ఉపాహారం... వెరైటీగా!

ఏరోజుకారోజు వెరైటీ టిఫిన్‌ ఉండాలని కోరుకుంటారు పిల్లలు. లేదంటే... ‘ఇవాళా ఇడ్లీయేనా... బోర్‌’ అంటూ తినడం మానేస్తారు.

Published : 04 Feb 2024 00:13 IST

ఏరోజుకారోజు వెరైటీ టిఫిన్‌ ఉండాలని కోరుకుంటారు పిల్లలు. లేదంటే... ‘ఇవాళా ఇడ్లీయేనా... బోర్‌’ అంటూ తినడం మానేస్తారు. అలాంటి చిన్నారులకు ఈ టిఫిన్లను మార్చిమార్చి చేసి రుచి చూపిస్తే సరి.  


హరియాలీ పోహా

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: ఒకటిన్నర కప్పు, ఉడికించిన పచ్చిబఠాణీ: అరకప్పు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పల్లీలు: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: అరకప్పు, పుదీనా ఆకులు: పావుకప్పు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: మూడు.

తయారీ విధానం: ముందుగా అటుకుల్ని ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి... బాగా కడిగి, తరువాత నీటిని పిండేసి విడిగా పెట్టుకోవాలి. మిక్సీలో కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేయించుకుని ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగుతున్నప్పుడు కొత్తిమీర పేస్టు, పచ్చిబఠాణీ, తగినంత ఉప్పు వేసి మరోసారి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక అటుకుల్ని కూడా వేసి వాటికి మసాలా పట్టేవరకూ కలిపి దింపేస్తే హరియాలీ పోహా రెడీ.  


దహీ సేమియా బాత్‌

కావలసినవి: సేమియా: కప్పు, ఉప్పు: తగినంత, నీళ్లు: మూడు కప్పులు, తాజా పెరుగు: రెండున్నర కప్పులు, కాచి చల్లార్చిన పాలు: పావుకప్పు, పచ్చిమిర్చి తరుగు: టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, దానిమ్మ గింజలు: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సెనగపప్పు: చెంచా.  

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేయాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు సేమియా వేయాలి. సేమియా ఉడుకుతున్నప్పుడు స్టవ్‌ని కట్టేసి నీటిని పూర్తిగా వంపేయాలి. సేమియా చల్లారిందనుకున్నాక గిలకొట్టిన పెరుగు, పాలు పోసి.. పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, దానిమ్మగింజలు వేసి కలపాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు వేయించుకుని ఈ తాలింపును పెరుగులో వేసి కలిపితే చాలు. నోరూరించే దహీ సేమియా తయారైనట్లే.


మసాలా బ్రెడ్‌ టోస్ట్‌

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: ఆరు, ఉడికించిన బంగాళాదుంపలు: మూడు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, క్యాప్సికం తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌ తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, పసుపు: పావుచెంచా, ఎండుమిర్చి గింజలు: చెంచా, అల్లం ముద్ద: అరచెంచా, ఉప్పు: తగినంత, దనియాలపొడి: చెంచా, మిరియాలపొడి: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, వెన్న: పావుకప్పు: పాలు: పావుకప్పు.

తయారీ విధానం: బ్రెడ్‌స్లైసులు, పాలు, వెన్న తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా ఓ గిన్నెలో వేసుకుని.. తరువాత అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్‌స్లైసును తీసుకుని దానిపైన కాసిని పాలు రాసి... తరువాత బంగాళాదుంపల మసాలాను జామ్‌ తరహాలో స్లైసు మొత్తం పరవాలి. ఇదేవిధంగా మిగిలిన స్లైసుల్నీ చేసుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి... కొద్దిగా వెన్న వేసి... మసాలా పరిచిన వైపు బ్రెడ్‌ స్లైసును ఉంచి.. రెండోవైపు ఇంకొంచెం వెన్న రాయాలి. దోశ తరహాలో బ్రెడ్‌స్లైసును రెండువైపులా కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇదేవిధంగా మిగిలిన స్లైసుల్నీ చేసుకోవాలి.  


మరమరాల చీలా

కావలసినవి: మరమరాలు: రెండు కప్పులు, బొంబాయిరవ్వ: అరకప్పు, పెరుగు: అరకప్పు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, క్యాబేజీ తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, బీన్స్‌ తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌తురుము: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి గింజలు: చెంచా, ఉప్పు: తగినంత, వంటసోడా: పావుచెంచా, నూనె: అరకప్పు, ఆవాలు: రెండు చెంచాలు.

తయారీ విధానం: మరమరాలు మునిగేలా నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక వాటిని మిక్సీలో వేసుకుని దోశపిండి తరహాలో గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో నూనె, ఆవాలు తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలయ్యాక స్టవ్‌మీద పెనం పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేయించి... వాటిపైనే ఈ పిండిని మందంగా అట్టులా వేసుకుని.. నూనెతో రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటికి కొబ్బరిచట్నీ మంచి కాంబినేషన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..