Ukraine Crisis: రష్యా యుద్ధ ట్యాంకర్‌నే ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు.. వైరలవుతున్న వీడియో

ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఆ రైతు ఏంచేశాడు అనుకుంటున్నారా......

Updated : 02 Mar 2022 09:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేస్తోంది. భారీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌ నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ఆ రైతు ఏంచేశాడు అనుకుంటున్నారా..? శత్రు దేశానికి చెందిన యుద్ధ ట్యాంకునే ఎత్తుకెళ్లాడు మరి..!

తమ దేశంపై దాడి చేసేందుకు రష్యా బలగాలు  యుద్ధ ట్యాంకర్‌తో ఓ ప్రాంతానికి చేరుకున్నట్లు సదరు రైతు గుర్తించాడు. దీంతో ట్రాక్టర్‌తో గుట్టుచప్పుడు కాకుండా అక్కడకు చేరుకున్న కర్షకుడు.. తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసి అక్కడి నుంచి తరలించాడు. ఇది గమనించిన రష్యా సైనికుడు ఆ వాహనాల వెనుక పరిగెడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ పార్లమెంటు సభ్యుడు జానీ మెర్సర్ ఈ వీడియోను  ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘అతనేం నిపుణుడు కాదు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు నేడు రష్యా యుద్ధ ట్యాంకర్‌ను దొంగిలించాడు. రష్యా దాడి క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు. రైతు చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దేశాన్ని రక్షించేందుకు ఓ పౌరుడు ఏదైనా చేయగలడు అని ప్రశంసిస్తున్నారు. ఈ క్లిప్పింగ్‌ను ఇప్పటికే 4.6 మిలియన్ల మంది వీక్షించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని