారం లేనిదే నాకు ముద్ద దిగదు. ఇంట్లో అమ్మ ఎప్పడూ బియ్యంపిండి- కొబ్బరిపాల రొట్టె చేస్తుంది. విదేశాలకు వెళ్లి వచ్చాకా, షూటింగులకని దూరప్రాంతాలకు వెళ్లి ఇంటికొచ్చాకా మా అమ్మ చాలా వెరైటీలు చేసి పెడుతుంది. అవంటే నాకెంత ఇష్టమో.. హోటళ్లలో చేసే పెరీ పెరీ చికెన్‌- ఎగ్‌కార్న్‌ రైస్‌ అన్నా అంతే ఇష్టం. ఇంట్లో ఉంటే నెలకోసారైనా అవి తెప్పించి ఇంటిల్లిపాదికీ తినిపిస్తుంటా. తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం ఉలవచారు బిర్యానీ ఆర్డర్‌ చేస్తుంటా. నన్ను చూసి చాలామంది నువ్వు వెజ్‌ కూడా తింటావా అని ఆట పట్టిస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..