చదువు ఆపనని తాతయ్యకి మాటిచ్చా!

విడుదలకు సిద్ధంగా ఉన్నవి కొన్ని, షూటింగ్‌ జరుపుకొంటున్నవి మరికొన్ని... ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నవి ఇంకొన్ని... ఇలా సినిమాలు ఏ దశలో ఉన్నా హీరోయిన్‌గా వినిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్క పేరు... శ్రీలీల.

Updated : 27 Aug 2023 09:41 IST

విడుదలకు సిద్ధంగా ఉన్నవి కొన్ని, షూటింగ్‌ జరుపుకొంటున్నవి మరికొన్ని... ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్నవి ఇంకొన్ని... ఇలా సినిమాలు ఏ దశలో ఉన్నా హీరోయిన్‌గా వినిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్క పేరు... శ్రీలీల. అటు అందంతోనూ ఇటు డాన్స్‌లతోనూ క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకుంటున్న తెలుగందం శ్రీలీల ‘పెళ్లి సందడి’తో వెండి తెరకు పరిచయమైంది. ‘ధమాకా’ విజయంతో అరడజనుకుపైగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఓ పక్క ఎంబీబీఎస్‌ చదువుతూనే సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడి ప్రయాణం ఎలా మొదలైందంటే...

దువుకునేటప్పుడుగానీ, డాన్స్‌ ప్రదర్శనలు ఇచ్చేటప్పుడుగానీ సినిమాల ఆలోచనే లేదు నాకు. డాక్టర్ని అయి సేవ చేయాలని బలంగా ఉండేది. ఆ సంకల్పంతోనే సినిమాల్లోకి వచ్చినా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. ‘నావల్ల కావట్లేద’ని ఎన్నిసార్లు మనసుకు అనిపించినా ఇష్టంతోనే ముందుకు వెళుతున్నా. ఇప్పటికీ ఎంబీబీఎస్‌ చదువుతూనే నటిస్తున్నానంటే నాకే చిత్రంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే- ఒకే ఒక్క ఫొటో నా జీవితాన్ని మార్చింది. నా అడుగుల్ని మరోదారికి మళ్లించింది. అది తలుచుకుంటే నాకూ విచిత్రంగానే ఉంటుంది.

మా అమ్మమ్మా వాళ్లది ఒంగోలు. అమ్మ స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్టుగా పనిచేస్తోంది. ఎవరికైనా బాల్యమంటే అపురూపం. మళ్లీ మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనిపిస్తుంటుంది. నా బాల్యం మాత్రం అలాంటిది కానే కాదు. ఎందుకంటే చిన్నతనంలో చదువు, డాన్స్‌ తప్ప మరో ప్రపంచం లేకుండా పెరిగిన నాకు స్నేహితులు లేరు. స్కూలు నుంచి రాగానే తోటిపిల్లలతో ఆడుకోవడం ఎరగను. అంతేకాదు, నాకు జ్వరం రావాలని కోరుకున్న సందర్భాలు ఎన్నో. ఎందుకంటే ఎవరికైనా రోజూ స్కూలుకి వెళ్లడం బోరే కదా. మా అమ్మేమో అస్సలు బడి మాననిచ్చేది కాదు. కనీసం జ్వరం వస్తే అన్నా ఇంట్లో ఉంచుతుందేమోనని- ఉల్లిపాయ ముక్కల్ని చంకలో పెట్టుకుని మరీ ప్రయత్నించా. కానీ, వర్కవుట్‌ అవ్వలేదు. రోజూ ముద్దపప్పులో నెయ్యి వేసి మా అమ్మ కంచాలు కంచాలు తినిపించేది. బహుశా అలా తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉండి జ్వరం వచ్చేది కాదేమో. అలా స్కూలు విషయంలో బాధపడిన నేను ఇంటికి తిరిగొచ్చాక మరో సమస్యతో సతమతమయ్యేదాన్ని. అదే భరతనాట్యం. చదువుతోపాటు మరో యాక్టివిటీ కూడా ఉండాలని అమ్మ డాన్స్‌ స్కూల్లో చేర్పించింది. దాంతో నాతోటి పిల్లలు ఇంటికొచ్చి ఆడుకుంటుంటే నేనేమో తకథిమి తకథిమి అంటూ నాట్యం చేయాల్సి వచ్చేది. కొత్తల్లో అయితే డాన్స్‌ చాలా కష్టంగా ఉండేది. కాళ్లు బొబ్బలెక్కేవి. డాన్స్‌కి వెళ్లనని ఏడ్చేసేదాన్ని. కాళ్లకు కట్టు కడుతూ...‘ఈరోజు కష్టంగా ఉన్న డాన్స్‌ ఏదో ఒక రోజు ఇష్టంగా మారుతుంది. ఏం ఫర్వాలేదు, అప్పటి వరకూ ఓర్చుకో...’ అని చెప్పి పంపేది. ఆ సమయంలో అమ్మ మీద చాలా కోపం వచ్చేది. కానీ కొన్నిరోజులకు తను చెప్పినట్టే డాన్స్‌ మీద ఆసక్తి కలిగింది. అప్పుడప్పుడూ మఠాల్లోనూ, ఆలయాల్లోనూ ప్రదర్శనలు ఇస్తుండేదాన్ని. అలా పెరిగిన నేను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. సెలవు రోజుల్లో అమ్మ తనతోపాటు కాన్ఫరెన్సులకు తీసుకెళ్లేది. అక్కడ తెల్లకోటు వేసుకున్న డాక్టర్లని చూసేదాన్ని, వాళ్ల గురించి వినేదాన్ని. అందుకేనేమో ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి మీద ఎంతో గౌరవం కలిగింది. అంతెందుకు వైద్యురాలిగా ప్రసవం చేసి పాపాయిని భూమ్మీదకు తీసుకొచ్చే అమ్మ కూడా నాకు అద్భుతంగానే కనిపిస్తుంది. అందుకే నేనూ డాక్టర్ని అవ్వాలని నిర్ణయించుకున్నా. దానికి అమ్మమ్మాతాతయ్యలు ఎంతగానో సంతోషించారు. అలాంటిది సినిమాల వైపు ఎలా టర్న్‌ అయ్యాననే కదా సందేహం.

ఫొటోతో అవకాశం

మా అమ్మ ప్రతి పుట్టినరోజుకీ- నాకూ, అన్నయ్యలిద్దరికీ ఫొటో షూట్‌ చేయిస్తుండేది.‘కేజీఎఫ్‌’తోపాటు కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన భువన గౌడ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు- ఆయన నా ఫొటోల్ని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. తన ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న ఓ దర్శకుడు ఆ ఫొటోలు చూసి సినిమా అవకాశం ఇస్తామంటూ ఇంటికొచ్చారు. అప్పటి వరకూ ఆ ఆలోచన లేని నాకు అవకాశం రావడంతో నటించాలనిపించింది. నా ఇష్టమే అమ్మ ఇష్టం కావడంతో తనవైపు నుంచి అభ్యంతరం రాలేదు. పదో తరగతికూడా పూర్తి కాకుండా ఎలాగని అమ్మమ్మా వాళ్లు భయపడ్డారు. నేను చదువుని పక్కన పెట్టననీ, డాక్టర్ని అవుతాననీ తాతయ్యకి మాటిచ్చి మరీ సినిమాలకు సంతకం చేశా. అది ఒత్తిడితో చేసింది మాత్రం కాదు. నాకు ఈ వృత్తి పట్ల ఉన్న గౌరవంతోనే చదవాలని నిర్ణయించుకున్నా. పైగా ఎంబీబీఎస్‌ చేసిన పదేళ్లకైనా పీజీ చేసుకునే సౌలభ్యముంది. దాంతో ఇంట్లో వాళ్లందరి అంగీకారంతో సినిమా రంగంలోకి వచ్చా. అప్పుడు పొడవుగా మోకాళ్ల వరకూ ఉన్న జుట్టును కత్తిరించేయమన్నారు. అసలే నాకు జుట్టు అంటే చాలా ఇష్టం. కత్తిరించిన రోజు ఎంత బాధేసిందో. కానీ పాత్రకోసం అలా చేయక తప్పలేదు.

చేతినిండా సినిమాలు

నేను పదో తరగతిలో ఉండగానే ‘కిస్‌’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇంటర్‌ అయ్యేటప్పటికి ఆ సినిమా విడుదలైంది. షూటింగ్‌లో పాల్గొంటూనే కాలేజీకి వెళ్లేదాన్ని. అలా చేసిన ‘కిస్‌’, ‘భరాటే’ సినిమాల్లో మంచి పేరు రావడంతో రాఘవేంద్రరావు సర్‌ ‘పెళ్లి సందడి’లో అవకాశమిచ్చారు. ఆ సమయంలో మెడికల్‌ ఎంట్రన్స్‌కు చదువుతున్నా. పరీక్ష రాశాకే సెట్‌లో అడుగు పెట్టిన నాకు- ఆ వెంటనే ‘ధమాకా’లో ఆఫర్‌ వచ్చింది. అయితే, అంతకు ముందు ఆ దర్శకుడు నన్ను ‘హలో గురు ప్రేమకోసమే’ కథతో సంప్రదించారు కానీ నాకే కుదరలేదు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ల్లో నటనతోపాటు డాన్స్‌కీ మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులు ఆదరించారు. ఎక్కడికి వెళ్లినా ఆ పాటలే వినిపించేవి. చాలామంది ఆడవాళ్లు ‘నువ్వు మా అమ్మాయిలా ఉన్నావ’ంటూ దగ్గరకొచ్చి గుండెలకు హత్తుకునేవారు. వారి అభిమానం వెలకట్టలేనిది. ఆ ఆదరణకు తోడు అరడజనుకు పైగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘భగవంత్‌ సింగ్‌ కేసరి’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’... వంటి ఎనిమిది సినిమాలు చేతిలో ఉన్నాయి. వరస సినిమాలతో చేతినిండా పని ఉన్నా చదువుని మాత్రం పక్కన పెట్టలేదు. ఎంబీబీఎస్‌ చదువుతున్న నేను తప్పనిసరి అయితే కాలేజీకి వెళుతుంటా. ప్రాక్టికల్స్‌కీ హాజరవుతుంటా. కాలేజీకి వెళ్లనప్పుడు మెటీరియల్‌ తెప్పించి అమ్మే పాఠాలు చెబుతుంటుంది. పొద్దునా, సాయంత్రం-  షూటింగ్‌ సమయంలో విరామం దొరికినప్పుడు చదువుకుంటా. మిగతా కోర్సులతో పోలిస్తే- ఎంబీబీఎస్‌ను కాలేజీకి వెళ్లకుండా చదవడం చాలా కష్టం. కాలేజీ యాజమాన్యం, అమ్మా ఇస్తున్న ప్రోత్సాహంతో చదవగలుగుతున్నా. పరీక్షల సమయంలో ఫోన్‌ కూడా ఆపేసి పదిరోజులపాటు షూటింగులకు దూరంగా ఉంటా. నిద్రసరిపోక ఒత్తిడిగా అనిపించినప్పుడు మాత్రం అనవసరంగా రెండు పడవల మీద కాళ్లు పెట్టానా అనుకుంటా. కానీ, అంత బిజీ లైఫ్‌నే ఇష్టపడతా. ప్రస్తుతం అయితే నేను నటించాల్సిన సినిమాలన్నీ పూర్తి చేద్దామనుకునేలోపు ఇంకో దాంట్లో అవకాశం వచ్చి ఆ జాబితా పెరిగిపోతోంది. సాధ్యమైనంత త్వరగా పీజీ పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం.


అదే మార్చుకోవాలి

నాకు ఎనిమిది మంది అమ్మమ్మలు ఉన్నారు. సమయం దొరికినప్పుడు వాళ్లందర్నీ కలుస్తుంటా. చిన్నప్పట్నుంచీ వాళ్లతో మాట్లాడటం వల్లే తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా. అలానే నాకు సామెతలు కూడా బాగా వచ్చు.

  • టేకులు తీసుకున్నప్పుడు భయపడిపోతుంటా. డైరెక్టర్‌కి సారీ చెబుతా. ఒకసారి పాట షూటింగ్‌ జరుగుతుంటే కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ వన్‌ మోర్‌ వన్‌ మోర్‌ అంటూ- చేయించిన సీనే మళ్లీ మళ్లీ చేయించారు. దాంతో ముప్ఫైకిపైగా టేకులు తీసుకున్న నాకు భయమేసి- ఇంకెప్పుడూ అలా చేయనని సారీ చెబుతూ మాస్టర్‌కి ఓ మూడు పేజీల లేఖ రాశా. దానికి ఆయన పడీ పడీ నవ్వుకున్నారు. సెట్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ సమస్య వల్ల వన్‌ మోర్‌ చెప్పానంటూ అసలు విషయం తరవాత చెప్పారు.
  • ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ కుంకుడుకాయలతో తలస్నానం చేయిస్తుంది. అప్పుడప్పుడూ మందారం, ఉల్లిపాయరసం రాస్తుంటుంది. చర్మం నిగారింపు కోసం టొమాటో, బంగాళాదుంప రసం తాగుతా. రోజుకు రెండుమూడుసార్లు ఐస్‌తో మర్దన చేస్తుంటా.
  • కాబోయేవాడికి సెన్సాఫ్‌ హ్యూమర్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉండాలి.
  • నాకు భక్తి ఎక్కువే. ఉదయాన్నే పూజ చేసి ఇంట్లోంచి బయటకు వస్తా. హ్యాండ్‌బ్యాగులో ఎప్పుడూ అమ్మవారి కుంకుమ ఉంటుంది. అలానే పండుగల సమయంలో ప్రసాదం కోసం పాయసం కూడా చేస్తా.
  • తెలియని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటా. ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే వెంటనే దాన్ని ఓ డైరీలో రాసుకుంటా.
  • ‘కేజీఎఫ్‌’ హీరో యశ్‌ భార్య రాధిక పండిట్‌కీ, నాకూ దగ్గర పోలికలు ఉండటంతో మేం బంధువులం అనుకుంటారు చాలామంది. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. అక్కకి రెండు ప్రసవాలూ అమ్మే చేసింది. యశ్‌ని ‘జీజూ’ అని పిలుస్తుంటా. సినిమాల్లోకి వచ్చే ముందు అక్కా, యశ్‌ నన్ను గైడ్‌ చేశారు.
  • స్ట్రీట్‌ షాపింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. మాల్స్‌కి బదులు వీధుల్లో కొనడం వల్ల చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది.
  • నేను ఫోన్‌ తక్కువ వాడతా. దాంతో చాలా కాల్స్‌ ఎత్తను. మెసేజ్‌కీ బదులివ్వను. అలా కావాలని చేయనుగానీ, ఆ అలవాటు మాత్రం మార్చుకోవాలనుకుంటున్నా. అదే నేను ఎవరికైనా ఫోన్‌ చేస్తే వెంటనే ఎత్తకపోతే మాత్రం ఫీలవుతుంటా.
  • పులిహోర చాలా ఇష్టం. టీలు కూడా ఎక్కువగా తాగుతుంటా. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ టీలు ఎక్కువగా తీసుకుంటా. మా ఇంట్లో ఎన్ని రకాల టీ ఫ్లేవర్లు ఉన్నాయో. అలానే చాక్లెట్లు నా బలహీనత.
  • కనిపిస్తే తినకుండా ఉండలేను. కానీ డైటింగ్‌ పరంగా వాటికి దూరంగా ఉండక తప్పట్లేదు.
  • రేఖకు వీరాభిమానిని. ఆమె పాటలు వింటుంటా. డాన్స్‌ విషయంలో శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు నాకు స్ఫూర్తి. సమయం దొరికితే వాళ్ల సినిమాలు చూస్తుంటా.


ఆ పని చేయండి!

న్నడలో ‘బై టూ లవ్‌’ సినిమాలో నటించినప్పుడు బెంగళూరులోని మాతృశ్రీ అనే స్వచ్ఛంద సంస్థకు వెళ్లా. అక్కడున్న వాళ్లంతా ప్రత్యేక అవసరాలున్న పిల్లలే. తల్లిదండ్రులు వదిలేసిన ఆ చిన్నారుల్ని చూసి ఏడుపొచ్చింది. రోజంతా వారితో గడిపినా సమయం తెలియలేదు. అప్పట్నుంచీ అలాంటి వారికి సాయపడుతున్నా. అలానే ఇతరులకు సాయం చేయాలనుకునేవారు మీ చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ఆశ్రమాలకు వెళ్లండి. కనీసం వారానికో, నెలకో ఒకరోజు వారితో కలిసి కబుర్లు చెప్తూ భోజనం చేయండి. ఆ సమయంలో అన్నంతో కడుపు, ఆనందంతో హృదయం నిండిపోతాయి. అందుకే ‘హియర్‌ ఫర్‌ యు’ ప్రచారం ప్రారంభించా. ఎవరైనా సరే ఏదైనా ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఫొటోలు తీసుకుని ‘హియర్‌ ఫర్‌ యు’ అని ట్యాగ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయండి.

పద్మ వడ్డె


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..