సుసంస్కారం

నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది.

Published : 17 Mar 2024 01:12 IST

నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది.

ప్రవర్తన, సంభాషణ ఎదుటివారి మనసుల్లో ప్రగాఢ ముద్ర వేస్తాయి. మన ఆహార్యం, సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, ఆతిథ్యం, సంస్కృతి, అతిథి మర్యాదలు, సంస్కారం... ఇవన్నీ ఎదుటివారికి మన సభ్యతను తెలియజేస్తాయి. సంఘజీవులుగా సమాజంలో సాటి మనుషులతో ఎలా మెలగాలో అలవరచుకోవాలి. అలా లేనప్పుడు అధికంగా నష్టపోయేది మనమే. నేడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తున్నాం. నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురితో ఉండాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనల్ని మనం ఎప్పటికప్పుడు పున శ్చరణ చేసుకోవాలి. మాటల్లోనూ చేతల్లోనూ నీడలా వెన్నంటి ఉండేదే సంస్కారం. మానవ సంబంధాలను దగ్గర చేయడం లేదా దూరం చేయడంలో ఈ రెండూ ముందు వరసలో ఉంటాయి.

స్వతహాగా వచ్చే సభ్యత సంస్కారాలు కొన్ని అయితే, ఎదుటివారిని సమాజాన్ని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నెన్నో. ఎవరైనా మనలో లోపాల్ని చెప్పినప్పుడు వాటిని మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి. సభ్యత, సంస్కారాలకు దూరం చేసే దుర్లక్షణాలే మనిషిని అశాంతికి గురిచేస్తాయని సనాతన ధర్మమే కాదు- ఎందరో సద్గురువులూ బోధించారు.

రమణ మహర్షి దర్శనానంతరం నారాయణ గురు ఎంతో ఆత్మానుభూతికి లోనయ్యారు. ఆ స్ఫూర్తితో నివృత్తి పంచకం రచించారు. అందులో ఇతరుల ఊరు, పేరు, వయసు, కులం, వృత్తి ఇత్యాదులపై ఆసక్తి కనబరచనివారు ఆత్మానందాన్ని అనుభవిస్తారని చెప్పారు. 

చాలామంది పరిచయం ఉన్నవారితోనే సభ్యతగా, మర్యాదగా వ్యవహరిస్తుంటారు. ఇది సంస్కార లక్షణం కాదు. ప్రతివారితోనూ సంస్కారవంతంగా మెలగాలి. ముఖ పరిచయం లేని వ్యక్తుల ముందూ అణకువగా మసలుకోవాలి. అందరితో అన్నిచోట్లా సౌమ్యంగా వ్యవహరించాలి. మనిషి వ్యక్తిత్వానికి శోభనిచ్చేవి వినయపూర్వక సభ్యత, సంస్కారాలే.

పెద్దలు కనిపిస్తే నమస్కరించడం, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండటం, సాటివారితో స్నేహపూర్వకంగా మసలుకోవడం, అవసర సమయాల్లో తోటివారికి సహాయపడటం, పుట్టిన నేలను దేశాన్ని మరవకుండా ఉండటం... ఇవన్నీ బాల్యం నుంచే తల్లిదండ్రులు, గురువులు పిల్లలకు నేర్పాల్సిన సంస్కారాలు. సానుకూల దృక్పథం గలవారి చుట్టూ మానవత్వ సంబంధాలు పరిభ్రమిస్తుంటాయి. వ్యతిరేక భావాలు గల వ్యక్తుల నుంచి ఏ బంధమైనా దూరంగా పారిపోతుంది.

ఈ ప్రపంచాన్ని చూడటానికి నువ్వు ఒక కిటికీ. నిన్ను నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నువ్వు ఇవతలి నుంచి చూసే అవతలి ప్రపంచం అందంగా కనిపిస్తుంది అన్నారు జార్జి బెర్నార్డ్‌ షా. మొరటుగా కటువుగా మాట్లాడటం వల్ల సరళత్వాన్ని కోల్పోతాం. అందరి పట్ల అన్నిచోట్లా సౌమ్యంగా వ్యవహరించాలి. సంస్కారవంతులైన సజ్జనుల సహచర్యంలో జ్ఞానం లభిస్తుంది. అదే సుసంస్కారం. మనసులో ఆలోచన, మాటలో సూచన, క్రియలో ఆచరణ, సభ్యతలో సంస్కారం, వీటి మధ్య ఐక్యత సాధించిన వ్యక్తులే సుసంస్కారులుగా భాసిస్తారు.

 ఎం.వెంకటేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని