మనది ఉద్యోగ మిత్ర ప్రభుత్వమని చెప్పండి

‘రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గింది. రుణాలు తీసుకునేందుకు పరిమితులున్నాయి. ఎక్కువగా అప్పుచేసే అవకాశమూ లేదు.

Published : 22 Jan 2022 04:40 IST

వారి డిమాండ్లు తీర్చాలంటే ఏదైనా పెద్ద పథకం ఆపాలి!

తెదేపా వలలో పడకుండా చూడండి

మంత్రిమండలి భేటీలో సీఎం జగన్‌ దిశానిర్దేశం

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గింది. రుణాలు తీసుకునేందుకు పరిమితులున్నాయి. ఎక్కువగా అప్పుచేసే అవకాశమూ లేదు. ఆదాయం పెరిగితేనే అప్పు పరిమితీ పెరుగుతుంది. ఈ ఇబ్బందులే లేకపోతే ఉద్యోగులకు చేయగలిగినంతా చేస్తాం కదా? వారితో మనది ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని సీఎం జగన్‌ మంత్రులతో అన్నట్లు తెలిసింది. ‘ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించేవాళ్లమే. అవి తీర్చాలంటే ఏదో ఒక పెద్ద పథకం ఆపాల్సి వస్తుంది. కానీ, మనం ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నాం కదా’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. శుక్రవారం మంత్రిమండలి సమావేశంలో పీఆర్‌సీ, ఉద్యోగుల ఆందోళనలపై సీఎం అరగంట పాటు మాట్లాడారని సమాచారం. సుమారు 15 పాయింట్లతో కూడిన సమాచారాన్ని మంత్రులకు అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం చేసిన మార్గనిర్దేశం ఇదీ..

ఎక్కడికక్కడ మాట్లాడండి

‘మీకిచ్చిన సమాచారాన్నే ఎమ్మెల్యేలందరికీ ఇస్తాం. ఊళ్లలో ఎక్కడికక్కడ ఉద్యోగులతో మాట్లాడండి. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాకపోతే, వారికి ఇవన్నీ చేసేదా అనే విషయాన్ని వివరించండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే 27శాతం ఐఆర్‌ ఇవ్వడంతో రూ.17,900 కోట్ల భారం పడింది. ఐఆర్‌ ఇవ్వకపోయి ఉంటే, ఆ సుమారు రూ.18వేల కోట్లు వేరే పథకాలకు వాడుకుని ఉండేవాళ్లం కదా? ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఖజానాపై రూ.10,240 కోట్ల భారం పడుతున్నా పీఆర్‌సీ ఇచ్చాం. జీతాలు తగ్గుతున్నాయంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. మనం ఇచ్చిన పీఆర్‌సీ శాతాల స్థాయి హెచ్‌ఆర్‌ఏనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ వస్తోంది. ఐదారు రాష్ట్రాల్లోనూ ఇంతే ఇస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడం వల్ల లబ్ధి కలగదా?  స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10శాతం కేటాయించనున్నాం, 20శాతం రాయితీ ఇస్తున్నాం.

చంద్రబాబు చేసిన నియామకాలెన్ని?

‘చంద్రబాబు ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? మన ప్రభుత్వం తొలి ఏడాదిలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో కలిపాం. ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఏవో, యానిమేటర్లు ఇలా అందరికీ జీతాలు పెంచాం. ఇది ఉద్యోగ శ్రేయస్సు కాదా? చంద్రబాబు, తెదేపా ట్రాప్‌లో ఉద్యోగులు పడకుండా చూడండి’ అని వివరించారు.

సమన్వయం చేసేందుకు కమిటీ

రాష్ట్రస్థాయిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రధాన నేతలతో మాట్లాడేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)తో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని