Yaksha Prashnalu: యక్ష ప్రశ్నలు 125... అవేంటో తెలుసా?

యక్ష రూపంలో యముడు ధర్మరాజుకు 125 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకే ధర్మరాజు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన సోదరులను దక్కించుకున్నాడు.

Updated : 23 Oct 2023 19:28 IST

మానవ జీవన విధానం అర్థవంతంగా సాగేలా జీవన మర్మాలను చర్చిస్తూ మనిషి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలని మన పురాణ ఇతిహాసాలు నీతి కథలను, గాథలను మనకందించాయి. మహాభారతంలోని యక్ష ధర్మజ ప్రశ్నోత్తరాలు యక్ష ప్రశ్నల పేరిట సుప్రసిద్ధం. పాండవులు ద్వైతవనంలో అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒక విప్రుడు వచ్చి యజ్ఞార్థం ఉంచిన అరణి (అగ్నిని వెలిగించే కట్టెలు) పుల్లలను ఒక జింక సంగ్రహించుకుపోయిందని తన గోడును ధర్మరాజుకు విన్నవించుకొంటాడు. పరోప కారైన ధర్మజుడు పుల్లలను వెతికి తెచ్చే బాధ్యతను తన సోదరులకు అప్పగిస్తాడు. చాలా సమయం గడచినా వారు తిరిగిరారు. తానే స్వయంగా బయలుదేరి వెళ్ళి అక్కడ జలాశయం వద్ద విగతజీవులైన సోదరులను గమనిస్తాడు ధర్మజుడు.

తానూ ఆ జలాన్ని తాగబోతుండగా ఆకాశవాణి రూపంలో, ‘నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ సోదరులు మరణించారు. నువ్వైనా సమాధానాలు చెప్పి నీటిని గ్రోలి నీ వారిని బతికించుకో’ అని ఆజ్ఞాపిస్తాడు. సాక్షాత్తు యముడే ఆ యక్షరూపంలో ప్రశ్నలు సంధిస్తున్నాడని తెలిసిన ధర్మరాజు తెలివిగా ఆ నూట ఇరవై అయిదు ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన సోదరులను దక్కించుకొంటాడు. యక్ష ప్రశ్నలు సత్య, ధర్మ, అర్థ, మోక్ష మార్గాలను నిర్దేశిస్తూ మానవ జీవితం సుసంపన్నం కావడానికి దోహదపడతాయి.

ధర్మం గురించి, ధర్మ దీక్ష గురించి యక్షుడు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ధర్మం వల్ల ఆత్మ ప్రకాశించి నిత్యకర్మలు సవ్యంగా సాగుతాయని, ఆత్మ సూర్యుడిలా వెలుగుతూ దుష్టత్వాన్ని దూరం చేస్తుందని చెబుతాడు. తాము చేసే దానధర్మాలు జీవులకు సర్వోన్నతమైనవని వారి కీర్తి ప్రతిష్ఠలను ఆచంద్రతారార్కం వెలిగిస్తాయని చెబుతాడు ధర్మరాజు. ఉన్నతమైన ధర్మమేదని ప్రశ్నించిన యక్షుడికి సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమేనని ధర్మజుడి సమాధానం. తనకున్న సంపదను ఇతరుల శాంతి సౌభాగ్యాల కోసం వినియోగించడమే ఉత్తమమైన దానమని వివరిస్తాడు ధర్మనందనుడు. సత్యం ఎటువంటిది అన్న ప్రశ్నకు సర్వ దేవతలు, సూర్యచంద్రులు కూడా సత్యానికి కట్టుబడి ఉంటారని, సత్యాన్ని పలికేవారికి దైవం వెన్నంటి ఉంటాడని సమాధానం చెబుతాడు.

గాలి కంటే వేగమైనది ఏది అన్న ప్రశ్నకు మనసేనని చెబుతూ దాన్ని నిగ్రహిస్తే కోరికల సాగరాన్ని ఎదురీది బయటపడవచ్చు అంటాడు ధర్మరాజు. విచారం పొందిన మనసుకు ఉపశమనాన్ని అందించేది భగవన్నామమేనని వక్కాణిస్తాడు. ఎవరు భాగ్యవంతుడు అన్న ప్రశ్నకు గణించలేని గడ్డిపరకల్లా గజిబిజిగా జనించే కోరికలను నియంత్రించేవారే భాగ్యవంతులు అంటాడు ధర్మరాజు. సంపదలు తాండవిస్తున్నా పరోపకారగుణం కొరవడినవారు, పితృభక్తి లేనివారు జీవన్మృతులని యక్ష ప్రశ్నకు మరో సమాధానం. ఏది విసర్జించిన ప్రేమను పొందవచ్చు అని అడిగినప్పుడు గర్వాన్ని, అహంకారాన్ని వీడిన మనిషి గౌరవమర్యాదలకు పాత్రుడవుతాడని, వాటి వల్ల భోగం, సౌభాగ్యం ప్రాప్తిస్తాయని చెబుతాడు.

లోకంలో బరువైనది, ఎత్తయినది ఏదన్న ప్రశ్నకు తల్లిప్రేమ, తండ్రి మమతేనని రూఢిగా సమాధానం చెబుతాడు. సౌఖ్యమైనది సంతృప్తి అని, ఉత్తమ మిత్రులు ఆలుమగలేనని, పరుల క్షేమమే పుణ్యగతులకు హేతువని, గౌరవించదగినది ఐకమత్యమని, ఉత్తమభాగ్యం ఆరోగ్యమని, మహావిషాలంటే అరిషడ్‌ వర్గాలని, సత్యాన్ని పరిరక్షించేది జ్ఞానమని... ఇలా ఎన్నో ప్రశ్నలకు అలవోకగా జవాబులు చెప్పి యక్షుడి ప్రశంసలందుకుంటాడు ధర్మరాజు. తనకున్న దానితో తృప్తిని పొంది అందరికీ తలలో నాలుకలా, పదిమందీ మెచ్చేలా జీవిస్తూ కీర్తిని పొందేవాడే నిజమైన సంపన్నుడు. మహాభారత కాలం నాటి ఆ యక్షప్రశ్నలు మనకూ వర్తిస్తాయని గమనించి వాటి అర్థాలను, ధర్మాలను ఆకళింపు చేసుకొని ప్రవర్తిస్తే- మనిషి జీవితం ధన్యమవుతుంది.

 మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని